ఏఎస్పీగా మధుమోహన్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ
సంగారెడ్డి క్రైం, న్యూస్‌లైన్ : జిల్లా అదనపు ఎస్పీగా ఆర్ మధుమోహన్‌రెడ్డి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్ సీఐడీ విభాగంలో ఏఎస్పీగా పనిచేసిన మధుమోహన్‌రెడ్డి ఇటీవల జిల్లాకు బదిలీ అయిన విషయం తెలిసిందే. శుక్రవారం ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లా పోలీసు కార్యాలయంలోని డీఎస్బీ, డీసీఆర్బీ, డీపీఓ, ఏఆర్ హెడ్‌క్వార్టర్స్, కంట్రోల్ రూమ్ శాఖల అధికారులతో మాట్లాడారు. జిల్లాలో పోలీసుల పని తీరు గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఏఎస్పీ మధుమోహన్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో నేరాల అదుపునకు చేపట్టాల్సిన చర్యలతో పాటు ట్రాఫిక్ సమస్యపై దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. ప్రజలు ఏమైనా సమస్యలు ఎదుర్కొంటే తనకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని ఆయన సూచించారు. సమస్యలు విన్నవించిన వెంటనే వాటి పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటానని మధుమోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు.
ఏఎస్పీని కలిసిన సిరిబాబు
అదనపు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఆర్ మధుమోహన్‌రెడ్డిని శుక్రవారం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సిరిబాబు కలిసి అభినందనలు తెలియజేశారు. పుష్పగుచ్చం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో నేరాల సంఖ్య పెరిగిందని, వాటిని అరికట్టేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.