breaking news
rambhatla Krishnamurthy
-
అక్షరాలా ‘నడిచే’ విజ్ఞాన సర్వస్వం రాంభట్ల!
ప్రముఖ కవి, విమర్శకుడు, చిత్రకారుడు, పత్రికా రచయిత, సంపాదకుడు, తొలి తెలుగు కార్టూనిస్ట్ కవి (‘శశవిషాణం’), వేదాల గురించి సృజనాత్మకంగా ఆలోచించి విస్తృతంగా రాసిన పరిశోధకుడు, ‘కన్యాశుల్కం’ నిపుణుడు, మార్క్సిస్టు మేధావి, తెలుగులో జర్నలిజం అధ్యయన కేంద్రానికి మొట్టమొదటి ప్రధాన అధ్యాపకుడు, రాంభట్ల కృష్ణమూర్తి. ఆయన శతజయంతి సంవత్సరమిది. పుట్టింది ఎక్కడో తూర్పు తీరంలో అయినప్పటికీ, రాంభట్లగారు తన జీవితంలో అత్యధిక భాగం గడిపింది హైదరాబాద్‌లోనే. నిజానికి, రాంభట్ల ఒక స్వయంనిర్మిత సౌధం! హైదరాబాద్‌లోని శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషానిలయం లాంటి గ్రంథాలయాల్లోనే ఆయన తెలుగుసంస్కృత సాహిత్య అధ్యయనం సాగింది. మాతృభాష తెలుగులోనూ, స్వయంకృషితో నేర్చుకున్న ఇంగ్లిష్‌లోనూ, కొద్దోగొప్పో పాఠశాలల్లో చదువుకున్న ఉర్దూలోనూ రాంభట్లగారు తర్వాతి కాలంలో పాండిత్యం సంపాదించడం విశేషం. తరుణ యవ్వనంలో రాంభట్ల ఆర్య సమాజ్ ప్రభావంలో వేదాల గురించి తెలుసుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. ‘అందరికీ విద్య జ్ఞానప్రాప్తి సత్యప్రకాశం’ అనే దయా నంద సరస్వతి ఆదర్శం రాంభట్లను ప్రభావితం చేసింది. చివరివరకూ ఆయన తన వృత్తి నాలుగు విషయాలు నేర్చుకోవడమూ ఆ నేర్చుకున్నదాన్ని నలుగురికి నేర్పడమేనని నమ్మి, దాన్నే ఆచరించారు. వాస్తవానికి రాంభట్ల జీవనం మేలిమలుపు తిరిగింది ఆ నవయవ్వన దశలోనే. ఆయన దయానంద సరస్వతి దగ్గరే వేద మంత్రాల ప్రతిపదార్థ తాత్పర్యాల దగ్గరే ఆగిపోలేదు! ఫ్రెడ్రిక్ రాసెన్, ఫ్రాంజ్ బాప్, రుడాల్ఫ్ ఫాన్ రాత్, ఫ్రెడ్రిక్ మ్యాక్స్ మ్యూలర్ల రచనలు చదవడానికి ఆయన పడరానిపాట్లు పడ్డారు. ఏమాత్రం తీరిక చిక్కినా మ్యాక్స్ మ్యూలర్ సంకలించిన ‘ద సేక్రెడ్ బుక్స్ ఆఫ్ ద ఈస్ట్’ చదువుతుండేవారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అచ్చువేసిన ఈ సంకలనం మొత్తం రాంభట్లగారికి నిత్యపారాయణీయం. కానీ, జర్మన్ ఇండాలజిస్టుల దగ్గరా ఆయన ఆగిపోలేదు. జవహర్లాల్ నెహ్రూ, శ్రీపద అమృత డాంగే, రాహుల్ సాంకృత్యాయన్ తదితరులు చూపిన బాటలో రుగ్వేద కాలపు గణసమాజాన్ని ఊహించే సాహసానికి ఆయన చిన్ననాటనే తెగించారు! తంత్ర సంస్కృతి గురించి సంపాదించిన పరిజ్ఞానం రాంభట్లని భౌతికవాదం వైపు నడిపించింది. ప్రాచీన ఆచారాల్లో నిబిడీకృతమయివున్న తాంత్రిక భావనలను వెతికే దిశగా అది దారితీసింది. సామెతలూ, ఊళ్ల పేర్ల వెనక దాగిన అర్థాలను విశ్లేషించడానికి ఈ భౌతికవాదమే తోవ చూపించింది. అదే ఆయన్ని తాపీ ధర్మారావు లాంటి బహుముఖ ప్రజ్ఞావంతుడికి చేరువ చేసింది. ఆ ఆలోచన క్రమమే రాంభట్లని మార్క్సిజం వైపు నడిపించింది. ఈ మేధోపరిణామమే ఆయన్ని గ్రంథస్థమయిన చరిత్ర రచనకు మించి ఆలోచించే సాహసిగా పదును పెట్టింది. అదే, తనను అరుదయిన మేధావిగా మార్చింది. 1940 దశకంలో వెలువడుతూ ఉండిన నిజాం అధికార పత్రిక ‘మీజాన్.’ ఇది, ఉర్దూ, ఇంగ్లిష్, తెలుగు భాషల్లో వచ్చేది. తెలుగు పత్రికకు అడివి బాపిరాజు సంపాదకులు. ఆయన దగ్గర సహాయ సంపాదకులుగా చేసే శ్రీనివాస చక్రవర్తి సంస్కృత రూపకాల్లో దిట్ట. ఆయనకు ఆధునిక తెలుగు నాటకాల్లో ‘కన్యాశుల్కం’ అంటే తగని మక్కువ. రాంభట్లకయితే కన్యాశుల్కమంటే ప్రాణం! చక్రవర్తిగారు రాంభట్లకి ఆర్యసమాజ్ రోజులనుంచీ పరిచయస్తులు. ఆయన ద్వారానే అడివి బాపిరాజుతో రాంభట్లకు పరిచయమయింది. బాపిరాజు గారు రాంభట్లను ఎప్పుడూ ‘మైడియర్ యంగ్‌మ్యాన్!’ అని గిరీశం ఫక్కీలో పలకరించేవారట. (రాంభట్ల మమ్మల్నందర్నీ ‘ఏం ఫ్రెండూ!’ అనే పలకరించేవారు!) కన్యాశుల్కమే వారిని కట్టిపడేసింది. ఆ కన్యాశుల్కం నాటకమే రాంభట్లను అభ్యుదయ రచయితగా మార్చింది. దాని రచయిత గురజాడే సామాజిక, ప్రాంతీయ మాండలికాల పట్ల ఆయనలో ఆసక్తి కలిగించారు. గురజాడనుంచే, బాధితులపట్ల పక్షపాతం కలిగి వుండాలనే నీతిని రాంభట్ల నేర్చుకున్నారు. అదే అభ్యుదయ రచయితల సంఘం ప్రణాళిక రచనలో ‘శ్రామికవర్గ పక్షపాతం’గా ప్రతిఫలించింది. ‘మృచ్ఛకటికం కన్యాశుల్కం’, ‘గిరీ శంశకారుడు’, ‘వసంతసేనమధురవాణి’ అనే అంశాలను తులనాత్మకంగా అధ్యయనం చెయ్యడం రాంభట్ల ప్రవృత్తిలోనే భాగంగా మారిపోయింది! ఫ్రెడ్రిక్ ఎంగెల్స్ ద్విశత జయంతి సంవత్సరంలో చెప్పుకోవలసిన ఓ విశేషం ఉంది ఎంగెల్స్ రచన ‘ఆరి జిన్ ఆఫ్ ఫ్యామిలీ’ని రాంభట్ల వారానికి ఒకసారయినా చదివేవారు! విభిన్న అధ్యయనరంగాల్లో విస్తృతమయిన పరిజ్ఞానం కలిగివుండి, ఏ ‘రెఫరెన్సూ’ లేకుండానే గళగ్రాహిగా మాట్లాడుతూవుండే వ్యక్తులను సంచార విజ్ఞాన సర్వస్వాలుగా పిలవడం కద్దు. అయితే, రాంభట్లని సంచార విజ్ఞాన సర్వస్వం అన డం కన్నా, నడిచే విజ్ఞాన సర్వస్వం అనడమే భావ్యమని నా నమ్మకం. ఎందుకంటే, ఆయన అక్షరాలా ‘నడిచే’ విజ్ఞాన సర్వస్వమే! 1970–80లలో, హైదరాబాద్ పురవీథుల్లో రాం భట్ల, చిన్నపాటి శిష్యబృందాన్ని వెంటపెట్టుకుని, కిలోమీటర్ల తరబడి నడుస్తూ కనిపించేవారు. వేదవేదాంగాలు మొదలుకుని ఫ్రాయిడియన్ సైకోఎనాలిసిస్ వరకూ ఫ్రీ సై్టల్ లెక్చర్ దంచుతూ రాంభట్లగారు నడుస్తూవుంటే, మేమందరం ఆయన వెంట అబ్బురపడుతూ నడిచిపోతూండేవాళ్లం. సరమఅపాల మొదలుకుని గిల్గ మేష్ఎంకిడు వరకూ ఎందరెందరి ప్రస్తావనో వస్తూవుండేది. కాస్త ఖాళీగా వుండే ఇరానీ రెస్టారెంట్ కనిపించే వరకూ ఈ వాకథాన్ సాగుతూ వుండేది. ఎక్కడయినా ‘అడ్డా బిఠాయించామంటే’ చర్చనీయాంశం ఓ కొలిక్కివచ్చే వరకూ ‘బైఠక్’ కొనసాగాల్సిందే! ఈ చర్చ ఎప్పుడూ వన్‌వే ట్రాఫిక్‌లా జరిగేదికాదు. నిజానికి రాంభట్లగారే అలా జరగనిచ్చేవారు కారు. ఒకవేళ అలా జరిగే ప్రమాదం కనబడితే, అప్పటిదాకా తాను చెప్తూవచ్చిన వాదాన్ని తానే ఖండించడం మొదలుపెట్టేవారాయన! ‘వాదానువాద సంవాద ప్రతివాదా’లనే తర్క ప్రక్రియల గురించి సహచరులకు వివరిస్తూ చర్చను మోడరేట్ చేసేవారాయన. ఆయన పాతకాలపు ‘చండామార్కుల మార్కు’ గురువు కారు. తన కన్నా పాతిక ముప్ఫైయేళ్లు చిన్నవారయిన శిష్యులందరినీ ప్రేమగా ‘ఫ్రెండూ!’ అని పిలిచే ఆధునిక గురువు. ఏథెన్స్ వీథుల్లో సోక్రటిస్ నిర్వహించాడని చెప్పే ‘ఎలింకస్’ తరహా సంచార చర్చాగోష్ఠులను రాంభట్ల ఏళ్ల తరబడి కొనసాగించారు. నాకు తెలిసి, తెలుగునాట ఇలాంటి కార్యక్రమం చేపట్టిన మరో వ్యక్తి లేరు! అదీ రాంభట్ల విశిష్టత. శతజయంతి వేళ మనం స్మరించుకోవలసిన ముఖ్యమైన అంశం ఇదే. రాంభట్లగారు రాసింది బహుతక్కువ. ఆ రాసిన పది పుస్తకాలూ కూడా మార్కెట్లో దొరకడం లేదు. ఈ శతజయంతి సందర్భంగానైనా తన లభ్య రచనల సర్వస్వం వెలువడితే బావుంటుంది. రాంభట్లగారి ‘ఫ్రెండ్స్’ వింటున్నారా? (ఫిబ్రవరి 22 ఉదయం విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీలో రాంభట్ల కృష్ణమూర్తి శత జయంతి సభ సందర్భంగా..) వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు మందలపర్తి కిశోర్ -
విజయవాడ పై ఒక ‘వైతాళిక’ రచన
రాజధాని కేవలం భౌతికం కాదు, దానికో మానసిక పార్శ్వం కూడా ఉంటుంది. రాజధాని కేవలం రాజకీయ సంబంధి కాదు, దానికి సాంస్కృతిక కోణం ఉంటుంది. రాజధాని సుందరికి దేహపుష్టితో పాటు చక్కని నడక, నాజూకు కూడా అవసరమే. కానీ మీడియా, ఇతర మేధావి వర్గాలకు సైతం ఇది పూర్తిగా అర్థమైనట్టులేదు. ‘మొన్నటివరకూ తెలుగువాళ్లకు తమదంటూ చెప్పుకోదగిన ఓ మహానగరం లేదు. నగరం లేకపోతే నాగరికత ఎలా వస్తుంది?’ అనేవారు రాంభట్ల కృష్ణమూర్తి. ఇప్పుడు తెలుగువాళ్లకు రాజధాని రూపంలో మరో మహానగరం రాబోతోంది. దానిని ‘అమరావతి’ అనే అందమైన, చారిత్రక స్ఫురణ కలిగిన పేరుతో పిలవబోతున్నా దానికి విశాలమైన దేహాన్ని కల్పించబోయేది మాత్రం విజయవాడే. ఇక్కడో విచిత్రం ఉంది. ‘అమరావతి’ అనే రాజధానిలో విజయవాడ వెళ్లి కలసిపోవడం లేదు. రాజధాని నగరమే విజయవాడలో కలసిపోబోతోంది. ఈవిధంగా విజయవాడ రెండు ‘త్యాగాలు’ చేయబోతోంది. మొదటిది, ‘రాజధాని’ అని ఘనంగా చెప్పుకునే అవకాశాన్ని అది అమరావతికి ధారపోస్తోంది. రెండోది, ఇంద్రుడికి ఆయుధం కావడం కోసం దధీచి వెన్నెముకను అర్పించినట్టుగా, రాజధాని కోసం విజయవాడ తన దేహాన్ని అర్పిస్తోంది. అయితే, తను చేయబోతున్న త్యాగాల గురించీ, రాజధాని ప్రాంతంగా తను సరికొత్త రూపురేఖల్ని తెచ్చుకోబోవడం గురించీ విజయవాడ నగరానికి ఇప్పటికీ తెలిసినట్టు లేదు. పూర్వం బాల్యవివాహాలు చేసేవారు. పెళ్లన్నా, పెళ్లికూతురు ముస్తాబన్నా ఏమీ తెలియని వయసు కనుక; అలంకారానికి యాంత్రికంగా ఒళ్లు అప్పగించడం తప్ప రేపు తన రూపు ఎలా మారుతుందో, పెళ్లి తన జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో బాలవధువుకు ఏమీ తెలియదు. పైగా మన పెళ్లిళ్లు చాలావరకూ అర్ధరాత్రి ముహూర్తాల్లోనే కనుక ఆ చిన్నారి నిద్రలో జోగుతూ ఉంటుంది. రాజధానీ అవతరణ పూర్వ సంధ్యలో ఇప్పుడు విజయవాడ కూడా అలాగే జోగుతున్నట్టుంది. ఏ జాతి చరిత్రలోనైనా రాజధాని నిర్మాణం ఒక ఉజ్వలఘట్టం. ఒక ఉత్తేజకర సందర్భం. ఎన్నో కలలు, ఊహలు, ప్రణాళికలతో మనసులు కిక్కిరిసిపోయి తబ్బిబ్బు పడాల్సిన సమయం. రాజధాని నిర్మాణమంటే కేవలం భూసేకరణ కాదు; రియల్ ఎస్టేట్ పుంజాలు తెంచుకోవడం కాదు; ప్రభుత్వం ఏదో చేసేస్తుంటే జనం కళ్లప్పగించి చూస్తూ ఉండిపోవాల్సిన ఘట్టం అసలే కాదు; సమాజం తాలూకు సర్వాంగాలూ కొత్త రక్తం నింపుకుని సరికొత్త ఉత్సాహంతో పాలుపంచుకోవలసిన సన్నివేశం. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఆ సందడి కనిపించడం లేదు. రాజధాని కేవలం భౌతికం కాదు, దానికో మానసికపార్శ్వం కూడా ఉంటుంది. రాజధాని కేవలం రాజకీయ సంబంధి కాదు, దానికి సాంస్కృతిక కోణం ఉంటుంది. రాజధాని సుందరికి దేహపుష్టితో పాటు చక్కని నడక, నాజూకు కూడా అవసరమే. కానీ మీడియా, ఇతర మేధావి వర్గాలకు సైతం ఇది పూర్తిగా అర్థమైనట్టులేదు. అర్థమయ్యుంటే ఈ వర్గాల దృష్టి ఇప్పటికే విజయవాడ మీద ఫ్లడ్ లైట్ కాంతితో పడి ఉండేది. ఈ నగర చరిత్రేమిటి, దీని కథేమిటి, దీని ప్రస్తుత స్థితిగతులు ఏమిటి, దీనికున్న హంగులూ, అవకాశాలూ ఎలాంటివి, రాజధాని ప్రాంతంగా అభివృద్ధి చెందడానికి దీనికి ఇంకా ఏమేం కావాలి సహా అనేక ప్రశ్నల్లోకి ఇప్పటికే లోతుగా తలదూర్చి ఉండేవి. కనీసం విజయవాడ మీద చిన్నవో, పెద్దవో పుస్తకాలైనా ఈపాటికి మార్కెట్‌ను ముంచెత్తి ఉండాలి. ఆ దాఖలాలు లేవు. అయితే, ఇంత ఎడారిలోనూ ఒక ఒయాసిస్... అది, జాన్సన్ చోరగుడి వెలువరించిన ‘మన విజయవాడ’. తెలుగునాట అభివృద్ధి - సామాజిక అంశాలను ‘కాలికస్పృహ’తో విశ్లేషించి వ్యాఖ్యానించే కొద్దిమంది సీరియస్ రచయితల్లో జాన్సన్ చోరగుడి ఒకరు. విజయవాడపై తను చేసిన రేడియో ప్రసంగాలను పొందుపరుస్తూ ‘మన విజయవాడ’ పేరుతో తొలి ముద్రణను ఆయన 2000 సంవత్సరంలోనే ప్రచురించారు. ప్రస్తుత రాజధాని సందర్భాన్ని దృష్టిలో ఉంచుకుని, దానికే మరికొన్ని అంశాలు జోడిస్తూ పునర్ముద్రించారు. ఆవిధంగా ఈ పుస్తకానికి ఒక ‘వైతాళిక’ (మేలుకొలుపు) స్వభావం వచ్చింది. విజయవాడను ‘కలర్‌ఫుల్’గా కాకుండా ‘బ్లాక్ అండ్ వైట్’లో చూపించడానికి జాన్సన్ ప్రయత్నించారు. నేటి తీరుతెన్నులను ఎత్తిచూపుతూ మెత్తని వాతలూ పెట్టారు. నైసర్గికంగా విజయవాడ ఉత్తర, దక్షిణాలకు కూడలి అవడం వల్ల మొదటినుంచీ వర్తక కేంద్రంగానే ఉంటూ వచ్చిందనీ, ఆ విధంగా ‘వెచ్చాలవాడ’ అయి, క్రమంగా ‘వెచ్చవాడ’, ‘బెజవాడ’ అయిందని ఆయన అంటారు. క్రీ.శ. 10-11 శతాబ్దులలో విజయవాడ వేంగీ చాళుక్యుల ఏలుబడిలో ఉన్నప్పుడు రాష్ట్రకూటులు, వారి వత్తాసుతో రెండవ యుద్ధమల్లుడు జరిపిన దండయాత్రలతో విజయవాడ ఓ పెద్ద రణరంగంగా మారి అరాచక శక్తులకు ఆటపట్టు అయిందనీ; అప్పటినుంచీ ఆ అరాచక స్వభావం కొనసాగుతూ ఉండడం విజయవాడ ప్రత్యేకత అనీ అంటారు. పంచాయతీగా ఉన్నప్పుడు విజయవాడ రూపురేఖలేమిటి, అది ఎప్పుడు మునిసిపాలిటీ అయింది, విజయవాడకు ఎప్పుడు రైలొచ్చింది-- మొదలైన వివరాలను ఎంతో ఆసక్తిభరితంగా అందిస్తూనే; వ్యవసాయ ఆర్థికత నుంచి సినిమా, ఆటోమొబైల్ రంగాలకు; రకరకాల మోసాలతో సహా డబ్బు సంబంధ వ్యాపారాలకూ ఎలా పరివర్తన చెందుతూ వచ్చిందో ఒక సామాజిక శాస్త్రవేత్తకు ఉండే లోచూపుతో విశ్లేషించారు. సామాజిక వర్గాల అమరికను, ఊర్ధ్వచలనాన్ని స్పృశించారు. విజయవాడ పుస్తక ప్రచురణ కేంద్రంగా మారిన నేపథ్యాన్నీ తడిమారు. నాణ్యమైన చదువుల స్పృహ ఫలితంగా విస్తరించిన విద్యాసంస్థలతో, మేధోవలసలతో విజయవాడ ‘గ్లోబలైజేషన్’లో భాగమవుతున్నా; ‘ఇప్పటికీ వెరపు లేకుండా బహిరంగంగా బూతులు (సెక్సు కాదు, తిట్లు) మాట్లాడటం బెజవాడలో సహజ దృశ్యశ్రవణ’మనీ, ‘పొలం నగరంలోకి రావడం అంటే ఇదే’ననీ అంటూ చిన్న వ్యాఖ్యా దర్పణంలోనే కొండంత బెజవాడను చూపించారు. ‘మానసిక కాలుష్యం లేని ఒక తరం కనుక ఆవిర్భవిస్తే... ఇక్కడ అన్ని విధాల ఆరోగ్యవంతమైన రాష్ట్ర రాజధాని రూపు దిద్దుకోవడం ఇప్పటికీ సాధ్యమే’నన్న చారిత్రక ఆశాభావాన్నీ వ్యక్తం చేశారు. 76 పేజీల ఈ సచిత్ర రచన పరిమాణంలో చిన్నదే కానీ విషయ వైశాల్యంలో, లోతులో చిన్నది కాదు. రేపు ఒక సమగ్ర రచనకు అవకాశమిచ్చే అన్ని రకాల ప్రాతిపదికలూ ఇందులో ఉన్నాయి. భాస్కరం కల్లూరి 9703445985