breaking news
Prison inmate
-
నోళ్లు తెరిచిన జైళ్లు
క్రిమినల్ కేసుల్లో అసలైన దోషులను గుర్తించి శిక్షించడానికీ, అమాయకులకు న్యాయం అందించేం దుకూ న్యాయస్థానాలు సాగించే సుదీర్ఘ విచారణల పర్యవసానంగా జైళ్లు కిక్కిరిసి ఉంటున్నాయని మానవ హక్కుల సంఘాలు మాత్రమే కాదు... సుప్రీంకోర్టు సైతం అనేక సందర్భాల్లో చెప్పింది. కానీ ఈ పోకడ ఉన్నకొద్దీ ఉగ్రరూపం దాలుస్తున్నదని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పదేళ్లక్రితం వరకూ మొత్తం ఖైదీల్లో విచారణ ఖైదీల శాతం సగటున అత్యధికంగా 65 వరకూ ఉండగా, ఇప్పుడది 76 శాతానికి పెరిగిందని ఆ గణాంకాలు వివరిస్తున్నాయి. లెక్కకుమించి ఖైదీలను జైళ్లలో కుక్కితే సంస్కరణాలయాలు కావలసిన ఆ కారాగారాలు కాస్తా పశువుల కొట్టాలుగా మారతాయనీ, సరికొత్త నేరగాళ్లు పుట్టుకొచ్చేందుకు అవి దోహదపడతాయనీ పాలకులు గుర్తించకపోవడం విచారకరం. ఒకపక్క కరోనా మహమ్మారి గత రెండేళ్లుగా విలయం సృష్టిస్తోంది. పర్యవసానంగా అన్ని విభాగాల పనితీరూ కుంటుబడింది. అవి పూర్తి సామర్థ్యంతో పనిచేయడానికి అనువైన పరిస్థితులు ఇంకా ఏర్పడలేదు. న్యాయవ్యవస్థ సైతం అనివార్యంగా సమస్యలను ఎదుర్కొనక తప్పడం లేదు. సహజం గానే జైళ్లపై దీని ప్రభావం పడుతోంది. శిక్ష పూర్తయి జైలు నుంచి విడుదలయ్యేవారితో పోలిస్తే కొత్తగా కేసుల్లో ఇరుక్కుని జైలుపాలవుతున్న వారి సంఖ్య 2020 తర్వాత తీవ్రంగా పెరిగిందని జాతీయ క్రైమ్ రికార్డుల బ్యూరో(ఎన్సీఆర్బీ)లోని గణాంకాల ఆధారంగా ‘ఇండియా జస్టిస్ రిపోర్టు’ నివేదిక నిర్ధారించింది. దాని ప్రకారం ఢిల్లీ జైళ్లలో 2019లో విచారణ ఖైదీలు 82 శాతం ఉండగా, మరుసటి సంవత్సరానికి అది 90.7 శాతమైంది. జమ్మూ కశ్మీర్లో 83.4 శాతం నుంచి 90.5 శాతానికి పెరిగింది. అంతక్రితం ఎంతో కొంత మెరుగ్గా ఉన్న పంజాబ్, హరియాణా, మధ్యప్రదేశ్ లలో విచారణలో ఉన్న ఖైదీల శాతం గణనీయంగా పెరిగింది. పంజాబ్‌లో 2019లో విచారణ ఖైదీలు 66 శాతం ఉండగా, అది కాస్తా 85 శాతమైంది. హరియాణాలో 64.4 నుంచి 82 శాతానికి, మధ్యప్రదేశ్‌లో 54.2 నుంచి 70 శాతానికి పెరిగింది. నిజానికి ఈ గణాంకాలన్నీ 2020 నాటి లెక్కలు. ఆ సంవత్సరం న్యాయస్థానాలు సైతం సరిగా పనిచేసే పరిస్థితులు లేకపోవడం వల్ల విచారణలు మందగించాయి. ఆ తర్వాతైనా పెద్దగా మెరుగుపడింది లేదు గనుక ఈ సంఖ్య ఇంకా పెరిగి ఉండొచ్చు. కొన్ని రాష్ట్రాల్లో ఆన్లైన్ విచారణలు జరపడం వల్ల కొంత ప్రయోజనం కనబడిన మాట వాస్తవమే. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 188 అమలు చేయడంతో కేసుల సంఖ్య అపారంగా పెరిగింది. 2019తో పోలిస్తే 2020లో అదనంగా 16,43,690 కేసులు నమోదయ్యాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో వాస్తవంగా శిక్షార్హమైన వారెందరో, అమాయకులెవరో తేల్చడం న్యాయ వ్యవస్థకు తలకుమించిన పని. పరిమితికి మించి ఖైదీలుండటం వల్ల సాధారణ పరిస్థితుల్లోనే జైళ్లలో ఎన్నో సమస్యలేర్పడ తాయి. కరోనా వంటి మహమ్మారి విరుచుకుపడినప్పుడు ఆ సమస్యలు మరింత ఉగ్రరూపం దాల్చడంలో ఆశ్చర్యంలేదు. ఏళ్ల తరబడి విచారణలు కొనసాగుతుండటం వల్ల 200 శాతానికి మించి ఖైదీలున్న జైళ్లు కూడా ఎన్నో ఉన్నాయి. అలాంటిచోట కరోనాను అరికట్టేందుకు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడం సాధ్యమేనా? కారాగారాల్లో కరోనా విస్తరించకుండా చర్యలు తీసుకుంటున్నా మని ప్రభుత్వాలు చెబుతూనే వచ్చాయి. క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేసి, కొత్తగా వచ్చిన ఖైదీలను కొన్ని రోజులపాటు అక్కడ ఉంచటం, జైలు మాన్యువల్ అమలును ఆపి, విజిటర్స్ రాకుండా కట్టడి చేయడం అందులో కొన్ని. కానీ ఖైదీల మానవ హక్కులు ఆవిరికావడం మినహా వీటి వల్ల కలిగే ప్రయోజనం శూన్యం. న్యాయవాదులుగానీ, వారి బంధువులుగానీ నేరుగా ఖైదీలను కలిసే అవకాశాలు తగ్గిపోయాయి. లాకప్ డెత్‌లు, అసహజ మరణాల విషయంలో అంతకుముం దున్న జవాబుదారీతనం కూడా అడుగంటింది. కనుకనే 2020లో లాకప్ డెత్‌లు ఏడు శాతం పెరగ్గా, ఆత్మహత్యలు, ప్రమాదాలు, హత్యలు వంటి అసహజ మరణాలు 18.1 శాతం హెచ్చయ్యాయి. తగినన్ని అధికారాలున్న స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఆరా తీస్తే మన జైళ్లలో ఎంతటి దారుణమైన పరిస్థితులున్నాయో వెల్లడవుతుంది. దేశమంతా లాక్డౌన్ అమలైన కాలంలో సర్వోన్నత న్యాయస్థానం ఒక ముఖ్యమైన సూచన చేసింది. రాష్ట్రాల్లో అత్యున్నత స్థాయి కమిటీలు ఏర్పాటు చేసి, ఖైదీల సంఖ్యను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నది దాని సారాంశం. అందువల్ల విడుదలైనవారి శాతం అంతకుముందుతో పోలిస్తే మెరుగైంది. కానీ ఆరోగ్యపరమైన కారణాలు, పెద్ద వయసు, జండర్ వంటి ప్రాతిపదికలు కాక, ఖైదీల విడుదలను పాలనాపరమైన వ్యవహారంగా కమిటీలు పరిగణించడంవల్ల పెద్దగా ప్రయోజనం కలగలేదు. పరిమితికి మించి ఖైదీలుండటం, అదే సమయంలో తగినంతగా సిబ్బంది లేకపోవడం జైళ్లలో అవినీతికి, అమానవీయతకు, ఇతర వైపరీత్యాలకూ దారితీస్తోంది. జైళ్లు సంస్కర ణాలయాలని ఎంత గొప్పగా చెప్పుకుంటున్నా అందులో చిత్రహింసలు విడదీయరాని భాగమని ‘డిసిప్లిన్ అండ్ పనిష్: ద బర్త్ ఆఫ్ ద ప్రిజన్’ పుస్తకంలో మైఖేల్ ఫాకల్ట్ అంటాడు. మనిషిలో అమానవీయతను పెంచి, నేర ప్రవృత్తికి అలవాటు చేసే జైళ్ల స్థితిగతులను చక్కదిద్దడానికి సిబ్బందిని పెంచడం, పటిష్టమైన పర్యవేక్షణ ఉండేలా చూడటం, జవాబుదారీతనాన్ని పునఃప్రతిష్టించడం కీలకం. వీటిపై న్యాయస్థానాలు, ప్రభుత్వాలు దృష్టి సారించడం తక్షణావసరం. -
తినే కంచంలో ఉప్పు పోశారు.. ఆమె చేసిన ఘోరం అలాంటిది
ఓ మహిళా ఖైదీ రిమాండ్‌లో ఉన్న సమయంలో తోటి ఖైదీలు.. జైలులో తినే కంచంలో అధికంగా ఉప్పు కలిపి చుక్కలు చూపించారు. ఆమె చేసిన తప్పుకు తోటి ఖైదీలు సైతం అసహ్యించుకున్నారు. అందుకే ఆమె చేసిన తప్పు గుర్తుకు వచ్చేలా చేశారు. ఈ ఘటన ఇంగ్లండ్‌లోని ఈస్ట్ ఉడ్ మహిళల కారాగారంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. ఎమ్మా టుస్టిన్ అనే 32 ఏళ్ల మహిళ.. 29ఏళ్ల థామస్ హ్యూస్‌ను రెండో పెళ్లి చేసుకుంది. తన మొదటి భార్యతో థామస్ విడిపోయినప్పటికీ.. వారిద్దరికి జన్మించిన ఆర్థర్ పోషణ బాధ్యతను తానే తీసుకున్నాడు. ఇక తనకు, థామస్‌కు మధ్య బాలుడు ఆర్థర్ ఉండడం ఇష్టంలేని ఎమ్మా.. ఆర్థర్ తినే కంచంలో రోజూ మోతాదుకు మించి ఉప్పును కలపడం మొదలు పెట్టింది. దీంతో ఆర్థర్ ఆరోగ్యం క్షిణించి, రక్తంలో ఉప్పు శాతం పెరిగి మృతిచెందాడు. ఈ ఘటనలో బాలుడి సవతి తల్లి ఎమ్మకు కోవెంట్రీ క్రౌన్ కోర్ట్ డిసెంబర్ 3న 29 ఏళ్ల కారాగార శిక్షను విధించింది. అయితే ఎమ్మా రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలో అదే జైలులో శిక్ష అనుభవించిన ఎలైన్ ప్రిచర్డ్(మాజీ ఖైదీ).. జైలులోని జరిగిన సంఘటనలను మీడియాతో పంచుకున్నారు. ఆరేళ్ల బాలుడిని పొట్టన పెట్టుకున్న ఎమ్మాకు.. ఆర్థర్ పడిన బాధను చూపించాలని జైలులో ఉన్న మహిళా ఖైదీలమంతా నిర్ణయించుకున్నామని తెలిపారు. ఎమ్మా బాలుడిని హింసించి కంచంలో ఉప్పు కలిపినట్టుగానే తామంతా.. ఆమె తినే కంచంలో ఉప్పు కలిపేవాళ్లమని తెలిపారు. తామంతా కారాగారంలో ఉన్న సమయంలో ఎమ్మా పట్ల క్రూరంగా ప్రవర్తించామని కానీ, ఆర్థర్‌ను హింసించి చంపినందుకు మేము(ఖైదీలు) చేసిన హింసకు ఆమె శిక్షార్హురాలని ఎలైన్ చెప్పారు. తన భర్త థామస్.. బాలుడు ఆర్థర్‌ను నిర్లక్ష్యం చేయడం వల్ల తను జైలు శిక్ష అనుభవిస్తున్నానని చెప్పేదని పేర్కొంది. ఆర్థర్ ఎలా చనిపోయాడనే విషయాన్ని చెప్పేది కాదని, అసలు బాలుడి ప్రస్తావన కూడా తీసుకురాలేదని ఎలైన్ పేర్కొంది. -
ఇక హాయిగా మాట్లాడుకోవచ్చు
నాసిక్: నాసిక్ రోడ్ సెంట్రల్ జైల్లోని ఖైదీలు ఇక తమ బంధువులకు ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు. ఇటీవల ఠాణే, తలోజా కారాగారాల్లోని ఖైదీలకు ఫోన్ కాల్ అవకాశం కల్పించినట్టుగానే... నాసిక్ జైల్లో ఖైదీలకు కూడా అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. సుదూర గ్రామాల నుంచి జైల్లో ఉన్న తమ బంధువులను చూడటానికి వచ్చేవారికి ఇకనుంచి ఆ ప్రయాణభారం తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. అందుకే రెండు ఫోన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనను పంపినట్టు నాసిక్ రోడ్ కేంద్ర కారాగార అధికారులు తెలిపారు. ‘దీనిని ప్రయోగాత్మకంగా ఠాణే కేంద్ర కారాగారంతోపాటు తలోజా జైలులో ఈ సౌకర్యాన్ని కల్పించామని, అలాంటిదే ఇప్పుడు నాసిక్ రోడ్ కేంద్ర కారాగారంలో కూడా ఏర్పాటు చేయనున్నామ’ని చెప్పారు. విషయమై ఉన్నతాధికారులతో చర్చించామని జైలు సూపరింటెండెంట్ జయంత్ నాయక్ తెలిపారు. నెలకు రెండుసార్లు తమ బంధువులతో 10 నిమిషాలపాటు మాట్లాడుకునే అవకాశం కల్పిస్తున్నట్లు జైలు అధికార వర్గాలు చెబుతున్నాయి. కాగా ఈ సౌకర్యాన్ని ఖైదీలు దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటున్నారు. నాసిక్ రోడ్ కేంద్ర కారాగారంలో ప్రస్తుతం 2,290 మంది ఖైదీలుండగా, వీరిలో 1,600మంది జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. వారానికోసారి తమ బంధువులను కలిసే అవకాశం ఖైదీలకు ఇస్తున్నామని అధికారులు తెలిపారు. సుదూరంగా ఉన్న బంధువులు ఎప్పుడు పడితే అప్పుడు కలవడానికి అవకాశం ఉండదు. దీంతో తమ కుటుంబం, పిల్లలు, జీవిత భాగస్వాములు ఎలా ఉన్నారనే ఆలోచన ఖైదీలను మానసిక ఆందోళనకు గురిచేస్తుంది. ఇలాంటి భావోద్వేగాలతోనే కొన్ని వారాల కిందట ఓ ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఖైదీలు గందరగోళానికి గురవకుండా ఉండేందుకే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తమ బంధువులతో మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ కేంద్ర కారాగారానికి ఒక మానసిక వైద్యుడు కూడా అవసరమని సంబంధిత అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే కేంద్ర కారాగారంలో అలాంటి పదవి ఇంతవరకూ ఆమోదం పొందలేదు.