విప్రో ఫలితాల్లో ఫట్
ముంబై: వరుసగా ఐటీ దిగ్గజాలు తొలి త్రైమాసిక ఫలితాల్లో నిరాశపరుస్తున్నాయి. దేశంలో మరో అతిపెద్ద సాప్ట్ వేర్ దిగ్గజం విప్రో సైతం తన లాభాలను కోల్పోయింది. మంగళవారం విడుదలచేసిన కంపెనీ తొలి త్రైమాసికం ఏప్రిల్-జూన్ ఫలితాల్లో నికర లాభాలు 6.7 శాతం పడిపోయి, రూ.2,059 కోట్లగా నమోదయ్యాయి. రెవెన్యూ సైతం 0.3 శాతం కోల్పోయి రూ.13,697.6 కోట్లగా ప్రకటించింది. అయితే మొత్తం ఆదాయం 10.7శాతం పెరిగింది.
అయితే ఈ మొదటి త్రైమాసికంలో రూ 13,794 కోట్ల అమ్మకాలతో రూ 2,181 కోట్ల నికర లాభం ఆర్జించవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. ఈ ఫలితాలతో విశ్లేషకుల అంచనాలను విప్రో తారుమారు చేసింది. అయితే జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఐటీ సర్వీసుల రెవెన్యూను 1.93 బిలియన్ డాలర్ల నుంచి 1.95 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనావేస్తోంది.
విప్రో షేర్ నేటి ట్రేడింగ్ లో 0.47 శాతం కిందకు ట్రేడ్ అయి, రూ.549.40గా నమోదైంది. కంపెనీ రిజల్ట్స్ మార్కెట్ అవర్స్ తర్వాత వెల్లడయ్యాయి. దీని ప్రభావం బుధవారం నాటి మార్నింగ్ సెషన్ లో పడొచ్చని, ఐటీ ఇండెక్స్ కిందకు జారొచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనావేస్తున్నారు.