breaking news
The National Investigation Agency
-
‘జునూద్’... 27వ మాడ్యుల్!
1992 నుంచి నగరంలో ఊపందుకున్న మాడ్యుల్ సంస్కృతి ‘తెహరీఖ్’ మినహా అన్నీ బయట నుంచి వచ్చినవే ‘గత చరిత్రల్ని’ అధ్యయనం చేస్తున్న పోలీసు, నిఘా సిటీబ్యూరో: జునూద్ అల్ ఖలీఫా ఏ హింద్... దేశ వ్యాప్తంగా పేలుళ్లకు కుట్రపన్ని జాతీయ దర్యాప్తు సంస్థకు చిక్కిన మాడ్యుల్ ఇది. గత నెలలో 12 నగరాల్లో చిక్కిన 14 మందిలో హైదరాబాద్‌కు చెందిన నలుగురు ఉన్నారు. దీంతో సహా ఇప్పటి వరకు నగరంలో వెలుగులోకి వచ్చిన మాడ్యుల్స్ సంఖ్య 27కు చేరింది. విదేశాల్లో ఉండే ఉగ్రవాద సంస్థలు... దేశీ ముష్కరులు ఏదైనా విధ్వంసానికి కుట్ర పన్నితే ఈ పని చేసేందుకు ముందుగా కొందరిని ఎంచుకుంటారు. వీళ్లు ఒకరికి ఒకరు తెలిసి ఉండచ్చు లేదా తెలియకపోవచ్చు. అయినా కొన్ని లింకుల ద్వారా వీరంతా బృందంగా ఏర్పడి అనుకున్న పనిని ప్రణాళిక ప్రకారం పూర్తి చేస్తారు. దీన్నే మాడ్యుల్ అంటారు. ‘జునూద్’కు చెందిన నలుగురు సిటీలో చిక్కడంతో పోలీసు, నిఘా వర్గాలు 1992లో జరిగిన అదనపు ఎస్పీ కృష్ణప్రసాద్ హత్యకు ఒడిగట్టిన హిజ్బుల్ ముజాహిదీన్ మొదలు 2007, 2013ల్లో జంట పేలుళ్లకు పాల్పడిన ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం), అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ వరకు ప్రతి ఒక్క మాడ్యుల్ చరిత్రను పూర్తిగా అధ్యయనం చేస్తున్నారు. ఫలితంగా ముష్కరమూకలకు సంబంధించిన లింకులు దొరికే అవకాశం ఉందని భావిస్తున్నారు. ముజాహిదీన్-ఇ-ఇస్లాం: పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్‌లో అంతర్భాగంగా పని చేసింది. 1992లో టోలిచౌకి లో ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్‌ను అతిదారుణంగా హత్య చేసింది దీని సభ్యులే. మన్జీమ్-ఇస్లాహుల్-ముస్లమీన్: ముంబైకి చెందిన డాక్టర్ జలీస్ అన్సార్ ఈ మాడ్యుల్‌కు నేతృత్వం వహించాడు. 1993లో నగరంలోని అనేక ప్రాంతాల్లో పేలుళ్లకు పాల్పడింది. ఫసీయుద్దీన్ మాడ్యుల్: నగరానికి చెందిన విశ్వ హిందూ పరిష్యత్ నేతలు నందరాజ్ గౌడ్‌ను 1992లో, పాపయ్య గౌడ్‌ను 1993లో హత్య చేసింది. ఐఖ్వాన్-ఉల్-ముస్లమీన్: ఈ మాడ్యుల్ నగర వ్యాప్తంగా విధ్వంసాలు సృష్టించాలని 1993లో కుట్ర పన్నింది. దీన్ని ఛేదించిన నగర పోలీసులు గౌహర్ అమీన్ మీర్, నసీర్ అహ్మద్ భట్ తదితరులను అరెస్టు చేశారు. అల్-జిహాద్: కాశ్మీర్‌కు చెందిన ఈ టైస్ట్ ఆర్గనైజేషన్ 1994లో నగరంలో నెట్వర్క్ ఏర్పాటు చేసుకుంది. ముస్లిం ముజాహిదీన్: అస్ఘర్ అలీ నేతృత్వంలో 1997లో ఈ మాడ్యుల్ ఏర్పడింది. ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న మీర్జా ఫయాజ్ అహ్మద్ బేగ్‌ను నాంపల్లి కోర్టు నుంచి తప్పించింది. ఎల్ఈటీ మాడ్యుల్: పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరేతొయిబా (ఎల్ఈటీ) 1998లో సలీం జునైద్‌ను హైదరాబాద్ పంపింది. పాతబస్తీలో షెల్టర్ ఏర్పాటు చేసుకుని ఇక్కడి యువతను ఆకర్షించడానికి ప్రయత్నించి పట్టుబడ్డాడు. 1999లో వాలీ మహ్మద్ జహీద్ అలియాస్ హఫీఖ్ వఖ్వారీ అలియాస్ తాహెర్ మాడ్యుల్, 2000ల్లో ఆజం ఘోరీ నేతృత్వంలో ఐఎంఎంఎం మాడ్యుల్, దీన్దార్ అంజుమన్ సంస్థ, 2001లో హిజ్బుల్ ముజాహిదీన్, గణేష్ నిమజ్జన ఉరేగింపులో పేలుళ్లకు కుట్ర పన్నిన అబ్దుల్ అజీజ్ అలియాస్ గిడ్డా అజీజ్ మాడ్యుల్, అష్వక్ అలీ మాడ్యుల్, 2002లో దిల్‌సుఖ్‌నగర్‌లోని సాయిబాబా ఆలయం వద్ద పేలుడుకు పాల్పడిన అబ్దుల్ బారీ మాడ్యుల్, 2003లో గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్య హత్య కేసులో అరెస్టు అయిన అస్ఘర్ అలీ మాడ్యుల్, 2004లో బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి హత్యకు కుట్ర పన్నిన జైష్-ఏ-మహ్మద్ మాడ్యుల్, సికింద్రాబాద్‌లోని గణేష్ టెంపుల్ పేల్చివేతకు కుట్ర పన్నిన నసీరుద్దీన్ మాడ్యుల్, పాకిస్తానీ అర్షద్ మాలిక్ మాడ్యుల్, 2004/2005ల్లో గులాం మజ్దానీ అలియాస్ నవీద్ మాడ్యుల్ చురుకుగా పని చేశాయి. 2005 అక్టోబర్ 12న చోటు చేసుకున్న టాస్క్‌ఫోర్స్ కార్యాలయంపై జరిగిన మానవబాంబు దాడి దీని పనే. ఆపై అదే ఏడాది ముజీబ్ అహ్మద్ మాడ్యుల్, 2006/2007ల్లో షాహెద్ అలియాస్ బిలాల్ మాడ్యుల్స్ నగరంలో కార్యకలాపాలు సాగించాయి. ఇక 2007, 2013ల్లో నగరంలో జంట పేలుళ్లకు పాల్పడిన ఇండియన్ ముజాహిదీన్ మాడ్యుల్లో స్థానికులు ఎవరూ లేరు. ఆపై విఖార్ అహ్మద్‌కు చెందిన తెహరీఖ్ గల్బా ఏ ఇస్లాం (టీజీఐ) మాడ్యుల్ పోలీసుల పైనే తూటా ఎక్కుపెట్టింది. సల్మాన్ మొయినుద్దీన్, అప్ఫా జబీన్లతో కూడిన ఐసిస్ మాడ్యుల్, దీనికి అనుబంధంగా వెలుగులోకి వచ్చిన ‘జునూద్’ ప్రస్తుతం పోలీసు, నిఘా వర్గాలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. -
సహరన్‌పూర్‌లో తొలి ‘ఉగ్ర’ సమావేశం!
‘జునూద్’ ఏర్పడ్డాక ఇదే మొదటి మీటింగ్ గతేడాది జనవరిలో నిర్వహించిన ముదబ్బీర్ హైదరాబాద్ నుంచి వెళ్లి పాల్గొన్న నఫీస్ ఖాన్ సమాచార మార్పిడికి రెండు యాప్స్ వినియోగం సిటీబ్యూరో: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌కు అనుబంధంగా ఏర్పడిన ‘జునూద్ అల్ ఖలీఫా ఏ హింద్’ తొలి సమావేశం ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌లో జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ మాడ్యుల్‌కు సంబంధించి హైదరాబాద్‌లో అరెస్టయిన నలుగురినీ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఢిల్లీ యూనిట్ కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలోనే ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. సిటీలో చిక్కిన నలుగురిలో నఫీస్ ఖాన్ అత్యంత కీలకమైన ఉగ్రవాదిగా అధికారులు నిర్థారించారు. సిరియా కేంద్రంగా అన్సార్ ఉల్ తౌహిద్ సంస్థను ఏర్పాటు చేసి, ఐసిస్ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న షఫీ ఆర్మర్ అలియాస్ యూసుఫ్ హింద్ (కర్ణాటకలోని భత్కల్ వాసి) ఆదేశాలతోనే ఈ మాడ్యుల్ పని చేస్తున్నట్లు ఆధారాలు సేకరించారు. ఫేస్బుక్ ద్వారా ఇతడికి పరిచయమైన ముంబై వాసి ముదబ్బిర్ ముస్తాఖ్ షేక్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన రిజ్వాన్ అలియాస్ ఖాలిద్‌లకు ‘జునూద్’ విస్తరణ బాధ్యతల్ని అప్పగించాడు. సహరన్‌పూర్‌లో మీటింగ్... ఈ మాడ్యుల్‌కు చీఫ్‌గా వ్యవహరించిన ముదబ్బీర్ ఆన్లైన్ ద్వారానే ‘జునూద్’ను విస్తరించాడు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌కు చెందిన నఫీస్ ఖాన్‌తో 2014లో పరిచయం ఏర్పడింది. అబు జరార్ పేరుతో మాడ్యుల్లో చేరి, చాకచక్యంగా వ్యవహరిస్తున్న నఫీజ్ ఖాన్‌ను ఈ మాడ్యుల్ ఆర్థిక లావాదేవీలు పర్యవేక్షించే ఫైనాన్స్ చీఫ్‌గా ముదబ్బీర్ నియమించాడు. మాడ్యుల్‌ను దేశవ్యాప్తంగా విస్తరించాలనే ఉద్దేశంతో ముదబ్బీర్ గతేడాది జనవరిలో యూపీలోని సహరన్‌పూర్‌లో తొలి సమావేశం ఏర్పాటు చేశాడు. అప్పట్లో అక్కడ మత ఘర్షణలు జరిగిన నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని మీటింగ్ కోసం ఎంచుకున్నారు. ఇందులో పాల్గొన్న ఐదుగురిలో నఫీస్ ఖాన్ అలియాస్ అబు జరార్ కూడా ఉన్నాడు. వాస్తవానికి ఈ సమావేశంలోనే మాడ్యుల్లోని ప్రతి ఒక్కరికీ ప్రాంతాల వారీగా ‘ఉగ్రబాధ్యతలు’ అప్పగించాలని భావించారు. అయితే షఫీ ఆర్మర్ ఆదేశాల మేరకు ఆ ప్రక్రియను వాయిదా వేసుకున్నారు. ఈ సమావేశం నుంచి తిరిగి వచ్చిన తర్వాతే నఫీస్ నగరానికి చెందిన ఒబేదుల్లా ఖాన్, మహ్మద్ షరీఫ్ మొహియుద్దీన్, అబు అన్స్‌లను ఉగ్రవాదబాట పట్టించాడు. ఈ మాడ్యుల్ సహరన్‌పూర్‌తో పాటు హైదరాబాద్, లక్నో, టమ్కూర్‌లో పలుమార్లు సమావేశమైందని, క్యాడర్‌కు ఆయుధాల వినియోగం, పేలుడు పదార్థాల తయారీకి సంబంధించి బెంగళూరు, టమ్కూరు, లక్నోల్లోని అటవీ ప్రాంతాల్లో శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసేందుకు కుట్రపన్నిందని ఎన్ఐఏ గుర్తించింది. నిఘాకు దొరకని యాప్స్‌తో... ముష్కరమూకల వినియోగం పెరిగిన నేపథ్యంలో నిఘా వర్గాలు ఫేస్బుక్, వాట్సాప్ తదితర సోషల్‌మీడియాలపై కన్నేసి ఉంచుతున్నాయి. దీన్ని పసిగట్టిన ‘జునూద్’ మాడ్యుల్ సమాచార మార్పిడికి కొత్త యాప్స్‌ను వినియోగించింది. అంతగా ప్రాచుర్యంలోకి రాని ఆడ్రాయిడ్ యాప్స్ ‘ట్రిలియన్’, ‘సురిస్పోట్’లను తమ సెల్ఫోన్లలోకి డౌన్లోడ్ చేసుకుని వ్యవహారాలు కొనసాగించామని ఎన్ఐఏ అధికారులకు ఉగ్రవాదులు వెల్లడించారు. ‘జునూద్’ కార్యకలాపాలను విస్తరించే ప్రయత్నాల్లో ఉన్న ముదబ్బీర్ ముంబైతో పాటు ఢిల్లీ, గుజరాత్, బీహార్, పశ్చిమ బెంగాల్, అలహాబాద్, ఉత్తరాఖండ్, ఆజామ్ఘర్ ప్రాంతాల్లో మీడియా వింగ్స్ ఏర్పాటుకు నిర్ణయించారు. దీనికోసం ఆయా ప్రాంతాల్లో విద్యాధికుల్ని, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వారిని ఎంచుకునే పనిలో ఉండగానే ఈ మాడ్యుల్ గుట్టురట్టయింది.