breaking news
pre metric
-
మూతపడుతున్న ప్రీమెట్రిక్ హాస్టళ్లు
నల్లగొండ : జిల్లాలో బీసీ ప్రీమెట్రిక్ హాస్టళ్లు మూతపడుతున్నాయి. విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడంతో 5 హాస్టళ్లను మూసి వేస్తూ గత ఏప్రిల్‌లోనే బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థుల సంఖ్య ఒక్కో హాస్టల్లో 100 ఉండగా గత సంవత్సరం కేవలం 60నుంచి 70మంది చేరారు. దాంతో ఐదు హాస్టళ్లను మూసివేసి అక్కడ ఉన్న విద్యార్థులను పక్క హాస్టళ్లకు మార్చాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దాంతో జిల్లాలో 5 ప్రీమెట్రిక్ హాస్టళ్లను మూసివేస్తూనే జిల్లా అధికారులు కాలేజీ హాస్టళ్లకు డిమాండ్ ఉండడంతో వాటినే కాలేజీ హాస్టళ్లుగా మార్చి షిఫ్ట్ చేయాలని కమిషనర్‌ను కోరారు. ఇందుకు కమిషనర్ అంగీకరించారు. జిల్లాలో ఇలా.. జిల్లాలో మొత్తం 14 కళాశాల హాస్టళ్లు, 32 ప్రీమెట్రిక్ హాస్టళ్లు ఉన్నాయి. ఒక్కో కాలేజీ హాస్టల్లో గత సంవత్సరం 210 మంది విద్యార్థుల వరకు ఉన్నారు. మొత్తం 3,090 మంది ఉండగా, 32 ప్రీమెట్రిక్ హాస్టళ్లలో ఒక్కో హాస్టల్లో వంద మంది విద్యార్థులకు తగ్గకుండా ఉండాలి. కానీ, కొన్ని హాస్టళ్లలో 50నుంచి 60 మాత్రమే విద్యార్థులు ఉండడంతో ఆ హాస్టళ్లను మూసివేయాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. మూసివేసిన హాస్టళ్లు ఇవే.. జిల్లాలోని శాలిగౌరారం మండలంలో ఉన్న బీసీ హాస్టల్, కట్టంగూర్ మండలం ఈదులూరు హాస్టల్, నాంపల్లి మండలంలోని బాలుర, మునుగోడులోని బాలుర, చండూరులోని బాలికల హాస్టల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడంతో ఆ హాస్టళ్లను మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గురుకుల పాఠశాలల ఏర్పాటుతో తగ్గిన విద్యార్థులు జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బీసీ గురుకులాల్లో బీసీ విద్యార్థినీ విద్యార్థులు చేరారు. మిగిలిన హాస్టళ్లలో కూడా కొంత భాగాన్ని బీసీలకు కేటాయించారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని వారంతా తమ పిల్లలను గురుకుల పాఠశాలల్లోనే చేర్చించారు. దీంతో మండల స్థాయిలో ఉన్నటువంటి ప్రీ మెట్రిక్ పాఠశాలలతో పాటు హాస్టళ్లలో కూ డా విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. దీంతో హాస్టళ్లు మూతపడే స్థాయికి చేరుకున్నాయి. మరికొన్ని కళాశాల హాస్టళ్లు అవసరం నల్లగొండ జిల్లా కేంద్రంలో అన్ని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, బీఈడీ, డైట్, పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలలు ఉండడంతో కళాశాల హాస్టళ్లకు డిమాండ్ పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్న హాస్టళ్లలోనే సామర్థ్యాన్ని మించి విద్యార్థినీ విద్యార్థులు ఉంటున్నారు. గత సంవత్సరం ఒక్కో కళాశాల హాస్టళ్లలో 210 మంది విద్యార్థులు ఉండగా ఈ సంవత్సరం వాటిని 180కి కుదించారు. అయినా కూడా బీసీ బాలుర, బాలికల కళాశాల హాస్టళ్లకు డిమాండ్ ఉంది. డిమాండ్‌కు అనుగుణంగా కళాశాలల హాస్టళ్లు పెంచాలని అధికారులు కోరుతున్నారు. కళాశాల హాస్టళ్లుగా మార్పు.. విద్యార్థులు తక్కువగా ఉన్నటువంటి జిల్లాలోని 5 హాస్టళ్లను మూసివేస్తూ ఉత్తర్వులు చేసిన బీసీ సంక్షేమ శాఖ అధికారులు.. వాటిని కళాశాల హాస్టళ్లుగా మార్చుతూ అక్కడి నుండి షిఫ్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లా అధికారులు వాటిని షిఫ్ట్ చేసి కళాశాల హాస్టళ్లుగా మార్చి ప్రారంభించారు. ఇప్పటికే కళాశాల హాస్టళ్లలో విద్యార్థులను కూడా తీసుకుంటున్నారు. అయినప్పటికీ డిమాండ్ బాగా ఉంది. అయితే శాలిగౌరారం మండలంలోని బాలుర బీసీ హాస్టల్‌ను కళాశాల హాస్టల్‌గా మార్చి మిర్యాలగూడకు షిఫ్ట్ చేయగా, కట్టంగూర్ మండలం ఈదులూరులో బీసీ బాలుర హాస్టల్‌ను కళాశాల హాస్టల్‌గా మార్చి నకిరేకల్‌కు మార్చాలని కమిషనర్‌కు జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపారు. కాగా నాంపల్లి బీసీ బాలుర హాస్టల్‌ను, చండూరులోని బీసీ బాలికల హాస్టల్‌ను కళాశాల హాస్టల్‌గా మారుస్తూ నల్లగొండ జిల్లా కేంద్రంలోకి మార్చారు. మునుగోడులోని బీసీ బాలుర హాస్టల్‌ను కూడా నల్లగొండ కళాశాల హాస్టల్‌గా మార్చారు. అయితే మునుగోడులోనే ఉంచాలని, అక్కడ ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిడి రావడంతో తిరిగి అక్కడే కొనసాగించేందుకు తిరిగి ప్రతిపాదనలు కమిషనర్‌కు పంపారు. మొత్తానికి కేజీటూపీజీతో గ్రామాల్లో విద్యార్థులంతా గురుకుల పాఠశాలలో చేరగా జనరల్హాస్టళ్లు మూతపడిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో కళాశాలల హాస్టళ్లకు డిమాండ్ పెరగడంతో వాటిని కళాశాలల హాస్టల్‌గా మారుస్తూ అక్కడి నుండి జిల్లా కేంద్రానికి, డివిజన్ కేంద్రానికి డిమాండ్‌ను బట్టి మార్చారు. దీంతో కళాశాల హాస్టళ్లకు ఉన్న డిమాండ్ కాస్త తగ్గింది. -
ఆప్షన్ గల్లంతు..
ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తుల నిలిపివేత ‘ఈపాస్’ వెబ్సైట్ నుంచి ‘బీసీ’ ఆప్షన్ తొలగింపు చిక్కుల్లో బీసీ విద్యార్థులు.. సాక్షి, రంగారెడ్డి జిల్లా: వెనకబడిన తరగతులకు చెందిన విద్యార్థులు చిక్కుల్లో పడ్డారు. ప్రభుత్వం బీసీ విద్యార్థులకు ఇస్తున్న ప్రీ మెట్రిక్(పదోతరగతికి ముందు) విద్యార్థుల ఉపకార వేతనాలకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియను ఒక్కసారిగా నిలిపివేయడంతో ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి బీసీ విద్యార్థుల ప్రీమెట్రిక్ ఉపకార వేతనాలకు సంబంధించి విద్యాసంవత్సరం ప్రారంభంలోనే ప్రభుత్వం ప్రకటించింది. అయితే క్షేత్రస్థాయిలో అంతగా ప్రచారం లేకపోవడంతో దరఖాస్తుల ప్రక్రియ నత్తనడకన సాగింది. మరోవైపు ఆదాయ ధ్రువీకరణ మరింత పరిమితంగా విధించడం.. సర్టిఫికెట్ల జారీలో తీవ్ర జాప్యం కావడంతో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోలేకపోయారు. తాజాగా అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలతో సిద్దంగా ఉన్నప్పటికీ.. అర్థంతరంగా దరఖాస్తు ప్రక్రియను నిలిపివేయడంతో విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. ప్రచారలోపం: ప్రీ మెట్రిక్ ఉపకారవేతనాలకు సంబంధించి ప్రభుత్వం బీసీ విద్యార్థులకు అవకాశం కల్పించింది. 5నుంచి పదోతరగతి చదివే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులోతో పాటు 9,10 తరగతులు చదివే బీసీ విద్యార్థులు ఈ ఉపకారవేతనాలకు అర్హులు. ఎస్సీ, ఎస్టీల వార్షికాదాయం రూ.2 లక్షలు కాగా, బీసీ విద్యార్థులకు మాత్రం రూ. 45 వేలుగా నిర్ణయించింది. అయితే క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులు కనిష్టంగా రూ.50 వేలకు తక్కువ ఆదాయాన్ని ధ్రువీకరించడం లేదు. దీంతో బీసీ విద్యార్థులు అనర్హులవుతున్నారు. ఈనేపథ్యంలో అధికారులను ఒప్పించి ఆదాయ సర్టిఫికెట్లు తెచ్చుకోగా.. దరఖాస్తు నమోదును నిలిపివేయడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. జిల్లాలో 9,10 తరగతులు చదివే బీసీ విద్యార్థులు 35వేల వరకు ఉంటారని అంచనా. అయితే ఇప్పటివరకు కేవలం 4వేల వరకు మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఆధార్ కార్డులను కూడా తప్పనిసరి చేసింది. దీంతో కార్డులు లేని విద్యార్థులంతా దరఖాస్తుకు నోచుకోలేకపోయారు.