లంగ్స్‌కు పొగచూరు... దగ్గుతో బేజారు!!
చలికాలం అనగానే కొన్ని వ్యాధులు కాస్త విజృంభిస్తాయి. మిగతా సీజన్లలోనూ అవి కనిపించినా ఈ టైమ్‌లో తమ ప్రతాపం చూపుతాయి. వాటిల్లో ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు కాస్త ప్రబలంగా కనిపిస్తుంటాయి. అందులో ఒకటి క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్. ఇంగ్లిష్‌లో సంక్షిప్తంగా సీఓపీడీ అని పిలిచే ఈ వ్యాధి దగ్గుతో వ్యక్తమవుతుంది. పురుషుల్లోనైతే ప్రధానంగా పొగతాగే అలవాటు వల్ల, మహిళల్లో కట్టెల పొయ్యి వద్ద విపరీతమైన పొగకు గురి కావడం వల్ల కనిపించే ఈ వ్యాధిపై అవగాహన కోసం ఈ కథనం.
ఎడతెరిపి లేకుండా దగ్గు వస్తుండే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ అనే ఈ వ్యాధి దీర్ఘకాలికంగా బాధిస్తుంటుంది. సాధారణంగా ఇది పిల్లల్లో కనిపించదు. పెద్దవాళ్లలోనూ నలభై ఏళ్లకు పైబడిన వారిలోనే ఇది ఎక్కువగా ఉంటుంది. అయితే పొగతాగే అలవాటు గనక ఉంటే నలభై లోపు వాళ్లలోనూ కనిపించడానికి అవకాశాలు ఎక్కువ. అందుకే బీడీలు, సిగరెట్లు, హుక్కా వంటి పొగ అలవాటు ఉన్నవారిలో ఇది చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఒకప్పుడు పొగ విపరీతంగా తాగి, ఇప్పుడు మానేసిన వారిలోనూ ఇది కనిపించడానికి ఆస్కారం ఎక్కువ. ఇక చలి ప్రదేశాల్లో చలికాచుకోడానికి మంట వేసుకుని, నిత్యం ఆ పొగకు ఎక్స్పోజ్ అయ్యేవారిలోనూ ఇది ఎక్కువగానే కనిపిస్తుంటుంది. కేవలం పొగ మాత్రమే గాక... దుమ్ము, ధూళితో కూడిన వాతావరణమూ ఈ వ్యాధికి ఒక కారణం. అందుకే బొగ్గుగనుల్లో, సిమెంటు, టెక్స్టైల్స్, రసాయనాలు, ఆభరణాలకు పూత పూసే ఎలక్ట్రో ప్లేటింగ్ పరిశ్రమల వంటి చోట్ల పనిచేసేవారిలోనూ ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇలాంటి వాతావరణంలో దీర్ఘకాలికంగా పనిచేయడం లేదా అదేపనిగా కలుషిత వాతావరణానికి ఎక్స్పోజ్ కావడం వ్యాధికి ప్రబలమైన కారణమేగాక... వ్యాధిని ప్రేరేపించే అంశం (ట్రిగరింగ్ ఫ్యాక్టర్)గా పనిచేస్తుంది.
కారణాలు: మనం ఊపిరితిత్తుల ద్వారా శ్వాస తీసుకుంటామన్న విషయం తెలిసిందే. నిత్యం పొగతాగే అలవాటు వల్ల గానీ లేదా ఎప్పుడూ పొగకు ఎక్స్పోజ్ అవుతుండటం వల్ల గానీ ఊపిరితిత్తుల్లోకి గాలిని తీసుకెళ్లే శ్వాసనాళాలు సన్నబడతాయి. ఫలితంగా వాటి ద్వారా గాలి వెళ్లడానికి, లోపలి నుంచి బయటకు రావడానికి కొంత అవరోధం ఏర్పడుతుంది. దాంతో ఊపిరిసరిగా అందక నిండుగా, బరువుగా ఉన్నట్లు, ఛాతీ పట్టేసినట్లు ఉంటుంది.
ఆస్తమా (ఉబ్బసం) ఉన్న వ్యక్తుల్లో చికిత్స సరిగా జరగకపోతే దీర్ఘకాలంలో వారికి కూడా సీఓపీడీ రావచ్చు.
సీఓపీడీ - తీవ్రతలలో తేడాలు : సాధారణంగా సీఓపీడీ వ్యాధిలో దగ్గు లక్షణం ఉన్నా... దాని తీవ్రతను బట్టి ఇతర లక్షణాలూ కనిపించవచ్చు. ఈ వ్యాధి తీవ్రతను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి... తక్కువ (మైల్డ్), ఒక మోస్తరు (మోడరేట్), తీవ్రమైనది (సివియర్)గా వ్యాధి తీవ్రతను విభజించవచ్చు. ఆయా దశల్లో వ్యాధి లక్షణాలు ఈ కింది విధంగా ఉంటాయి.
తక్కువ (మైల్డ్): దగ్గు కాస్త ఎక్కువగా వస్తుంటుంది ఒక్కోసారి దగ్గుతో పాటు శ్లేష్మం (కళ్లె) కూడా పడవచ్చు కాస్త ఎక్కువగా పనిచేసినా లేదా త్వరత్వరగా నడిచినా ఊపిరి తీసుకునే సామర్థ్యం తగ్గినట్లుగా అనిపించవచ్చు.
ఓ మోస్తరు (మోడరేట్): దగ్గు ఎక్కువగానే వస్తుంటుంది. దగ్గుతో పాటు శ్లేష్మం (కళ్లె) పడుతూ ఉంటుంది కాస్త ఎక్కువగా పనిచేసినా లేదా వేగంగా నడిచినా కూడా ఊపిరి అందనట్లుగా అనిపిస్తుంది. శారీరక శ్రమతో కూడిన ఇంటిపనులు చేస్తున్నప్పుడు ఆయాసంగా ఉంటుంది. దాంతో మిగతావారితో పోల్చినా, ఇంతకు ముందు పనిచేసే తీరుతో పోల్చినా ఇంటి పనులన్నీ నెమ్మదిగా చేయాల్సి వస్తున్నట్లు గ్రహిస్తారు జలుబు లేదా ఛాతీ ఇన్ఫెక్షన్ వస్తే తగ్గడానికి చాలా రోజులు పడుతుంది.
తీవ్రమైన (సివియర్) వ్యాధి లక్షణాలు: విపరీతంగా దగ్గు వస్తుంది. పగలూ రాత్రీ అదేపనిగా దగ్గుతుంటారు దగ్గుతో శ్లేష్మం (కళ్లె) కూడా విపరీతంగా పడుతూ ఉంటుంది పనికి వెళ్లలేరు మెట్లు ఎక్కలేరు ఇంటిపని కూడా చేయలేరు కనీసం గదిలో ఒక మూల నుంచి మరో మూలకు కూడా నడవలేరు ఆఖరికి విశ్రాంతి తీసుకుంటున్నా అలసిపోయినట్లే ఉంటుంది.
వ్యాధి నిర్ధారణ: సీఓపీడీని నిర్ధారణ చేయడానికి స్పైరోమీటర్ అనే పరికరాన్ని ఉపయోగిస్తారు. దీని సహాయంతో కొన్ని శ్వాస పరీక్షలు చేసి వ్యాధితో పాటు... అది తక్కువ (మైల్డ్)గా ఉందా, ఓ మోస్తరా (మోడరేట్) లేక తీవ్రం (సివియర్)గా ఉందా అన్నది నిర్ధారణ చేస్తారు. ఈ పరీక్షకు ముందుగా డాక్టర్లు రోగిని వ్యక్తిగతంగా/క్లినికల్‌గా పరీక్షిస్తారు. దాంతోపాటు అతడు పనిచేసే ప్రదేశం, వాతావరణం, వృత్తిగత సమస్యల (ప్రొఫెషనల్ హెజార్డ్స్) వంటి అనేక అంశాల ద్వారా వ్యాధిని నిర్ధారణ చేస్తారు.
నివారణ: ఈవ్యాధికి పొగతాగే అలవాటు నుంచి దూరంగా ఉండటం / పొగతాగే అలవాటు ఉంటే దాన్ని తక్షణం మానేయడం మంచి నివారణ. రోజుకు కనీసం రెండు సిగరెట్లు తాగినా సరే... ఈ వ్యాధి పెరిగి, పరిస్థితి వేగంగా దిగజారుతుంది. ఊపిరితిత్తుల్లోకి పొగ ప్రవేశిస్తున్నకొద్దీ అది వాయునాళాలను మరింతగా మూసుకుపోయేలా చేస్తుంది. దాంతో శ్లేష్మం (కళ్లె) మరింతగా పెరుగుతూ పోతుంది. ఫలితంగా ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ (ప్రాణవాయువు) పాళ్లు బాగా తగ్గి, పనిచేసే శక్తిని, సామర్థ్యాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. అందుకే వ్యాధి ఉన్నవారు ముందుగా పొగతాగే అలవాటుపై కష్టమైనా నియంత్రణ సాధించాలి. అందుకే ప్రయత్నపూర్వకంగానైనా పొగతాగే అలవాటుకు దూరం కావాలి. అందుకు ఉపయోగపడే కొన్ని సూచనలివి...
స్మోకింగ్ మానేయాలని అనుకున్న తర్వాత ఫలానా తేదీ నుంచి మానేస్తాను అని మీ సన్నిహితులకు బహిరంగంగా చెప్పండి. ఆ తర్వాత కూడా మీరు స్మోకింగ్ చేస్తూ ఉంటే మాటతప్పుతున్నావంటూ వారు మిమ్మల్ని హెచ్చరించేలా చేసుకోండి.
పొగ తాగడం మానేసిన వెంటనే... అంటే ఆరుగంటల్లోనే దాని తాలూకు మంచి ఫలితాలు మీకు తెలియడం ప్రారంభమవుతుంది. అంటే... అదేపనిగా పొగచూరే మీ ఊపిరితిత్తులు శుభ్రం కావడం ప్రారంభమవుతుంది. అవి శుభ్రమయ్యేలోపే మీరు పొగను మళ్లీ లోనికి పంపించరు కాబట్టి క్రమేణా... పొగ తాలూకు కాలుష్యాలను ఊపిరితిత్తుల్లోని సీలియరీ బాడీస్‌గా పేర్కొనే ప్రత్యేకకణాలు తమ మూవ్మెంట్స్ (ఫ్లిక్కరింగ్)ద్వారా ఊపిరితిత్తులను శుభ్రపరుస్తాయి. పొగ తాగాలన్న కోరిక కలిగిన ప్రతిసారీ ఈ విషయాన్ని గుర్తుతెచ్చుకుంటూ ఉండండి. దాంతో పొగతాగాలనుకున్న ప్రతిసారీ ఆ కోరికను వాయిదా వేసుకుంటారు. అలా నాలుగైదు సార్లు జరిగితే... లాస్ట్ టైమ్ పొగ తాగినప్పటి నుంచి గ్యాప్ క్రమంగా పెరుగుతూ పోయి కొద్దికాలంలోనే మీకు స్మోకింగ్‌పై కోరిక తగ్గుతుంది.
మీరు సిగరెట్స్ కొనే షాప్‌ను ప్రయత్నపూర్వకంగా దాటేయండి. సాధారణంగా అలవాటైనచోటే సిగరెట్స్ కొంటుంటారన్నది ఒక పరిశీలన. కాబట్టి ఆ షాప్ ఉండే మార్గం గుండా కాకుండా వేరే దారుల్లో మీ కార్యాలయానికి వస్తుండండి. ఈ అంశం వల్ల కూడా స్మోకింగ్ నుంచి దూరంగా ఉండే అవకాశాలు పెరుగుతాయి. మీకు అందుబాటులో ఉన్న ప్రతిసారీ పొగ తాగేస్తుంటారు. అందుకే ప్రయత్నపూర్వకంగా సిగరెట్ ప్యాకెట్ /బీడీ కట్ట వంటివి మీకు అందుబాటులో లేకుండా చూసుకోండి. అందుబాటులో లేకపోవడం అన్న అంశం కూడా చాలాసార్లు పొగ తాగే వ్యవధిని పెంచుతుంది. ఒకసారి పొగతాగే వ్యవధి మీకు తెలియకుండానే బాగా పెరిగితే... ఆ తర్వాత దాన్ని కాస్తంత ప్రయత్నపూర్వకంగా కొనసాగిస్తే... పొగతాగే అలవాటు నుంచి దూరమయ్యే అవకాశాలు పెరుగుతుంటాయి. మీరు స్మోక్ చేసేటప్పుడు కంపెనీ ఇచ్చే వారి నుంచి తాత్కాలికంగా దూరంగా ఉండండి. మీరు స్మోకింగ్ మానేసిన విషయం వారికి చెప్పండి. ఇకపై సిగరెట్ ఆఫర్ చేయవద్దని, బలవంతం కూడా చేయవద్దని స్నేహితులకు చెప్పండి. ఇంట్లోని యాష్-ట్రే వంటి వాటిని తొలగించండి. మీరు సిగరెట్ తాగాక వచ్చే దుర్వాసనతో మీ పిల్లలు, మీ పార్ట్నర్, మీ ఫ్రెండ్స్, కొలీగ్స్ మీనుంచి దూరం జరగడం గమనించండి. వాళ్లలా జరిగిపోవడం మీకు ఇబ్బంది కలిగించి పొగతాగే అలవాటును మానేస్తారు.
నోటినుంచి దుర్వాసన వస్తుంటే మీరెంత ఇబ్బందిపడతారో మీకు తెలిసిందే. అలాంటిది దుర్వాసన కలిగించే అంశాన్ని ప్రయత్నపూర్వకంగా ఎందుకు చేస్తారని మీకు మీరు విశ్లేషించుకుంటే తప్పక ఆ దురలవాటుకు దూరమవుతారు.
మీకు మనోబలం సరిపోక మీ అంతట మీరు మానలేకపోతుంటే డాక్టర్లను కలిసి తప్పనిసరిగా యాంటీ క్రేవింగ్ ట్యాబ్లెట్స్ తీసుకోండి. అలా మందులు వాడుతున్నందుకైనా మీరు పొగ తాగడం మానేస్తారు.
మీరు పొగతాగే సమయంలో ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి. పొగతాగడం మానేసి, కొంతకాలం గడిచాక ఆ తర్వాత మళ్లీ మరోసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి. ఈ పరీక్షల వల్ల వచ్చిన పాజిటివ్ ఫలితాలను గుర్తించండి. ఆ ఫలితాలు మిమ్మల్ని కచ్చితంగా మీ దురలవాటునుంచి దూరం చేస్తాయి.
సిగరెట్ మానాలనుకున్నప్పుడు తేదీలను నిర్ణయించుకోవద్దు. ఆ తేదీకి దగ్గరవుతున్నకొద్దీ ‘ఎలాగూ మానేస్తున్నాం కదా’! అన్న ఫీలింగ్‌తో ఎక్కువ సిగరెట్స్ తాగే అవకాశం ఉంది. అందుకే అనుకున్న వెంటనే మానేయండి. ఆ నిర్ణయం తప్పనిసరిగా సత్ఫలితాలు ఇస్తుంది.
- నిర్వహణ: యాసీన్
చికిత్స
సీఓపీడీ లక్షణాలు కనిపించగానే... అవి పెరిగేదాకా వేచిచూడవద్దు. ఎంత త్వరగా చికిత్స జరిగితే అంత తేలిగ్గా/సమర్థంగా సీఓపీడీని అదుపు చేయవచ్చు. ఇక ఈ చికిత్సలో భాగంగా థియోఫిలిన్ మాత్రలను వాడాల్సి ఉంటుంది. అలాగే వాయునాళాలను వెడల్పు చేసేందుకు పీల్చే మందులైన ‘బ్రాంకోడయలేటర్స్’ను ఉపయోగిస్తారు. వీటిని ఉపయోగించగానే అవి... శ్వాసనాళాలను వెడల్పు చేసి... మరింత బాగా/కులాసాగా శ్వాస పీల్చుకోడానికి తోడ్పడతాయి. ఇది కాస్త దీర్ఘకాలం చేయాల్సిన చికిత్స కాబట్టి దగ్గు వంటి లక్షణాలు తగ్గగానే, వ్యాధి తగ్గినట్లుగా అపోహ పడవద్దు. కాబట్టి లక్షణాలు తగ్గినట్లు అనిపించినా డాక్టర్ చెప్పిన వేళలకు ఫాలో అప్‌కు వెళ్తుండాలి.
అపోహ
ఈ వ్యాధి ఉన్నవారు విపరీతంగా దగ్గుతుండటం వల్ల ఇది అంటువ్యాధిలా అనిపిస్తుంది.
వాస్తవం
సీఓపీడీలో దగ్గు తీవ్రంగా ఉన్నప్పటికీ ఇది అంటువ్యాధి కాదు.
డాక్టర్ సునంద
కన్సల్టెంట్ పల్మునాలజిస్ట్
కేర్ హాస్పిటల్స్,
నాంపల్లి, హైదరాబాద్