breaking news
Peoples War Movement
-
43 ఏళ్లకి వచ్చావా సత్యంరెడ్డి..! చూసేందుకు పెద్ద ఎత్తున వచ్చిన జనం
మిర్యాలగూడ: ఒకటి రెండేళ్లు కాదు.. ఏకంగా 43 ఏళ్ల పాటు సొంతింటికి దూరంగా ఉన్న ఓ మావోయిస్టు నేత ఇన్నేళ్లకి చేరుకున్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం సుబ్బారెడ్డిగూడెం గ్రామానికి చెందిన గజ్జల సత్యంరెడ్డి అలియాస్ గోపన్న పీపుల్స్‌వార్ ఉద్యమంలో సుదీర్ఘంగా పనిచేశారు. హైదరాబాద్ ఏవీ కళాశాలలో డిగ్రీ చదువుతున్న క్రమంలో విప్లవోద్యమానికి ఆకర్షితుడై 1980లో పీపుల్స్ వార్ పార్టీలో చేరిన ఆయన దండకారణ్యంలో మావోయిస్ట్ పార్టీ విస్తరణకు కీలకంగా పని చేశారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా కూడా వ్యవహరించిన సత్యంరెడ్డి 26 ఏళ్లు అడవిలో ఉండి.. 17 ఏళ్లు జైలు జీవితం గడిపారు. పోలీసులు మోపిన అన్ని కేసులనూ కోర్టులు కొట్టివేయడంతో ఛత్తీస్గడ్ రాష్ట్రం రాయ్‌పూర్ జైలు నుంచి విడుదలయ్యారు. అక్కడి నుంచి తన తమ్ముడితో కలిసి సొంత ఊరైన సుబ్బారెడ్డిగూడెం గ్రామానికి ఆదివారం సాయంత్రం చేరుకున్నారు. సత్యంరెడ్డి వచ్చిన విషయం తెలుసుకున్న గ్రామస్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. అజ్ఞాతంలో ఉండగానే సత్యంరెడ్డి తోటి పార్టీ సభ్యురాలిని వివాహం చేసుకోగా ఆమె ఎన్కౌంటర్లో మరణించింది. అనంతరం ద్వితీయ వివాహం చేసుకున్నప్పటికీ ఆమె వివరాలు తెలియరాలేదు. సత్యంరెడ్డి తాను పుట్టి పెరిగిన ఊరిని సందర్శించి.. చిన్నప్పుడు తాను తిరిగిన ప్రాంతాలను గ్రామస్తులతో కలిసి గుర్తుచేసుకున్నారు. తాను జైళ్లో ఉన్న సమయంలోనే తల్లిదండ్రులు మరణించడంతో వారిని కడసారి చూసుకోలేకపోయానని ఆవేదన చెందారు. అయితే తన అన్నను, తమ్ముడిని, వారి కుటుంబసభ్యులను తిరిగి కలిసినందుకు సంతోషం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను కలుసుకున్న వేళ భావోద్వేగపూరిత వాతావరణంలో కంటతడిపెట్టారు. ఇక మీదట తన జనజీవన స్రవంతిలోనే కొనసాగుతానని, తిరిగి మావోయిస్ట్ పార్టీలోకి వెళ్లేది లేదని సత్యంరెడ్డి చెప్పారు. -
వ్యూహా రచనలో దిట్ట
ఏఓబీ ఎన్కౌంటర్లో కన్నుమూసిన గాజర్ల రవి మిలటరీ వ్యూహాల్లో పేరుపొందిన మావోయిస్టు అగ్రనేత పోలీసు స్టేషన్లపై వరుస దాడులు లెంక లగడ్డలో బీఎస్ఎఫ్ జవాన్లపై బాంబుదాడి ఏటూరునాగారం, కరకగూడెం పోలీస్స్టేషన్ల పేల్చివేతలో కీలకం మావోయిస్టుల ప్రతినిధిగా శాంతి చర్చలకు... అన్నదమ్ముల్లో ముగ్గురు మావోయిస్టు నేతలే ఇప్పటికే ఎన్కౌంటర్లో మృతిచెందిన ఆజాద్ కొద్దినెలల కింద లొంగిపోయిన గాజర్ల అశోక్ చిట్యాల, ఇల్లెందు, పెద్దపల్లి, హైదరాబాద్: ఏఓబీ ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు అగ్రనేత గాజర్ల రవి అలియాస్ గణేశ్ అలియాస్ ఉదయ్ (46) మెరుపు దాడులకు, మిలటరీ వ్యూహరచనలో దిట్టగా పేరు పొందారు. చిన్న వయసులోనే పోరుబాట పట్టిన ఆయనది 26 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం. అసలు వారి కుటుంబమంతా మావోయిస్టు ఉద్యమంతో ముడిపడి ఉంది. రవి 1990లో ఉద్యమ బాట పట్టి ఎన్కౌంటర్లో మరణించేదాకా ప్రజాపోరులో కొనసాగారు. దళంలో చేరిన ఎనిమిది నెలలకే దళ కమాండర్‌గా ఎదిగిన నేపథ్యం ఆయనది. 2004లో ఉమ్మడి ఏపీ రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన శాంతి చర్చల్లో మావోయిస్టుల తరఫున ప్రతినిధిగా కూడా పాల్గొన్నారు. 1992లో ఉద్యమంలోకి రవి అలియాస్ గణేశ్ భూపాలపల్లి జిల్లా (పాత వరంగల్ జిల్లా) చిట్యాల మండలం వెలిశాలలో జన్మించారు. అక్కడి ప్రభుత్వ పాఠశాలలోనే పదో తరగతి వరకు చదువుకున్నారు. 1986 నుంచి 1988 వరకు పెద్దపల్లి ఐటీఐలో ఫిట్టర్ కోర్సు చేశారు. ఇంటర్మీడియట్ హన్మకొండలో పూర్తిచేశారు. 1990 నుంచి ఉద్యమానికి ఆకర్షితుడై 1992 వరకు విద్యార్థి సంఘం నాయకుడిగా పనిచేశారు. అప్పటికే ఆయన అన్న ఆజాద్ పీపుల్స్‌వార్ ఉద్యమంలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. దాంతో పోలీసులు గణేశ్‌ను చిత్రహింసలు పెట్టడంతో వెలిశాలకు వచ్చి టేకుమట్లలో పోలీస్ కానిస్టేబుల్‌ను కిడ్నాప్ చేశారు. తర్వాత అన్న ఆజాద్ స్ఫూర్తితో 1992లో పీపుల్స్‌వార్‌లో చేరారు. ఉత్తర తెలంగాణలో పీపుల్స్‌వార్ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచారు. నక్సలైట్ గ్రూపులన్నీ కలసి మావోయిస్టు పార్టీగా ఏర్పాటయ్యాక కీలక నేతగా మారారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా, ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రత్యేక జోన్ కారదర్శివర్గ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. మల్కన్‌గిరి సరిహద్దు ఇన్చార్జిగా వ్యవహరించారు. మెరుపు దాడుల్లో మావోయిస్టు ఉద్యమంలో రవి ఎంతో కీలకమైన పాత్ర పోషించారు. విధ్వంసాలు, దాడులు, మిలటరీ ఆపరేషన్లలో దిట్టగా ఆయనకు పేరుంది. పీపుల్స్‌వార్‌లో ప్లాటూన్లను ఏర్పాటు చేసిన కాలంలో ఆజాద్ ఆ వ్యవహారాలు చూసేవాడని చెబుతారు. 1994 సార్వత్రిక ఎన్నికల సమయంలో మంథని డివిజన్ లెంకలగడ్డలో బీఎస్ఎఫ్ జవాన్లపై దాడిచేసి ఆరుగురిని చంపిన ఘటనలో గణేశ్ పాత్ర కీలకమైనదని అంటారు. గణేశ్ వ్యూహంతోనే 1999-2000 మధ్య ఏటూరునాగారం పోలీస్‌స్టేషన్‌పై దాడి జరిగింది. కరకగూడెం, కొత్తగూడ, ఏటూరునాగారం పోలీస్స్టేషన్లపై దాడుల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఉత్తర తెలంగాణ ఏరియా కమిటీ సభ్యుడిగా ఉన్న సమయంలో మహదేవపూర్ పోలీస్‌స్టేషన్‌పై బస్సు బాంబు దాడి చేశారు. మావోయిస్టు పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శిగా, కేకేడబ్ల్యూ (కరీంనగర్, ఖమ్మం, వరంగల్) కార్యదర్శిగా కూడా పనిచేశారు. కారేపల్లి, బోడు పోలీస్స్టేషన్ల మీద జరిగిన దాడులతోపాటు ఇల్లెందు, పాకాల, మణుగూరు, పాల్వంచ, ఏటూరునాగారం, ములుగు ఏరియాల్లో జరిగిన అనేక సంఘటనలకు ఆయన నాయకత్వం వహించారు. గుండాల మండలం చెట్టుపల్లి సమీపంలో ప్రజాపథం వాహ నం పేల్చి వేసిన సంఘటన గణేశ్ నేతృత్వంలోనే జరిగిందని చెబుతారు. చెట్టుపల్లి గుట్టల్లో జరిగిన కా ల్పులు, కాచనపల్లి సమీపంలో జరిగిన కాల్పుల ఘటన, గుండాల-లింగాల మధ్య ఎదురుకాల్పుల ఘటనల్లో పాల్గొన్నారు. ప్రభుత్వంతో చర్చల అనంతరం నిర్బంధం తీవ్రం కావడంతో కేకేడబ్ల్యూ కార్యదర్శి బాధ్యతల నుంచి తప్పుకొని ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లా రు. వందకుపైగా ఎన్కౌంటర్ల నుంచి చాకచక్యంగా తప్పించుకుని, కేడర్‌ను కూడా రక్షించాడని రవితో పనిచేసిన మాజీ మావోయిస్టులు చెబుతుంటారు. శాంతి చర్చల ప్రతినిధిగా.. 2004-05లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో శాంతి చర్చల్లో మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు రామకృష్ణ (ఆర్కే)తో కలసి గణేశ్ ముఖ్య భూమిక పొషించారు. ఏవోబీ కమిటీ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించారు. ప్రభుత్వంతో చర్చల సమయంలో గణేశ్ ఇల్లెందు, పాల్వంచ, మణుగూరు, పాకాల కొత్తగూడెం, ఏటూరునాగారం ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి మావోయిస్టు ఉద్యమ విస్తరణకు కృషి చేశారు. మణుగూరులో జరిగిన బహిరంగసభలో జనశక్తి నేత అమర్‌తో కలిసి పాల్గొన్నారు. అయితే ఆ చర్చలు విఫలం కావడంతో తిరిగి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల సెక్రెటరీగా మావోయిస్టు పార్టీని విస్తరింప జేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇదే శాంతి చర్చలకు జనశక్తి ప్రతినిధిగా హాజరైన రియాజ్ బదనకల్లు ఎన్కౌంటర్లో చనిపోయారు. శాంతి చర్చలకు బ్రేక్ పడిన పదేళ్ల తర్వాత గణేశ్ ఏవోబీ ఎన్కౌంటర్లో హతమయ్యారు. మృతుల్లో కంకణాలపై ప్రచారం ఎన్కౌంటర్ మృతుల్లో కాల్వశ్రీరాంపూర్ మండలం కి ష్టంపేట గ్రామానికి చెందిన కంకణాల రాజిరెడ్డి కూడా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. కరీంనగర్ జిల్లా నుంచి ఖమ్మం వెళ్లిన ఆయన ఛత్తీస్‌గఢ్ మావోయిస్టు పార్టీలో ఉన్నారని కొందరు భావిస్తుండగా.. ఇటీవలి కాలంలో ఏవోబీకి వెళ్లారని కూడా అంటున్నారు. తాజా ఎన్కౌంటర్లో రాజిరెడ్డి కూడా మృతిచెందినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ కుటుంబమంతా పోరుబాటే... గాజర్ల కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ములు మావోయిస్టు నేతలే సాక్షి, వరంగల్/భూపాలపల్లి: వెలిశాల.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా (పాత వరంగల్ జిల్లా) టేకుమట్ల మండలంలోని ఓ ఊరు.. ప్రజా పోరాటాలకు వేదికగా నిలిచింది. ఒకప్పటి పీపుల్స్‌వార్, ప్రస్తుత మావోయిస్టు ఉద్యమానికి కీలకమైన నాయకులను అందించింది. భూస్వామ్య, పెత్తందారీ వ్యవస్థను ఎదుర్కొనేందుకు ఈ గ్రామానికి చెందిన గాజర్ల కుటుంబం నుంచి ముగ్గురు అన్నదమ్ములు సాయుధ ఉద్యమ బాట పట్టారు. మావోయిస్టు అగ్రనేతలు సారయ్య అలియాస్ ఆజాద్, అశోక్ అలియాస్ ఐతు, రవి అలియాస్ గణేశ్‌లు ఉద్యమంలో తమదైన ముద్ర వేశారు. పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా.. వెలిశాల గ్రామానికి చెందిన గాజర్ల కనకమ్మ-మల్లయ్య దంపతులకు రాజయ్య, సమ్మయ్య, సారయ్య, రవి, అశోక్‌లు సంతానం. ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమి, గీత వృత్తి వారి జీవనాధారం. ఈ ఐదుగురు అన్నదమ్ముల్లో సారయ్య, రవి, అశోక్‌లు వారి జీవితాన్ని ఉద్యమానికే ధారపోశారు. 1987లో వెలిశాలలో సింగిల్ విండో ఎన్నికలు జరిగాయి. డెరైక్టర్ పదవి కోసం పోటీ చేసిన ఆజాద్.. ప్రత్యర్థి నల్ల కృష్ణారెడ్డి జిత్తుల కారణంగా ఓడిపోయారు. పెత్తందార్ల అప్రజాస్వామిక వైఖరితో ఎన్నికల ఫలితాలు మారిపోయాయని గ్రహించి.. 1989లో పీపుల్స్‌వార్ బాటపట్టారు. అన్న మార్గంలో నడిచిన గణేశ్ 1992లో అజ్ఞాతంలోకి వెళ్లారు. తర్వాత 1994లో అశోక్ కూడా ఉద్యమంలో చేరారు. గాజర్ల సోదరులు అజ్ఞాతంలోకి వెళ్లక ముందే వారి తల్లిదండ్రులు కన్నుమూశారు. పెద్ద సోదరుడు రాజయ్య అనారోగ్యంతో మృతి చెందగా.. సమ్మయ్య సింగరేణిలో ఉద్యోగం చేసి రిటైరయ్యారు. ఆజాద్ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా, మిలటరీ ప్లాటూన్ కమాండర్‌గా పనిచేశారు. 2008 ఏప్రిల్ 2న ఏటూరునాగారం మండలం కంతనపల్లి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఆయన, ఆయన భార్య రమ మృతిచెందారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆ ఎన్‌కౌంటర్‌పై ఇప్పటికీ న్యాయ విచారణ కొనసాగుతుండడం గమనార్హం. వీరికి వరుసకు సోదరుడయ్యే గాజర్ల నవీన్ కూడా మావోయిస్టు పార్టీలో పనిచేసి నేర్లవాగు ఎన్కౌంటర్లో చనిపోయారు. ఇక దండకారణ్య ప్రత్యేక జోన్ కమిటీ సభ్యుడిగా పనిచేసిన అశోక్.. అనారోగ్యంతో బాధపడుతూ కొద్దినెలల కింద లొంగిపోయారు. గణేశ్ సోమవారం నాటి ఏవోబీ ఎన్కౌంటర్లో కన్నుమూశారు.