breaking news
Pilli Ramchander
-
నగరంలో పిట్టలోళ్లు...
హైదరాబాద్ నగరంలో పిట్టలోళ్లుగా గుర్తింపు పొందిన పార్ధీల జీవన విధానం ప్రత్యేకంగా ఉంటుంది. పార్ధీల కుటుంబ వ్యవస్థల్లో మహిళలదే ఆధిపత్యం. కుటుంబ వ్యవహారాల్లో వారిదే అంతిమ నిర్ణయం. పండ్లు, కూరగాయల వ్యాపారాలు చేసే పార్ధీలకు నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక బస్తీలు ఉన్నాయి. వీటిని పార్ధీవాడాలు అంటారు. పార్ధీలకు ప్రత్యేకంగా భాష ఉన్నా, దానికి లిపి లేదు. నగరంలో పార్ధీల జనాభా దాదాపు రెండున్నర లక్షల వరకు ఉంటుంది. అయితే, వీరికి ప్రత్యేకమైన అసోసియేషన్లు లేవు. బస్తీల వారీగా పంచాయతీ కమిటీలు ఏర్పాటు చేసుకుని, వీరు తమ బాగోగులు చూసుకుంటుంటారు. కొండజాతి ప్రజలనే పార్ధీలంటారు. పురుషులను పార్ధీ అని, మహిళలను పార్ధన్ అని పిలుస్తారు. కొండ ప్రాంతాలకు చెందిన పార్ధీలు వేట కోసం కుటుంబ సమేతంగా సంచార జీవనం కొనసాగించేవారు. పక్షులను వేటాడటంతో వీరు పిట్టలోళ్లుగా గుర్తింపు పొందారు. పార్ధీల మొదటి ప్రజాప్రతినిధులు... పాతబస్తీ పురానాపూల్ డివిజన్లో అప్పటి బల్దియా కౌన్సిలర్‌గా మొదటిసారి ఎన్నికైన కె.కాశీరాం 1968-69లో హైదరాబాద్ డిప్యూటీ మేయర్‌గా కొనసాగారు. పార్ధీ వర్గానికి చెందిన తొలి ప్రజాప్రతినిధి ఆయనే. అనంతరం 1986లో జరిగిన బల్దియా ఎన్నికల్లో ఇదే పురానాపూల్ బస్తీ నుంచి పురానాపూల్ డివిజన్ మహిళా కౌన్సిలర్‌గా ఎస్.విజయకుమారి ఎన్నికయ్యారు. పార్ధీ వర్గానికి చెందిన తొలి మహిళా ప్రజాప్రతినిధిగా ఆమె గుర్తింపు పొందారు. వినాయక చవితి, హోలీ ప్రధాన పండుగలు... పార్ధీలకు వినాయక చవితి, హోలీ ప్రధానమైన పండుగలు. ఈ రెండు పండుగలను వీరు ఘనంగా జరుపుకుంటారు. రకరకాల పండ్లతో కూడిన ప్రత్యేక వాహనంపై వినాయకుడిని నిమజ్జనానికి తరలించేటప్పుడు ఆడామగ చిన్నాపెద్ద తారతమ్యం లేకుండా దారిపొడవునా నృత్యాలు చేస్తూ ముందుకు సాగుతారు. హోలీ పండుగను మూడురోజులు ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఈ వేడుకలకు దేశవ్యాప్తంగా ఉన్న పార్ధీలందరూ పాతబస్తీ శివార్లలోని జల్పల్లిలో మకాం వేసి, హోలీ వేడుకలను ఘనంగా జరుపుకోవడం తరతరాలుగా వస్తోంది. జల్పల్లిలోని గోల్కొండ నవాబు ప్రియురాలు మీరాబాయి సమాధితో పాటు తమ పూర్వీకుల సమాధుల వద్ద శ్రద్ధాంజలి ఘటించడం వీరి ఆనవాయితీ. గోల్కొండ నవాబు కాలంలో.... గోల్కొండ నవాబుల కాలంలో రాజస్థాన్‌లోని చిత్తోడ్‌గఢ్‌కు చెందిన మీరాబాయి నగరానికి వలస వచ్చింది. అప్పటి గోల్కొండ నవాబు ఆమెపై ప్రేమాభిమానాలను చూపించి 17 గ్రామాలను బహూకరించినట్లు ఇక్కడి పార్ధీలు చెబుతున్నారు. నాలుగు శతాబ్దాల కిందటే నగరానికి వలస వచ్చిన పార్ధీలు తమ సంస్కృతీ సంప్రదాయాలను నేటికీ కాపాడుకుంటున్నారు. నగరంలో.... పురానాపూల్, ఎస్.వి.నగర్, లక్ష్మీనగర్, విష్ణునగర్, జాలీ హనుమాన్, లాల్‌దర్వాజా, రాజన్నబౌలి, ఎల్బీనగర్, చిక్కడపల్లి, మురళీధర్ బాగ్, బషీర్‌బాగ్, ఖైరతాబాద్, ఫతేనగర్, ఎర్రగడ్డ, సీతాఫల్మండి, చిలకలగూడ, బాలానగర్, కాచిగూడ చౌరస్తా, మల్కాజిగిరిలోని ఉప్పర్‌గూడ, సికింద్రాబాద్ గ్యాస్ మండి, రాణిగంజ్ తదితర ప్రాంతాల్లో పార్ధీవాడలున్నాయి. పార్ధీలేమంటున్నారంటే... పేదరికంలో మగ్గుతున్న తమను ఎస్టీలుగా గుర్తించాలని పార్ధీలు కోరుకుంటున్నారు. ముప్పయ్యేళ్ల కిందట తమను ఎస్టీలుగా గుర్తించినట్లు కేంద్రం ప్రకటించినా, రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం లేదని ఆవేదన చెందుతున్నారు. పార్ధీవాడల్లో తమ కోసం ప్రత్యేక కమ్యూనిటీ హాళ్లు నిర్మించాలని కోరుతున్నారు. జల్పల్లిలో పార్ధీలకు చెందిన దాదాపు వంద ఎకరాల స్థలాన్ని రౌడీషీటర్లు కబ్జా చేశారని, ఆ స్థలాన్ని కాపాడాలని, చిరువ్యాపారాలు చేసుకుంటున్న తమకు పావలా వడ్డీకి రుణాలు ఇవ్వాలని కోరుతున్నారు. ..:: పిల్లి రాంచందర్ -
పాతబస్తీ చానళ్లు.. పక్కా.. లోకల్
ఓల్డ్ సిటీ అనగానే ఇరుకు గల్లీలే గుర్తొస్తాయి. గల్లీలు ఇరుకైనా అక్కడి మనుషుల మనసులు విశాలం. రద్దీని చూసి రంది పడకుండా.. కొంచెం ఇష్టంగా ముందుకు నడిచి చూడండి. ఎక్కడి నుంచో సైగల్ గొంతు చెవుల్లో తేనెలు కురిపిస్తుంది. ఓ ఇంట్లోంచి ‘రిమ్జిమ్ గిరె సావన్’ అంటూ కిషోర్దా స్వరం తొలకరిలా కురుస్తుంది. గల్లీ నుంచి కొంచెం పక్కకు తిరిగితే.. ‘నువు పెద్దపులి నెక్కినావమ్మో.. గండిపేట గండి మైసమ్మ’ అంటూ.. ఓ భక్తిగీతం పరవశులను చేస్తుంది. ఇంకొంచెం ముందుకెళ్తే.. ‘ఆదాబ్..!’ అంటూ హైదరాబాదీ ఉర్దూలో ఓ గొంతు ఆత్మీయంగా పలకరిస్తుంది. ఇది పాతబస్తీలో అడుగు పెడితే సొంతమయ్యే అనుభూతి. ఈ భిన్నత్వమే అక్కడ దాదాపు 100కు పైగా కేబుల్ చానల్స్ విజయవంతంగా నడిచేందుకు దోహదపడుతోంది! దక్షిణ మూసీ ప్రాంతమైన పాతబస్తీలో 120 వరకు కేబుల్ ఆపరేటర్లున్నారు. ఒకప్పుడు కేబుల్ ఆపరేటర్లుగా ఉన్నవాళ్లు కాస్తా ఇప్పుడు టీవీ చానళ్ల ఓనర్లయ్యారు. ఆశ్చర్యపోకండి. కేబుల్ టీవీ చానళ్ల ఓనర్లు. ఇందులో కొన్ని టీవీలు ఉర్దూ, తెలుగు భాషల్లో న్యూస్ బులెటిన్లను అందిస్తుండగా.. మరికొన్ని సినిమాలు, సినిమా పాటలతో నిరంతరం ప్రజలకు వినోదాన్నిస్తున్నాయి. ఎలాంటి నియమ నిబంధనలు, ఒత్తిళ్లు లేకుండా స్వేచ్ఛగా తమ ప్రసారాలను అందిస్తున్నాయి. రెండు దశాబ్దాల కిందటే... మీరాలంమండి రోడ్డులోని జహరానగర్లో ఆర్ఎంఎస్ చానల్ ఇరవయ్యేళ్ల క్రితం మొదటిసారిగా కేబుల్ టీవీ ప్రసారాలను ప్రారంభించింది. అనంతరం ఓల్డ్‌సిటీ కేబుల్ నెట్వర్క్ (ఓసీఎన్) పేరుతో మరో కేబుల్ టీవీ చానల్ ప్రసారాలు ప్రారంభించింది. తరువాతి కాలంలో చాలా చానళ్లు ప్రారంభమయ్యాయి. వందకు పైగా చానళ్లు.. 4-టీవీ, రుబీ టీవీ, రియల్ రుబీ, ఆప్తక్, సీసీఎన్, ఫిజా, ఎంక్యూ టీవీ, ఎన్ఎన్ఎస్ చానల్, మాస్ టీవీ, టీవీ-21, హైదరాబాద్ చానల్, శాలిమార్ చానల్, కృషి టీవీ, వీఆర్ టీవీ, మై టీవీ, ఎస్ఎం టీవీ, ఎఫ్ఎం టీవీ, నిషా టీవీ, నిషా ప్లస్ టీవీ, నిషా ఇస్లామిక్, వీ టీవీ, ఆర్ఎంఎస్ కేబుల్ టీవీ, మొఘల్ టీవీ, ఎంకే చానల్, జీ టీవీ, ఎస్ టీవీ, ఏషియన్ టీవీలతో పాటు మరికొన్ని స్థానిక కేబుల్ టీవీ చానళ్లు ఓల్డ్ సిటీలో ఉన్నాయి.ఇవి వందకుపైగా ఉంటాయని అంచనా. ఇందులో 4-టీవీ, రుబీ టీవీ, రియల్ రుబీ, ఉర్దూ టీవీలు రోజూ ఉర్దూలో వార్తలు ప్రసారం చేస్తున్నాయి. సత్వర స్పందన పాతబస్తీలో ఏ చిన్న సంఘటన జరిగినా ఈ ఉర్దూ కేబుల్ టీవీ చానళ్లు వెంటనే స్పందిస్తున్నాయి. ఒక్కోసారి సంఘటనా స్థలంలో చిత్రీకరించిన సంఘటనలన్నింటినీ ఎడిట్ చేయకుండా యథావిధిగా ప్రసారం చేస్తున్నాయి. దీనివల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నాయి. పండుగలకు రేటింగ్... కొత్త సినిమాలతో పాటు అక్కడ జరిగే పండుగలు, ఉత్సవాలను ప్రత్యక్ష ప్రసారాలు చేస్తున్నాయి ఈ చానల్స్. హిందువుల ఏరియాల్లోని కేబుల్ టీవీ చానళ్లు బోనాలు, అయ్యప్ప స్వామి పూజలు, వినాయక చవితి ఉత్సవాలు, దసరా, దీపావళి వేడుకలను ప్రత్యక్షంగా అందిస్తుండగా.. ముస్లిం ఏరియాల్లోని కేబుల్ టీవీ చానళ్లు ఉర్సు ఉత్సవాలు, రంజాన్, మిలాద్-ఉన్-నబీ తదితర మతపరమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నాయి. పండుగలు, ఉత్సవాలప్పుడు లోకల్ చానల్స్ రేటింగ్ హైస్పీడ్‌లో పెరిగిపోతుందనడంలో అతిశయోక్తి లేదు. ఆదాయ వనరులు ఎమ్ఎస్ఓలతో సంబంధం లేదు కాబట్టి ఆదాయం నెలవారీ ప్రకటనలే. ప్రతి రోజు స్క్రోలింగ్‌లతో పాటు విజువల్ యాడ్లను ప్రసారం చేస్తున్నాయి. స్థానికులు కచ్చితంగా చూసే ఈకేబుల్ టీవీల్లో యాడ్ ఇస్తే తమ కొనుగోళ్లు పెరుగుతాయని వ్యాపారుల నమ్మకం. 24 గంటల పాటు స్క్రోలింగ్ రన్ చేసే ప్రకటనకు నెలకు రూ. 400 నుంచి 600 వరకు, గంటకోసారి ప్రసారం చేసే విజువల్ యాడ్స్‌కు నెలకు 1,500 నుంచి 2,000 వరకు లభిస్తుంది. ఇక భక్తి కార్యక్రమాలు, స్కూల్ యాడ్స్, వ్యాపార ప్రకటనల ప్యాకేజీలను కొనసాగిస్తున్నారు. అంతేనా.. లోకల్‌గా జరిగిన పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్స్‌కి కూడా ఈ చానల్స్‌లో మంచి గిరాకీ. వ్యయం శాటిలైట్ టీవీ చానల్ ప్రారంభించడానికి ఖర్చు 20 కోట్ల నుంచి మొదలవుతుంది. కానీ ఈ కేబుల్ చానల్ నిర్వహణకు లక్ష నుంచి లక్షన్నర వరకు ఖర్చవుతుంది. ఒక సిస్టం, ఒక కెమెరా, కెమెరామెన్ చాలు.. చానల్ రన్ చేసేయొచ్చు. చిన్న కేబుల్ టీవీ చానళ్లు కేవలం ఇద్దరు సిబ్బందితో నడుస్తున్నాయి. టీవీ చానల్ గదితో పాటు ఇద్దరి జీతభత్యాలు, నెలసరి ఖర్చు మాత్రమే ఉంటుంది. ఈ ఇద్దరిలో ఒకరు నిర్వాహకులే ఉంటుండటంతో ఒక వేతనం కూడా తగ్గుతోంది. ఇక ఎలాంటి ఎడిటింగ్, మిక్సింగ్ కార్యక్రమాలు లేకపోవడంతో నెలవారీ ఖర్చులు కూడా తక్కువగానే ఉన్నాయి. ఆకట్టుకునే కార్యక్రమాలు ఖబర్నామా.. ఫోర్త్ టీవీ చానల్లో ప్రతిరోజూ ప్రసారమయ్యే ఫోర్త్ టీవీ ఖబర్నామా ఉర్దూ న్యూస్‌కి వ్యూయర్స్ ఎక్కువ. రాత్రి 7.30 గంటలకు, 10 గంటలకు, అర్ధరాత్రి ఒంటి గంటకు, తెల్లవారుజామున 4 గంటలకు, ఉదయం 8 గంటలకు, 11.30 గంటలకు ప్రసారమయ్యే ఈ బులెటిన్లలో వార్తలన్నీ పాతబస్తీకే సంబంధించినవి కావడంతో స్థానికులు వాటిని మిస్ కావడంలేదు . దక్కనీ న్యూస్ హైదరాబాద్ పాతబస్తీ ఉర్దూ యాసలో ప్రసారమయ్యే ద క్కనీ న్యూస్ ఇక్కడి జనాల మోస్ట్ ఫేవరెట్ బులెటిన్. పరాయి భాషలో కాకుండా పక్కింటివాళ్లు విషయం చెప్పినట్టు ‘ఆదాబ్...’! అంటూ వార్తలను చేరవేయడం ఈ న్యూస్ ప్రత్యేకత. ప్రభుత్వ సహకారం కావాలి స్థానిక ప్రేక్షకులకు వినోదంతో పాటు ఉత్సవాల ప్రత్యక్ష ప్రసారాలు, వార్తలను అందజేస్తున్న కేబుల్ టీవీ చానళ్లను ప్రభుత్వం గుర్తించి తగిన విధంగా ప్రోత్సాహకాలు అందించాలి. స్థానిక ఉత్సవాల సమయంలో సమాచార పౌర, సంబంధాల శాఖ ప్రభుత్వ ప్రకటనలను జారీ చేస్తే బాగుంటుంది. - మీర్ మెహదీ అలీ బాక్రీ సెన్సేషనల్ న్యూస్ సిండికేట్ (ఎస్ఎన్ఎస్) - పిల్లి రాంచందర్