కూటమి కొత్త కుట్రను తిప్పి కొట్టిన కడప మేయర్
సాక్షి, వైయస్సార్ జిల్లా: కడప మేయర్ పదవి దక్కకపోవడంతో కూటమి ప్రభుత్వం కొత్త కుట్రలకు తెర తీసింది. వైఎస్సార్సీపీకి చెందిన నూతన మేయర్ పాకా సురేష్ పేరిట అభ్యంతకర పోస్టర్లను అచ్చేయించింది. అయితే ఈ కుట్రను ఆయన అంతే సమర్థవంతంగా తిప్పికొట్టారు. కడప సిటీలో మేయర్ పాకా సురేష్‌పై కొన్ని పోస్టర్లు వెలిశాయి. కోర్టులో ఉన్న అంశాన్ని వక్రీకరిస్తూ.. పన్ను కట్టలేదంటూ ప్లెక్సీలు వేయించారు టీడీపీ నేతలు. అయితే.. ఈ పరిణామంపై ఇటు వైఎస్సార్సీపీతో పాటు అటు బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. ఓ బీసీ నేత మేయర్ కావడాన్ని ఓర్వలేకపోతున్నారని అంటున్నాయి. ఈ మేరకు ప్లెక్సీలు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాయి. తాజాగా ఈ పోస్టర్ పరిణామాలపై సురేష్ స్పందించారు..‘‘నేను 10 ఏళ్లుగా నేను పన్ను కట్టడం లేదని ఆరోపణలు చేశారు. ఈ కూటమి ఏడీపీ సర్వే చేసి నగరంలో 20వేల ఇళ్లకు పన్నులు భారీగా పెంచారు. దానిపై నేను స్వయంగా పోరాటం చేస్తున్నాను. చట్ట ప్రకారం పన్ను పెంచాలంటే ముందు నోటీసులు ఇవ్వాలి. కానీ కూటమి ప్రభుత్వం అలా చేయకుండా 20వేల మందిపై బాదుడు వేశారు. కార్పొరేషన్ పాలకవర్గం ఈ పెంపుపై తీర్మానం కూడా చేశాం. పన్ను పెంపుపై మా తల్లి కూడా రివిజన్ పిటిషన్ వేశాం. అన్ని అనుమతులు చూపించాం. పన్ను తగ్గిస్తామని కూడా అధికారులు చెప్పారు. రివిజన్ పన్ను కట్టాలని అధికారులు ఇంతవరకు నోటీసులు ఇవ్వలేదు. 20వేల మంది పరిస్థితి ఇలానే ఉంది. కొంతమంది కోర్టుకు కూడా వెళ్లారు.. .. వ్యక్తిగతంగా నాపై కక్షతో ఇలాంటి ప్లెక్సీలు వేసి టైమ్ వెస్ట్ చేసుకుంటున్నారు. నేను మేయర్ కావడాన్ని తట్టుకోలేక ఇలాంటి తప్పుడు చర్యలకు దిగుతున్నారు. మా పార్టీ నేతలు ఏకాభిప్రాయంతో నన్ను మేయర్ గా ఎన్నుకున్నారు. మేయర్ అయిన మొదటి రోజే నాపై కుట్రలు చేస్తున్నారు. నేను మేయర్ కావడం గిట్టని వారు నాపై ప్లెక్సీలు పెట్టారు. మీ వ్యక్తిగత ఎజెండాతో ఇలా ప్లెక్సీలు పెట్టే బదులు నగరంపై దృష్టి పెట్టండి. ప్రజా సమస్యలపై ఎవరు సలహాలు ఇచిన తీసుకుంటాను. అధికార, ప్రతిపక్ష, వామపక్ష పార్టీలు ఏవైనా నగర అభివృద్ధికి సహకరించాలి’’ అని పాకా సురేష్ తనపై జరుగుతున్న ప్రచారాన్ని తిప్పి కొట్టారు.