breaking news
Penamaluru mandal
-
యువతిపై వృద్ధుడి లైంగిక వేధింపులు
సాక్షి, విజయవాడ : జిల్లాలోని పెనమలూరు మండలం కానూరులో మరో కీచకపర్వం వెలుగులోకి చూసింది. కూతురు వయసున్న ఓ యువతిపై అరవై ఏళ్ల వృద్ధుడు లైంగిక వేధింపులకు దిగాడు. కోరిక తీర్చాలంటూ వెంటబడ్డాడు. వేధింపులు తాళలేక బాధిత యువతి విజయవాడ పోలీసులను ఆశ్రయించింది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితునిపై పలు సెక్షన్లకింద కేసునమోదు చేశారు. వివరాలు.. పెనమలూరు మండలం కానూరుకు చెందిన సుబ్రహ్మణ్యం (60) అదే గ్రామానికి చెందిన బత్తిన హారిక (26)ను లైంగిక కోరిక తీర్చాలంటూ వేధించసాగాడు. గత కొన్ని రోజులుగా ఈ వేధింపులు తీవ్రతరం కావడంతో బాదిత యువతి విజయవాడ పోలీసులను ఆశ్రయించింది. యువతి ఫిర్యాదు మేరకు వృద్ధుడిపై ఐపీసీ 420, 354, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. -
సీఆర్డీఏ దూకుడుకు హైకోర్టు బ్రేక్
పెనమలూరు : మండలంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలో సీఆర్డీఏ దూకుడుకు హైకోర్టు బ్రేకులు వేసింది. పెనమలూరు మండలంలో అక్రమ నిర్మాణాలపై సీఆర్డీఏ కొరడా ఝుళిపించడంతో బిల్డర్లు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో సీఆర్డీఏ అధికారులు, బిల్డర్లకు మధ్య పోరు తారస్థాయికి చేరుకుంది. పెనమలూరు మండలంలో కొన్నేళ్లుగా నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ నేతలు, కొందరు బిల్డర్లకు మధ్య సయోధ్య కుదరకపోవడంతో వివాదం నెలకొందని, ఈ క్రమంలోనే భవనాలను కూల్చివేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రూప్ హౌస్‌లు అక్రమంగా నిర్మించడంపై సీఆర్డీఏ అధికారులు వారం రోజులుగా దాడులు చేస్తున్నారు. మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ వద్దకు ఈ పంచాయితీ వెళ్లింది. అయినా ప్రయోజనం లేకపోయింది. ఇ్పటివరకు దాదాపు 20 అక్రమ కట్టడాల శ్లాబ్‌లకు రంథ్రాలు పెట్టారు. దీంతో యనమలకుదురు, కానూరు గ్రామాలకు చెందిన బిల్డర్లు మూడు, నాలుగు రోజులుగా హైకోర్టుకు వెళ్తున్నారు. తమకు ఇచ్చిన నోటీసులకు అప్పీలుకు సీఆర్డీఏ అవకాశం ఇవ్వటం లేదని తెలిపారు. దీంతో సుమారు 25 మంది బిల్డర్ల భవనాల కూల్చివేతపై కోర్టు స్టే ఇచ్చింది. మరో పది మంది బిల్డర్ల పిటిషన్లు కోర్టు పరిశీలనలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో గురువారం కానూరులో ఒక అక్రమ కట్టడం మాత్రమే కూల్చివేశారు. త్వరలోనే మరింత మంది బిల్డర్లు స్టే తెచ్చుకునే అవకాశం ఉందని, ఈలోపు కూల్చివేత ప్రక్రియను ముగించాలని సీఆర్డీఏ అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. -
అవినీతి కార్యదర్శులపై వేటు
మచిలీపట్నం : పెనమలూరు మండలం యనమలకుదురు పంచాయతీలో పనిచేసి అక్రమాలకు పాల్పడ్డ నలుగురు పంచాయతీ కార్యదర్శులపై సస్పెన్షన్ వేటు పడింది. 18వ తేదీన వీరిని కలెక్టర్ సస్పెండ్ చేశారు. 2011 నుంచి 2014 వరకు మూడేళ్ల పాటు ఈ పంచాయతీలో నలుగురు కార్యదర్శులు పనిచేయగా ఎవరి చిత్తానుసారం వారు వ్యవహరించారు. పంచాయతీ నిధులను స్వాహా చేయడంతో పాటు అక్రమ లేఅవుట్లకు ఇష్టానుసారం అనుమతులిచ్చి కోట్లాది రూపాయలు వెనకేసుకున్నారు. పంచాయతీలో కార్యదర్శులు చేస్తున్న అక్రమాలపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో విచారణకు ఆదేశించిన అధికారులు నలుగురు కార్యదర్శులు అక్రమాలకు పాల్పడ్డారని నిర్ధారణ కావడంతో ఎట్టకేలకు వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ పనిచేసిన ఓ కార్యదర్శి రూ. 28,89,943, మరో కార్యదర్శి రూ. 13,39,120 స్వాహా చేసినట్లు విచారణలో తేలింది. చేసిన తప్పులపై వివరణ ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శులను వివరణ కోరగా వారు ఇచ్చిన సమాచారంపై సంతృప్తి చెందని అధికారులు వారిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. యనమలకుదురు విజయవాడకు సమీపంలో ఉండడంతో భవనాలు, సముదాయాల నిర్మాణానికి ఇబ్బడిముబ్బడిగా అనుమతులిచ్చేశారు. ఈ వ్యవహారంలోనూ ఇరువురు కార్యదర్శులు లక్షలాది రూపాయలు వెనుకేసుకున్నారని విశ్వసనీయ సమాచారం. ఒక్కొక్క కార్యదర్శి పంచాయతీలో చేసిన అక్రమాల వివరాలిలా ఉన్నాయి. తాడిగడపలో పనిచేస్తున్న వి.బ్రహ్మం అనే కార్యదర్శి యనమలకుదురు పంచాయతీ ఇన్చార్జ్ కార్యదర్శిగా 2011 సెప్టెంబరు 6 నుంచి 2013 నవంబరు 17వ తేదీ వరకు రెండు విడతల్లో బాధ్యతలు నిర్వహించారు. ఈ సమయంలో పంచాయతీకి వచ్చిన ఆదాయంలో రూ. 28,89,943 స్వాహా చేశారు. ఎస్.రమేష్ అనే కార్యదర్శి 2012 ఆగ స్టు నుంచి కొన్ని నెలల పాటు రెగ్యులర్ కార్యదర్శిగా పనిచేశారు. ఈయన పనిచేసిన సమయంలో పంచాయతీకి సంబంధించి రూ. 13,39,120 స్వాహా చేసినట్లు విచారణలో అధికారులు తేల్చారు. నగదు స్వాహాతో పాటు ఏడు పనులకు సంబంధించిన ఎం బుక్‌లను మాయం చేసినట్లు విచారణలో అధికారులు నిగ్గు తేల్చారు. ఆర్.శ్రీనివాస్ అనే కార్యదర్శి 2013 జనవరి 24వ తేదీ నుంచి 2014 ఫిబ్రవరి 12వ తేదీ వరకు మరో విడతలో 2014 మే 20వ తేదీ నుంచి 2014 జూన్ 28వ తేదీ వరకు కార్యదర్శిగా పనిచేశారు. ఈయన పనిచేసిన కాలంలో 90 లేఅవుట్లకు ఇష్టానుసారంగా అనుమతులు ఇచ్చేసినట్లు అధికారులు తేల్చారు. ఒక్కొక్క లేఅవుట్‌కు కనీసంగా రూ. 50వేలు చొప్పున వసూలు చేసినట్లు స్థానికులు చెప్పుకుంటున్నారు. రికార్డులు సక్రమంగా నిర్వహించలేదు. ఈ కార్యదర్శి 2014 జూన్ 28వ తేదీన రిలీవ్ కాగా ఒక లేఅవుట్‌కు సంబంధించి 2014 జూలై 10వ తేదీన చలానా కట్టినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. పి.ఉమామహేశ్వరరావు అనే కార్యదర్శి 2014 ఫిబ్రవరి 13వ తేదీ నుంచి 2014 మే 19వ తేదీ వరకు యనమలకుదురు కార్యదర్శిగా పనిచేశారు. ఈయన కన్నా ముందు పనిచేసిన పంచాయతీ కార్యదర్శి నుంచి చార్జ్ తీసుకోలేదు. ఈయనే సొంతంగా కొత్త రిజిష్టర్లు పెట్టి 58 లేఅవుట్లకు అప్రూవల్ ఇచ్చేశారు. ఈ అంశంపైనా విచారణ చేయగా అన్నీ వాస్తవాలని వెల్లడైంది. వి.బ్రహ్మం అనే పంచాయతీ కార్యదర్శి పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట పంచాయతీ కార్యదర్శిగా ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఎస్.రమేష్ కంచికచర్ల మండలం పరిటాల పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆర్.శ్రీనివాస్ పెనమలూరు మండలం గోసాల పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. పి.ఉమామహేశ్వరరావు కలిదిండి మండలం కొండంగి గ్రామపంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. వీరు నలుగురూ చేసిన అవకతవకలపై గతంలో విజయవాడ సబ్-కలెక్టర్‌గా పనిచేసిన డి.హరిచందనతో పాటు విజయవాడ డీఎల్పీవో ఎన్‌ఎస్‌ఎస్‌వి.ప్రసాద్ విచారణ నిర్వహించారు. వీరు చేసిన అక్రమాలు ఇంకా ఉన్నాయని పంచాయతీ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో పాటు పంచాయతీలో ప్రతి ఇంటికి సంబంధించిన లేఅవుట్లు, దానికి సంబంధించిన వివరాలు సేకరించే పనిలో ఉన్నట్లు ఇన్చార్జ్ డీపీవో వరప్రసాదరావు తెలిపారు. నాలుగేళ్ల వ్యవధిలో యనమలకుదురు పంచాయతీలో అనేక అక్రమాలు జరిగాయి. పంచాయతీకి సంబంధించిన నిధులే రూ. 42,29,063 స్వాహా జరిగినట్లు విచారణలో వెల్లడైంది. మరింత లోతుగా విచారణ చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకొచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది.