breaking news
north america telugu association
-
NATA Convention 2023: ప్రత్యేక ఆకర్షణగా నాటా విమెన్ ఫోరమ్
ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) డాలస్ లో నిర్వహించిన నాటా కన్వెన్షన్ 2023లో ఎన్నో విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. వాటిల్లో నాటా విమెన్ ఫోరమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్వాతి సానపురెడ్డి, నాటా మహిళా ఫోరం ఛైర్పర్సన్ సభను ఉద్దేశించి స్వాగత ఉపన్యాసంలో తెలుగు మహిళలు చేసిన పనులు స్ఫూర్తిదాయకం అన్నారు. ఏ ఏ అంశాలు? గృహహింస, మహిళా ఆరోగ్యం, స్థానిక రాజకీయాల్లో మహిళల పాత్ర, లైంగిక వేధింపులు, హాలీవుడ్ సినిమాలో నటించడం వంటి అంశాలపై చర్చలు జరిగాయి. నాటా మహిళా ఫోరం సలహాదారులు కృష్ణవేణి రెడ్డి, లక్ష్మి అన్నపూర్ణ పాలేటి ఆధ్వర్యంలో కార్యక్రమాలు వినూత్నంగా రూపొందించారు. ఇందులో పాల్గొన్న వారు, నిర్వాహకులు, సమన్వయ కర్తలు అందరూ మహిళలే అవడం, "మా అందరిదీ ఒకే మాట ఒకే బాట" అంటూ ఉత్సాహంగా పాల్గొనడం విశేషం. ఉమాభారతి కోసూరి (నృత్య సాహిత్య కళా భారతి) మధురమైన వాక్ చాతుర్యంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మనీ శాస్త్రి (అమేరికోకిలా) మధురమైన గళముతో పాడి వినిపించారు. మహిళా పరివర్తన - దశాబ్దాలుగా 'స్త్రీ' ఎదుగుదల - సంగీత సాహిత్య దృశ్య కథనం విభాగంగా అతివల గురించి అందమైన శ్రవణ దృశ్యాలతో పాటు చక్కని మాటలతో పాటలతో మనసుకు హత్తుకునేలా చేశారు. మహిళా విశిష్టత మహిళా ప్రతిభ - చరిత్రలో తెలుగింటి ఆడపడుచులతో ముఖాముఖి అనే కార్యక్రమంలో ఆడపడుచుల అనుభవాలను, అనుభూతులను, కష్టాలను, ఎదుగుదల, ఈ స్థాయికి ఎలా వచ్చారో ప్రేక్షకులతో పంచుకునే అవకాశం కల్పించారు అమల దుగ్గిరాల (EVP ఎంట్రప్రెస్స్ CIO at USAA ), ఉమా దేవిరెడ్డి (TEDx Leadership Coach),, ప్రేమ రొద్దం (Corporate & Business Immigration Attorney ) స్పూర్తిదాయకమైన స్త్రీలు వారి జీవితంలో ఎన్నుకున్న వృత్తి ఎంతవరకు వారు న్యాయం చేశారో చేస్తున్నారో చర్చించారు. అమ్మ నుండి అంతరిక్ష మహిళ వరకు “మహిళలు తమ జీవన విధానంలో అలవర్చుకోవాల్సిన సంస్కరణలు, మహిళా సాధికారతకు తమవంతుగా మహిళలు తాము వున్నాం అని తెలపడం జరిగింది. అమ్మ నుండి అంతరిక్షం వరకు వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్న మహిళలు.. ఎందులోనూ తీసిపోరు అన్నట్లు వసంత లక్ష్మి అయ్యగారితో నిర్వహించిన మహిళా మిమిక్రీ కార్యక్రమం అత్యంత జనరంజకంగా సాగింది. ఇన్నాళ్లు మగవాళ్ళు మాత్రమే చేయగలరు అనుకున్న ఈ మిమిక్రీ కళను అత్యంత సమర్థతతో నిర్వహించి కడుపుబ్బా నవ్వించారు. మరికాస్త హాస్యం కోసం ‘టాక్ ఆఫ్ ది టౌన్ 'లో సజితా తిరుమలశెట్టి , కవిత రాణి కోటి ప్రేక్షకులకు వీనుల విందు చేశారు. మనీ శాస్త్రి వారి మధురమైన గళముతో పాడి వినిపించారు, ఉమాభారతి కోసూరి వ్యాఖ్యాతగా (నరేషన్) సంగీత సాహిత్య సమ్మోహనం - మాన్యుల మన్నన మనల్ని అలరించే ఓ అద్భుతమైన దృశ్యం. ముఖ్య అతిధులుగా వాసిరెడ్డి పద్మ, ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ విమెన్ కమిషన్ చైర్ పర్సన్ మరియు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఛైర్ పర్సన్ అఫ్ TTD LAC in ఢిల్లీ ఉమెన్స్ ఫోరమ్.. మహిళలందరిని ప్రశంసించారు. ఇక్కడి మహిళలు తమ వృత్తిని, తెలుగు సంస్కృతిని అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. అనేక జనరంజక కార్యక్రమాలలో 35 సంవత్సరాల అనుభవం ఉన్న కూచిపూడి నృత్య కళాకారిణి పద్మ శొంఠి నృత్య కార్యక్రమం, మహిళా రక్షణ గురించి వివేక్ తేజ చెరుపల్లి ప్రసంగం తో పాటుగా మహిళలు తనకు తానుగా రక్షణ, భద్రత ఉపాయాలు మెళకువలు తెలిపారు. వైష్ణవి రామరాజు 'సొగసు చూడతరమా' అంటూ మన భారతదేశంలో ఉన్న వివిధ ప్రాంతాల్లో వేసుకునే మహిళల వస్త్రధారణ తీరులను ప్రదర్శన చేయడం ఈ కార్యక్రమానికి హైలైట్ అయింది. అరుణ సుబ్బారావు (పేరడీ క్వీన్, ఫోక్ సింగర్)- తన పేరడీ తో పాటు కొన్ని ఫోక్ పాటలు కూడా పాడి వినిపించడం ద్వారా ప్రేక్షకులు ఎంతో ఆనందించారు. మహిళ ప్రతిభ మహిళా సాధికారత” (Women Empowerment) విభాగంలో మన తెలుగింటి ఆడపడుచులు పల్లవి శాస్త్రి (Hollywood Producer & Actress) వారి మూవీ "LAND GOLD" (Brilliant Film on Faith Family & Culture in America) కీర్తన శాస్త్రి, Hollywood Producer & Casting Director) మరియు అపూర్వ గురుచరణ్ (Los Angels based Indian Producer) మూవీ "JOYLAND " వారిని 'మహిళా ప్రతిభ' పురస్కారాలతో సత్కరించారు. ఈ కార్యక్రమాలలో వేటికవే గొప్ప ప్రదర్శనలు అయినప్పటికీ 'పురాతన సంప్రదాయ చీరల ప్రదర్శన' మాత్రం సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. 1930 నుండి 1990 వరకు ఎప్పుడు ఎక్కడ ఎవరు చూడని చీరల ప్రదర్శన, ఒక్కటి కాదు రెండు కాదు దాదాపు 40 చీరలు పైగా ఈ ప్రదర్శనలో చూడటం జరిగింది. ఆ కాలంలో వాడిన కాంచీపురం, ధర్మవరం, ఆరణి, వేంకటగిరి, మంగళగిరి, పైతాని, బనారస్, షికార్గ్, కశ్మీరీ పట్టు చీరలు , ఈ కాలంలో దొరకని అపురూప చీర సంపదలను ప్రదర్శించి, ఆహూతులను అచ్చెరువొందేలా చేశారు. ఈ చీరలను చూసి తమ అమ్మమ్మ, నానమ్మ దగ్గర చూసిన చీరలు అని అందరూ తమ గత జ్ఞాపకాల్లోకి జారుకుని, ఆనందానుభూతులకు లోనయ్యారు. సంధ్య పుచ్చలపల్లి (ఫౌండర్ అఫ్ ఆర్తి హోమ్) చీరలు మగ్గం మీద నేయడం ఒకొక్కటిగా వివరించి, నేత కార్మికులకు కృతజ్ఞతలు తెలపడం, చీర యొక్క పుట్టుపూర్వోత్తరాలు వివరించడం విశేషం. ఆఖరున కృష్ణవేణి రెడ్డి శీలం, NATA ఉమెన్స్ ఫోరమ్ Advisor కార్యక్రమంలో పాల్గొన్న అతిధులకు, అభిమానులకు, NATA ప్రెసిడెంట్ శ్రీ కొర్సపాటి శ్రీధర్ గారికి మరియు వారి కార్యవర్గానికి NATA ఉమెన్స్ కార్యవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం నభూతో న భవిష్యతి అన్న రీతిలో మహిళల ప్రాధాన్యత, వారి గొప్పతనం ప్రపంచానికి తెలిసేలా చేయడమే లక్ష్యంగా చేసిన ఈ ప్రయత్నం అంచనాలను మించి విజయవంతం అయిందని, దీనికి తోడ్పాటు అందించిన వారిందరికి నాటా మీడియా అడ్వైజర్ కోటిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. -
విదేశాల్లో ఉన్న తెలుగువారు ఐక్యత చాటడం సంతోషంగా ఉంది :సీఎం జగన్
-
NATA Convention 2023: మీ ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను.. సీఎం జగన్
అమెరికాలోని డాల్లస్‌లో జరుగుతున్న నాటా తెలుగు మహా సభలనుద్దేశించి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వీడియో త్వారా తన సందేశం ఇచ్చారు. ముఖ్యమంత్రి సందేశాన్ని నాటా సభల్లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. 2023 నాటా కన్వెన్షన్‌కు హాజరైన ప్రతి ఒక్కరికీ బెస్ట్ విషెస్ తెలియజేశారు. నాటా కార్యవర్గానికి ముఖ్యంగా శ్రీధర్, అనిల్, ప్రేమసాగర్తో పాటు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. నాలుగేళ్ళ కిందట తాను డాల్లస్ వచ్చిన సందర్భం ఇప్పటికీ గుర్తుందన్నారు. మీరంతా నా మీద చూపించిన ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాం ‘వేరే దేశంలో ఉన్నా, ఇంత మంది తెలుగువారు. గొప్పవైన మన సంస్కృతి, సాంప్రదాయాల్ని కాపాడుకుంటూ చక్కటి ఐకమత్యాన్ని చాటటం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. మిమ్నల్ని అందరినీ ఒకసారి తల్చుకుంటే.. అక్కడ పెద్ద, పెద్ద కంపెనీలలో సీఈఓలుగా ఐటీ నిపుణులుగా, నాసా వంటి సంస్ధల్లో కూడా సైంటిస్టులగానూ, అనేక విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లుగా, అమెరికా ప్రభుత్వంలో కూడా ఉద్యోగులుగా, బిజినెస్‌మెన్‌గా, మంచి డాక్టర్లుగా రాణిస్తున్న తీరుకు మిమ్నల్ని చూసి మేమంతా ఇక్కడ గర్వపడుతున్నాం. మీలో అనేకమంది మూలాలు.. మన గ్రామాల్లోనే కాకుండా మన మట్టిలో ఉన్నాయి. మీలో అనేకమంది పేద, మధ్యతరగతి కుటుంబాల్లో నుంచి వచ్చినా.. అక్కడకి వెళ్లి ఇలా రాణించడానికి.. మీ కఠోరమైన కమిట్మెంట్, ఫోకస్ ఈ రెండూ మిమ్మల్ని ఆ గడ్డ మీద నిలబెట్టాయి. నిజంగా మిమ్నల్ని చూసినప్పుడు ఆ స్ఫూర్తి మాలో ప్రతి ఒక్కరికీ వస్తుంది. అలాం కమిట్మెంట్, ఫోకస్ మన రాష్ట్రంలోని మన పిల్లల్లో ఎంతగానో ఉండటం నేను నా కళ్లారా చూశాను. ఆకాశమే హద్దుగా.. ఆకాశాన్ని దాటి వెళ్లాలన్న కోరికతో ఉన్న వారు ఎదగాలంటే, అందుకు వారికి కావాల్సిన సదుపాయాలు కల్పించాలన్న తపనతో ఈ నాలుగు సంవత్సరాల కాలంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తేగలిగాం. చదువే సాధనం గ్లోబల్ సిటిజన్‌గా మనం ఎదగాలంటే.. చదువన్నది ఒక పెద్ద అవసరమైన సాధనం. అందుకనే రాష్ట్రంలో విద్యారంగంలో తెచ్చిన విప్లవాత్మ మార్పులు గమనించినట్లైతే.. మన గవర్నమెంట్ బడులన్నీ కూడా పూర్తిగా రూపురేఖలు మారుతున్నాయి. నాడు-నేడు అనే గొప్ప కార్యక్రమం చేస్తున్నాం. స్కూళ్లలో ఉన్న మౌలికసదుపాయాల రూపురేఖలన్నీ మారుస్తున్నాం. 8వ తరగతిలోకి రాగానే మన ప్రభుత్వ బడిలో చదువుతున్న పిల్లలకు.. ట్యాబ్‌లు ఇస్తున్నాం. 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్లను నియమించాం. 6వ తరగతి నుంచి ప్రతి తరగతిలోనూ డిజిటల్ విద్యను అందించేలా ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ ఏర్పాటు చేస్తున్నాం. 6వతరగతి ఆపైన అన్ని తరగతి గదుల్లోనూ ఈ డిసెంబరు నాటికి ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్స్ ఏర్పాటు పూర్తి అవుతుంది. ప్రభుత్వ బడుల్లోనే 3వ తరగతి నుంచే టోఫెల్లో శిక్షణ ఇచ్చేందుకు ఈటీఎస్ ప్రిన్స్టన్తో ఒప్పందం చేసుకున్నాం. 3వతరగతి నుంచే టోఫెల్ ప్రైమరీ, టోఫెల్ జూనియర్ ఇలా పదోతరగతి వరకూ శిక్షణ ఇస్తారు. ఇంటర్మీడియట్లో టోఫెల్ సీనియర్‌ను కూడా వచ్చే సంవత్సరం ప్రవేశపెట్టబోతున్నాం. విద్యావ్యవస్థలో మార్పులు అమ్మ ఒడి, గోరుముద్ద, విద్యా కానుక, ఉన్నత విద్యలో అయితే విద్యా దీవెన, వసతి దీవెన లాంటి పథకాలన్నీ కూడా ఏపీలో గొప్పగా అమలు చేస్తున్నాం. ఇవన్నీ చదువుకుంటున్న పిల్లల కోసం విద్యావ్యవస్ధలో తెస్తున్న మార్పులు. చదువు అనే ఒక ఆయుధం ఎంత అవసరమో చెప్పడానికే ఇవన్నీ ఇంతగా చెప్పాల్సి వస్తుంది. దీని గురించి సుదీర్ఘంగా వివరించే సమయం లేకపోయినా.. మన రాష్ట్రంలో మన తర్వాత తరం గురించి ఎంత చిత్తశుద్ధితో ఆలోచనలు చేస్తున్నామో మీ అందరికీ క్లుప్తంగా వివరించగలిగాను. విద్యారంగం ఒక్కటే కాదు... ఏ రంగాన్ని తీసుకున్నా ఇలాంటి మార్పులే కనిపిస్తాయి. మీ గ్రామంలో ఎప్పడూ చూడని విధంగా విలేజ్ సెక్రెటేరియట్ మీ కళ్లెదుటనే కనిపిస్తుంది. అందులో దాదాపు 10 మంది పిల్లలు మన ఊరికి సంబంధించిన సేవలు అందిస్తూ కనిపిస్తున్నారు. బర్త్ సర్టిఫికెట్ నుంచి దాదాపు 600 రకాల సేవలు ప్రతి 2000 మందికి ఒకటి చొప్పున గ్రామ సచివాలయాలు తీసుకొని వచ్చి వాటి ద్వారా మన గ్రామంలోనే సేవలందుతున్న గొప్ప పరిస్థితి ఉంది. మన గ్రామంలోనే ప్రతి 50 నుంచి 100 ఇళ్లకు ఒక వాలంటీర్.. పౌర సేవల్ని ఇంటింటికీ డోర్ డెలివరీ చేస్తున్నాడు. పెన్షన్, రేషన్.. అన్నీ మన ఇంటి ముంగటికే వచ్చే గొప్ప వాతావరణం మన రాష్ట్రంలో కనిపిస్తుంది. ప్రతి గ్రామంలోనూ రైతు భరోసా కేంద్రం ఇవాళ ప్రతి గ్రామంలోనూ ఒక రైతు భరోసా కేంద్రం కనిపిస్తోంది. పంట విత్తనం నుంచి పంట అమ్మకం వరకూ ప్రతి రైతును చేయిపట్టుకుని నడిపిస్తున్న గొప్ప వ్యవస్ధ మన గ్రామంలోనే కనిపిస్తుంది. ఇంకా నాలుగు అడుగులు వేస్తే మన గ్రామంలోనే విలేజ్ క్లినిక్‌లు కనిపిస్తాయి. మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ మీద ఇంత ధ్యాస పెట్టిన పరిస్థితి బహుశా ఎప్పడూ చూసి ఉండరు. బీపీ, షుగర్ వంటి ఎన్సీడీ డిసీజస్ పెద్ద పెద్ద రోగాలకు ఇవే కారణాలుగా కనిపిస్తున్నాయి. సరైన టైంలో ట్రీట్మెంట్ చేయలేకపోతే బ్లడ్ ప్రెజర్ కార్డియాక్ అరెస్టుకు, షుగర్ కిడ్నీ వ్యాధులకు దారితీస్తాయి. రాబోయే రోజుల్లో మెడికల్ బిల్స్‌ను కట్టడి చేయాలంటే.. ప్రివెంటివ్ కేర్ అన్నది చాలా ప్రాముఖ్యమున్న అంశం. ఇవాళ ప్రివెంటివ్ కేర్‌లో ఎక్కడా చూడని విధంగా మన గ్రామంలోనే అడుగులు కనిపిస్తున్నాయి. ప్రతి గ్రామంలోనూ ఒక విలేజ్ క్లినిక్.. దానికి అనుసంధానంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెఫ్ట్‌ను తీసుకునివచ్చాం. ఎప్పుడూ చూడని విధంగా టెర్షిరీ కేర్‌లో 17 కొత్త మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం. ఒక్క వైద్య రంగంలోనే 48వేల పోస్టులను భర్తీ చేశాం. నాడు నేడుతో ప్రతి ఆసుపత్రిని.. విలేజ్ క్లినిక్ నుంచి మొదలుకుని పీహె చ్‌సీలు, సీహెచ్‌లు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, బోధనాసుపత్రులన్నింటిలోనూ నాడు నేడు ద్వారా రూపురేఖలు మార్చే కార్యక్రమం కనిపిస్తోంది. ప్రతి గామంలోనూ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ప్రతి గ్రామంలోనూ మరో నాలుగు అడుగులు వేస్తే ఇంగ్లీష్‌మీడియం బడులు కనిపిస్తాయి. బైలింగువల్ టెక్ట్స్‌బుక్స్‌ను మన స్కూలు పిల్లలు చదువుతున్నారు. ఇంగ్లీష్అన్నది ప్రపంచంలో విజ్ఞానాన్ని మనం నేర్చుకునేందుకు, చదువుకునేందుకు ఉపయోగపడే ఒక గొప్ప మీడియం. గ్లోబల్ సిటిజన్‌గా మన పిల్లలు ఎదగటానికి ఇంగ్లీష్ ఒక సాధనం. ఏది కావాలన్నా.. సైన్సెస్‌లో ఏది చదువుకోవాలన్నా, ఆర్ట్స్‌లో ఏది చదువుకోవాలన్నా, ఇంజనీరింగ్‌లో ఏది చదువుకోవాలన్నా.. చివరికి పిల్లలు తమకు తాముగా ఏ సబ్జెక్ మీద అయినా అవగాహన పెంచుకోవాలన్నా.. ముందు వారికి ఇంగ్లీష్ మీద పూర్తిస్ధాయిలో పట్టు రావాలి. వారికి కావాల్సినంత కంటెంట్ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సంస్థలు మనకు ఇంటర్నెట్లో అందుబాటులోకి తీసుకువచ్చాయి. అది కూడా ఉచితంగా తీసుకొచ్చాయి. మన ఫోన్లోనే ఇవన్నీ అందుబాటులో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇవన్నీ సాధ్యం కావాలంటే.. అది కేవలం ఇంగ్లిష్ ద్వారా మాత్రమే వీలవుతుంది. కాబట్టే, ప్రపంచంలోకి వెళ్ళేందుకు కావాల్సిన ఇంగ్లీష్ భాష పునాదిని మనం గట్టి పరుస్తున్నాం. మీ అందరితో పంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే.. నేడు ఏపీలో పరిస్థితి ఎలా ఉందో గమనిస్తే.. రాష్ట్రంలో కనీవినీ మార్పులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో రూరల్ ఎకానమీ సస్టైనబులిటీని పరిశీలిస్తే.. ప్రతి ఒక్కరూ కూడా కన్జూమెన్స్ అయిపోయే పరిస్థితుల్లోకి వెళ్లిపోతే.. రేపు ఉత్పత్తిదారులగా ఎవరూ ఉండని పరిస్థితి కనిపిస్తుంది. రూరల్ ఎకానమీని ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే.. వినియోగం పెరిగిపోయి, ఉత్పత్తి చేసేవాళ్లు ఎవరూ లేకుండా పోతారు. దీనివల్ల ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతుంది. అలా జరిగితే మనం ఆహార ధాన్యాలను బయట దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. బయట దేశాల నుంచి ఎప్పుడైతే దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందో అప్పుడే ద్రవ్యోల్బణాన్ని కూడా దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆహార ధాన్యాలను పండించిన తర్వాత మనం వాటిని లాభాలకే అమ్ముతాం. ఆ తర్వాత ఏ దేశమైనా వాటిని దిగుమతి చేసుకోవాలంటే.. వాటి మీద లాజిస్టిక్స్ కాస్ట్ కూడా ఉంటుంది. దాని తర్వాత వాళ్లు మరలా రీటైల్ మార్జిన్స్, డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ పెట్టుకుంటారు. అన్నీ కలుపుకుంటే.. ఏ దేశమైనా ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకోవడం మొదలుపెడితే.. ద్రవ్యోల్బణాన్ని కూడా దిగుమతి చేసుకున్నట్టే. అలాంటి పరిస్థితికి అడ్డుకట్ట వేయాలంటే రూరల్ ఎకానమీ బలపడాలి. అలా జరగాలంటే ప్రతి గ్రామంలోనూ నివసిస్తున్న వాళ్ల ఆకాంక్షలను నెరవేర్చాలి. విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఈ రోజు రాష్ట్రంలో మనం చేస్తున్న ఈ పనులన్నీ రాబోయే రోజుల్లో ఒక దిక్సూచి అవుతాయి. మనం వాళ్ల ప్రతి ఆకాంక్షను చేరుకోగలగుతాం. తల్లిదండ్రులు తమ పిల్లలను గొప్పగా చదివించాలనుకుంటారు. చదువుకుంటున్న పిల్లలకు ఇంగ్లీష్ రావాలని, ఇంగ్లీష్ మీడియం బడులు కావాలని కోరుకుంటారు. ఇప్పుడు గ్రామాల్లో ఇంగ్లీష్ మీడియం బడులు అందుబాటులో ఉన్నాయి. అదే విధంగా ఆ గ్రామంలో ఉన్నవాళ్లకు విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెఫ్ట్ ఈ రెండింటినీ కూడా అందుబాటులోకి తీసుకుని వచ్చాం. ఇవి కాక వ్యవసాయరంగంలో ప్రిసిసెన్ అగ్రికల్చర్ అన్నది రాబోయే రోజుల్లో, రాబోయే తరంలో గొప్ప మార్పు. దీనికి బీజం మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలోనే ఆర్బీకేల ద్వారా గ్రామస్ధాయిలో పడింది. ఇవన్నీ గమనిస్తే.. రాబోయే రోజుల్లో అన్లిమిటెడ్ బ్యాండ్ విడ్త్‌తో ఇంటర్నెట్ కనెక్టివిటీ ప్రతి గ్రామంలోకి వస్తుంది. అక్కడే డిజిటల్ లైబ్రరీ కూడా వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామస్థాయిలో మన కళ్లెదుటనే జరుగుతున్న గొప్ప మార్పులివి. ఇవే కాకుండా మౌలిక వసతుల మీద రాష్ట్రంలో నాలుగు సంవత్సరాలుగా జరుగుతున్న పురోగతిని కూడా గమనించినట్లయితే... పోర్టులు, హార్బర్లు, ఎయిర్‌పోర్టులు మౌలిక వసతులు, ఇండస్ట్రియల్ కారిడార్లు ఇవన్నీ ఎప్పుడూ జరగని విధంగా అడుగులు పడుతున్నాయి. మరో 4 పోర్టుల నిర్మాణం స్వాతంత్య్రం వచ్చిన 75 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో మనకు 6 పోర్టులు నాలుగు లొకేషన్స్‌లో ఉంటే.. ఇప్పుడు మరో 4 పోర్టులు వేగంగా నిర్మాణం అవుతున్నాయి. 10 పిషింగ్ హార్బర్ల నిర్మాణమూ వేగంగా జరుగుతుంది. తీరప్రాంతంలో ప్రతి 50 కిలోమీటర్లకూ ఒక పోర్ట్ లేదా ఫిషింగ్ హార్భర్‌లో ఏదో ఒక నిర్మాణం జరుగుతుంది. ఇప్పటికే కర్నూలులో విమానాశ్రయం ప్రారంభమయింది. విశాఖపట్టణం, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా శంకుస్ధాపన చేసుకున్నాం. ఆ పనులు పనులు వేగంగా జరుగుతున్నాయి.ఎప్పుడూ రాష్ట్రంలో జరగని విధంగా.. ఇవాల దేశంలో 11 ఇండస్ట్రియల్ కారిడార్లు పనులు జరుగుతుంటే.. అందులో 3 ఇండస్ట్రియల్ కారిడార్లు పనులు మన రాష్ట్రంలో జరుగుతున్నాయి. టెర్షరీ కేర్‌కు మెడికల్ కాలేజీలు మనకు చాలా అవసరం. మెడికల్ కాలేజీ వస్తే.. పీజీ స్టూడెంట్స్ వస్తారు. అప్పుడే టెర్షరీ కేర్‌లో మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులు కూడా తయారవుతాయి. అలాంటిది మనకు స్వాతంత్య్రం వచ్చిన తరవాత ఇప్పటి వరకు కేవలం 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉంటే ఈ రోజు మరో 17 మెడికల్ కాలేజీ పనులు నిర్మాణ పనులు మన కళ్లెదుటనే వేగంగా జరుగుతున్నాయి. మూడేళ్లుగా తొలిస్థానంలో ఏపీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో వరసగా మూడు సంవత్సరాలు నుంచి దేశంలోనే మొదటి స్ధానంలో ఆంధ్రరాష్ట్రమే కనిపిస్తోంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్‌లో కూడా రాష్ట్రం ఇవాళ టాప్ 4,5 స్ధానాల్లో కనిపిస్తుంది. మన గడ్డ మీద మనందరి ప్రభుతం విద్య, వైద్యం, వ్యవసాయం, ఇళ్ళ నిర్మాణం, రాబోయే తరం పిల్లల అభివృద్ధి, మహిళా సంక్షేమం, వృద్ధులు–వితంతువులు–దివ్యాంగుల సంక్షేమం, సామాజిక న్యాయం, లంచాలకు తావులేకుండా, వివక్షకు చోటు లేకుంగా జరుగుతున్న పరిపాలనా సంస్కరణల పరంగా చూసినా, వికేంద్రీకరణపరంగా చూసినా, పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక సదుపాయాలు పరంగా.. ఇలా ప్రతి ఒక్క విషయంలో దేశంలోనే ఒక గొప్ప మార్పు.. ఆంధ్రరాష్ట్రంలో జరుగుతుందన్న సంకేతాలు ఇవ్వగలుగుతున్నాం. మీ అందరికీ ఒక్కటే విజ్ఞప్తి ఇవన్నీ ఎందుకు నేను ఇంతగా చెప్పాల్సి వస్తుందంటే కారణం.. అక్కడ ఉన్న మీ సహాయ, సహకారాలు కూడా ఎంతో అవసరం అని చెప్పడానికే ఇవన్నీ మీ దృష్టికి తీసుకువస్తున్నాను. చివరిగా మీ అందరికీ ఒక్కటే విజ్ఞప్తి. అక్కడ మీరు ఎంతగానో ఎదిగారు. ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్, ఎక్స్పోజర్ మీకు ఉంది. ఆంధ్రరాష్ట్రానికి మీరు ఏ రకంగా ఉపయోగపడగలిగితే ఆ రకంగా ఉపయోపడండి. ఆర్ధికంగా అన్న మాటలు కాస్తా కూస్తో.. ఉపయోగకరంగా ఉంటాయి కానీ దాన్ని పక్కనపెడితే.. అంతకంటే ఎక్కువగా మీ అనుభవం అవసరం. ఇప్పటికే అభివృద్ది చెందిన వెస్ట్రన్ వరల్డ్‌లో మీరు ఇన్నేళ్లు అక్కడ ఉన్నారు కాబట్టి మీ అనుభవం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అవన్నీ కూడా మీరు ఇంకా ఎక్కువగా ఏపీ మీద, మన గ్రామాల మీద ధ్యాస పెట్టగలిగితే మన రాష్ట్రానికి ఉపయోగపడతాయి. ఇది నా తరపు నుంచి మీకు చేస్తున్న విజ్ఞప్తి. ఈ సందర్భంగా నాటా కార్యక్రమంలో పాలుపంచుకొంటున్న మీ అందరికీ మంచి జరగాలని, అమెరికాలో ఉన్న తెలుగువాళ్లు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు’ అని సీఎం తన సందేశం వినిపించారు. -
‘తానా’ అంతర్జాతీయ కార్టూన్ పోటీ.. విజేతలకు రూ. లక్ష నగదు
సాక్షి, అమరావతి: తెలుగు భాష, తెలుగు కార్టూన్ కీర్తిని విశ్వవ్యాప్తం చేసేందుకు అంతర్జాతీయ కార్టూన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకుడు ప్రసాద్ తోటకూర తెలిపారు. మంగళవారం విజయవాడలోని సర్వోత్తమ గ్రంథాలయం ఆడిటోరియంలో కార్టూన్ పోటీల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తొలిసారిగా తానా అంతర్జాతీయ తెలుగు కార్టూన్ పోటీలు–2023ను ఏర్పాటు చేసిందన్నారు. వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూ, తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటేలా కార్టూన్లు పంపాలని తెలిపారు. పోటీల్లోని ఎంట్రీల నుంచి 12 అత్యుత్తమ కార్టూన్లను ఎంపిక చేసి ఒక్కొక్కరికి రూ.5,000, మరో 13 ఉత్తమ కార్టూన్లకు గాను ఒక్కొక్కరికీ రూ.3,000 చొప్పున మొత్తం 25 మందికి నగదు బహుమతులు అందజేస్తామని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగు కార్టూనిస్టులు పోటీల్లో పాల్గొనవచ్చని, ఒక్కొక్కరి నుంచి మూడు కార్టూన్లను స్వీకరిస్తామని తెలిపారు. ఎంట్రీలను 300 రిజల్యూషన్ జేపీఈజీ ఫార్మేట్లో tanacartooncontest23@gmail.comకు ఈ నెల 26లోగా పంపాలన్నారు. ఫలితాలను జనవరి 15న సంక్రాంతి రోజు ప్రకటిస్తామని చెప్పారు. వివరాల కోసం 9154555675, 9885289995 నంబర్లను సంప్రదించాలని కోరారు. కార్యనిర్వాహక సభ్యులు కళాసాగర్, కలిమిశ్రీ, జాకీర్ పాల్గొన్నారు. (క్లిక్: బెజవాడను కప్పేసిన మంచు దుప్పటి) -
నాటా పెయింటింగ్ పోటీ
చికాగో: నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (నాటా) వారి ఆధ్వర్యంలో నాటా పెయింటింగ్ పోటీ నిర్వహిస్తోంది. ఈ పోటీలో పాల్గొనేందుకు ఉత్సాహం చూపే ప్రతిభావంతులు సెప్టెంబర్ 7వ తేదీలోగా పెయింటింగ్‌ను పంపించాల్సి ఉంటుంది. ఈ పోటీకి న్యాయ నిర్ణేతగా వున్నపద్మశ్రీ గ్రహీత ఎస్వీ రామారావు.. పెయింటింగ్‌ల నుంచి 10-15 మందిని ఫైనల్‌కు ఎంపిక చేస్తారు. ఫైనల్‌కు ఎంపిక అయిన వారితో సెప్టెంబర్ 27న ఆన్లైన్ ఫైనల్ పోటీ నిర్వహించనున్నారు. (వేడుకగా “నాటా - మిన్నిసోటా” మహిళా దినోత్సవం) విజేతలకు మొదటి బహుమతిగా 500 డాలర్లు, రెండవ బహుమతిగా 400 డాలర్లు, మూడవ బహుమతిగా 300 డాలర్లు, అలాగే మిగిలిన ఏడుగురికి 100 డాలర్ల చొప్పున బహుమతులు ఉంటాయి. ఈ సదవకాశం ప్రపంచంలో వున్న తెలుగు వారికీ అందరికీ! ఇంకెందుకు ఆలస్యం సెప్టెంబర్ 7లోగా మీ పెయింటింగ్‌ను పంపండి. ఈ పోటీకి సంబంధించి మరిన్ని వివరాలకు https://www.nataus.org/art2020 ను సంప్రదించగలరు. (ఒకేసారి 50 దేశాల్లో హనుమాన్ చాలీసా పారాయణం) -
రత్నాకర్ ఫ్యామిలీకి నాట్స్ 13 వేల డాలర్ల సాయం
డల్లాస్: గత నవంబర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రత్నాకర్ శెట్టిపల్లి, అతని కుటుంబ సభ్యుల వైద్య సహాయం కొరకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) 13 వేల డాలర్ల (భారత కరెన్సీలో రూ.8.37 లక్షలు ) నిధులను సమీకరించింది. ఈ మేరకు ఆదివారం ఇర్వింగ్ నగరంలోని 'బిర్యానీ అండ్ మోర్' రెస్టారెంట్లో చెక్ ను నాట్స్ హెల్ప్ లైన్ టీం స్థానిక టెక్సాస్ స్టేట్ హౌస్ ప్రతినిధి, మాట్ రినాల్డి సమక్షంలో రత్నాకర్ కుటుంబ సభ్యులకు అందజేశారు. రత్నాకర్, అతని కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. నాట్స్ అండతో తమ కుటుంబం కొంత కోలుకునే అవకాశం లభించిందని, వారు అందించిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా స్టేట్ హౌస్ రెప్రజంటేటివ్ మాట్ రినాల్డి మాట్లాడుతూ.. నాట్స్ సంస్థ తన హెల్ప్ లైన్ ద్వారా చేస్తున్న సేవలను కొనియాడారు. రత్నాకర్ కుటుంబానికి జరిగిన నష్టం చాలా బాధాకరమని, వారికి నాట్స్ సంస్థ ఎలాంటి సహాయం కావాల్సిన అండగా ఉంటుందని నాట్స్ వైస్ ప్రెసిడెంట్ బాపు నూతి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాట్స్ బోర్డు డైరెక్టర్స్ డాక్టర్ చౌదరి ఆచంట, రాజేంద్ర మాదాల, నాట్స్ హెల్ప్ లైన్ ముఖ్య కార్యకర్తలు ఆది గెల్లి, బాపు నూతి, డల్లాస్ చాప్టర్ కో-ఆర్డినేటర్ రామకృష్ణ మార్నేని, మహిళా విభాగం కోఆర్డినేటర్ జ్యోతి వనం, నాట్స్ డల్లాస్ ముఖ్య సభ్యులు కిషోర్ వీరగంధం, రాజా మాగంటి, రవి బొజ్జురి, కిరణ్, తదితరులు పాల్గొన్నారు.