breaking news
reyality
-
6,200 దిగువకు నిఫ్టీ
వరుసగా రెండో రోజుకూడా మార్కెట్లు నష్టపోయాయి. మంగళవారం 16 పాయింట్లు తగ్గిన నిఫ్టీ తాజాగా 41 పాయింట్లు కోల్పోయింది. వెరసి 6,200 దిగువన 6,161 వద్ద ముగిసింది. ఇక సెన్సెక్స్ కూడా వారం రోజుల్లో లేని విధంగా 146 పాయింట్లు క్షీణించి 20,709 వద్ద నిలిచింది. ప్రధానంగా రియల్టీ, ఎఫ్ఎంసీజీ, ఆటో 3-1% మధ్య నీరసించాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియడంతో ఫలితాల వెల్లడికి ముందుగానే ఇన్వెస్టర్లు లాభాలను స్వీకరిస్తున్నారని విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతో సెంటిమెంట్ బలహీనపడిందని తెలిపారు. ఈ నెలాఖరులో సమావేశంకానున్న ఫెడరల్ రిజర్వ్ సహాయక ప్యాకేజీల ఉపసంహరణపై నిర్ణయాన్ని వెలువరించవచ్చునన్న అంచనాలు కూడా మార్కెట్లలో అమ్మకాలకు కారణమవుతున్నాయని చెప్పారు. యూనిటెక్ 10% పతనం: నోయిడాలోని విలాసవంత హౌసింగ్ ప్రాజెక్ట్‌కోసం 2007లో ఎల్ఐసీ నుంచి రూ. 200 కోట్ల రుణాలపై వడ్డీ చెల్లింపుల్లో విఫలమైందన్న వార్తలతో యూనిటెక్ షేరు ఒక దశలో 15% వరకూ పతనమైంది. చివరికి 10% నష్టంతో రూ. 15.65 వద్ద ముగిసింది. అక్టోబర్‌లో రుణ మార్కెట్ల జోష్ రూ. 7,280 కోట్లు సమీకరించిన కంపెనీలు ప్రైమరీ మార్కెట్ ద్వారా కంపెనీలు అక్టోబర్‌లో రూ. 7,279 కోట్లను సమీకరించాయి. సెప్టెంబర్ నెలలో సమీకరించిన రూ. 3,847 కోట్లతో పోలిస్తే ఇవి 89% అధికం. అయితే వీటిలో రుణ(డెట్) మార్కెట్ల నుంచి అత్యధికంగా రూ. 7,195 కోట్లను సమీకరించగా, ఈక్విటీ షేర్ల అమ్మకం ద్వారా రూ. 84 కోట్లు మాత్రమే లభించాయి. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం(2013 -14) తొలి ఏడు నెలల(ఏప్రిల్-అక్టోబర్) కాలంలో కంపెనీలు సమీకరించిన మొత్తం రూ. 18,636 కోట్లకు చేరింది. గతేడాది(2012-13) ఇదే కాలంలో ప్రైమరీ మార్కెట్ల ద్వారా కంపెనీలు రూ. 9,484 కోట్లను మాత్రమే సమకూర్చుకోగలిగాయి. -
పండగవేళ.. గృహ రుణం ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్: పండగ సీజన్ ప్రారంభమైంది. సొంతిల్లు కొనుక్కోవాలనే ఆలోచన అందరికీ ఉంటుంది. కానీ, గృహ రుణం తీసుకోవాలనే విషయంలో తికమక పడుతుంటారు. బ్యాంకు, గృహరుణ సంస్థలో రుణం ఎలా తీసుకోవాలో నిర్ణయించుకోలేకపోతుంటారు. ఇలాంటి వారికోసమే ఈ కథనం.. గృహ రుణం విషయంలో ఎన్నో అనుమానాలుంటాయి. ఎంత రుణం తీసుకోవాలి? ఎన్నేళ్లకు తీసుకోవాలి? మంచి బ్యాంకు ఏది? ఇలా అనుమానాల జాబితా పెద్దదే. రుణం తీసుకోవాలనుకునే వారు తమ ఆదాయం, వాయిదాల చెల్లింపు సామర్థ్యం, కావాల్సిన రుణం ఆధారంగా ఎవరు తక్కువ వడ్డీ ఇస్తారో గుర్తించి ఆ బ్యాంకులు, రుణ సంస్థలను ఎంచుకోవాలి. పోలికలున్నాయి: రుణ అర్హత నిబంధనలు, పరిశీలనా రుసుములు, ఆస్తి విలువ మదింపు, ఆస్తిని తాకట్టు పెట్టుకోవటం, ఖాతాదారు గురించి తెలుసుకోవటం (కేవైసీ), రుణ చరిత్ర, ఒప్పంద పత్రాలు ఇలా దాదాపు అన్ని అంశాల్లోనూ బ్యాంకులు, హెచ్ఎఫ్సీలు పాటించే నిబంధనలు ఒకేలా ఉంటాయి. వడ్డీరేట్లలో తేడా: గృహరుణ సంస్థలు ప్రైమ్ లేడింగ్ రేటు (పీఎల్ఆర్) ప్రామాణికంగా వడ్డీ రేట్లను నిర్ణయించి, రుణాలను మంజూరు చేస్తాయి. జూన్ 30, 2010 వరకు కూడా బ్యాంకులు ఈ విధానాన్నే పాటించేవి. ఆ తర్వాత నుంచి మరింత పారదర్శకంగా ఉండేలా బేస్‌రేట్ విధానానికి మారాయి. గతంలో బ్యాంకుల నుంచి గృహ రుణాలు తీసుకున్న చాలామంది ఖాతాదారులు ఇంకా పీఎల్ఆర్ విధానంలోనే కొనసాగుతున్నారు. బ్యాంకులు బేస్‌రేట్ కన్నా తక్కువ వడ్డీ రేటుకు రుణాలు ఇవ్వవు. రుణ వడ్డీ రేట్లు తగ్గితే బ్యాంకులు తమ ఖాతాదార్లను నిలుపుకోవడానికి తమ బేస్‌రేటును తగ్గిస్తుంటాయి. ఒకసారి బేస్ రేటు తగ్గిస్తే.. ఈ ప్రాతిపదికన రుణం తీసుకున్న రుణ గ్రహీతలందరికీ ఆ ప్రయోజనం అందుతుంది. బ్యాం కులు బేస్‌రేటుపై కొంత శాతం అధికంగా వడ్డీ రేటును నిర్ణయిస్తాయి. గృహరుణ సంస్థలు పీఎల్ఆర్కు కొంత శాతం తక్కువగా వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి. వడ్డీ రేట్లు మారినప్పుడు బ్యాంకులు బేస్ రేటును తగ్గించకుండా అధికంగా ఉన్న వ్యత్యాసాన్ని తగ్గిస్తాయి. దీనివల్ల కొత్త ఖాతాదారులకు మేలేకానీ, ఇప్పటికే రుణం తీసుకున్న వారికి మాత్రం ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి రుణం తీసుకోబోయే ముందు వడ్డీ రేట్లు తగ్గినప్పుడు బ్యాంకు బేస్‌రేటు తగ్గిస్తుందా లేదా అనేది చూసుకోవాలి. బేస్ రేటుకు, వడ్డీ రేటుకు వ్యత్యాసం ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. ప్రస్తుతం పండగ సీజన్ కాబట్టి చాలా బ్యాంకులు బేస్‌రేట్ మీదనే రుణాలు మంజూరు చేస్తున్నాయి. కొన్ని బ్యాంకులైతే స్వల్ప వడ్డీ మీద రుణాలిస్తున్నాయి. బ్యాంకులు, గృహ రుణ సంస్థలు చలన వడ్డీపై రుణం తీసుకున్న వారి విషయంలో ముందస్తు చెల్లింపులకు సంబంధించి ఎలాంటి రుసుములూ విధించడం లేదు. స్థిర వడ్డీ, రెండు రకాల వడ్డీ (కొన్నాళ్లు స్థిరం, ఆ తర్వాత చలనం) విధానంలో తీసుకున్న వారికి మాత్రం రుసుముల భారం రెండు చోట్లా ఉంది. ఎన్‌హెచ్‌బీ నిబంధనల ప్రకారం సొంత వనరులతో రుణం తీర్చిన సందర్భాల్లో గృహరుణ సంస్థలు ఎలాంటి రుసుములూ వసూలు చేయకూడదు. వడ్డీరేట్లు, రుణాల మంజూరు, ఇతర నిబంధనల్లో తేడాలు లేనప్పటికీ చాలామంది బ్యాంకుల నుంచి మాత్రమే రుణం తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. దీనికి కారణం చాలా రోజులుగా వాటితో అనుబంధం ఉండటం, విస్తరించి ఉండటం బ్యాంకులకు కలిసొస్తుంది. అన్నిచోట్లా సేవలు అందకపోవటం, హెచ్ఎఫ్సీల నుంచి రుణం తీసుకోవడానికి ప్రధాన అడ్డంకి. బ్యాంకు, గృహరుణ సంస్థ ఎక్కడి నుంచి రుణం తీసుకున్నా ముందుగా అవి ఇప్పటికే రుణం తీసుకున్న వారికి అందిస్తున్న ప్రయోజనాలను పరిశీలించాలి. ఒకసారి మీరు ఆసంస్థ ఖాతాదారుగా మారిన తర్వాత మీకు ఎలాంటి లాభాలు ఉంటాయో దీనివల్ల అర్థమవుతుంది. కొత్త ఖాతాదారుల్లో సమానమైన ప్రయోజనాలను అందించే బ్యాంకు/గృహరుణ సంస్థకే ప్రాధాన్యం ఇవ్వండి.