breaking news
ration problems
-
తిండిగింజలకు నానాతిప్పలు
సాక్షి, అమరావతి: నడవలేని స్థితిలోనూ చేతికర్రల సాయంతో వచ్చిన వృద్ధులు..! సర్వర్లు మొరాయించడంతో గంటల కొద్దీ క్యూలైన్లు, రోడ్లపై మహిళల పడిగాపులు..! సమయం దాటినా తెరుచుకోని చౌక దుకాణాల వద్ద నిరీక్షించిన చిన్నారులు..! చంటిబిడ్డలను చంకన ఎత్తుకుని తల్లుల ఎదురుచూపులు..! ఒకేసారి రద్దీతో డిపోల్లో కుస్తీలు..! ఈ–పోస్ మిషన్లు పనిచేయక దుకాణాలు మూసేసి వెళ్లిపోయిన డీలర్లు..! ఉసూరుమంటూ వెనుదిగిరిన కార్డుదారులు..! ..ఇదీ రాష్ట్రంలో రెండో రోజు పరిస్థితి. కూటమి ప్రభుత్వంలో ప్రజా పంపిణీ వ్యవస్థ అధ్వాన స్థితి.పొట్ట నింపుకొనేందుకు చౌక బియ్యమే పరమాన్నంగా భావించే పేదలను గంటల తరబడి క్యూలైన్లలో నిలబెడుతోంది కనికరం లేని సర్కా రు. వృద్ధులు, దివ్యాంగులపై దయ చూపకుండా మండుటెండల్లో రోడ్లపై నడిపిస్తోంది. పేదల మేలును మరిచి.. ఇంటి వద్దకే రేషన్ ఇచ్చే వ్యవస్థను రద్దు చేసిన కూటమి సర్కారు సోమవారం రేషన్ పంపిణీలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. రాష్ట్రంలో ఎక్కడికెళ్లినా.. లబ్ధిదారుల్లో ఎవరిని పలకరించినా రేషన్ అవస్థలే వినిపిస్తున్నాయి. అక్కరకు రాని వైనం.. రేషన్ డిపోల ద్వారా బియ్యం పంపిణీని గొప్పగా కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. దివ్యాంగులు, వృద్ధులకు ఇంటికే బియ్యం అందిస్తున్నట్లు ప్రకటనలు గుప్పిస్తోంది. క్షేత్రస్థాయిలో చూస్తే వీరు చౌక బియ్యం కోసం ప్రాణాలకు తెగించి యుద్ధం చేయాల్సి వస్తోంది. జీవిత చరమాంకంలో.. ఊతకర్రల సాయంతో బియ్యం కోసం రేషన్ షాపుల వద్దకు వచ్చిన వయోధికులు అక్కడే కూలబడుతున్నారు.బియ్యం మూటను భుజంపై కూడా పెట్టుకోలేని దుస్థితిలో చుట్టుపక్కలవారిని సాయం కోసం బతిమలాడుకుంటున్నారు. గత ప్రభుత్వంలో ఎండీయూల ద్వారా ఇంటి వద్దనే హాయిగా రేషన్ తీసుకున్న పరిస్థితి నుంచి కూటమి ప్రభుత్వం తమను అవస్థల పాలు చేస్తోందని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ⇒ 65 ఏళ్లు దాటినవారికి దివ్యాంగులకు ఇంటికే డీలర్ల ద్వారా రేషన్ ఇస్తామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. ఇలా 15 లక్షల మందిని లెక్కించింది. వీరిలో తొలి రోజు ఏకంగా మూడు లక్షలమందికి పంపిణీ చేసినట్టు దొంగ లెక్కలు చూపిస్తోంది. మరి ప్రభుత్వమే ఇంటికి రేషన్ ఇస్తుంటే లక్షలమంది వృద్ధులు, దివ్యాంగులు ఎందుకు దుకాణాలకు వస్తారు? వచ్చినా డీలర్ ఇంటికే బియ్యం పంపిస్తామని ఎందుకు చెప్పట్లేదు? ఇదంతా కూటమి కుటిలతంత్రం.ఒకటే మాట.. సర్వర్ల మొరాయింపు టెక్నాలజీ వినియోగం తమ పేటెంట్ హక్కుగా చెప్పుకునే చంద్రబాబు అండ్ కో పేదలకు ఐదు కిలోల బియ్యాన్ని పంపిణీ చేయలేక చేతులెత్తేస్తోంది. రేషన్ దుకాణాలకు వెళ్లిన లబ్ధిదారులకు ఒక్కటే మాట వినిపిస్తోంది.. సర్వర్ పనిచేయట్లేదు అని. దీంతో ప్రజలు పాట్లు పడుతున్నారు. 60 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్.. రేషన్‌కు 65 ఏళ్లా? రాష్ట్రంలో ప్రభుత్వం 60 లక్షలకుపైగా వృద్ధాప్య, దివ్యాంగ, ఇతర పింఛన్లను ఇస్తోంది. వీళ్లందరికీ తెల్ల రేషన్ కార్డులే ఉంటాయి. ఇందులో 48 లక్షలకు పైగా వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్య బాధితులు ఉంటారు. ఇన్ని లక్షల్లో వృద్ధులు, దివ్యాంగులు ఉంటే ప్రభుత్వం 15 లక్షల మందికి.. అది కూడా 65 ఏళ్లు దాటినవారికి మాత్రమే రేషన్ ఇంటికి చేరవేస్తామని చెబుతోంది. 60 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్ ఇస్తూ.. రేషన్‌కు వచ్చేసరికి 65 ఏళ్లకు పెంచి చూపి ప్రజలను మోసం చేస్తోంది. తూకంలో అంతా మోసం.. కూటమి ప్రభుత్వం రేషన్ పంపిణీని ఒక్కరోజులోనే భ్రషు్టపట్టించింది. గతంలో లబ్ధిదారుల కళ్లముందే బియ్యం తూకం వేసి.. ఈ–పోస్, తూకం యంత్రం అనుసంధానాన్ని చూపించి బియ్యాన్ని సరఫరా చేసేవారు. ఇప్పుడు సిగ్నల్ సమస్య వల్ల మాన్యువల్‌గా బియ్యం పరిమాణాలను నమోదు చేసి, తూకం లేకుండా ఇస్తున్నారు. వేలిముద్రలు తీసుకుని బియ్యం బదులు పేదల చేతుల్లో డీలర్లు అరకొర నగదు పెడుతున్నారు.రేయింబవళ్లు పడిగాపులుసోమవారం చాలాచోట్ల అసలు రేషన్ దుకాణాలు తెరుకోలేదు. గుంటూరు జిల్లా కొరిటెపాడులో సాయంత్రం 4.30 దాటినా చౌక దుకాణం తీయకపోవడంతో వృద్ధులు డీలర్ కోసం ఎదురుచూశారు. నెహ్రూనగర్‌లో 4.50కు కూడా దుకాణం తెరవకపోవడంతో లబ్ధిదారులు నిరాశగా వెనుదిరిగారు. కడప హౌసింగ్‌బోర్డు కాలనీలో 9.50 దాటినా తెరవలేదు. ఇక్కడే ఎన్జీవో కాలనీలో సర్వర్ పనిచేయకపోవడంతో డీలర్ వెళ్లిపోయారు. ఒంగోలు బలరాం కాలనీలో సర్వర్ పనిచేయక రాత్రి సమయంలోనూ ప్రజలు పడిగాపులు పడ్డారు. వాస్తవానికి రేషన్ డీలర్ ఇల్లు ఒకచోట ఉంటుంది.. దుకాణం ఎక్కడో ఉంటుంది. దీంతో సమయపాలన పాటించడంలేదు.తలలు పట్టుకుంటున్న డీలర్లు ⇒ సర్వర్ మొరాయించడంతో ఒంగోలు జిల్లాలో రెండో రోజూ ప్రజలకు కష్టాలు తప్పలేదు. కార్డుదారులు గంటల తరబడి ఎదురుచూశారు. వృద్ధులు కూడా దుకాణానికి వచ్చి రేషన్ తీసుకోవాలనని డీలర్లు చెబుతుండడంతో.. సుదూరంగా ఉన్నప్పటికీ కాలినడకన వెళ్లి బియ్యం గోతాలను ఎత్తుకుని అష్టకష్టాలు పడుతూ ఇళ్లకు తెచ్చుకున్నారు. ⇒ సర్వర్ సక్రమంగా పనిచేయక రాజమహేంద్రవరంలోని పలు ప్రాంతాల్లో కార్డుదారులు రెండు రోజులుగా కష్టాలు పడ్డారు. సర్వర్ ఎప్పుడు పని చేస్తుందోనని నిరీక్షించి.. డీలర్లు సైతం తలలు పట్టుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన లబ్ధిదారులు ఉదయం, సాయంత్రం కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోందని వాపోయారు. ⇒ కడపతో పాటు ప్రొద్దుటూరు, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేలు, మైదుకూరు, కమలాపురం తదితర ప్రాంతాల్లో సర్వర్ సమస్య కారణంగా కార్డుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎండ తీవ్రత ఉన్నప్పటికీ సరుకులు అయిపోతాయేమోనని వచ్చిన వృద్ధులు అవస్థలు పడ్డారు. సరుకులను ఇంటికి తీసుకెళ్లేందుకు పడరాని పాట్లు పడ్డారు. ⇒ తిరుపతి జిల్లాలో చౌక దుకాణాల వద్దకు వెళ్లడానికి లబ్ధిదారులు నానా తిప్పలు పడ్డారు. జిల్లాలో 300 దుకాణాల బాధ్యతను∙ఇంచార్జి డీలర్లుకు అప్పజెప్పారు. వీరంతా ఒక గంట తమ షాప్ వద్ద.. మరో గంట ఇంచార్జి రేషన్ షాపు వద్ద సరుకులు ఇస్తున్నారు. కందిపప్పు, చక్కెర అరకొర ఇస్తున్నారు. ⇒ చిత్తూరు జిల్లాలో రెండోరోజు కూడా రేషన్ పంపిణీ మొరాయించింది. ఉదయం నుంచి రాత్రి వరకు సర్వర్ సమస్య వేధించింది. సర్వర్ పనిచేసినప్పుడల్లా ఒక్కో కార్డుదారుడికి రేషన్ ఇచ్చేందుకు డీలర్లు ముప్పుతిప్పలు పడ్డారు. క్యూలో వేచి ఉన్న కార్డుదారులకు మధ్యాహ్న సమయంలో నీరసం ఆవరించింది. చాలామంది డీలర్లు ఇష్టానుసారంరేషన్ తలుపులు తీశారు. ⇒ ఏలూరు జిల్లాలో రేషన్ పంపిణీ గందరగోళంగా సాగుతోంది. అనేక ప్రాంతాల్లో ఉదయం నుంచి సర్వర్ల సమస్యలతో గందరగోళం నెలకొంది. ⇒ ఉమ్మడి అనంతపురం జిల్లావ్యాప్తంగా సోమవారం కూడా ప్రజలు రేషన్ కష్టాలు ఎదుర్కొన్నారు. 65 ఏళ్లు దాటిన వృద్ధులకు ఇంటి వద్దనే రేషన్ అందిస్తామంటూ కూటమి ప్రభుత్వ పెద్దలు ప్రగల్బాలు పలికినా.. క్షేత్రస్థాయిలో అమలు కాలేదు.అసలే వృద్ధురాలు. ఊతకర్ర లేనిదే నడవలేదు. అయినా బియ్యం కోసం దుకాణానికి వచ్చింది. సర్వర్ పనిచేయక గంటల తరబడి నిరీక్షించింది. ఎట్టకేలకు బియ్యం ఇచ్చాక.. సంచి భుజాన పెట్టుకుని మోయలేక అవస్థలు పడుతూ ఇంటికి బయలుదేరింది. నెల్లూరు ఈద్గామిట్ట ప్రాంతంలో సోమవారం కనిపించిన దృశ్యమిది. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు -
జనంపై బాబు పగ.. ఏపీలో ‘రేషన్’ కష్టాలు (ఫొటోస్)
-
మ‘కామ్’ మారింది!
సాక్షి, మెదక్: వారికి పట్నంలో పనిలేదు.. మనీ లేదు. ఉన్నపణంగా ఉపాధి పోయింది. ఉన్నట్టుండి రోడ్డున పడ్డారు. కుటుంబ పోషణ గగనమైంది. కరోనా కాటుకు వలసకూలీలు విలవిలలాడారు. కట్టుబట్టలతో, ఖాళీకడుపులతో ఊరిబాటపట్టారు. హైదరాబాద్ నగరంలో విపత్కర పరిస్థితులను తట్టుకోలేక సొంతూళ్లకు వచ్చిన చాలామంది స్థానికుల అండతో కొత్త ఉపాధిని వెతుక్కుని జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం వైరస్ ప్రభావం తగ్గినా పట్టణాలకు తరలిపోకుండా సొంత గ్రామం లేదా జిల్లాలో స్థిర నివాసం ఏర్పరచుకొని తోచిన వ్యాపారం చేస్తూ, కూలిపని చేసుకుంటూ కుటుంబాలను సాకుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో విద్యావంతులైన నిరుద్యోగులు పలువురు సొంతంగా చిరు వ్యాపారాలు ఏర్పాటు చేసుకోగా ఇతరులు పలు షాపుల్లో పనులకు వెళ్తూ పొట్టపోసుకుంటున్నట్లు తెలుస్తోంది. రేషన్ పోర్టబిలిటీ లెక్కలే నిదర్శనం రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఏ రేషన్ దుకాణం నుంచైనా రేషన్ సరుకులు తీసుకునే(పోర్టబిలిటీ) వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం కలిపించని విషయం తెలిసిందే. కరోనాకు ముందు ప్రస్తుతం పోర్టబిలిటీ సేల్‌ను పరిశీలిస్తే అధిక మొత్తంలో ప్రజలు సొంతూళ్లలోనే ఉపాధి పొందుతూ జీవనం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మార్చి 22న జనతా కర్ఫ్యూ, వెంటనే లాక్డౌన్ అమల్లోకి రాగా ఆ తర్వాత విడతలవారీగా అన్‌లాక్ చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో, ఇతర ప్రాంతాల్లో ప్రైవేట్‌లో ఉద్యోగాలు చేస్తున్న వందలాది మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. లాక్‌డౌన్‌తో పనుల్లేక వలస కూలీలు సొంత జిల్లాలకు తరలివచ్చారు. ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టినప్పటికీ స్థానికంగానే ఉపాధి పొందుతున్నారు. మెదక్ జిల్లాలో కరోనాకు ముందు ఫిబ్రవరిలో రేషన్ పోర్టబిలిటీ కింద 18,825 మంది ఇతర ప్రాంతాల లబ్ధి దారులు రేషన్ సరుకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ సంఖ్య 30,096కు చేరింది. ఇదే పరిస్థితి రాష్ట్రంలోని అనేక జిల్లాల్లోనూ గమనించవచ్చు. -
రేషన్ కోసం తిప్పలు
ఈచిత్రం మడకశిర మండలం గౌడనవెళ్లి గ్రామంలోనిది. సిగ్నల్ సమస్యతో 14 నంబర్ షాపులోని ఈ-పాస్ యంత్రం వేలిముద్రలు తీసుకోకపోవడంతో మంగళవారం జనమంతా ఇలా ఊరికి కిలోమీటరు దూరం వచ్చి రేషన్ తీసుకుంటున్నారు. అక్కడ కూడా సిగ్నల్ సమస్య వస్తుండడంతో గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని, దీంతో కూలి పనులు కూడా మానుకోవాల్సి వస్తోందని కార్డుదారులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వృద్ధులు, వికలాంగులు కిలోమీటర్ల దూరం నుంచి రేషన్ సరుకులను ఇళ్లకు తీసుకువెళ్లేందుకు పడరానిపాట్లు పడుతున్నారు. మండలంలోని దాదాపు అన్ని రేషన్ షాపుల వద్ద ఇదే పరిస్థితి నెలకొందనీ, కొందరు రేషన్ డీలర్లయితే సిగ్నల్ బాగా అందుతుందని సమీపంలోని కొండలపైకి వెళ్తుండడంతో లబ్ధిదారులంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. - మడకశిర రూరల్