breaking news
patan charu
-
మహిళా కానిస్టేబుల్ దారుణ హత్య
సదాశివపేట రూరల్ (సంగారెడ్డి)/రామచంద్రపురం: రాష్ట్ర రాజధాని శివారులో ఓ మహిళా కానిస్టేబుల్ దారుణ హత్యకు గురైంది. ఆమెతో సన్నిహితంగా మెలిగే మరో కానిస్టేబులే ఈ దారుణానికి ఒడిగట్టాడు. అను మానం, ఆర్థికపరమైన గొడవలతో ఏర్పడిన మనస్పర్థలే ఈ హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది. సదాశివపేట సీఐ కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి బుధవారం తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్ మండలంలోని మేకవనంపల్లి గ్రామానికి చెందిన మందరిక (32) సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రపురం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. ఆమెకు సంగారెడ్డి జిల్లాలోని హత్నూర పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేసే ప్రకాశ్‌తో పరిచయం ఉంది. అది కాస్తా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొంతకాలం తర్వాత వారి మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. మందరిక వేరే వ్యక్తితో చనువుగా ఉంటోం దని ప్రకాశ్ అనుమానం పెంచుకొని తరచూ ఆమె పనిచేసే పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి గొడవ పెట్టుకోవడంతో అతనిపై అదే స్టేష న్లో రెండు కేసులు కూడా నమోదయ్యాయి. ఈ క్రమంలో సోమవారం డ్యూటీకి వెళ్లిన మందరిక రాత్రి అయినా ఇంటికి చేరుకోకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు మంగళవారం రామచంద్రాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు... మొదట ప్రకాశ్‌ను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. అలాగే మృతదేహాన్ని తగలబెట్టానని పేర్కొన్నాడు. మొదట మందరికను తన కారులో ఎక్కించుకొని పటాన్చెరు శివార్లలో గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత సదాశివపేట మండల పరిధిలోని వెంకటాపూర్ శివారులోని ఓ పంట కాలువలో పెట్రోల్ పోసి మృతదేహాన్ని తగలబెట్టాడు. మృతదేహం చాలా భాగం వరకు కాలిపోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు. మృతదేహాన్ని తగలబెట్టిన ప్రదేశాన్ని జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డితోపాటు సైబరాబాద్ మియాపూర్ ఏసీపీ రవికుమార్ పరిశీలించారు. సిబ్బందిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కాగా, మందరికతోపాటు పనిచేసిన సిబ్బంది, మహిళా కానిస్టేబుళ్లు ఆమె మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. -
పార్టీ మారను
సంగారెడ్డి మున్సిపాలిటీ న్యూస్‌లైన్: తాను బతికున్నంత వరకూ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని పటాన్చెరు ఎమ్మెల్యే టి. నందీశ్వర్‌గౌడ్ స్పష్టం చేశారు. పార్టీలో తనను అవమానించడం వల్లే బయటకు వెళ్లాలనుకున్నానని తెలిపారు. సోమవారం ఆయన పట్టణంలోని ఇందిరాభవన్ ఆవరణలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. బలహీన వర్గానికి చెందిన తనను రాజకీయంగా అణచివేసేందుకు కుట్ర పన్నారని మండిపడ్డారు. 2009 ఎన్నికల్లో భూపాల్‌రెడ్డి తన తరఫున ప్రచారం చేస్తూనే తెర వెనుక ఓడించేందుకు మహిపాల్‌రెడ్డిని ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దింపారని విమర్శించారు. అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకుని రావాలని భూపాల్‌రెడ్డిని ఆదేశించినా ఆయన పట్టించుకోలేదన్నారు. ఇటీవల అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఏఐసీసీ ప్రతినిధులు వచ్చిన సందర్భంగా నియోజకవర్గం నుంచి టిక్కెట్లు ఆశిస్తున్న వారి జాబితాలో నాలుగు పేర్లు ఇచ్చినప్పటికీ తన పేరు ఇవ్వకుండా వివక్ష చూపారన్నారు. పార్టీల్లో తనను అవమానించడం వల్లే పార్టీ మారాలనుకున్నానని తెలిపారు. ఇందుకోసం కేసీఆర్ తనతో మాట్లాడి టిక్కెట్ ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలిపారు. ఈ విషయం రాహుల్‌గాంధీకి తెలియడంతో ఆయన స్వయంగా తనతో మాట్లాడారని పార్టీలో ఎలాంటి వివక్ష ఉండదని వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కచ్చితంగా అవకాశం ఉంటుందని, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించడంతో తాను టీఅర్ఎస్లో చేరే ఆలోచనను విరమించుకున్నానని వివరించారు. వచ్చే ఎన్నికల్లో తాను పటాన్చెరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగానే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. కలిసి పనిచేస్తే పది సీట్లు ఖాయం.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రనాయకులు కలిసి పనిచేస్తే పదికి పది స్థానాలు సాధించుకుంటామని నందీశ్వర్‌గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలో గ్రూపు రాజకీయాలు ఎక్కువగా ఉన్నందున అభ్యర్థుల గెలుపు సులభం కాదని అందుకు మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ప్రత్యేక చొరవ చూపాలన్నారు. అధిష్టానం ఎవ్వరికి టిక్కెట్ ఇచ్చినా తాను సామాన్య కార్యకర్తగా పనిచేస్తానని తెలిపారు. జిల్లాలో మాజీ మంత్రులు గీతారెడ్డి, సునీతా లకా్ష్మరెడ్డితో పాటు సీనియర్ ఎమ్మెల్యేలు గ్రూపు రాజకీయాలు లేకుండా ఐక్యంగా పనిచేసేందుకు కృషి చేయాలని సూచించారు. పటాన్చెరు నియోజకవర్గంలోని కాంగ్రెస్ తరపున పోటీ చేసే ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులకు తానే పార్టీ బీ ఫారాలను అందజేయనున్నట్లు తెలిపారు. పార్టీకోసం పనిచేసిన వారికే అవకాశం ఇస్తానని నందీశ్వర్‌గౌడ్ స్పష్టం చేశారు.