breaking news
Qila
-
జగిత్యాలకు ఐకాన్ ఈ ‘ఖిల్లా’
జగిత్యాల: ఈ ఖిల్లా జగిత్యాలకే ఐకాన్. దాదాపు 20 ఎకరాల స్థలంలో ఫ్రెంచ్ ఇంజనీర్ల పర్యవేక్షణలో ఈ కోటను నిర్మించినట్లు చెబుతుంటారు. నక్షత్రాకారంలో నిర్మించిన ఈ కోట చుట్టూ కందకాలను తవ్వారు. శత్రువులు కోటపై దాడిచేస్తే అడ్డుకునేందుకు దాదాపు వందకు పైగా ఫిరంగులు (Cannons) ఏర్పాటు చేశారు. సైనికుల కోసం ప్రత్యేక గదులు, అలాగే ఫిరంగులు, ఆయుధాల నిల్వ కోసం కూడా ప్రత్యేకమైన గదులు, తాగునీటి కోసం నిర్మించిన బావి, కోనేరు సైతం ఇందులో ఉన్నాయి. దాదాపు మూడు వందల సంవత్సరాలు గడుస్తున్నా ఈ కోట ఇంకా చెక్కు చెదరకుండా ఉంది.1930 వరకు జగిత్యాల (Jagtial) రెవెన్యూ కార్యాలయాలు ఈ కోటలోనే ఉండేవని చెబుతుంటారు. ఎలగందుల కోట పాలకులైన జుల్‌ముల్క్ జాఫరుద్దౌలా, మీర్జా ఇబ్రహీంఖాన్‌లు ఈ కోటను నిర్మించినట్లు చెబుతుంటారు. ఫ్రెంచ్ ఇంజనీర్లు దీనిని ప్రత్యేకంగా నిర్మించారు. దీనిని పైనుంచి చూస్తే తప్ప ఇది నక్షత్రాకారంలో ఉన్నట్లు తెలియదు. చెక్కుచెదరని గోడలు.. కందకాలు.. వందల సంవత్సరాల కిందట నిర్మించిన ఈ ఖిల్లా ముఖద్వారం గానీ, సైనికుల కోసం ఏర్పాటు చేసిన గదులు గానీ ఇప్పటికీ చెక్కు చెదరలేదు. శత్రువులు కోటలోనికి రావాలంటే లోతైన ఆ కందకాన్ని దాటి రావాల్సి ఉంటుంది. అప్పట్లో ఆ కందకంలో మొసళ్లను కూడా పెంచేవారని చెబుతుంటారు. సైనికులు రాకపోకలు సాగించడానికి కొన్ని చోట్ల కందకాల వద్ద చెక్క తలుపులు ఉండేవి. అవసరం ఉన్నప్పుడు వారు బయటకు వెళ్లేవారు. కోటలో ఏనుగులు (Elephants) కూడా ఉండేవని చెబుతుంటారు. అలాగే ఇప్పటికీ ప్లస్ ఆకారంలో నిర్మించిన కోనేరులో ఎంత ఎండలు మండినా నీరు ఎండిపోదు. ఈ కోట నుంచి ఒక సొరంగం కరీంనగర్ (Karimnagar) జిల్లాలోని ఎలగందుల కోటకు సైతం వెళ్తుందని చరిత్రకారులు చెబుతుంటారు. పట్టించుకోని పురావస్తు శాఖ.. ఈ ఖిల్లాను అభివృద్ధి చేస్తే మంచి పర్యాటక కేంద్రంగా మారే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. పురావస్తు శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. జగిత్యాల జిల్లాగా ఏర్పాటైన అనంతరం అప్పటి కలెక్టర్ శరత్.. జగిత్యాల ఖిల్లాలోనే స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. దీంతో ఖిల్లాకు పూర్వ వైభవం వచ్చింది. చదవండి: శామీర్‌పేట్ కారిడార్‌పై పీటముడి.. హెచ్ఎండీఏ తర్జనభర్జనఈ వేడుకలకు ఖిల్లాను పూలు, మొక్కలతో ఎంతో అందంగా తీర్చిదిద్దేవారు. అయితే కరోనా (Corona) వచ్చినప్పటి నుంచి వేడుకలను ఇందులో నిర్వహించడం బంద్ చేశారు. మళ్లీ ఖిల్లా పూర్వ వైభవం కోల్పోతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి దానిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రజలు కోరుతున్నారు. -
ఖిలాకు కొత్తశోభ
గణతంత్ర వేడుకలకు ముస్తాబు 260 ఏళ్లనాటి కోటలో 26 ఉత్సవాలు జగిత్యాల జోన్ : చుట్టూ లోతైన కందకాలు.. అందులో భయంకరమైన మొసళ్లు.. ఫిరంగుల చప్పుళ్లు, సైనికుల విన్యాసాలతో ఒకప్పుడు శత్రుదుర్భేద్యంగా ఉన్న జిల్లాకేంద్రంలోని 260 ఏళ్లనాటి ఖిలా (కోట).. రిపబ్లిక్ దినోత్సవానికి వేదిక కాబోతోంది. గతమంతా కీర్తిగాంచిన ఈ ఖిలా.. ఇన్నాళ్లూ నిర్లక్ష్యం నీడలో కొనసాగింది. జగిత్యాల జిల్లాగా ఆవిర్భవించడం.. పరిపాలన అందుబాటులోకి రావడంతో ఖిలా కొత్త శోభ సంతరించుకోనుంది. నాడు మొగలుల సేనలు కవాతు చేస్తే.. అదే ప్రాంతంలో నేడు పోలీసులు దేశానికి గౌరవవందనం సమర్పించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ శరత్, ఎస్పీ అనంతశర్మ ఆధ్వర్యంలో వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నక్షత్రాకారంలో ఖిలా జిల్లాకేంద్రంలోని ఖిలా కండ్లపల్లి చెరువుకు సమీపాన ఉంటుంది. దీన్ని 20 ఎకరాల్లో నక్షత్రాకారంలో నిర్మించారు. ఆ సమయంలో ఖిలా చుట్టూ లోతైన కందకాలు తవ్వి.. అందులో మొసళ్లను పెంచేవారని ప్రచారం. దీన్ని జల్దర్గా కోటగా సైతం పిలిచేవారు. కోట నిర్మాణం యూరోపియన్ పద్ధతిలో క్యాజిల్‌ను పోలి ఉంటుంది. రాయి, సున్నంతో ఈ కోటను నిర్మించారు. 1747లో నిర్మితమైన ఖిలా జగిత్యాల పరగణానికి పరిపాలన కేంద్రంగా ఉండేది. మొ గల్ గవర్నర్‌గా ఉన్న నవాబ్ ఇబ్రహీం ఈ కోటను నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతుంటారు. 1791లో నిజాం సైన్యాలకు, ఇబ్రహీం థంసా కుమారుడికి, ఎలగందుల పాలకుడైన ఎహెత్షామి జంగ్ సైన్యాలకు యుద్దం కూడా జరిగినట్లు చెబుతుంటారు. ఇందులో ఖిలా సంరక్షకుడు జాఫర్ అలం పోరాడి నిజాం సేనల చేతిలో ఓడిపోయినట్లు చెపుతుంటారు. కట్టె చెక్కల మీదుగా కోటలోకి ప్రవేశం కోటలోకి నేరుగా ఎవరూ వెళ్లే అవకాశం ఉండేదికాదు. పొడవైన, లోతైన కందకాలు దాటాలంటే వెడల్పాటి పెద్ద కట్టె చెక్కలు వేసేవారని, అవి దాటాక రెండు ప్రధాన ద్వారాలు వస్తాయి. వీటికీ పొడవైన తలుపులు ఉన్నాయి. వీటిని ఏనుగులతోనే లాగించేవారని చరిత్రకారులు చెబుతుంటారు. ఇప్పటికీ కనిపిస్తున్న ఫిరంగులు మొగలులు, తర్వాత వచ్చిన నిజాంలు ఈ కోటను తమకు రక్షణ వలయంగా ఉపయోగించున్నారు. కోటలోని ఎతైన ప్రదేశంలో 100 వరకు ఫిరంగులను ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఫిరంగులు కోటలో ఇప్పటికీ కనిపిస్తాయి. వాటిపై మహ్మాద్ ఖాసీం పేరు కనిపిస్తుంది. కోటలో మందుగుండు సామగ్రిని నిల్వ చేసేందుకు విశాలమైన గదులు నిర్మించారు. కోటను సంరక్షించేందుకు ఒక ఖిలేదారు, 200 మంది సిపాయిలు పర్యవేక్షించేవారని తెలుస్తోంది. పరిపాలన కేంద్రంగా ఖిలా 17వ శతాబ్దంలో నిర్మించిన ఖిలా ఓ పరిపాలన కేంద్రంగా ఉండేది. 1905 దాకా ఎలగందుల సర్కారుగా ఉన్న సమయంలో ఖిలాలోనే పరగణా కార్యాలయాలు పనిచేసేవి. దువ్వం తాలుకాదార్ (సబ్ కలెక్టర్) ఇక్కడి నుండే పాలన సాగించేవారు. ఇలా 1930 వరకు జగిత్యాల రెవెన్యూ కార్యాలయాన్ని ఈ కోటలోనే నిర్వహించారు. వేడుకలకు సర్వంసిద్ధం కోట మరమ్మతు, ఆధునీకరణకు రూ.50 లక్షలు ఇస్తామని చెప్పిన పాలకులు కేవలం. రూ.10 లక్షలు మాత్రమే కేటాయించారు. ఆ నిధులు చిన్నచిన్న పనులకే సరిపోలేదు. ఖిలాలో లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తామని చెప్పినా ఇంకా ఆచరణలోకి రాలేదు. ఖిలాలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తుండటంతో, ఈ సారైన అధికారుల, ప్రజాప్రతినిధుల దృష్టి పడుతుందని జగిత్యాల ప్రజలు ఆశిస్తున్నారు.