breaking news
pawn gold
-
బంగారం అమ్మేసుకుంటున్నారు.. ఎందుకో తెలుసా?
వెబ్‌డెస్క్: కరోనా వైరస్ ముందుగా చేతులకు అంటుకుని.. ఆ తర్వాత నోరు, ముక్కు, కళ్ల ద్వారా గొంతులోకి చేరుతుంది. అక్కడ పెరిగి ఊపిరితిత్తుల్లో తిష్ట వేసుకుని ప్రాణాంతకమవుతుంది. కరోనా కష్టాలు కూడా ఇలాగే ఉన్నాయి. ముందుగా ఆప్పులు, ఆ తర్వాత తాకట్టులు, చివరకు ఉన్న ఆస్తులు అమ్మేయడం. తాజా గణాంకాలు ఇదే చెబుతున్నాయి. కరోనా దెబ్బకు భారీ ఎత్తున బంగారం తాకట్టు పెట్టడమో లేదా అమ్ముకోవడమో చేస్తున్నారు భారతీయులు. పొదుపు సొమ్ముతోనే కరోనా మహమ్మారి కట్టడికి 2020లో తొలిసారి లాక్డౌన్ విధించారు. దాదాపు మూడు నెలల పాటు కఠిన ఆంక్షలు కొనసాగాయి. కరోనా భయంతో దాదాపు దేశమంతటా ఈ కఠిన నిబంధనలకు మద్దతుగానే నిలిచారు. ఇళ్లకే పరిమితమయ్యారు. ఆదాయం లేక పోయినా దాచుకున్న సొమ్ముతో, పొదుపు చేసిన మనీతో ఇళ్లు గడిపేశారు. కుదువ బెట్టారు కానీ ఆరు నెలలు తిరగకుండానే కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడింది. ప్రతీ రోజు వేల సంఖ్యలో మరణాలు, లక్షల సంఖ్యలో కేసులు నమోదు అయ్యాయి. మళ్లీ కఠిన ఆంక్షలు తెరపైకి వచ్చాయి. జనజీవనం స్థంభించిపోయింది. రెక్కాడితే కానీ డొక్కాడని సామాన్యులకు, వేతన జీవులపైనా తీవ్ర ప్రభావం చూపింది కరోనా. అయితే ఈసారి ఇళ్లు గడిచేందుకు ఎంతో కష్టపడి కొనుకున్న బంగారం, ముచ్చపటి చేసుకున్న ఆభరణాలే దిక్కయ్యాయి. తాకట్టుతో సరి మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థ గత మూడు నెలలో సుమారు రూ. 404 కోట్ల విలువైన బంగారాన్ని వేలం వేసింది. అంతకుముందు తొమ్మిది నెలల్లో కేవలం రూ. 8 కోట్ల రూపాయల విలువైన బంగారాన్నే ఆ సంస్థ వేలం వేసింది. అంటే కరోనా కష్టాలతో మణపురం దగ్గర తాకట్టు పెట్టిన బంగారం విడిపించుకునే పరిస్థితి సామాన్యులకు లేకపోయింది. అందుకే ఆ సంస్థకే బంగారాన్ని వదిలేశారు. ఇలా నష్టపోయని వారిలో రైతులు, చిరు వ్యాపారులు, రోజువారీ కూలీలు, కార్మికులే ఎక్కువగా ఉన్నారు. భయపెడుతున్న థర్డ్ వేవ్ ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయిన వారిని మరింత భయపెడుతోంది థర్డ్ వేవ్ ముప్పు. మరోసారి దేశంపై కరోనా విజృంభిస్తే బంగారం మీద రుణాలు తీసుకోవడం భారీగా పెరిగే అవకాశం ఉంటుందని లండన్ కు చెందిన మెటల్స్ ఫోకస్ లిమిటెడ్ కన్సల్టెంట్ చిరాగ్ సేఠ్ వెల్లడించారు. ఆర్థిక అవసరాల కోసం పాత బంగారం అమ్మకాలు భారీగా పెరగవచ్చన్నారు. ఈ మొత్తం 215 టన్నులు దాటొచ్చని అంచనా వేశారు. గడిచిన తొమ్మిదేళ్లలో ఇదే అత్యధికమని ఆయన చెబుతున్నారు. 25 శాతం తగ్గాయి కరోనా ఎఫెక్ట్‌తో పాత బంగారం అమ్మకాలు సౌతిండియాలో ఈ సారి 25 శాతం ఎక్కువగా ఉన్నాయని కొచ్చికి చెందిన బంగారం శుద్ధి చేసే సంస్థ సీజీఆర్ మెటల్లాయ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ జేమ్స్ జోష్ అభిప్రాయపడ్డారు. తగ్గిన కొనుగోళ్లు కరోనా మహమ్మారి ప్రభావం వల్ల రెండేళ్లుగా భారతీయులు బంగారం కొనేందుకు ఆసక్తి చూపించడం లేదు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ గణాంకాల ప్రకారం గత ఏడాది అమ్మకాలు రెండు దశాబ్దాల కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. అమ్మకాలు పెరగొచ్చు మరోవైపు ఈ ఏడాది అమ్మకాలు 40 శాతం పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. కరోనా ఎఫెక్ట్‌తో ధరలు తగ్గడం, వివాహాల సీజన్ ఉండడంతో 50 టన్నులకు పైగా బంగారం క్రయవిక్రయాలు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. -
రుణమో..రామచంద్రా
మాఫీపై అయోమయం బ్యాంకు అధికారులకు అందని ఉత్తర్వులు ఖరీఫ్ రుణాలు ఇప్పట్లో ఇచ్చేది లేదంటున్న బ్యాంకర్లు వాయిదా మీరిన పంట రుణాలపై వడ్డీభారం డ్వాక్రా సంఘాలదీ అదే తీరు మచిలీపట్నం : తెలుగుదేశం ప్రభుత్వం సాచివేత ధోరణి రైతుల పాలిట శాపంగా మారింది. పాత రుణాలను రద్దు చేసి కొత్తవాటిని మంజూరు చేస్తారని ఆశపడిన అన్నదాతకు తీరని వేదనే మిగిలింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా పంట రుణాలపై స్పష్టత లేదు. అసలు రుణాలు ఇస్తారా.. లేదా.. అనే విషయం కూడా తేల్చడంలేదు. ఎలాంటి ఉత్తర్వులు రాలేదు జిల్లాలో పంట రుణాలు రూ.2,352 కోట్లు, బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలు రూ.3,276 కోట్లు ఉన్నాయి. ప్రభుత్వం పంట రుణాలను ఒక్కొక్క కుటుంబానికి రూ.1.50 లక్షలు చొప్పున మాఫీ చేస్తామని ప్రకటించింది. ఈ లెక్కన రూ.700 కోట్లు మాత్రమే మాఫీ అయ్యే అవకాశం ఉంది. బంగారం తాకట్టు పెట్టి పంట రుణాలు తీసుకున్న రైతులకు రూ.50వేలు చొప్పున మాఫీ చేస్తామని ప్రకటించింది. ఈ రకం రుణాలు రూ.900 కోట్లు మాఫీ అయ్యే అవకాశం ఉందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం రైతులు తీసుకున్న రుణాలు మాఫీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఇందుకు సంబంధించిన విధివిధానాలు ఇప్పటి వరకు బ్యాంకు అధికారులకు చేరలేదు. గతంలో రుణాలు రీషెడ్యూలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దానికి సంబంధించి కూడా బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నుంచి ఎలాంటి ఉత్తర్వులు అందలేదని ఇక్కడి అధికారులు చెబుతున్నారు. స్పష్టత వచ్చే వరకు రుణాలు ఇచ్చేది లేదు రుణమాఫీ, రీషెడ్యూలుపై అయోమయం నెలకొంది. రిజర్వు బ్యాంకు నుంచి గానీ, తమ బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నుంచి ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు రుణాలు ఇవ్వాలని ఇంకా ఎలాంటి ఉత్తర్వులు అందలేదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. వచ్చే నెల 4, 5 తేదీల్లో ఆయా జిల్లాల లీడ్ బ్యాంకు మేనేజర్లు, చీఫ్ మేనేజర్లతో హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి హాజరయ్యే అవకాశం ఉందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. ఈ సమావేశంలో రుణమాఫీ, పంట రుణాల మంజూరుపై నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగానే పంట రుణాల మంజూరుకు అవకాశం ఉంటుందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. 12.50 నుంచి 14.50 శాతం వరకు వడ్డీ చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా రైతులెవరూ రుణ బకాయిలు చెల్లించలేదు. ఈ ఏడాది జూన్ 30నాటికే పంట రుణాలు వాయిదా మీరాయి. వాయిదా మీరితే 12.50 శాతం నుంచి 14.50 శాతం వరకు వడ్డీ భారం పడుతుందని బ్యాంకు అధికారులు చెబు తున్నారు. ఇప్పటికే తమ రుణాలు వాయిదా మీరాయని ప్రభుత్వం ఎప్పటికి రుణమాఫీ చేస్తుందోనని, వడ్డీ భారాన్ని భరిస్తుందా.. లేదా.. అనేది ప్రశ్నార్థకమే. డ్వాక్రా సంఘాలదీ అదే తీరు జిల్లాలో 56,808 డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. ఆయా సంఘాల్లో 6.24 లక్షల మందికి పైగా సభ్యులు ఉన్నారు. వీరు రూ.938 కోట్ల మేర వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. డ్వాక్రా సంఘాలు తీసుకున్న రుణాలను మాఫీ లేదా రీషెడ్యూలు చేయాలని ఎలాంటి ఉత్తర్వులు అందలేదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. గత మూడు, నాలుగు నెలల నుంచి డ్వాక్రా సభ్యులు రుణాలు చెల్లించటం లేదు. దాదాపు రూ.32 కోట్లు బకాయి పడ్డారు. ఈ నగదుకు రూపాయి వడ్డీ చొప్పున వసూలు చేస్తామని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. నిర్దేశించిన తేదీలోపు రుణం చెల్లించకపోవటంతో డ్వాక్రా సంఘాలు తీసుకున్న రుణంపై కూడా రూపాయి వడ్డీ పడే అవకాశం ఉందని తెలిపారు. ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు రద్దు చేస్తానన్న రూ.లక్ష మొత్తాన్ని వారి ఖాతాలో డిపాజిట్ సొమ్ముగానే పరిగణించే అవకాశం ఉంది. నాలుగు నెలల నుంచి సక్రమంగా రుణం చెల్లించని నేపథ్యంలో అన్ని డ్వాక్రా సంఘాలు రుణమాఫీ జరిగిన అనంతరం ఆరు నెలల పాటు సకాలంలో రుణం చెల్లిస్తేనే వారికి మళ్లీ కొత్తగా రుణం ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయం అటు రైతులకు, ఇటు డ్వాక్రా సంఘాల సభ్యులను ఇబ్బంది పెట్టే విధంగా ఉందని ఆయా వర్గాలవారు పెదవి విరుస్తున్నారు.