ఐఎన్ఎస్ కోల్‌కతా నౌకలో ప్రమాదం.. నేవీ అధికారి మృతి
ముంబై: ఐఎన్ఎస్ సింధు రక్షక్ జలాంతర్గామిలో పేలుళ్ల సంఘటన మరచిపోకముందే.. భారత నౌకాదళంలో మరో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ముంబై తీరప్రాంతం మజగావ్ డాక్‌యార్డ్‌లో శుక్రవారం జరిగిన ప్రమాదంలో ఒక నౌకాదళం అధికారి ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. నిర్మాణ దశలో ఉన్న ఐఎన్ఎస్ కోల్‌కతా నౌకలో గ్యాస్ లీకవడంతో ఈ ప్రమాదం సంభవించినట్టు అధికారులు చెప్పారు.
ముంబైలోనే కొలాబా డాక్‌యార్డులో నిలిచి ఉన్న ‘ఐఎన్ఎస్ సింధు రక్షక్’ జలాంతర్గామిలో వరుస పేలుళ్లు సంభవించిన సంగతి తెలిసిందే. గత ఆగస్టులో జరిగిన ఈ ఘటనలో భారీ ప్రాణ నష్టం జరిగింది. పేలుళ్లతో చాలా భాగం దెబ్బతిన్న జలాంతర్గామి సముద్రంలో సగం వరకు మునిగిపోయింది.