Poultry products
-
స్మగ్లింగ్.. కోడి గుడ్డేం కాదు!
కెనడా, మెక్సికో నుంచి అమెరికాలోకి అక్రమంగా తరలిస్తూ సరిహద్దుల్లో భారీగా పట్టుబడుతున్న ఉత్పత్తుల సంఖ్య కొద్ది నెలలుగా భారీగా పెరిగిపోయింది. అయితే అవేమిటో తెలుసా? ఎప్పట్లా ఫెంటానిలో, ఇతరేతర డ్రగ్సో కాదు. పౌల్ట్రీ ఉత్పత్తులు! ఆశ్చర్యంగా ఉన్నా నిజమిది. పైగా వాటిలోనూ సింహ భాగం గుడ్లే కావడం విశేషం!! నానాకష్టాలూ పడి డ్రగ్స్‌ను దేశం దాటించేకంటే స్మగ్లింగ్ నెట్వర్కులకు ఇదే మాంచి లాభసాటి బేరంగా కన్పిస్తోందట. అమెరికాను అతలాకుతలం చేస్తున్న గుడ్ల కొరత తీవ్రతకు ఈ ఉదంతం అద్దం పడుతోంది. కెనడా, మెక్సికోల నుంచి అమెరికాలోకి ఫెంటానిల్ తదితర డ్రగ్స్ విచ్చలవిడిగా స్మగ్లింగ్ అవుతుండటం పరిపాటి. అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఇది డొనాల్డ్ ట్రంప్‌కు పెద్ద ప్రచారాస్త్రంగా మారింది కూడా. కెనడాపై టారిఫ్‌ల యుద్ధానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా కూడా ఫెంటానిల్ నిలిచింది. కానీ కొద్ది నెలలుగా కెనడా నుంచి గుడ్లు తదితర పౌల్ట్రీ ఉత్పత్తుల స్మగ్లింగ్ డ్రగ్స్‌ను కూడా మించిపోయిందంటూ అమెరికా అధికారులే ముక్కున వేలేసుకుంటున్నారు. గుడ్లే అమెరికన్లకు ప్రధానమైన బ్రేక్‌ఫాస్ట్. ఉదయాన్నే ఆమ్లెట్లుగానో, మరో రూపంలో గుడ్లు తిన్నాకే వారికి రోజు మొదలవుతుంది. వారి బ్రేక్‌ఫాస్ట్ అవసరాలు కాస్తా బ్లాక్మార్కెటర్లకు కాసుల పంటగా మారుతుండటం విశేషం!డ్రగ్స్ కంటే 10 రెట్లు! 2024 అక్టోబర్‌తో పోలిస్తే ప్రస్తుతం కెనడా నుంచి డెట్రాయిట్ గుండా అమెరికాలోకి అక్రమంగా గుడ్లు తరలిస్తున్న వారి సంఖ్య 36 శాతం పెరిగినట్టు అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ గణాంకాలు చెబుతున్నాయి. ఇక మెక్సికో సరిహద్దులకు అతి సమీపంలో ఉండే శాన్‌డీగో వద్ద ఈ ఉదంతాలు ఏకంగా 158 శాతం పెరిగిపోవడం విశేషం. 2024 అక్టోబర్ నుంచి అమెరికా సరిహద్దులను దాటించే ప్రయత్నంలో పౌల్ట్రీ ఉత్పత్తులు పట్టుబడ్డ ఉదంతాలు 3,768కి పైగా నమోదయ్యాయి. ఇదే సమయంలో ఫెంటానిల్ పట్టుబడ్డ ఉదంతాలు కేవలం 352 మాత్రమే కావడం విశేషం. పెరుగుతున్న ఫ్లూ రిస్క్! బర్డ్ ఫ్లూ దెబ్బకు కొన్నేళ్లుగా ఉత్తర అమెరికా ఖండమంతా అతలాకుతలమవుతోంది. కెనడాలో దీని తీవ్రత తక్కువగా ఉన్నా అమెరికా బాగా ప్రభావితమైంది. అక్కడ రెండు మూడేళ్లుగా కోట్లాది కోళ్లను హతమార్చాల్సి వచ్చింది. ఇది క్రమంగా దేశవ్యాప్తంగా తీవ్ర గుడ్ల కొరతకు దారితీసింది. దాంతో గుడ్ల ధరలు చుక్కలనంటుతున్నాయి. డజనుకు 5 డాలర్ల మార్కును దాటేసి ఆల్‌టైం రికార్డు సృష్టించాయి. షికాగో, శాన్ఫ్రాన్సిస్కో వంటి పలు ప్రధాన నగరాల్లోనైతే డజను గుడ్లు ఏకంగా 9 నుంచి 10 డాలర్ల దాకా పలుకుతున్న పరిస్థితి! గుడ్ల సంక్షోభం చేయి దాటిపోయిందని స్వయానా అధ్యక్షుడు ట్రంపే అంగీకరించారు! ఈ ఏడాది చివరకల్లా గుడ్ల ధరలు కనీసం మరో 50 శాతం దాకా పెరగవచ్చని అంచనా. దాంతో కొద్ది నెలలుగా స్మగ్లర్ల కన్ను గుడ్లపై పడింది. కెనడా నుంచి అమెరికాలోకి వాటి అక్రమ రవాణా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది. అయితే దీనివల్ల బర్డ్ ఫ్లూతో పాటు ఇతరత్రా రోగాల రిస్కు పెరిగిపోతోందని అమెరికా ఆందోళన చెందుతోంది. కోళ్లు, గుడ్ల స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపేందుకు కెనడా, మెక్సికో సరిహద్దుల వద్ద నిఘాను మరింత కఠినతరం చేయాలంటూ ట్రంప్ సర్కారు తాజాగా ఆదేశాలు జారీచేసింది!అమెరికాలో అద్దెకు కోళ్లు గుడ్ల సంక్షోభం పుణ్యమా అని అమెరికాలో ఇప్పుడు కోడి పెట్టలను అద్దెకిచ్చే సరికొత్త వ్యాపారం పుట్టుకొచి్చంది. అది ఇప్పుడక్కడ యమా జోరుగా సాగుతుండటం విశేషం. డజను గుడ్లకు 5 నుంచి 10 డాలర్ల దాకా పెట్టాల్సి రావడం అమెరికన్లను కలవరపరుస్తోంది. దీనికి బదులు ఇంటి పెరళ్లలో కోడిపెట్టలను సాకేందుకు వాళ్లు మొగ్గుచూపుతున్నారు. దాంతో దేశవ్యాప్తంగా కోడిపెట్టలకు చెప్పలేనంత డిమాండ్ ఏర్పడింది. దీన్ని సొమ్ము చేసుకునేందుకు రెంట్ ద చికెన్ వంటి పేర్లతో ఏకంగా కంపెనీలే పుట్టుకొచ్చాయి. ఆర్నెల్ల ప్రాతిపదికన కోడిపెట్టలను అద్దెకిస్తున్నాయి. కనీస అద్దె ప్యాకేజీలు 300 డాలర్ల నుంచి మొదలవుతున్నాయి. ఇందులో భాగంగా రెండు పెట్టలతో పాటు వాటికి ఆర్నెల్ల పాటు కావాల్సిన దాణాను కూడా కంపెనీలే ఇస్తాయి. కోళ్ల గూడు కూడా సమకూరుస్తాయి. ఆరోగ్యకరమైన పెట్ట వారానికి ఐదారు దాకా గుడ్లు పెడుతుంది. ఆ లెక్కన రెండు కోళ్లు ఆర్నెల్లకు కనీసం 250 గుడ్లు పెడతాయన్నమాట. వాటిని మార్కెట్లో కొనాలంటే ప్రస్తుత రేట్లను బట్టి కనీసం 80 నుంచి 160 డాలర్లకు పైనే పెట్టాల్సి ఉంటుంది. కోళ్లను సాకడం ద్వారా ఏ రోజుకు ఆ రోజు తాజా గుడ్లు దొరుకుతుండటం అమెరికన్లను బాగా ఆకర్షిస్తోంది. అంతేగాక గుడ్లను పొదిగించి కోళ్ల సంఖ్యను ఇబ్బడిముబ్బడిగా పెంచుకుంటున్నారు. కాంట్రాక్టు ముగిశాక అవి వారికే సొంతమవుతున్నాయి. వాటిని అద్దెకిస్తూ సైడ్ వ్యాపారం చేస్తున్న వారికి కూడా కొదవ లేదు. దొరికితే జరిమానాలుఅమెరికాలోకి గుడ్లు, ఇతర ప్రాసెస్ చేయని పౌల్ట్రీ ఉత్పత్తుల రవాణా చట్టవిరుద్ధం. ఫ్లూ తదితర ఆందోళనలే ఇందుకు కారణం. వీటిని దేశంలోకి తరలించే ప్రయత్నంలో పట్టుబడితే 300 డాలర్ల దాకా జరిమానా విధిస్తారు. ‘‘ఇరు దేశాలకూ కొన్నేళ్లుగా నిద్ర లేకుండా చేస్తున్న ఫెంటానిల్ వంటి డ్రగ్స్ కంటే కూడా కెనడా నుంచి అమెరికాలోకి గుడ్ల అక్రమ రవాణాయే పెరిగిపోతోందంటే ఆశ్చర్యంగానే ఉంది. కానీ కళ్లెదుట కన్పిస్తున్న వాస్తవమిది’’ అన్నారు కెనడా చాంబర్ ఆఫ్ కామర్స్ పాలసీ చీఫ్ మాథ్యూ హోమ్స్. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఫ్రెష్‌టుహోమ్ 104 మిలియన్ డాలర్ల సమీకరణ
న్యూఢిల్లీ: మాంసం, పౌల్ట్రీ ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయించే స్టార్టప్ సంస్థ ఫ్రెష్‌టుహోమ్ తాజాగా రూ. 104 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 861 కోట్లు) సమీకరించింది. అమెజాన్ ఎస్ఎంభవ్ వెంచర్ ఫండ్, ఇతర ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన ఈ నిధులను వ్యాపార విస్తరణ కోసం వినియోగించుకోనుంది. వచ్చే ఏడాది వ్యవధిలో 100 భౌతిక రిటైల్ స్టోర్స్‌ను ప్రారంభించనుంది. 2015లో బెంగళూరు కేంద్రంగా ఫ్రెష్‌టుహోమ్ కార్యకలాపాలు ప్రారంభించింది. ప్రస్తుతం దేశీయంగా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో 160 పైగా నగరాల్లోనూ వ్యాపారం నిర్వహిస్తోంది. ఇప్పటివరకూ 250 మిలియన్ డాలర్ల నిధులు సమీకరించినట్లు సంస్థ సీఈవో, సహ వ్యవస్థాపకుడు షాన్ కడవిల్ తెలిపారు. ప్రస్తుతం 30 రిటైల్ స్టోర్స్ ఉండగా వచ్చే 12 నెలల్లో వీటిని 130కి పెంచుకోనున్నట్లు వివరించారు. అటు సౌదీ అరేబియాతో పాటు ఇతర దేశాల్లోనూ విస్తరించనున్నట్లు తెలిపారు. 2025 ఆఖరు నాటికి ఐపీవోకి (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) వచ్చే యోచనలో ఉన్నట్లు కడవిల్ చెప్పారు. ప్రస్తుతం తమ వార్షికాదాయం దాదాపు రూ. 1,100 కోట్లుగా ఉన్నట్లు వివరించారు. -
పౌల్ట్రీ ఉత్పత్తుల విక్రయంపై నిషేధం వద్దు
న్యూఢిల్లీ: బర్డ్‌ఫ్లూ(ఎవియన్ ఇన్‌ఫ్లూయెంజా) కారణంగా మహారాష్ట్ర, హరియాణాలో పౌల్ట్రీ కోళ్ల వధ కొనసాగుతోందని కేంద్ర ప్రభుత్వం ఆదివారం వెల్లడించింది. మహారాష్ట్రలోని ముంబైలో, మధ్యప్రదేశ్‌లోని మాందసౌర్‌లో కొత్తగా బర్డ్‌ఫ్లూ కేసులు బయటపడ్డాయని తెలిపింది. ఇప్పటివరకు ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, కేరళ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, హరియాణా, గుజరాత్లో బర్డ్‌ఫ్లూ నిర్ధారణ అయ్యింది. పౌల్ట్రీ ఉత్పత్తుల విక్రయంపై నిషేధం విధించడం సరికాదని, దీనిపై పునరాలోచించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. వ్యాధి ప్రభావం లేని రాష్ట్రాల నుంచి కోళ్లను దిగుమతి చేసుకోవచ్చని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర పశు సంవర్థక శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. బర్డ్‌ఫ్లూ ప్రభావిత రాష్ట్రాల్లో కోళ్లలోనే కాకుండా కాకులు, గుడ్లగూబలు, పావురాలలో ఈ వ్యాధి ఆనవాళ్లు బయటపడ్డాయని పేర్కొంది. బర్డ్‌ఫ్లూపై అనుమానం ఉంటే సమాచారం అందించడానికి మహారాష్ట్ర పశు సంవర్థక శాఖ టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల బృందం బర్డ్‌ఫ్లూ ప్రభావిత రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తోంది. తాజా పరిస్థితిపై అధ్యయనం చేస్తోంది. ఈ వ్యాధిపై తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని, గందరగోళానికి గురికావొద్దని కేంద్ర పశు సంవర్థక శాఖ కోరింది. తప్పుడు ప్రచారం వల్ల పౌల్ట్రీ పరిశ్రమతోపాటు రైతులు సైతం నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేసింది. -
పౌల్ట్రీ ఉత్పత్తుల అమ్మకాలపై ఆంక్షల్లేవు
సాక్షి, అమరావతి: బర్డ్ ఫ్లూ నేపథ్యంలో రాష్ట్రంలో పౌల్ట్రీ ఉత్పత్తుల అమ్మకాలపై ఇప్పటి వరకు ఎలాంటి ఆంక్షలు విధించలేదని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు. ఉడికించిన కోడిగుడ్లు, మాంసం తినడం వలన బర్డ్ ఫ్లూ రాదని అందువలన ప్రజలు ఎలాంటి అపోహలకు గురికాకుండా నిరభ్యంతరంగా తినవచ్చునన్నారు. మన రాష్ట్రంలో బర్డ్ ఫ్లూతో ఒక్క పక్షి కూడా మరణించిన దాఖలాలు లేవన్నారు. వలస పక్షులు, నీటి పక్షులద్వారా ఈ వ్యాధి ప్రబలే అవకాశం ఉన్నందున రాష్ట్రంలో వలస పక్షులు, నీటి పక్షులు ఎక్కువగా వచ్చే ప్రాంతాలను మ్యాపింగ్ చేస్తున్నట్టు చెప్పారు. పశువైద్యులు తమ పరిధిలో ఉన్న కోళ్ల ఫారాలను సందర్శించి అక్కడ ఉన్న కోళ్ల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తుండాలని సూచించారు. ఉత్సాహపూరిత వాతావరణంలో కనుమ పండుగను జరుపుకోవాలని మంత్రి అప్పలరాజు మంగళవారం ఓ ప్రకటనలో ప్రజలకు పిలుపునిచ్చారు. -
పౌల్ట్రీ ఫార్మింగ్
ఏటా పది నుంచి పదిహేను శాతం వృద్ధి నమోదు చేసుకుంటున్న రంగం పౌల్ట్రీ. ముఖ్యంగా ప్రపంచీకరణ నేపథ్యంలో పౌల్ట్రీ ఉత్పత్తుల ఎగుమతులు ఆశాజనకంగా ఉండటం, ఆహార అలవాట్లు మారడం వంటి కారణాలు కూడా దేశంలో పౌల్ట్రీ రంగ విస్తరణకు దోహదం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పౌల్ట్రీ ఫార్మింగ్ కోర్సులకు కూడా డిమాండ్ పెరుగుతోంది. అవకాశాలు.. విభాగాలు: పౌల్ట్రీ రంగంలో ప్రధానంగా న్యూట్రిషన్, బ్రీడింగ్, హేచరీ మేనేజ్మెంట్, ప్రొడక్ట్ అండ్ ప్రాసెసింగ్, హెల్త్ అండ్ బయో సెక్యూరిటీ, ఎకనామిక్ అండ్ ప్రొడక్ట్ టెక్నాలజీ తదితర విభాగాల్లో ఉపాధి సొంతం చేసుకోవచ్చు. ఉపాధి వేదికలు: బోధన, పరిశోధన, పౌల్ట్రీ పరిశ్రమల్లో అవకాశాలుంటాయి. దేశవ్యాప్తంగా ఉన్న పలు పరిశోధన సంస్థల్లో శాస్త్రవేత్తలుగా ప్రవేశించవచ్చు. ప్రభుత్వ విభాగంలో వెటర్నరీ ఆఫీసర్, లైవ్‌స్టాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ హోదాలు కూడా పొందవచ్చు. స్వయం ఉపాధి: పౌల్ట్రీ రంగంలో సర్టిఫికెట్ పొందిన వారు సొంత ప్రాక్టీస్ కూడా నిర్వహించవచ్చు. స్పెషలైజేషన్ సబ్జెక్టుల ఆధారంగా పౌల్ట్రీ ఫార్మ్స్‌కు సలహాదారులుగా వ్యవహరించవచ్చు. అంతేకాకుండా పీజీ పూర్తి చేసుకుంటే బ్రాయిలర్ పౌల్ట్రీ, ఇఎంయు ఫార్మింగ్ విభాగాల్లో సొంత యూనిట్లు కూడా నెలకొల్పవచ్చు. దీనికోసం నాబార్డ్ రుణం కూడా లభిస్తుంది. కోర్సులు: పౌల్ట్రీ రంగంలో అడుగుపెట్టాలనుకునే వారు ఐదేళ్ల వ్యవధి గల బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండరీ కోర్సు పూర్తి చేయాలి. ఆ తర్వాత ఎంవీఎస్సీ చేస్తే మరిన్ని అవకాశాలు లభిస్తాయి. బీవీఎస్సీ, ఎంవీఎస్సీ ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీలు: శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ కోర్సులు: బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స అండ్ యానిమల్ హస్బెండరీ (బీవీఎస్సీ అండ్ ఏహెచ్), మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్స (ఎంవీఎస్సీ) వెబ్సైట్: www.svvu.edu.in డిప్లొమా కోర్సులు: పౌల్ట్రీ విభాగానికి సంబంధించి పలు డిప్లొమా కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాలు.. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (వ్యవధి: ఆరు నెలలు; అర్హత: ఎనిమిదో తరగతి) వెబ్సైట్: www.ignou.ac.in నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ వెబ్సైట్: www.nios.ac.in అన్నామలై యూనివర్సిటీ వెబ్సైట్: annamalaiuniversity.ac.in