గవర్నర్ అనుమతితో పీఎస్యూలు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక ప్రభుత్వరంగ సంస్థ(పీఎస్యూ)లను వెంటనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం మౌఖికంగా ఆదేశించింది. ఈ మేరకు ప్రతీ పీఎస్యూ వెంటనే బోర్డు సమావేశం ఏర్పాటు చేసుకుని విభజన తీర్మానం చేసి గవర్నరుకు పంపాలని సూచించింది. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక ప్రభుత్వరంగ సంస్థలను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ కేబినెట్ అనుమతి తప్పనిసరి అని మొదట్లో ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఏర్పడిన తర్వాతే ప్రత్యేకంగా పీఎస్యూలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని భావించింది.
అయితే, గవర్నరుకు ప్రభుత్వానికి ఉన్న అన్ని అధికారాలు ఉన్న నేపథ్యంలో కేవలం ఆయన ఆమోదం సరిపోతుందని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు త్వరలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయనుందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. మే 15 నాటికి అన్ని పీఎస్యూ బోర్డులు విభజన తీర్మానాన్ని ఆమోదిస్తూ గవర్నరు నుంచి అనుమతి తీసుకోవాలని ఈ ఆదేశాల్లో స్పష్టం చేయనున్నారు. గవర్నరు నుంచి అనుమతి లభించిన వెంటనే తెలంగాణ రాష్ట్ర పీఎస్యూను ఏర్పాటు చేస్తూ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ)కు దరఖాస్తు చేసుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వం సూచించినట్టు సమాచారం. ఉదాహరణకు తెలంగాణ ట్రాన్స్కో, తెలంగాణ జెన్కో, తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) మొదలైన పీఎస్యూలను ఏర్పాటు చేయాల్సిఉంది.