breaking news
Pakistan chief justice
-
నన్ను చంపేస్తారు.. భద్రత కల్పించండి: ఇమ్రాన్ ఖాన్
లాహోర్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. ప్రాణ భయం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు భద్రత కల్పించాలంటూ ఆ దేశ చీఫ్ జస్టిస్ బుమర్ అట బండయల్కు ఓ లేఖ రాశారు. పలు కేసుల్లో విచారణ నిమిత్తం కోర్టులకు హాజరయ్యే అవకాశం ఉన్నందున తనకు భద్రత అవసరమంటూ అందులో విజ్ఞప్తి చేశారాయన. నా ప్రభుత్వాన్ని కూలదోసినప్పటి నుంచి పరిస్థితి చాలా దారుణంగా మారింది. నాపై కేసులు నమోదు అవుతున్నాయి. చివరికి.. నన్ను చంపేయత్నం కూడా జరిగింది అని లేఖలో పేర్కొన్నారాయన. తాను దేశ మాజీ ప్రధాని అయినప్పటికీ తగిన భద్రత కల్పించడం లేదని ఇమ్రాన్ ఖాన్.. పాక్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గతంలో తనపై జరిగిన హత్యాయత్నంలో ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్, అంతర్గత వ్యవహారాల మంత్రి ప్రమేయం ఉందని ఆరోపించారు. తనపై మరో హత్యాయత్నం జరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. ఇవాళ్టి వరకు నాపై 74 కేసులు నమోదయ్యాయి. పాకిస్థాన్‌లో అతి పెద్ద రాజకీయ పార్టీకి ఛైర్మన్ నేను. కాబట్టే, నేను ఎక్కడికి వెళ్లినా జనసందోహం ఎక్కువగానే ఉంటుంది. ఇదే అదనుగా నన్నే చంపేందుకు కుట్ర పన్నుతున్నారు. ఇందుకు సంబంధించి స్పష్టమైన సంకేతాలు కూడా అందుతున్నాయి అని లేఖలో పేర్కొన్నారాయన. గతంలో లాహోర్ హైకోర్టుకు వెళ్లినప్పుడు భద్రతా వైఫల్యం తలెత్తిందని ఆయన గుర్తు చేశారు. రాజ్యాంగం ప్రకారం జీవించే హక్కు ప్రాథమిక హక్కు అని, తన ప్రాణాలకు తీవ్రమైన ముప్పు పొంచి ఉందని అన్నారాయన. మరోవైపు తోషాఖానా కేసులో ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా.. ఆదివారం లాహోర్‌లోని ఆయన ఇంటి వద్ద పెద్ద హైడ్రామానే నడిచింది. -
భారత్ చెప్పిందే.. పాక్ చీఫ్ జస్టిస్ చెప్పారు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని భారత్ ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది. అంతర్జాతీయ వేదికలపై ఈ విషయాన్ని ప్రస్తావించింది. పాకిస్థాన్ చీఫ్ జస్టిస్ అన్వర్ జహీర్ జమాలీ కూడా ఇప్పుడు ఇదే మాట చెప్పారు. పాక్‌లోని కొన్ని రాజకీయ పార్టీలు ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో ఇన్నాళ్లూ భారత్ చేస్తున్న వ్యాఖ్యలను సాక్షాత్తూ పాక్ చీఫ్ జస్టిస్ సమర్థించినట్టయ్యింది. ఇస్లామాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత ప్రయోజనాల కోసం కొన్ని రాజకీయ పార్టీలు ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడం దురదృష్టకరమని జమాలీ వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌లో జడ్జిలను, న్యాయవాదులను భయపెట్టేందుకు ఉగ్రవాదులు కోర్టులను లక్ష్యంగా చేసుకున్నారని చెప్పారు. దేశంలో ఉగ్రవాదం పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో స్థిరత్వాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే దేశంలో ఎక్కడా మతవిద్వేషాలకు తావులేకుండా చూడాలని జమాలీ చెప్పారు.