breaking news
ranjith maheshwari
-
రంజిత్, మయూఖాలకు రజతాలు
దోహా: ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత ట్రిపుల్ జంపర్ రంజిత్ మహేశ్వరి రజత పతకం సాధించాడు. ఆదివారం జరిగిన పురుషుల ట్రిపుల్ జంప్ ఫైనల్లో ఈ కేరళ అథ్లెట్ 16.16 మీటర్ల దూరం గెంతాడు. కజకిస్తాన్ అథ్లెట్ 16.69 మీటర్ల దూరం గెంతి స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నాడు. మహిళల ట్రిపుల్ జంప్‌లో భారత్‌కే చెందిన మయూఖా జానీ రజత పతకాన్ని నెగ్గింది. ఆమె 14 మీటర్ల దూరం గెంతి రెండో స్థానంలో నిలిచింది. మహిళల 60 మీటర్ల హర్డిల్స్ విభాగంలో భారత అథ్లెట్ గాయత్రి గోవిందరాజ్ ఫైనల్‌కు అర్హత సాధించింది. మహిళల పెంటాథ్లాన్ ఈవెంట్లో రెండో స్థానం సంపాదించిన స్వప్నా బర్మన్పై నిర్వాహకులు అనర్హత వేటు వేశారు. పెంటాథ్లాన్ ఈవెంట్లో భాగమైన 800 మీటర్ల రేసు సందర్భంగా స్వప్న తన లైన్లో కాకుండా వేరే లైన్లో పరిగెత్తిందని ఇరాన్ అథ్లెట్ ఫిర్యాదు చేసింది. దాంతో విచారణ చేసిన తర్వాత అది నిజమని తేలడంతో నిర్వాహకులు స్వప్న ఫలితాన్ని రద్దు చేశారు. ఇప్పటివరకు ఈ ఈవెంట్లో భారత్‌కు స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్యాలు లభించాయి. -
రంజిత్‌కు మొండిచెయ్యి
న్యూఢిల్లీ : డోపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రిపుల్ జంపర్ రంజిత్ మహేశ్వరికి... ప్రతిష్టాత్మక ‘అర్జున’ అవార్డును ఇచ్చేందుకు కేంద్ర క్రీడాశాఖ తిరస్కరించింది. 2008లో జరిగిన అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో అతను నిషిద్ధ ఉత్ప్రేరకం ఎపిడ్రైన్ వాడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై పూర్తి స్థాయిలో పరిశీలన జరిపిన క్రీడాశాఖ చివరకు పై నిర్ణయానికి వచ్చింది. కొచ్చిలో సెప్టెంబర్ 8, 2008లో జరిగిన అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో మహేశ్వరి శాంపిల్స్‌ను సేకరించి వారం రోజుల తర్వాత జాతీయ డోప్ టెస్టింగ్ ల్యాబోరేటరి (ఎన్‌డీటీఎల్)లో పరీక్షించారు. తర్వాత అక్టోబర్ 3న జరిపిన ‘ఎ’ శాంపిల్స్ పరీక్షలో కూడా అతను ఎపిడ్రైన్ వాడినట్లు రుజువు కావడంతో సస్పెన్షన్ వేటు వేశారు. అయితే వైద్యపరమైన చికిత్స కోసం తాను ఎపిడ్రైన్ వాడానని శాంపిల్స్ సేకరణ సమయంలో మహేశ్వరి చెప్పకపోవడం, విచారణ కమిటీ ముందు ‘బి’ శాంపిల్‌ను పరీక్షించాలని కోరకపోవడంతో అతనిపై మూడు నెలల పాటు నిషేధం విధించారు. అయితే ఈ మొత్తం వ్యవహారంపై మహేశ్వరి నిరసన తెలపకపోవడం, శిక్షను అంగీకరించడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న క్రీడాశాఖ అవార్డును తిరస్కరించింది. మరోవైపు ఈ కేసుకు సంబంధించిన పూర్తి రికార్డులను భారత అథ్లెటిక్ సమాఖ్య (ఏఎఫ్ఐ) సమకూర్చలేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు జరగకుండా కొత్త తరహా నిబంధనలు విధించాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.