breaking news
Pro kabaddi-2017
-
ప్రొకబడ్డీ సీజన్-5 టైటిల్ విజేత పట్నా పైరేట్స్
సాక్షి, చెన్నై: ప్రొకబడ్డీ ఐదో సీజన్ విజేతగా డిఫెండింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్ నిలిచింది. వరుసగా మూడో సారి టైటిల్ గెలిచి హ్యాట్రిక్ సాధించడంతో టోర్నీ చరిత్రలో తిరుగులేని రికార్డు సృష్టించింది. పట్నా కెప్టెన్ ప్రదీప్ నర్వాల్ 19 రైడ్ పాయింట్లతో మరోసారి తన దూకుడైన ఆటతో ఆ జట్టుకు 55-38 తేడాతో చిరస్మరణీయ విజయం అందించాడు. అత్యంత డిఫెన్స్ బలం ఉన్న గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌ను అంతిమ సమరంలో నిలువరించాడు. అతడి దూకుడుకు తోడు స్వీయ తప్పిదాలు, ఒత్తిడి గుజరాత్‌ను చిత్తుచేసింది. తొలుత గుజరాతే 9-3తో ఆధిక్యంలో ఉంది. పట్నాను ఆలౌట్ చేసి 15-10తో దూసుకుపోయింది. ఈ స్థితిలో ప్రదీప్ నర్వాల్ అద్భుత రీతిలో ఐదు పాయింట్లు తెచ్చి 15-15తో స్కోర్ సమం చేశాడు. రెండు జట్లు పోటాపోటీగా ఆడటంతో తొలి భాగంలో పట్నా 21-18తో నిలిచింది. రెండవ భాగంలో డిఫెండింగ్ చాంపియన్ మరింత చెలరేగి 29-23 తో ఆధిక్యం కనబరిచింది. అప్పుడు గుజరాత్ కాస్త పుంజుకుంది. పట్నా ఆధిక్యాన్ని 26-30కి తగ్గించింది. ఐతే మోను గోయత్ కూతకెళ్లి పాయింట్లు తేవడంతో మళ్లీ ఒత్తిడిలో పడిపోయింది. స్కోరు 34- 40తో ఉండగా పట్నా మళ్లీ దెబ్బకొట్టింది. తీవ్ర ఒత్తిడిలో ఉన్న డిఫెండర్లు ప్రత్యర్థి రైడర్లను పట్టేయడంలో పొరపాట్లు చేశారు. ప్రదీప్ మరోసారి వరుస సూపర్రైడ్లు చేయడంతో పట్నా 50-36తో తిరుగులేని ఆధిక్యం సంపాదించింది. చివరికి 55- 38తో విజయం సాధించి హ్యాట్రిక్ విజేతగా ఆవిర్భవించింది. పట్నాలో విజయ్ 7, జైదీప్ 5 పాయింట్లు సాధించారు. గుజరాత్లో సచిన్ 11, మహేంద్ర రాజ్‌పుత్ 5, చంద్రన్ రంజిత్ 4 పాయింట్లు సాధించారు. -
సీజన్లో కబడ్డీ.. మరి అన్ సీజన్లో..?
ప్రొ కబడ్డీ లీగ్‌తో భారత కబడ్డీ క్రీడాకారుల పంట పండింది. అంతర్జాతీయ స్థాయిలో రాణించినా రాని గుర్తింపును ప్రొ కబడ్డీ లీగ్ స్టార్ ఆటగాళ్లుగా మార్చింది. ఐపీఎల్ తర్వాత అత్యధిక వీక్షకులు అందుకున్న ఈ లీగ్ ప్రాంతీయ ఆటకావడంతో గ్రామస్థాయికి వరకు పాతుకుపోయింది. ఒకప్పడు కేవలం ప్రభుత్వ ఉద్యోగం కోసమే ఆడిన ఆటగాళ్లు ప్రోకబడ్డీ లీగ్ పుణ్యమా అని కెరీర్‌గా ఎంచుకుంటున్నారు. దీనికి నిదర్శనం ఐదో సీజన్లో నిర్వహించిన జూనియర్ కబడ్డీ లీగ్‌కు కార్పోరేట్ పాఠశాలలు పాల్గొనడమే. ఏడాదికి ఒక సారి జరిగే ఈ లీగ్‌తో ఆటగాళ్లు పారితోషకాన్ని బాగానే ఆర్జిస్తున్నా.. లీగ్ అనంతరం ఏం చేస్తారనే సందేహాం ప్రతి కబడ్డీ అభిమానికి కలుగుతోంది. మరీ స్టార్ కబడ్డీ ఆటగాళ్లు సీజన్ అనంతరం ఏం చేస్తారో ఓ లుక్కెద్దాం.. ♦ రైతుగా రాహుల్ చౌదరీ తెలుగు టైటాన్స్ కెప్టెన్ రాహుల్ చౌదరీ పదోతరగతి వరకే చదువుకున్నాడు. సొంత రాష్ట్రం ఉత్తర్‌ప్రదేశ్. నలుగురు అన్నదమ్ముల్లో మూడోవాడు. అన్నలిద్దరూ వ్యవసాయం చేస్తున్నారు. ‘కబడ్డీ ఏమైనా కూడు పెడుతుందా? చదువుకుంటే బాగు పడతావురా!’ అని తండ్రి రోజూ తిట్టిపోసినా, రాహుల్ పట్టించుకోలేదు. ‘ఏదేమైనా కబడ్డీతోనే జీవితం’ అని నిర్ణయించుకున్నాడు. అయిదేళ్లపాటు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్) క్యాంపులకు హాజరయ్యాడు. ఇంటికి రాగానే మళ్లీ పొలం పనులు. ఇప్పటికీ సేద్యమంటే తనకు ప్రాణం. తనేం మారలేదు. కాకపోతే, అప్పుడు నాగలితో పొలం దున్నాడు, ఇప్పుడు ట్రాక్టరుతో దున్నుతున్నాడు. అంతే తేడా! పీకేఎల్ ద్వారా మొదటి సీజన్లో అందుకున్న మొత్తంతో ఓ మాంచి ట్రాక్టరు కొన్నాడు. మిగిలిన డబ్బుతో ఇష్టమైన బుల్లెట్ బండిని సొంతం చేసుకున్నాడు. ఇక ప్రొ కబడ్డీ సీజన్-1లో 151 పాయింట్లతో అత్యధిక రైడింగ్ పాయింట్లు చేసిన రెండో ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఇక రెండో సీజన్లో 98, మూడో 87, నాలుగో సీజన్ 146 పాయింట్లతో తొలిస్థానంలో నిలిచాడు. పీకేఎల్ ప్రస్థానంలో 517 పాయింట్లతో టాప్ ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. ♦ హరియాణ డీసీపీ..అనూప్ కుమార్ హరియాణకు చెందిన ఈ స్టార్ రైడర్ స్కూల్ స్థాయి నుంచే కబడ్డీ ఆడటం మొదలు పెట్టాడు. తొలుత సీఆర్పీఎప్ కానిస్టేబుల్ ఉద్యోగం చేసినా.. కబడ్డీలో రాణించి హరియాణ డిప్యూటీ కమీషనర్ పోలీస్ (డీసీపీ)గా సేవలందిస్తున్నాడు. కేవలం ప్రభుత్వం ఉద్యోగం కోసం కబడ్డీ ఆడిన అనూప్ తర్వాత ఆటనే కెరీర్‌గా మలుచుకున్నాడు. భారత జట్టు కెప్టెన్‌గా 2016 కబడ్డీ వరల్డ్ కప్ అందించాడు. అర్జున అవార్డు కూడా అందుకున్నాడు ఈ స్టార్ రైడర్. ప్రోకబడ్డీ తొలి సీజన్లో ‘మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్’ అందుకున్న అనూప్ సీజన్-2లో యుముంబాకు టైటిల్ అందించాడు. ఇక సీజన్-1,3లలో జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ♦ ఏయిర్ ఇండియా ఉద్యోగి.. మంజీత్ చిల్లర్ మంజీత్ చిల్లర్ కూడా హరియాణకు చెందినవాడే.. తొలుత రెజ్లింగ్ నేర్చుకున్న మంజీత్ ముక్కు గాయం కావడంతో కబడ్డీవైపు మళ్లాడు. జాతీయ స్థాయిలో రాణించడంతో మంజీత్‌కు ఏయిర్ ఇండియా ఉద్యోగం లభించింది. జైపూర్ పింక్ పాంథర్స్‌కు కెప్టెన్‌గా ఉన్న మంజీత్. నాలుగు, మూడో సీజన్లో పుణేరీ పల్తాన్...తొలి రెండు సీజన్లలో బెంగళూరుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. లీగ్‌లోనే బెస్ట్ ఆల్‌రౌండర్. రెండో సీజన్లో ‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్’ అవార్డు అందుకున్నాడు. ♦ స్కూల్ టీచర్ దీపక్ హుడా.. హరియాణకు చెందిన దీపక్ నివాస్ హుడా పార్ట్‌టైమ్ టీచర్‌గా చేస్తూ కబడ్డీ ఆడేవాడు. చిన్నప్పుడే తల్లి మరణించడంతో కష్టాలు అనుభవించిన హుడా ఇంటర్లో తండ్రి మరణాంతరం పార్ట్ టైమ్ టీచర్‌గా మారారు. అనంతరం స్కూల్ టీచర్‌గా ఉద్యోగం సంపాదించి జాతీయ కబడ్డీ జట్టుకు ఎంపికయ్యారు. ఇప్పటికీ హుడా గ్రామాలకు వెళ్లి కబడ్డీ శిక్షణిస్తుంటాడు. తొలి రెండు సీజన్లలో తెలుగు టైటాన్స్‌కు ఆడిన హుడా మూడు, నాలుగు సీజన్లలో పుణేరి పల్టాన్ కు ఆడాడు. ఈ స్టార్ ఆల్ రౌండర్ ఐదో సీజన్లో కూడా పుణేరి పల్టాన్కే కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. రైల్వే ఉద్యోగి కాశీలింగ్ మహారాష్ట్రకు చెందిన కాశీలింగ్ అడకే... కబడ్డీ అంటే ప్రాణం. తండ్రి అకాల మరణంతో, కుటుంబ పోషణలో తల్లికి అండగా నిలవాల్సి వచ్చింది. చదువుల్ని పక్కనపెట్టి సేద్యానికి దిగాడు. అదీ గిట్టుబాటు కాకపోవడంతో కూలీ పనులకెళ్లాడు. అన్ని కష్టాల్లోనూ కబడ్డీ మీద మమకారాన్ని చంపుకోలేదు. ఆ ఉత్సాహమే మహారాష్ట్ర జట్టులో స్థానం కల్పించింది. పీకేఎల్ ప్రారంభంలో కాశీని ఢిల్లీ జట్టు రూ.10 లక్షలకు కొనుగోలు చేసింది. పది లక్షలు! - ఆ రోజు కూలీకి అది చాలా పెద్ద మొత్తమే. మంత్రమేసినట్టు, ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయాయి. తొలుత ఢిల్లీకి ఆడిన కాశీ. ప్రస్తుతం యుముంబా తరుపున ఆడుతున్నాడు. ప్రస్తుతం రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. రెండో సీజన్లో అత్యధిక రైడింగ్పాయింట్లు సాధించాడు. ♦ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ యజమానిగా వ్యవహరిస్తున్న తమిళ్ తలైవాస్ జట్టు కెప్టెన్ అజయ్ ఠాకూర్ కూడా ఏయిర్ ఇండియా ఉద్యోగే. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఈ స్టార్ రైడర్ తొలి రెండు సీజన్లు బెంగళూరు బుల్స్‌కు ప్రాతినిథ్యం వహించగా తరువాతి రెండు సీజన్లు పుణేరి పల్టాన్‌కు ఆడాడు.