breaking news
putting stones
-
పొట్టకూటికి రాళ్లు రువ్వుతున్నారు
న్యూఢిల్లీ: కశ్మీర్ యువతకు టూరిజం కావాలో, టెర్రరిజం కావాలో తేల్చుకోవాలంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం కశ్మీర్‌ను సందర్శించినప్పుడు కామెంట్ చేశారు. యతి, ప్రాసలతో కూడిన కామెంట్లు చేయడం, మీడియాను ఆకట్టుకోవడం ఆయనకు ఆది నుంచి అలవాటు. టూరిజాన్ని వదిలేసి టెర్రరిజమ్ వైపు వెళ్లడం కశ్మీర్ యువతకు ప్యాషన్ కాదు. ఉద్యోగాలు కల్పించలేని ప్రభుత్వం మీద ద్వేషం వారికి. ఆక్రోశంతో రాళ్లు రువ్వడం ప్రారంభించినా అది వారి బతుకుతెరువుగా మారుతోంది. రాళ్లు రువ్వినందుకు నెలకు ఐదు వేల నుంచి ఎనిమిది వేల రూపాయల వరకు వారికి మిలిటెన్సీని ప్రోత్సహిస్తున్న వారి నుంచి అందుతున్న విషయం తెల్సిందే. జమ్మూ కశ్మీర్లో చదువుకున్న ఇంజనీర్లు ఉన్నారు, టీచర్లు ఉన్నారు. స్వరాష్ట్రంలో పొరుగు రాష్ట్రాల్లో వారికి ఉద్యోగాలు లేవు. వారంతా నిరాశ, నిస్పహలతో రగిలిపోతున్నారు. నిపుణులైన జర్నలిస్టులు ఉన్నారు. ఫొటో గ్రాఫర్లు ఉన్నారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల్లో పనిచేసే వారికి చేతికందే ఆదాయం పొట్టకూటికే సరిపోదు. దేశంలో 18 ఏళ్ల నుంచి 29 ఏళ్లలోపు నిరుద్యోగుల సంఖ్య జాతీయ సగటు 13.2 శాతం ఉండగా, జమ్మూ కశ్మీర్లో దాదాపు రెండింతలు, అంటే 24.6 శాతం ఉన్నట్లు 2016లో నిర్వహించిన ఆర్థిక సర్వేనే తెలియజేస్తోంది. ఒక్క ఎంప్లాయిమెంట్ డిపార్ట్మెంట్ వద్దనే తమ పేర్లను నమోదు చేసుకున్న యువకులు లక్ష మందికిపైగా ఉన్నారు. వారికి ఉద్యోగం వస్తుందన్న ఆశ లేదు. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలుగానీ, కంపెనీలుగానీ లేనందున వారంతా ప్రభుత్వం ఉద్యోగాల కోసం నిరీక్షించాల్సిందే. ఒక్క పోలీసు ఉద్యోగాలు తప్పించి ఇతర ఉద్యోగాలు వారికి అందుబాటులో లేవు. (చదవండి...అక్కడ రాళ్లు విసిరితే డబ్బులిస్తారు) ల్యాప్ టాప్‌లు పట్టుకోవాల్సిన చేతులు రాళ్లు పట్టుకుంటున్నాయని కూడా నరేంద్ర మోదీ కామెంట్ చేశారు. నెలల తరబడి ఇంటర్నెట్ సర్వీసులను ప్రభుత్వమే నిలిపివేస్తుంటే వారు ల్యాప్ టాప్‌లను పట్టుకొని మాత్రం ఏం చేస్తారు. రాళ్లు విసిరితే నాలుగు డబ్బులైన వస్తాయి. గతేడాది మిలిటెంట్ బుర్హాని ఎన్కౌంటర్ జరిగిన నాటి నుంచి ఇప్పటి వరకు కశ్మీర్లో రెండు నెలలు కూడా ఇంటర్నెట్ పనిచేయలేదు. రాళ్లు రువ్వడంలో మరణిస్తున్నదీ, మిలిటెంట్లుగా మారుతున్న వారు కూడా బాగా చదువుకున్న వారే కావడం గమనార్హం. ఎంతో మంది ఇంజనీరింగ్ చదవిన విద్యార్థులు ఉద్యోగాలు రాక, టెర్రరిజమ్ వైపు మొగ్గు చూపుతున్న విషయం తెల్సిందే. వారందరు కూడా రాళ్లను పేర్చి ప్రాజెక్టులు కట్టాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఏం ప్రాజెక్టులు కడుతున్నారు? రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివద్ధి చేసినా కశ్మీర్లో సగం నిరుద్యోగ సమస్య తీరిపోయేది. అబ్బురపరిచే కశ్మీర్ అందాలు బాలివుడ్ సినిమాల్లో కనిపిస్తాయితప్ప నిజ జీవితంలో కనిపించవు. అందంగా కనిపించే దాల్ లేక్‌ను దూరం నుంచి చూడాల్సిందే తప్ప దగ్గరికెళితే కంపు భరించలేం. పర్యాటక ప్రాంతాలను అభివద్ధికి ఎంతో అవకాశం ఉన్నప్పటికీ ఆ దిశగా కేంద్రం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలేవీ లేవు. మిలిటñ న్సీ కారణంగా పర్యాటక ప్రాంతాలను అభివద్ధి చేయలేక పోతున్నామని ప్రభుత్వం సాకులు చెబుతోంది. అభివద్ధికి, మిలిటెన్సీకి అవినాభావ సంబంధం ఉందన్న విషయాన్ని గ్రహించి పనులు చేపడితే ఫలితం రావచ్చు. –ఓ సెక్యులరిస్ట్ కామెంట్ -
అక్కడ రాళ్లు విసిరితే డబ్బులిస్తారు
కశ్మీర్: జమ్మూ కశ్మీర్లో అల్లర్లు చెలరేగినప్పుడల్లా మెరికల్లాంటి కుర్రవాళ్లు వీధుల్లోకి రావడం, పోలీసులు, సైనికులు, ప్రభుత్వ అధికారులపైకి రాళ్లు రువ్వడం, వాహనాలను దగ్ధం చేయడం, దుకాణాలను తగులబెట్టడం మనం తరచూ చూస్తూనే ఉంటాం. కొన్నిసార్లు పెట్రోలు బాంబులు విసురుతూ బీభత్సం సష్టించడం కూడా తెల్సిందే. కాస్త జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ కుర్రవాళ్లు తమను గుర్తు పట్టకుండా ఉండేందుకు ముఖాలకు ముసుగులు ధరించడం లేదా కళ్ల కిందుగా ముఖాలకు కర్చీఫ్‌లు కట్టుకోవడం, పరుగెత్తడానికి అనువుగా కాళ్లుకు తెల్లటి స్పోర్ట్స్ షూలను ధరించడం కనిపిస్తుంది. నిరుద్యోగంతో రగిలిపోతున్న యువత ప్రభుత్వం మీద వ్యతిరేకతో ఇలా పెడదారి పట్టి పోతోందని సామాజిక శాస్త్రవేత్తలు ఇంతకాలం సూత్రీకరిస్తూ వచ్చారు. అదే ఉద్దేశంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా తన కశ్మీర్ పర్యటన సందర్భంగా కశ్మీర్ యువతను ఉద్దేశించి మాట్లాడుతూ పర్యాటకాన్ని ఎంచుకుంటారా, ఉగ్రవాదాన్ని ఎంచుకుంటారా? అని కూడా ప్రశ్నించారు. రాళ్లు రువ్వుతున్నది నిరుద్యోగ యువతేగానీ ప్రభుత్వం మీద ఆగ్రహంతోనే ఆక్రోశంతోనో వాళ్లు రాళ్లు రువ్వడంలేదు. కేవలం డబ్బుల కోసం వారు రాళ్లు రువ్వుతున్నారు. రాళ్లు రువ్వినందుకు వారికి నెలకు ఒక్కొక్కరికి 5,000 రూపాయల నుంచి 8,000 రూపాయలు జీతంగా వస్తాయట. పెట్రోలు బాంబులు తయారు చేయడానికి, వాటిని విసిరినందుకు అదనపు చార్జీలు అందుతాయట. ఈ విషయాలను రాళ్లు రువ్వుతున్న కుర్రవాళ్లు జకీర్ అహ్మద్ భట్, ఫరూక్ అహ్మద్ లోన్, వసీం అహ్మద్ ఖాన్, ముస్తాక్ వీరి, ఇబ్రహీం ఖాన్ ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన ఓ ఆపరేషన్‌లో వెల్లడించారు. 2008, 2010 సంవత్సరాల్లో కశ్మీర్లో పెద్ద ఎత్తున రాళ్లు రువ్వి బీభత్సం సష్టించిన సంఘటల్లో తాను పొల్గొన్నానని, గతేడాది బుర్హాన్ వాణి మిలిటెంట్ ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో కూడా తాను రాళ్లు రువ్వానని జకీర్ అహ్మద్ భట్ తెలిపారు. రాళ్లు రువ్వినందుకు తనకు నెలకు ఎనిమిది వేల రూపాయల వరకు అందుతాయని, తాను పెట్రోలు బాంబులు కూడా తయారు చేస్తానని, అందుకు ఒక్కోదానికి 700 రూపాయలు అందుతాయని, వాటిని విసిరినందుకు అదనపు చార్జీలు ఇస్తారని భట్ చెప్పారు. ‘మీకు డబ్బు ఎవరు ఇస్తారు, ఎవరి ద్వారా మీకు ఆ డబ్బు అందుతుందీ, ఎలా అందుతుందీ?’ అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు భట్ నిరాకరించారు. ‘ఇది మా బతుకుతెరువుకు సంబంధించిన అంశం. మా ప్రాణం పోతుందన్నా మా వెనకనున్న వ్యక్తుల గురించి మీము చెప్పం’ అని భట్ చెప్పారు. ‘కశ్మీరు పోలీసులు, సైనికులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రభుత్వ అధికారులపై మేము ఎన్నోసార్లు రాళ్లు రువ్వాం. ఇక ముందు కూడా అదే చేస్తాం. ఇది మాకు తిండి పెడుతోంది. బారముల్లా, సొపోర్, పటాన్లలో కూడా నేను రాళ్లు విసిరాను. ఇప్పుడు రాళ్లు రువ్వేందుకు ప్రతి శుక్రవారం బారముల్లా పోతున్నాను. శుక్రవారం నాడు రాళ్లు రువ్వినందుకు మాకు అదనపు డబ్బులు ముట్టుతాయి’ అని ఓ ప్రశ్నకు సమాధానంగా భట్ తెలిపారు. ఇంతవరకు 50, 60 పెట్రోలు బాంబులు విసిరానని చెప్పారు. రాళ్లు రువ్వినందుకు ఒక్కో రోజు వెయ్యి రూపాయల నుంచి మూడు వేల రూపాయల వరకు అందుకున్న సందర్భాలు ఉన్నాయని వసీం అహ్మద్ ఖాన్ తెలిపారు. మీకు డబ్బులిచ్చే వ్యక్తితో మీకు పరిచయం ఉందా? అన్న ప్రశ్నకు తన స్నేహితుడి ద్వారా తనకు పరిచయం అయ్యాడని లోన్ తెలిపారు. డబ్బులిచ్చే వ్యక్తి మిలిటెంటా లేదా టెర్రరిస్టా ? అని ప్రశ్నించగా, వారి గురించి ఎలాంటి వివరాలు వెల్లడించలేనని చెప్పారు. ఎక్కడ రాళ్లు రువ్వాలో, ఎప్పుడు రాళ్లు రువ్వాలో ముందస్తు ప్రణాళిక ఉంటుందా అన్న ప్రశ్నకు లోన్ సమాధానమిస్తూ ముందుగానే పక్కా వ్యూహంతో తమకు కబురు అందుతుందని చెప్పారు. రాళ్లు రువ్వే కుర్రవాళ్లలో పది, పన్నేండేళ్ల బాలలు కూడా ఉన్నారని, వారికి నెలకు ఐదువేల రూపాయల వరకు పేమెంట్లు ఉంటాయని వారు తెలిపారు. కండపుష్టి కలిగిన బలమైన యువకులకు గ్రూపులో పేమెంట్లు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. తమలో ఇప్పుడు చాలా వాట్సాప్ గ్రూపులున్నాయని, అత్యవసర సమయాల్లో గ్రూపు సందేశాలు పంపిస్తారని అహ్మద్ ఖాన్ తెలిపారు. వీరిలో ఒకరిద్దరు రాళ్లు రువ్విన సంఘటనల్లో అరెసై్ట ఆరు నెలలు జైలుకెళ్లిరాగా మరొకరి ఏడాది జైలు శిక్ష అనుభవించి వచ్చారు. జైలుకెళ్లి వచ్చినా మారలేదా ? అన్న ప్రశ్నకు ఇది తమ బతుకుతెరవని, మరోపని చేస్తూ బతకడం కష్టమని వారు చెప్పారు. గతేడాది జూలై నెల నుంచి అక్టోబర్ నెల వరకు రాళ్లు రువ్విన సంఘటనల్లో 92 మంది మరణించగా, 19 వేల మంది ప్రజలు గాయపడ్డారు. నాలుగువేల మంది భద్రతా సిబ్బంది కూడా గాయపడ్డారు. ఇద్దరు జవాన్లు మరణించారు. కశ్మీర్లో ఒక్క ఏడాదిలోనే రాళ్లు రువ్విన సంఘటనలు కొన్ని వేలుంటాయి.