breaking news
paddy harvest
-
తడిసిన ధాన్యం.. రైతు కళ్లలో దైన్యం
వరి కోతలు ప్రారంభమై నెల దాటింది. రైతులు ధాన్యాన్ని కల్లాల్లో రాశులు పోసి అమ్మేందుకు సిద్ధం చేశారు. గతంలో మాదిరిగా ఈ ఏడు కూడా కల్లం వద్దే మద్దతు ధరకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని ఎదురు చూశారు. అయితే ప్రభుత్వం అడ్రస్ లేకుండా పోయింది. కొనుగోలు కేంద్రాలకు వెళ్తే తేమశాతం పేరుతో అధికారులు ధర తగ్గిస్తున్నారు. ఇదే అదనుగా తీసుకుని దళారులు, మిల్లర్లు.. రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారు. నాలుగు రోజులు ఆగితే పరిస్థితులు మారకపోతాయా, ప్రభుత్వం పట్టించుకోకపోతుందా అని ఆశగా ఎదురుచూస్తున్న రైతన్న మీదికి పులిమీద పుట్రలా ఫెంగల్ తుపాన్ వచ్చిపడింది. రైతు కష్టాలను రెట్టింపు చేసింది. తుపాను వస్తుందని నాలుగు రోజుల ముందే వాతావరణశాఖ హెచ్చరించినా సర్కారు మొద్దు నిద్ర కారణంగా తడిసిన ధాన్యపు రాశుల వద్ద రైతు చేష్టలుడిగి చూస్తున్నాడు. ఇంత పెద్ద ఆపద వస్తే సీఎం కనీసం అధికారులతో సమీక్షించిన పాపానపోలేదు. మంత్రులు ట్వీట్లకు, నాయకులు మాటలకు పరిమితం కావడంతో క్షేత్రస్థాయిలో పరిస్థితి దయనీయంగా మారింది. పరిస్థితులు అంచనావేసి ప్రభుత్వం సకాలంలో స్పందించి ధాన్యం కొనుగోలు చేస్తే ఈ చింత మాకెందుకంటూ రైతన్న గోడు వెళ్లబోసుకుంటున్నాడు. వచ్చిందే అవకాశమనుకుని కళేబరాన్ని పీక్కుతినే రాబందుల్లా దళారులు, నాయకులు ఏకమై రక్తాన్ని పీల్చేస్తుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో రైతన్న కల్లం వద్ద కన్నీరు కారుస్తున్నాడు. రహదారుల పక్కన టార్పాలిన్లపై తడిసిన ధాన్యాన్ని ఆరబోసుకుని ఎప్పుడు కొంటారో, ఎంతకి కొంటారో తెలియక బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తున్నాడు. – సాక్షి నెట్వర్క్ -
ధాన్యం కొనుగోలుకు రెడీ..!
సాక్షి, రాజమహేంద్రవరం: రబీ ముందస్తు వరి కోతలు ప్రారంభమయ్యాయి. అనపర్తి, బిక్కవోలు, రంగంపేట, చాగల్లు, తాళ్లపూడి మండలాల్లో ఊపందుకుంటున్నాయి. మరో పది రోజుల వ్యవధిలో మరికొన్ని ప్రాంతాల్లో వేగం పుంజుకునే ఆవస్యకత ఉంది. రైతు పండించిన ప్రతి గింజా కొనుగోలు చేసి దన్నుగా నిలవాలన్నది ప్రభుత్వ ఆకాంక్ష. అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. దిగుబడి అందే నాటి కంటే ముందుగానే ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి తీసువచ్చేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తోంది. సేకరణకు అవసరమైన ఏర్పాట్లలో తలమునకలైంది. కొనుగోలుకు అవసరమైన గన్నీ బ్యాగులు, యంత్రాలు సిద్ధం చేస్తున్నారు. ఈనెల 15వ తేదీ తర్వాత ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 4.55 లక్షల మెట్రిక్ టన్నులే లక్ష్యం జిల్లా వ్యాప్తంగా రబీ సాధారణ సాగు 83,880 హెక్టార్లు. అత్యధికంగా వరి సాగవుతోంది. వరి సాధారణ సాగు విస్తీర్ణం 56,433 హెక్టార్లు కాగా.. 55,095 హెక్టార్లు సాగై 95 శాతానికి పైగా లక్ష్యాన్ని అధిగమించింది. ఈ ఏడాది 5.25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా. ఇందులో రైతులు, స్థానిక అవసరాలకు మినహాయించగా 4,55,845 మెట్రిక్ టన్నులు కొనుగోలుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. రైతులకు అనుకూలమైన మద్దతు ధర నిర్ణయించింది. సాధారణ రకం బస్తాకు (75 కిలోల బస్తా) రూ.1530, గ్రేడ్–ఏ రకానికి రూ.1545గా నిర్ణయించింది. 233 ఆర్బీకేల్లో.. జిల్లా వ్యాప్తంగా 18 మండలాల్లో 315 ఆర్బీకేలుండగా 233 రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. వాటిని 147 మిల్లులకు అనుసంధానం చేశారు. ఆయా కేంద్రాలకు నియమించిన సాంకేతిక సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. సేకరణకు జిల్లా వ్యాప్తంగా 70 లక్షల గన్నీ బ్యాగుల అవసరం ఉందని, ఏ మండలానికి ఎన్ని కావాలో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నారు. ఆర్బీకేల వద్ద సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఈ–క్రాప్, తేమ శాతం నిబంధనల ప్రకారం ధాన్యం సేకరిస్తారు. అనంతరం మొబైల్ యాప్‌లో రైతులకు కూపన్లు ఇస్తారు. కొనుగోళ్లకు మండల వ్యవసాయ అధికారులు ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరించనున్నారు. గ్రామ వలంటీర్లను సైతం భాగస్వాముల్ని చేస్తున్నారు. ధాన్యం రవాణా చేసే వాహనాలపై నిఘా పెడుతున్నారు. రవాణా చార్జీలు ఎవరికి చెల్లించాలనే విషయమై జాగ్రత్తలు తీసు కుంటున్నారు. ఎకరానికి 53 బస్తాల దిగుబడి రబీ ధాన్యం దిగుబడులు ఆశాజనకంగా ఉంటున్నాయి. ఎకరానికి 52 నుంచి 53 బస్తాల దిగుబడి అందుతోంది. జిల్లాలో అత్యధికంగా ఎంటీయూ–1121 రకం ధాన్యం సేకరించనున్నారు. 3.39 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అందే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు భావిస్తున్నారు. 76,000 మెట్రిక్ టన్నులు బోండాలు, 30 వేల మెట్రిక్ టన్నుల సన్న రకాలు ఉత్పత్తి అయ్యే సూచనలున్నట్లు వెల్లడించారు. ఈ పరిణామం రైతుల్లో ఆనందాన్ని నింపుతోంది. పెట్టుబడులకు పోను లాభాలు గడించవచ్చన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్లుగా దిగుబడులు టాప్.. జిల్లాలో 2021 ఖరీఫ్‌లో 82,695 హెక్టార్లలో వరి సాగు చేపట్టారు. ఎకరానికి (75 కిలోల బస్తా) 28 బస్తాల ధాన్యం దిగుబడి వస్తే.. 2022 ఖరీఫ్‌లో 73,606 హెక్టార్లలో వరి సాగయ్యింది. ఎకరానికి 33 బస్తాల దిగుబడి వచ్చింది. ఏడాది వ్యవధిలో ఎకరం పొలానికి 5 బస్తాలు వృద్ధి చెందింది. 2021 ఖరీఫ్‌లో మొత్తం 4,29,990 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అందితే.. 2022లో 4,52,368 మెట్రిక్ టన్నులు.. అంటే 22,378 మెట్రిక్ టన్నులు అదనంగా దిగుబడి వచ్చింది. గత ఐదేళ్లుగా ఇలాంటి దిగుబడులు ఎప్పుడూ నమోదు కాలేదని వ్యవసాయ శాఖ చెబుతోంది. ఇప్పటికే 2321 హెక్టార్లలో కోతలు పూర్తయినట్లు సమాచారం. ప్రతి గింజా కొంటాం:– రబీలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోలుకు సర్వం సిద్ధం చేశాం. ఇప్పటికే సమావేశం ఏర్పాటు చేసి సేకరణపై అధికారులు, సిబ్బందికి సలహాలు సూచనలు చేశాం. ముందస్తు కోతలు వచ్చే ప్రాంతాల్లో కేంద్రాలు ప్రారంభానికి చర్యలు తీసుకుంటున్నాం. 4.55 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. 233 ఆర్బీకేలు సిద్ధం చేస్తున్నాం. వారం రోజుల తర్వాత కొనుగోళ్లు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. –ఎన్.తేజ్ భరత్, జాయింట్ కలెక్టర్ -
వణికిస్తున్న సూపర్ సైక్లోన్
* వరికోతలు నిలుపుదల * హడావుడిగా కుప్పులు వేసిన రైతులు తెనాలి టౌన్ : బంగాళాఖాతంలో ఏర్పడిన సూపర్ సైక్లోన్‌తో రైతులు వణికిపోతున్నారు. ఏడాది పాటు కష్టపడి పండించి పంట చేతికి వచ్చే తరుణంలో తుపాను వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను దక్షిణాకోస్తాకు వ్యాపించే అవకాశం ఉందని చెప్పడంతో రైతులు కోతలు కోయకుండా నిలుపుదల చేశారు. ఇప్పటికి కోతలు కోసిన రైతులు హడావుడిగా కుప్పలు వేసుకున్నారు. రూరల్ మండలంలో 21, 550 ఎకరాల్లో వరిపైరును రైతులు సాగు చేశారు. ఇప్పటికి 2,500 ఎకరాల్లో వరి కోతలు కోశారు. మూడు రోజుల క్రితం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం(నాడా తుపాను) తీరం దాటడంతో రైతులు ఊపిరి పిల్చుకున్నారు. కానీ మళ్లీ సూపర్ సైక్లోన్ ఉందని తెలియడంతో రైతుల్లో భయం నెలకొంది. చేతికి వచ్చిన పంట దక్కుతుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. సకాలంలో వర్షాలు కురవకపోయిన ఏదో విధంగా పొలాలను సాగుచేసి పంట దక్కించుకునే పరిస్థితి ఉంది. దిగుబడులు కూడా ఆశాజనకంగానే ఉన్నాయి. ఎకరానికి 30 నుంచి 35బస్తాలు దిగుబడులు ఇస్తాయని రైతులు ఆశతో ఉన్నారు. సూపర్ సైక్లోన్ తీరం దాటిపోవాలని రైతులు కోరుకుంటున్నారు. కోతలు కోయకుండా ఆపేశాం.. పది ఎకరాల్లో వరిసాగు చేస్తున్నా. పంట కోసే దశకు వచ్చింది. సూపర్ సైక్లోన్ ఉందని తెలియడంతో వరి కోతలు కోయకుండా ఆపేశాం. పైరు కోయకపోతే గింజలు రాలిపోయే ప్రమాదం ఉంది. కోతలు కోయాలంటే భయంగా ఉంది. తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖాధికారులు తెలియజేయడంతో ఈ నెల 8వ తేదీ వరకు కోతలు కోసే పరిస్థితి లేదు. – మోర వెంకటేశ్వరరెడ్డి, రైతు, కొలకలూరు