breaking news
Prestige issue
-
ఆదివాసీలు ఆదుకుంటారా?
గుజరాత్లో 27 ఏళ్లుగా అధికారంలో ఉండడంతో ప్రజల్లో ఏర్పడిన వ్యతిరేకతను అధిగమించడానికి బీజేపీ చేయని ప్రయత్నాల్లేవు! ప్రధాని మోదీ సొంత రాష్ట్రం కూడా కావడంతో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ప్రతిష్మాత్మకంగా మారింది. ముక్కోణ పోరులో నెగ్గేందుకు ఆదివాసీ మంత్రం జపిస్తోంది...! ఆదివాసీ ప్రాంతాల్లో పట్టు బిగించడం ద్వారా గుజరాత్ అసెంబ్లీతో పాటు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కూడా విజయం సాధించడానికి బీజేపీ పకడ్బందీగా వ్యూహరచన చేస్తోంది. రాష్ట్రపతిగా ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము ఎన్నిక, మరో జలియన్‌వాలాబాగ్‌గా పేరు పడిన రాజస్థాన్‌లోని మాన్‌గఢ్ ధామ్‌ను జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించడం వంటి చర్యలెన్నో చేపడుతోంది. కాంగ్రెస్ కంచుకోటలైన ఈ స్థానాల్లో ఆప్ కూడా ప్రభావం చూపొచ్చన్న ఆందోళనా బీజేపీలో ఉంది. ఆదివాసీ స్థానాల్లో ఆప్ గట్టిగా ప్రచారం చేస్తోంది. వారు మొదట్నుంచే తనవైపే అయినా ముక్కోణపు పోటీలో ఏం జరుగుతుందోనన్న అనుమానంతో భారతీయ ట్రైబల్ పార్టీతో పొత్తుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. 27 ఏళ్ల బీజేపీ పాలనతో తమ బతుకులు ఏమీ మారలేదని ఆదివాసీలు గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆదివాసీ ప్రాంతాల్లో ప్రచారాన్ని బీజేపీ మరింత ఉధృతం చేసింది. ‘మీ దీవెనలు కావా’లంటూ ఆదివాసీ ప్రాంతమైన వల్సద్ నుంచే మోదీ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. 27 ఎస్టీ స్థానాల్లో కనీసం 20 గెలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే రూ.15 వేల కోట్లతో ఆదివాసీల అభివృద్ధి ప్యాకేజీ తెచ్చింది. ఆదివాసీలకు ఉద్యోగాల కల్పన, ఆ ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధిని ప్రచారంలో ప్రస్తావిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో స్వయంపాలన కోసం 1996లో పార్లమెంటు చేసిన ప్రొవిజన్స్ ఆఫ్ ది పంచాయత్స్ యాక్ట్ (పెసా) అమలు కాకపోవడం, భూ యాజమాన్య హక్కుల వంటివి విపక్షాల ప్రచారాస్త్రాలుగా మారాయి. ‘‘పెసా తదితరాలపై ఆదివాసీలు కాస్త అసంతృప్తిగా ఉన్నా అది చాలా తక్కువ. 20 ఏళ్లలో వారి జీవితాలు చాలా మారాయి. అభివృద్ధి కనిపిస్తోంది. అందుకే ఆదివాసీలు ఈ సారి మా వైపే ఉంటారు’’ అని భరూచ్ బీజేపీ ఎంపీ మన్సుఖ్ వాసవ ధీమాగా చెప్పారు. గుజరాత్లో ప్రచారాన్ని బీజేపీ, ఆప్ ఉధృతంగా చేస్తున్నా కాంగ్రెస్ నుంచి గాంధీ కుటుంబానికి చెందిన వారు ఇప్పటివరకు ఆ రాష్ట్రం వైపు కూడా చూడకపోవడం పార్టీలో అంతర్గతంగా అసంతృప్తిని రాజేస్తోంది. ఈ ముక్కోణపు పోటీలో బీజేపీ ఆశిస్తున్నట్టుగా ఆదివాసీలు అండగా ఉంటారో లేదో.. వేచి చూడాలి.. ఏ ఫర్ ఆదివాసీ ‘‘ఏ ఫర్ ఆదివాసీ’’ వారి కంటే తనకు ముఖ్యం మరెవరూ కాదంటూ ప్రధాని మోదీ గుజరాత్‌లోని ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. గుజరాత్ జనాభాలో 15% గిరిజనులే ఉన్నారు. అంటే దాదాపుగా 80 లక్షల నుంచి కోటి మంది వరకు గిరిజన జనాభా ఉంటుంది. దేశవ్యాప్తంగా చూసుకుంటే 8.1% గిరిజన జనాభా గుజరాత్‌లోనే ఉన్నారు. రాష్ట్రంలోని 14 జిల్లాలు 53 తాలూకాల్లో వీరి జనాభా విస్తరించి ఉంది. ఉత్తరాన అంబాజీ నుంచి దక్షిణాన ఉంబర్‌గావ్ వరకు ఆదివాసీల ప్రాబల్యమున్న ప్రాంతాలున్నాయి. మొత్తంగా 12 తెగలు ఉన్నప్పటికీ భిల్ తెగకు చెందినవారే సగం మంది ఉన్నారు. ఇక దాంగ్ జిల్లాలో గిరిజనుల ప్రాబల్యం ఎక్కువ. గిరిపుత్రులు ఎటువైపో?! రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు 182కి గాను 27 ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు ఉన్నాయి. మొత్తంగా చూస్తే 48 అసెంబ్లీ స్థానాల్లో ఆదివాసీ ఓట్లు అత్యంత కీలకం. రెండు దశాబ్దాలుగా అధికారంలో బీజేపీ ఉన్నప్పటికీ ఎస్టీ జనాభా ప్రాబల్యం అధికంగా ఉన్న సీట్లలో కాంగ్రెస్ స్థానం చెక్కు చెదరలేదు. గత మూడు దఫా ఎన్నికల్లోనూ ఎస్టీ రిజర్వ్ స్థానాలను బీజేపీ కంటే కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధించింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్టీ రిజర్వ్ స్థానాల్లో కాంగ్రెస్ 17 స్థానాల్లో విజయం సాధిస్తే, బీజేపీ ఎనిమిది సీట్లు, భారతీయ ట్రైబల్ పార్టీ (బీటీపీ) రెండు సీట్లలో విజయం సాధించింది. అయితే కాంగ్రెస్ తరఫున విజయం సాధించిన ఎమ్మెల్యేల్లో అయిదుగురు ఆ తర్వాత బీజేపీ గూటికి చేరుకున్నారు. అంతకు ముందు 2012లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 16 సీట్లలో గెలుపొందితే, బీజేపీకి 10, జనతాదళ్ (యూ)కి ఒక్క సీటు వచ్చింది. గిరిజనుల సమస్యలు గుజరాత్లో ఆదివాసీ ప్రాంతాల్లో పౌష్టికాహార లోపం ఇప్పటికీ ప్రధాన సమస్యగా ఉంది. అక్షరాస్యత చాలా తక్కువ. కొండల్లో కోనల్లో పండిన పంటల నుంచి వచ్చే ఆదాయం ఏ మాత్రం వారికి సరిపోవడం లేదు. దళారుల దోపిడీలతో విసిగి వేసారి ఉన్నారు. ప్రతీ ఏడాది రాష్ట్రంలోని గిరిజనుల్లో 30% మంది ఉపాధి అవకాశాల కోసం తాత్కాలికంగా వలస వెళ్లిపోతున్నారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. విద్య, నిరుద్యోగం, ఆరోగ్యం, కుల సర్టిఫికెట్, ప్రొవిజన్స్ ఆఫ్ ది పంచాయత్స్ యాక్ట్ అమలు వంటి సమస్యలు ఇప్పటికీ ఎన్నికల ఎజెండాలో ఉన్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
టీడీపీ నేతల్లో వణుకు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్‌పై జరిగిన టీడీపీ దాడిని తిరుపతి అర్బన్ పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఘటనలో పాల్గొ న్న టీడీపీ ముఖ్య నాయకుల్ని విడతల వారీగా పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారణ జరుపుతున్నారు. దీంతో నగర టీడీపీ నేతల్లో వణుకు మొదలైంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని నేతలు కలవరానికి లోనవుతున్నారు. కేసును సీరియస్‌గా పరిగణిస్తున్న పోలీసులు ఇప్పటికే 15 మందికి పైగా నోటీసులు జారీ చేశారు. ఘటనలో పాల్గొన్న 40 మంది టీడీపీ నాయకులు, వార్డు స్థాయి నాయకులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించుకుని వ్యక్తిగతంగా విచారణ జరుపుతున్నారు సాక్షి ప్రతినిధి, తిరుపతి/ తిరుపతి క్రైం : తిరుమల శ్రీవారి దర్శనార్థం కుటుంబ సమేతంగా వచ్చిన అమిత్ షా ఈ నెల 11న ఉదయం దర్శనం పూర్తిచేసుకుని కొండ దిగుతుండగా అలిపిరి దగ్గర కాన్వాయ్‌పై టీడీపీ కార్యకర్తలు దాడి జరిపారు. కాన్వాయ్‌లో ఉన్న బీజేపీ నేత కోలా ఆనంద్ కారు అద్దాలను పగులగొట్టి ఉద్రిక్తత సృష్టించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడి కాన్వాయ్‌పై దాడి చేయ డం జాతీయ స్థాయిలో సంచలనమైంది. మరుసటి రోజు ప్రధాన పత్రికలన్నీ దాడి జరిగిన తీరును, బీజేపీ నేతల ఖండనలనూ ప్రముఖంగా ప్రచురించాయి. కేంద్ర ఇంటెలిజెన్సు ఇచ్చిన సమాచారంతో ఏపీ పోలీస్ ఉన్నతాధికారులు అప్రమత్తమై తిరుపతి అర్బన్ పోలీసుల్ని నివేదిక కోరారు. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న జాతీయ పార్టీ నాయకుని కాన్వాయ్‌పై దాడి జరుగుతుంటే స్థానిక పోలీసులు ఏం చేస్తున్నారంటూ ఏపీ పోలీస్ బాస్‌లు ప్రశ్నించారు. దీంతో తిరుపతి అర్బన్ పోలీసులు కేసును సీరియస్‌గా తీసుకున్నారు. అదే రోజున కాన్వాయ్ పై కర్రతో దాడికి పాల్పడిన సుబ్రమణ్యయాదవ్ అనే టీడీపీ నాయకుడిని అరెస్టు చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. అతనిపై కేసు నమోదు చేశారు. తరువాత కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఎస్పీ అభిషేక్ మొహంతి ఆధ్వర్యంలో అలిపిరి సీఐ చంద్రశేఖర్ నాయకుల విచారణ కొనసాగిస్తున్నారు. సీసీ కెమెరాల పుటేజీల ఆధారంగా.... సంఘటన జరిగిన 11వ తేదీ అలిపిరి నిరసనలో పాల్గొన్న టీ డీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు గుర్తిస్తున్నారు. ఘటనా ప్రదేశంలో టీటీడీ అమర్చిన సీసీ కెమెరాల పుటేజీలు, మీడియా ప్రచురించిన ఫోటోలు, టీవీ ఛానళ్ల వీడియోలలో కనిపించిన నగర పార్టీ నేతల పేర్లను నమోదు చేసుకుని విడతల వారీగా స్టేషన్‌కు పిలిపిస్తున్నారు. నగర పార్టీ అధ్యక్షుడు దంపూరి భాస్కర్‌యాదవ్, గుణశేఖర్‌నాయుడు, జిల్లా తెలుగుయువత అధ్యక్షుడు శ్రీధర్‌వర్మ, ఎమ్మెల్యే అల్లుడు సంజయ్‌లను ప్రధాన నాయకులుగా గుర్తించారు. వీరి నేతృత్వంలోనే పార్టీ కార్యకర్తలు ఆ రోజున నిరసనకు హాజరైనట్లు పోలీసులు సమాచారం తెప్పించుకున్నారు. దాడి జరిగిన తీరును విశ్లేషిస్తున్నారు. పార్టీ కార్యకర్తలు దాడి జరిపేందుకు కర్రలు, రాళ్లు వాడారా లేదానన్న అంశంపై వివరాలను సేకరిస్తున్నారు. విచారణ మొత్తాన్ని అర్బన్ ఎస్పీ అభిషేక్ మొహంతి సమీక్షిస్తున్నారు. బాధ్యులపై కేసులు ఖాయం అమిత్ షా కాన్వాయ్‌లో వెనుక ఉన్న వాహనంపై కర్రతో దాడి చేసిన టీడీపీ కార్యకర్త సుబ్రమణ్యాన్ని ఆ రోజే అరెస్టు చేశాం. దాడికి దారితీసిన పరిస్థితులు, ఎవరెవరి పాత్ర ఎంతుందన్న కోణంలో విచారణ జరుపుతున్నాం. ఇప్పటికే చాలా మందిని విచారించాం. నెలాఖరులోగా దర్యాప్తు పూర్తి చేసి బాధ్యులపై కేసు నమోదు చేస్తాం. – అభిషేక్ మొహంతి, అర్బన్ జిల్లా ఎస్పీ, తిరుపతి