అక్షర చరిత్ర
కలెక్టర్ విజయకుమార్ అక్షర సాక్షాత్కారానికి నడుం బిగించిన తరువాత ప్రకాశం నిరక్షరాస్యుల తల రాతలే మారిపోయాయి. అక్షరాల ఆకారాలే తెలియని చేతులు బలపాలు పట్టాయి ... పల్లె పాటలు పాడిన నాలుకలు అఆల రాగాలు అందుకున్నాయి. కలెక్టర్ పేరులోనే ఉన్న ‘విజయం’ విజయదరహాసం చేసింది. తొమ్మిది నెలల కాలంలోనే ఈ ఘనత సాధించడంతో దేశ రాజధానిలో ప్రకాశ కిరణాలు వెదజల్లుతున్నాయి. దేశంలో మిగిలిన జిల్లాలు ఒరవడి దిద్దుకోవడానికి ఒంగోలు వైపు వంగివంగి చూస్తున్నాయి.
ప్రత్యేక కథనం 2లో...ఒంగోలు టౌన్: అక్షరాస్యతలో సాధించిన విజయంతో జిల్లా కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్కే కాదు జిల్లాకే అరుదైన గుర్తింపు లభించింది. ‘ప్రకాశం అక్షర విజయం’ పేరుతో చేపట్టిన ఈ యజ్ఞం కేవలం 9 నెలల కాలంలో 18 శాతం అక్షరాస్యతను సొంతం చేసుకుంది. ‘జాతీయ సాక్షర భారత్ అవార్డు’ కోసం రాష్ట్రం నుంచి ప్రకాశం జిల్లాను జాతీయ సాక్షరతా మిషన్ ఎంపికచేసింది.
ప్రపంచ అక్షరాస్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 8వ తేదీ ఉదయం 11.30 గంటలకు న్యూఢిల్లీలోని విద్యాభవన్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా కలెక్టర్ ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. జిల్లాలో రెండు దశల్లో నిర్వహించిన ప్రకాశం అక్షర విజయంలో 4 లక్షల 75 వేల 39 మంది నిరక్షరాస్యులు అక్షరాస్యులుగా మారారు. దీంతో జిల్లాలో 63.08గా ఉన్న అక్షరాస్యత శాతం 78.84 శాతానికి పెరిగింది. రాష్ట్రంలో అక్షరాస్యతలో ప్రకాశం జిల్లా 10వ స్థానంలో ఉండేది. ప్రస్తుత ఫలితాలతో 5వ స్థానానికి చేరుకుంది.
తాను ఎలాంటి అవార్డులు, రివార్డుల కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టలేదు ... చదువుతోనే ప్రగతి సాధించవచ్చన్న ఉద్దేశంతో చేపట్టానని కలెక్టర్ ప్రకటించడం ఆయన హుందాతనానికి నిదర్శనం. గ్రామస్థాయిలో 20, 876 మంది వలంటీర్లు స్వచ్ఛందంగా చదువు చెప్పడానికి ముందుకు వచ్చారు. వీటిని గ్రామస్థాయిలో 1027 మంది పర్యవేక్షించారు. మండలస్థాయిలో 56 మంది, జిల్లా స్థాయిలో జిల్లా అధికారులు నిరంతర పర్యవేక్షణ కారణంగానే ఈ విజయం సాధ్యమైంది.
90 శాతానికి చేరుకుంటే వంద శాతం అక్షరాస్యత సాధ్యమవుతుంది. అటవీ ప్రాంతాల్లో గతంలో 33 నుంచి 36 శాతానికి మించి ఓటింగ్ నమోదు అయ్యేది కాదు... ఈ అక్షర విజయంతో ఇటీవల 85శాతం ఓటింగ్ నమోదైంది. అక్షరోద్యమంలో భాగంగా అక్షరాస్యులుగా మారుతున్న ప్రతి ఒక్కరికీ తాను స్వయంగా జాబు(పోస్టుకార్డు) రాసుకుంటున్నారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకునేందుకు కలెక్టర్ శనివారం ఒంఓగుల నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.