అడ్వొకేట్ జనరల్ వేణుగోపాల్ రాజీనామా
పీపీ పోసాని కోరినందునే రాజీనామా చేశానన్న ఏజీ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్(ఏజీ) పరాంకుశం వేణుగోపాల్ తన పదవికి ఆదివారం రాజీనామా చేశారు. ఏజీ పదవికి రాజీనామా చేయాలని రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్(పీపీ) పోసాని వెంకటేశ్వర్లు స్వయంగా వచ్చి తనను కోరడంతో రాజీనామా చేసినట్టు వేణుగోపాల్ ‘సాక్షి’తో చెప్పారు. గవర్నర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులనుద్దేశించి తాను రాసిన రాజీనామా లేఖను పోసాని తీసుకెళ్లారని వివరించారు. ‘‘పోసాని వెంకటేశ్వర్లు ఆదివారం ఉదయం నా కార్యాలయానికి వచ్చారు. 15 నిమిషాలపాటు నా కార్యాలయంలో ఉన్నారు. ప్రభుత్వం నన్ను మార్చే యోచన చేస్తోందని, ఈ విషయాన్ని నాతో చెప్పడానికి ఇబ్బందిపడుతోందని, అందువల్ల తనను పంపిందని పోసాని అన్నారు.
ఆ వెంటనే గవర్నర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఉద్దేశించి రాజీనామా లేఖ రాశాను. దానిని పోసాని చూసి.. రాజీనామాకు కారణాలు రాయాలని కోరారు. అయితే రాజీనామా చేసేందుకు నాకు ఎటువంటి కారణాలు లేవు కాబట్టి నేను కారణాలేవీ రాయలేదు. పైగా ఏజీ పదవిని నిర్వర్తించడం ఎంతో గౌరవమైన విషయం. కాబట్టి నా రాజీనామాకు కారణాలు లేవు. పోసాని అడిగారు.. నేను రాజీనామా చేశా’’ అని వేణుగోపాల్ ‘సాక్షి’కి వివరించారు. వేణుగోపాల్ 2014, జూన్ 19న రాష్ట్ర అడ్వొకేట్ జనరల్‌గా నియమితులయ్యారు.