breaking news
Power Loom Industry
-
వస్త్రపరిశ్రమలకు ‘పవర్’ పోటు
విద్యుత్ చార్జీల పెంపుతో పవర్లూమ్ పరిశ్రమలకు గడ్డుకాలం భివండీ, న్యూస్‌లైన్ : మహారాష్ట్రలోని వస్త్రపరిశ్రమలకు మరోసారి గడ్డుకాలం వచ్చిందని ‘రాష్ట్రీయ యంత్రమాగ్ సమన్వయ్ సమితి’ అధ్యక్షులు ప్రతాప్‌రావ్ హెగ్డే ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే అనేక సమస్యలతో సతమతవుతున్న వస్త్ర పరిశ్రమను రాష్ట్రప్రభుత్వ వైఖరి మరింత ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ఈ విషయంపై ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ, మహారాష్ట్రలో పవర్లూమ్ పరిశ్రమ పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 24 లక్షల పవర్లూమ్ యంత్రాలుండగా ఒక్క మహారాష్ట్రలోనే సుమారు 12 లక్షలు ఉన్నాయన్నారు. వీటిలో భివండీలోనే సుమారు ఏడు లక్షలకుపైగా పవర్ యంత్రాలున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో భివండీలో వస్త్రాల ఉత్పత్తి కూడా అత్యధికంగా జరుగుతుంది. కానీ ఇటీవల నూలు ధరలకు నిలకడలేదని, దళారులదే ఇష్టారాజ్యమైపోయిందని ప్రతాప్‌రావ్ ఆవేదన వ్యక్తం చేశారు. మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం విద్యుత్ ఛార్జీలు పెంచిందని, దీంతో పరిశ్రమలు మూత పడే పరిస్థితి నెలకొందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి రెండున రాష్ట్రవ్యాప్త ఆందోళన... విద్యుత్ చార్జీలను పెంపును నిరసిస్తూ ఫిబవ్రరి రెండో తేదీన వస్త్రపరిశ్రమల యజమానులు ఆందోళనకు దిగాలని నిర్ణయించారు. ఆ రోజున రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పవర్లూమ్ పరిశ్రమల అసోసియేషన్లు, యజమానులందరు ‘విద్యుత్ బిల్లుల హోలి’ (బిల్లులను తగులబెట్టడం) జరుపుకోవాలని ప్రతాప్‌రావ్ హెగ్డే పిలుపునిచ్చారు. భివండీలోని దివంగత మీనాతాయి ఠాక్రే హాల్లో రాష్ట్రీయ సమితి ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన సమావేశంలో ఆందోళన కార్యక్రమాన్ని రూపొందించామని తెలిపారు. ముంబైలోని మంత్రాలయం ఎదుట ఆందోళనకు దిగాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఈ సమావేశానికి మాలేగావ్, ధులే, షోలాపూర్, యేవ్లా, వీటా, ఇచ్చల్కరంజీ, ఉల్లాస్‌నగర్ తదితర ప్రాంతాలకు చెందిన పవర్లూమ్ పరిశ్రమతో సంబంధం ఉన్నవారితో పాటు బీజేపీ పార్లమెంట్ సభ్యుడు కపిల్ పాటిల్, మాజీ ఎంపీ సురేష్ టావురే హాజరయ్యారు. భివండీకి చెందిన మహారాష్ట్ర రాజ్య పవర్లూమ్ ఫెడరేషన్ అధ్యక్షులు ఫైజానా ఆద్మీ, ‘పవర్లూమ్ డెవలప్మెంట్ అండ్ ఎక్స్పోర్ట్, ప్రమోషన్ కౌన్సిల్’ (పీడీఇఎక్స్సీఐఎల్) ఉపాధ్యక్షులు వంగ పురుషోత్తం, మాలేగావ్ ఎమ్మెల్యే ఆసీఫ్ రషీద్, భివండీ ఎమ్మెల్యే రుపేష్ మాత్రే తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పవర్లూమ్ పరిశ్రమను ఆదుకోవాలి : వంగ పురుషోత్తం దేశ విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ‘మాంచెస్టర్ ఆఫ్ మహారాష్ట్ర’గా గుర్తింపు పొందిన భివండీలో దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు పవర్లూమ్ పరిశ్రమలపై ఆధారపడి ఉన్నారని పీడీఇఎక్స్సీఐఎల్ ఉపాధ్యక్షులు వంగ పురుషోత్తం చెప్పారు. తెలంగాణలోని కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, నల్లగొండ జిల్లాలకు చెందిన తెలుగు ప్రజలు ఈ పరిశ్రమలపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. ఇటీవల నూలు ధరలు ఆకాశాన్నంటడంతో ‘గ్రే’ బట్ట ఉత్పత్తి మందగించిందని, విక్రయాలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయని చెప్పారు. కొన్ని పరిశ్రమలు మూతపడ్డాయని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలను 20 శాతం పెంచడంతో వ్యాపారులు, కార్మికులు పస్తులుండే పరిస్థితులు నెలకొన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పాటించనున్నట్లు మహారాష్ట్ర రాజ్య పవర్లూమ్ ఫెడరేషన్ అధ్యక్షులు ఫైజానా ఆద్మీ తెలిపారు. పవర్లూమ్ సమస్యలపై స్పందించిన భివండీ పార్లమెంట్ సభ్యుడు కపిల్ పాటిల్ ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర వస్త్ర ఉద్యోగ మంత్రి సంతోష్ గంగ్వార్ దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు. -
తెలంగాణ సర్వే దెబ్బకు ‘పవర్లూమ్’ అతలాకుతలం
సాక్షి, ముంబై: తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే భివండీ పవర్లూమ్ పరిశ్రమలను అతలాకుతలం చేసింది. వేలమంది తెలంగాణ కార్మికులు భివండీలోని పవర్లూమ్ పరిశ్రమల్లో ఉపాధి పొందుతున్నారు. సర్వే కారణంగా కార్మికులంతా తెలంగాణలోని సొంతగ్రామాలకు వెళ్లిపోయారు. ఇంకా కార్మికులు పరిశ్రమలకు చేరుకోకపోవడంతో పవర్లూమ్ పరిశ్రమలు వెలవెలబోయాయి. సర్వేకు పట్టణంలోని సుమారు 50 వేల మంది ప్రజలు తరలి వెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు. వీరిపై ఆధారపడి ఉన్న పరిశ్రమలు, తదితర వ్యాపారాలపై భారీ ప్రభావం పడుతోంది. కేసీఆర్ తెలంగాణ ప్రాంతాల్లో ప్రజలకు ఉపాధి కల్పించినట్లయితే భివండీలో స్థిరపడ్డ గుజరాతి, ముస్లిం, మార్వాడీ, మరాఠీ వ్యాపారాలు దెబ్బతింటాయని పలువురు వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భివంఢీ నుంచి తెలంగాణ బాట భారతదేశ మాంచస్టర్గా పేరు గాంచిన భివండీ పట్టణంలో భారీ సంఖ్యలో పవర్లూమ్ పరిశ్రమలు మూతపడ్డాయి. సుమారు 50 సంవత్సరాల క్రితం నుంచి తెలంగాణలోని నల్గొండ, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, వరంగల్ వివిధ జిల్లాల ప్రజలు ఉపాధి కోసం భివండీ వచ్చి స్థిరపడ్డారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్త ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే కోసం ఇక్కడ స్థిరపడ్డ ప్రజలతో పాటు ఒంటరిగా వచ్చిన కార్మికులు కూడా ఈ నెల 15 నుంచి తెలంగాణ బాట పట్టారు. ఈ నెల 29న వినాయక చవితి పండుగ ఉండడంతో కొందరు కార్మికులు తమ కుటుంబ సభ్యులతో అక్కడే ఆగిపోయారు. ఇప్పటికే పట్టణంలోని సుమారు 20 వేలకు పైగా పవర్లూమ్ యంత్రాలు నిలిచిపోయాయి. నిత్యం లక్ష రూపాయల నష్టపోతున్నామని వ్యాపారస్తులు వాపోతున్నారు.