breaking news
rahamahendravaram
-
సోదరుడి మరణం.. రాజమండ్రికి జయప్రద
ఇటీవల అలనాటి సినీ నటి జయప్రద ఇంట విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. అనారోగ్యంతో ఆమె సోదరుడు రాజా బాబు మరణించారు. హైదరాబాద్‌లో ఉంటున్న ఆయన గురువారం (ఫిబ్రవరి 27) తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని జయప్రద సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. తాజాగా జయప్రద తన సోదరుడు రాజా బాబు అస్థికలను రాజమండ్రిలోని గోదావరి నది పుష్కర ఘాట్‌లో కలిపారు. ఈ సందర్భంగా తన సోదరుడి గురించి ఆమె మాట్లాడారు. ఆయన మా జీవితాల నుంచి దూరంగా వెళ్లిపోయినందుకు మాకు చాలా బాధగా ఉందన్నారు. ఆయన కుమారుడు సామ్రాట్‌తో కలిసి రాజాబాబు జన్మస్థానంలో అక్కడే అస్థికలు కలిపేందుకు వచ్చామని జయప్రద తెలిపారు.నా సోదరుడు రాజా బాబు ఇక్కడే పుట్టి పెరిగాడు. ఇక్కడే చదువుకున్నాడు. అతనితో ఉన్న ఎన్నో మరవలేని క్షణాలు గుర్తుగా ఉండిపోయాయి. నేను రాజమండ్రి ఎప్పుడొచ్చినా నా సోదరుడితోనే కలిసి వచ్చేదాన్ని. మొదటిసారి ఆయన లేకుండా ఇక్కడికి వచ్చా. మా జీవితాల్లో రాజాబాబు లేకపోవడం బాధగా ఉంది. అతని కుమారుడైన సామ్రాట్‌తో కలిసి ఈ రోజు అస్థికలు ప్రదానం చేయడానికి వచ్చాం. నా సోదరుడి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా' అని అన్నారు.ఇక జయప్రద విషయానికొస్తే 14 ఏళ్లకే నటిగా కెరీర్ ప్రారంభించారు. 1976 నుంచి 2005 వరకు దాదాపు 300కి పైగా సినిమాల్లో నటించారు. మరోవైపు రాజకీయాల్లోనూ ఉన్నారు. 1994లో తొలుత తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీ నాయకులతో గొడవల కారణంగా రెండేళ్లకే బయటకొచ్చి, సమాజ్ వాదీ పార్టీలో చేరారు. ప్రస్తుతానికైతే బీజేబీలో కొనసాగుతున్నారు. అలానే ప్రభాస్ 'ఫౌజీ'లోనూ ప్రస్తుతం నటిస్తున్నారు. -
రాజమహేంద్రవరంలో రాజెవరు..?
సాక్షి, రాజమహేంద్రవరం : తూర్పు చాళుక్య రాజైన రాజరాజ నరేంద్రుడు పాలించిన చారిత్రక ప్రాంతమిది. ఆ రాజ్యపు రాజధానిగా కూడా ఉండే రాజమహేంద్రవరం గతంలో రాజమండ్రి, రాజమహేంద్రి అని కూడా పిలిచారు. రాష్ట్రానికి సాంస్కృతిక రాజధానిగా పేరొందింది. రాజమహేంద్రవరం లోక్‌సభ నియోజకవర్గం గోదావరి నది చుట్టూ విస్తరించి ఉంది. ఆర్థిక, సాంఘిక, చారిత్రక, రాజకీయ ప్రాముఖ్యత కలిగిన నియోజకవర్గంగా గుర్తింపు పొందింది. పోలవరం వద్ద మన రాష్ట్రంలోకి ప్రవేశించిన గోదావరి నది ధవళేశ్వరం వద్ద రెండు ప్రధాన పాయలుగా చీలి ఏర్పరచిన డెల్టా ఇక్కడే ఉంది. నియోజకవర్గ స్వరూపమిదీ రాజమహేంద్రవరం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో దీని రూపురేఖలు మారిపోయాయి. అంతకుముందు రాజమహేంద్రవరం నియోజకవర్గంలో భాగంగా ఉన్న బూరుగుపూడి, కడియం, రామచంద్రాపురం, ఆలమూరు శాసనసభ నియోజకవర్గాలను తొలగించి.. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అదనంగా రెండు సెగ్మెంట్లను దీని పరిధిలో చేర్చారు. దీంతో తూర్పుగోదావరి జిల్లాలోని 4 అసెంబ్లీ సెగ్మెంట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలోని 3 అసెంబ్లీ సెగ్మెంట్లు ఈ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. గత చరిత్ర ఇది 1952లో భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున తొలి ఎంపీగా కానేటి మోహనరావు ఎన్నికయ్యారు. ఆ తర్వాత నల్లా రెడ్డినాయుడు, డీఎస్ రాజు, ఎస్‌బీపీబీకే పట్టాభి రామారావు, చుండ్రు శ్రీహరిరావు, సినీ నటి జూలూరి జమున, కేవీఆర్ చౌదరి, చిట్టూరి రవీంద్ర, గిరిజాల వెంకట స్వామినాయుడు, ఎస్‌బీపీబీకే సత్యనారాయణరావు, ఉండవల్లి అరుణ్‌కుమార్, మాగంటి మురళీమోహన్ ఇక్కడి నుంచి ఎంపీలుగా గెలిచారు. డీఎస్ రాజు(దాట్ల సీతారామరాజు), ఎస్‌బీపీబీకే పట్టాభి రామారావు వరుసగా మూడుసార్లు హ్యాట్రిక్ విజయాలు సాధించారు. వారి తర్వాత ఉండవల్లి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. ఇక్కడ మరో విశేషమేమిటంటే డీఎస్ రాజు 1957లో ఏకగ్రీవంగా ఎన్నికై రికార్డు సృష్టించారు. కాగా, ఇక్కడి నుంచే ఎంపీలుగా ఎన్నికైన ఎస్‌బీపీబీకే పట్టాభి రామారావు(కాంగ్రెస్), ఎస్‌బీపీబీకే సత్యనారాయణ స్వయానా అన్నదమ్ములు. వీరిద్దరూ కేంద్ర మంత్రులుగా పనిచేశారు. ఈ నియోజకవర్గంలో 16 పర్యాయాలు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ 10 సార్లు, టీడీపీ మూడుసార్లు, బీజేపీ రెండుసార్లు, భారత కమ్యూనిస్టు పార్టీ ఒకసారి విజయం సాధించాయి. అవినీతి ఊబిలో టీడీపీ అధికార టీడీపీని అవినీతి వెంటాడుతోంది. ఈ నియోజకవర్గ పరిధిలో దోచుకున్నంతగా ఇసుకను ఎక్కడా దోచుకోలేదు. ఇసుక ద్వారా అధికార పార్టీ నాయకులు రూ.వేలాది కోట్లు ఆర్జించారు. ఒక్క ఇసుకే కాదు.. మట్టి, గ్రావెల్ అక్రమ తవ్వకాలతో భారీగా దోపిడీ చేశారు. రియల్టర్ల దగ్గర ముడుపులు తీసుకుని అక్రమ లేఅవుట్లు వేయించారు. ఆ ముసుగులో పక్కనున్న ప్రభుత్వ భూములు, చెరువులను ఆక్రమించారు. నీరు–చెట్టు, మరుగుదొడ్లు, సీసీ రోడ్లు, సాగునీటి పనులు.. ఇలా ప్రతి దాంట్లో అక్రమాలకు పాల్పడ్డారు. ఇక, పుష్కర పనుల్లో పెద్దఎత్తున దోపిడీ జరిగింది. ఆ పనులను టీడీపీ నేతలకు కట్టబెట్టి పుష్కర నిధులను ధారాదత్తం చేశారు. వాటికి తోడు టీడీపీ నేతల మధ్య ఎక్కడికక్కడ అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ముఖ్యంగా కొవ్వూరులో విశాఖ జిల్లా పాయకరావుపేటకు చెందిన అనితను తీసుకొచ్చి పోటీ చేయిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పుష్కర పాపం చంద్రబాబుదే సీఎం చంద్రబాబు ప్రచార యావకు గోదావరి పుష్కరాల్లో 29 మంది భక్తులు బలి అయ్యారు. ఆయన ప్రచార డాక్యుమెంటరీ కోసం భక్తులను కట్టడి చేసి, అనంతరం ఒక్కసారిగా వదిలేయడంతో రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన భక్తులు ప్రాణాలను కోల్పోయారు. దీనికి ముమ్మాటికీ చంద్రబాబుదే బాధ్యత. రాజమహేంద్రవరం చరిత్రలో పెను మృత్యుఘంటిక మోగించిన ఆ ఘటనను ఇక్కడి ప్రజలంతా ఎప్పటికీ మరిచిపోలేరు. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో చంద్రబాబు ప్రత్యేకించి చేసిందేమీ లేదు. ఆ పార్టీ నేతల అవినీతిని ప్రోత్సహించడం తప్ప అభివృద్ధికి ఏమాత్రం పాటు పడలేదు. రాజన్న అడుగులు డెల్టా ఆధునికీకరణకు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.1,710 కోట్ల నిధులు కేటాయించారు. గోదావరి నీటిని మెట్టకు తరలించే పుష్కర ఎత్తిపోతల పథకానికి వైఎస్సార్ రూ.900 కోట్లు కేటాయించారు. 1.45 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరందించాలని లక్ష్యంగా నిర్దేశించారు. నన్నయ యూనివర్సిటీ ప్రగతికి పాటు పడ్డారు. బరిలో వీరే వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా మార్గాని భరత్, టీడీపీ తరఫున మాగంటి రూప, జనసేన నుంచి ఆకుల సత్యనారాయణ, బీజేపీ అభ్యర్థిగా సత్య గోపీనాథ్దాస్, కాంగ్రెస్ తరఫున ఎన్.విజయ శ్రీనివాసరావు రంగంలో ఉన్నారు. ఇక్కడ పోటీ ప్రధానంగా వైఎస్సార్ సీపీ, టీడీపీ మధ్యనే ఉంది. ప్రధాన పార్టీ అభ్యర్థులిద్దరూ కొత్త వారే. ఓటమి భయంతో సిట్టింగ్ ఎంపీ మాగంటి మురళీమోహన్ ఎన్నికల నుంచి తప్పుకోవడంతో ఆయన కోడలు మాగంటి రూప అభ్యర్థిత్వం తెరపైకి వచ్చింది. వైఎస్సార్ సీపీ తరపున యువకుడు, బీసీ నేత, సినీ నటుడు మార్గాని భరత్ పోటీ చేస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. భరత్ సుపరి చితుడు బీసీ వర్గానికి చెందిన యువకుడు. సినీ పరిశ్రమతో పరిచయం ఉన్న వ్యక్తి. ప్రజాసేవ చేయాలన్న సంకల్పంతో రాజకీయాల్లో అరంగేట్రం చేశారు. వైఎస్సార్ సీపీలో చేరి ఇప్పటికే లోక్‌సభ పరిధిలోని అన్ని ప్రాంతాలనూ చుట్టి వచ్చారు. దాదాపు అందరికీ సుపరిచితులయ్యారు. లోక్‌సభ వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ గాలి వీస్తుండటంతో విజయావకాశాలు మెండుగా కనబడుతున్నాయి. ప్రజలకు తెలియని రూపం ఎంపీ మురళీమోహన్ ఎన్నికల బరినుంచి తప్పుకోవడంతో ఆయన కోడలు మాగంటి రూప పోటీ చేస్తున్నారు. గతంలో మామకు సహకారంగా ఉన్నా నియోజకవర్గంలో ఆమె మార్క్ ఏమీ లేదు. నామినేషన్లకు కొన్ని రోజుల ముందు ఆమె అభ్యర్థిత్వం ఖరారైంది. దీంతో నియోజకవర్గ ప్రజలకు అంతగా పరిచయం కాలేదు. మామ మురళీమోహన్ ప్రత్యేకంగా చేసిందేమీ లేకపోవడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ఆ ప్రభావం రూపపై పడనుంది. – కందుల శివశంకర్, సాక్షి ప్రతినిధి, కాకినాడ -
అక్రమ నిర్మాణాలకు అడ్డా
జీ+2కు అనుమతులు.. అంతకుమించి నిర్మాణాలు.. సెట్‌బ్యాక్స్ లేకుండానే అపార్ట్మెంట్ల నిర్మాణం కాతేరులో యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన బిల్డర్‌కు లైసెన్స్ లేకపోయినా ప్లాన్‌కు పంచాయతీ అనుమతి పట్టించుకోని వివిధ విభాగాల అధికారులు సాక్షి, రాజమహేంద్రవరం : అక్రమ నిర్మాణాలకు కాతేరు అడ్డాగా నిలుస్తోంది. పాలక మండలి లేకపోవడం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవవడంతో పంచాయతీ పరిధిలో అనుమతులు లేకుండానే బహుళ అంతస్తుల భవనాలను యథేచ్ఛగా నిర్మిస్తున్నారు. సిబ్బంది చేతివాటంతో గ్రామంలో అనధికార కట్టడాలు విచ్చలవిడిగా పెరిగిపోవడంతోపాటు పంచాయతీకి లక్షల రూపాయల నష్టం వాటిల్లుతోంది. గత మూడేళ్లుగా కాతేరు పంచాయతీలో వందల సంఖ్యలో భవన నిర్మాణాలు చేపట్టారు. ఇందులో అపార్టుమెంట్లు, వ్యక్తిగత ఇళ్లు కూడా ఉన్నాయి. వీటిలో కొన్నింటికి పంచాయతీ అనుమతి ఉండగా మరికొన్నింటికి అటువంటిదేమీ లేదు. పంచాయతీ స్థాయిలో జీ+2 వరకూ భవనాల నిర్మాణానికి మాత్రమే అనుమతి లభిస్తుంది. కానీ కాతేరు పంచాయతీలో జీ+3 అంతకుమించి సొంత ఇళ్లు, జీ+5 వరకూ అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారు. వీటిలో కొన్నింటికి డీటీసీపీ అనుమతులుండగా మరికొన్ని అపార్ట్మెంట్లకు అటువంటివేవీ లేవు. అనుమతి కొంత.. కట్టేది కొండంత.. భవన నిర్మాణానికి పంచాయతీ అనుమతి తప్పనిసరి. స్థలం యాజమాన్య హక్కు పత్రాలు, లైసెన్స్ ఉన్న సర్వేయర్ వద్ద భవన నిర్మాణ ప్లాన్, సంబంధిత ఫీజులు చెల్లిస్లూ దరఖాస్తు చేసుకుంటే పాలక మండలి తీర్మానంతో పంచాయతీ కార్యదర్శి అనుమతిచ్చారు. అపార్ట్మెంట్ నిర్మాణానికి పైన పేర్కొన్న పత్రాలతోపాటు బిల్డర్ లైసెన్స్ నకలు కూడా దరఖాస్తుతో జత చేయాలి. భవనం నిర్మిస్తున్న యజమాని లేదా బిల్డర్ నుంచి నిబంధనలకు, దరఖాస్తులో పేర్కొన్న కొలతలకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టబోమన్న ప్రమాణ పత్రం కూడా తీసుకుంటారు. కానీ కాతేరు పంచాయతీలో ఇలాంటివేవీ పట్టించుకోకుండానే దరఖాస్తు చేసిన వెంటనే అనుమతులు ఇచ్చేశారు. కొంతమంది జీ+2కు అనుమతులు తీసుకుని జీ+3 భవనాలు నిర్మించారు. కాతేరు పంచాయతీ మల్లయ్యపేటలో ప్రధాన రహదారికి 50 అడుగుల దూరంలో గోదావరి నది వైపు మూడంతస్తుల అపార్ట్మెంట్ నిర్మిస్తున్నారు. పంచాయతీ పరిధిలో రెండంతస్తుల వరకూ మాత్రమే నిర్మాణాలు చేపట్టాలి. నాలుగంతస్తుల నిర్మాణాలకు జిల్లా పట్టణ ప్రణాళిక విభాగం, ఐదు అంతకు పైన అంతస్తులకు గుంటూరులోని డీటీసీపీ కార్యాలయం అనుమతులు మంజూరు చేస్తాయి. కానీ మల్లయ్యపేటలో నిర్మాణంలో ఉన్న మూడంతస్తుల అపార్ట్‌మెంట్‌కు జిల్లా పట్టణ ప్రణాళిక విభాగం నుంచి ఎలాంటి అనుమతులూ లేవు. పంచాయతీ నుంచే రెండతస్తుల(జీ+2)కు అనుమతులు తీసుకుని మూడంతస్తులు (జీ+3) నిర్మిస్తున్నారు. ఇప్పటివరకూ ఏడు ఫ్లాట్లు విక్రయించారు. ముందువైపు మూడడుగులు, చుట్టుపక్కల రెండడుగుల మేర సెట్‌బ్యాక్స్ వదిలారు. పంచాయతీల్లో అపార్ట్మెంట్లు ఇలాగే నిర్మిస్తారని, జీ+2కు అనుమతి తీసుకుని జీ+3 కట్టామని, అధికారులు వచ్చినప్పుడు చూద్దామని బిల్డర్ చెబుతున్నారు. దీనినిబట్టి కాతేరు పంచాయతీలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిబంధనలు గాలికి.. అపార్ట్మెంట్ల నిర్మాణంలో నిబంధనలు ఏమాత్రం పాటించడం లేదు. నాలుగు వైపులా ఖాళీ స్థలం (సెట్‌బ్యాక్) రెండడుగులకు మించి లేదు. అగ్నిప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల జాడే లేదు. భవనం చుట్టూ గ్రీన్‌జోన్(మొక్కల పెంపకం)కు స్థలం కూడా లేకుండా ప్రహరీని ఆనుకునేవిధంగా అపార్ట్మెంట్ నిర్మిస్తున్నారు. బిల్డర్‌గా ఏ ప్రభుత్వ విభాగం నుంచీ లైసెన్స్ లేకపోయినా పంచాయతీ కార్యదర్శి అనుమతి ఇచ్చేశారు. సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ విభాగం నుంచి అమ్మకం లైసెన్స్ ఉందా? లేదా? అన్న విషయాలు పరిశీలించకుండానే అనుమతులు ఇచ్చేశారు. కాతేరు గ్రామంలోని మరికొన్ని అపార్ట్మెంట్లు కూడా ఇలాగే ఉన్నాయి. పర్యవేక్షణ లేకపోవడమే అసలు సమస్య రెండంతస్తులకు అనుమతి తీసుకుని మూడు, నాలుగు అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నా పట్టించుకునే అధికారే కాతేరులో కరువయ్యారు. అనుమతి ఇచ్చిన మేరకు భవన నిర్మాణం జరుగుతుందో లేదోనన్న విషయాన్ని కార్యదర్శి తరచూ పర్యవేక్షించాలి. కానీ గతంలో పని చేసిన కార్యదర్శులు ఇలాంటివేమీ పట్టించుకోలేదు. దీంతో భవన నిర్మాణదారులు అడ్డగోలుగా కట్టేస్తున్నారు. కార్యదర్శి పట్టించుకోకపోయినా మండల, డివిజన్ స్థాయి అధికారులు తరచూ తనిఖీలు చేస్తూండాలి. సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ తదితర విభాగాల అధికారులు తనిఖీలు చేయాలి. కానీ ఇక్కడ అలాంటివేమీ లేకపోవడంతో భవన నిర్మాణదారులు చెలరేగిపోతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణం జరుగుతున్నా పట్టించుకోని అధికారులు.. తీరా భవన నిర్మాణం పూర్తయ్యాక రంగంలోకి దిగుతున్నారు. భవన నిర్మాణదారులవద్ద లక్షల రూపాయలు దండుకుని కిమ్మనకుండా ఉంటున్నారన్న ఆరోపణలున్నాయి.