breaking news
National Health Insurance Scheme
-
సంక్షేమ పథకాలే ప్రచారాస్త్రాలు
న్యూఢిల్లీ: ఇటీవల బడ్జెట్లో ప్రకటించిన జాతీయ ఆరోగ్య బీమా, ఉచిత ఎల్పీజీ సిలిండర్, రైతుల పంటకు కనీసమద్దతు ధరను 150 శాతం పెంచడంలాంటి సంక్షేమ పథకాలు ఈ ఏడాది జరగనున్న పలు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ప్రధాన అస్త్రాలుగా మారతాయని కమలనాథులు భావిస్తున్నారు. రైతులు, సంక్షేమ పథకాలకు పెద్ద ఎత్తున నిధుల కేటాయింపుతో రాబోయే ఎన్నికల్లో పార్టీ లబ్ధి పొందుతుందని విశ్వసిస్తున్నారు. ఇందుకనుగుణంగానే బడ్జెట్లో రైతులు, పేదల కోసం కేంద్రం తెచ్చిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ అధినాయకత్వం పార్టీ శ్రేణుల్ని ఆదేశించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ పట్టుకోల్పోయిందని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శల్ని తిప్పికొట్టవచ్చని వెల్లడించాయి. ఈ నెల 18న త్రిపురలో, ఆ తర్వాత వరుసగా కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అన్నింటికంటే ముఖ్యంగా కర్ణాటకలో గెలవడం ద్వారా బీజేపీ గ్రామీణ ప్రాంతాల్లో బలహీనపడిందన్న కాంగ్రెస్ వాదనకు చెక్ పెట్టవచ్చని అగ్రనాయకత్వం భావిస్తున్నట్లు బీజేపీ శ్రేణులు తెలిపాయి. -
పంద్రాగస్టు లేదా గాంధీ జయంతి!
న్యూఢిల్లీ: దేశంలోని 10 కోట్ల పేద కుటుంబాలకు వైద్య ఖర్చుల కవరేజ్ అందించేందుకు ప్రభుత్వం ఉద్దేశించిన ‘మోదీ కేర్’ పథకాన్ని ఆగస్టు 15 లేదా, గాంధీ జయంతి (అక్టోబర్ 2) ప్రారంభించాలని కేంద్రం యోచిస్తోంది. వచ్చే (2018–19) ఆర్థిక సంవత్సరంలో ప్రారంభిస్తామని ఆర్థిక మంత్రి జైట్లీ ప్రకటించినప్పటికీ పథకం ప్రాముఖ్యత దృష్ట్యా స్వాతంత్య్ర దినోత్సవం లేదా గాంధీ జయంతిల్లో ఒకరోజు అట్టహాసంగా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ‘జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకం’ (దీన్నే మోదీ కేర్ అంటున్నారు)లో 60 శాతం కేంద్ర ప్రభుత్వం మిగిలిన 40 శాతాన్ని రాష్ట్రాలు భరించాల్సి ఉంటుందని జైట్లీ అన్నారు. బడ్జెట్లో ఈ ఏడాది ‘మోదీ కేర్’ కోసం రూ.2వేల కోట్లతో ప్రాథమిక మూలనిధిని ఏర్పాటుచేశామన్నారు. పథకం అమలు ఆధారంగా వచ్చే ఏడాది తర్వాత మరిన్ని నిధులు సమకూరుస్తామన్నారు. దీని ద్వారా 10 కోట్ల కుటుంబాలకు (దాదాపు భారత జనాభాలో 40 శాతం మందికి) లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ వైద్య పథకం క్యాష్లెస్గానే ఉంటుందని రీయింబర్స్మెంట్ పథకం కాదని చెప్పారు. ‘ఈ పథకం ఆసుపత్రిలో చికిత్సను, అనంతర సంరక్షణను అందిస్తుంది. ఇందులో పలు ప్రభుత్వాసుపత్రులు, ఎంపికచేసిన ప్రైవేటు ఆసుపత్రులు ఉంటాయి. ఇదో ట్రస్టు లాగా లేదా ఇన్సూరెన్స్ లాగా పనిచేస్తుంది. రీయింబర్స్మెంట్ సాధ్యం కాదు’ అని అన్నారు. పాలసీదారులు ఎక్కువగా ఉన్నప్పుడు ప్రీమియం తగ్గటం సహజమేనన్నారు. ఈ విధానాన్ని నీతి ఆయోగ్, వైద్య శాఖ సంయుక్తంగా రూపొందించాయని తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 1 తర్వాత)లో ఏదో ఒకరోజు దీన్ని ప్రారంభిస్తామన్నారు. వైఎస్సార్ హయాంలో ప్రారంభించిన ‘ఆరోగ్యశ్రీ’ ట్రస్టులాగే మోదీకేర్ను ట్రస్టులా నిర్వహించొచ్చనే భావనా వ్యక్తమవుతోంది. ఈ పథకం ద్వారా రూ.11వేల కోట్ల భారం పడుతుందని అంచనా. నిధులు కాదు.. అమలే సవాల్ ఈ పథకానికి నిధుల సమస్యలేదని వైద్య మంత్రి జేపీ నడ్డా అన్నారు. అమల్లో ఉండే అవరోధాలనూ కేంద్రం పరిశీలిస్తోందన్నారు. త్వరలోనే పథకానికి సంబంధించిన అన్ని వివరాలనూ వెల్లడిస్తామన్నారు. పథకాన్ని అమలు చేయాలా? వద్దా? లేక సొంత నిధులతో నడుపుకోవాలా? అనేది రాష్ట్రాలు నిర్ణయించుకోవచ్చన్నారు. అన్ని అనారోగ్య సమస్యలకూ ఈ పథకంలో చికిత్స అందుతుందన్నారు. నిధుల సమీకరణ ఇబ్బందేం కాదని.. క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయటమే అసలు సవాల్ అని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ తెలిపారు. ‘ఏడాదికి రూ.5 లక్షల రూపాయల కవరేజీ ఇచ్చేందుకు ఒక్కో కుటుంబానికి రూ.1,000 నుంచి 1,200 వరకు ఖర్చవుతుంది. ఈ మొత్తాన్ని కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి’ అని నీతి ఆయోగ్ సలహాదారు అలోక్ కుమార్ పేర్కొన్నారు. ఒక్క శాతం సెస్ పెంచితే చాలు ఈ పథక రూపశిల్పి, నీతి ఆయోగ్ సభ్యుడు వినోద్ కుమార్ పాల్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒక్కశాతం అదనపు విద్య, వైద్య సెస్ ద్వారా ఈ పథకానికి అవసరమైన నిధిని సమకూర్చవచ్చన్నారు. 2011 సామాజిక, ఆర్థిక, కుల జనగణన ఆధారంగానే పేదల గుర్తింపు ఉంటుందన్నారు. పథకాన్ని వాడుకునేందుకు ఆధార్ తప్పనిసరి కాదన్నారు. కాగా, బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు లేకుండా పథకాన్ని ప్రకటించడం అంటే.. దారం లేకుండా గాలిపటాన్ని ఎగరేయటమేనని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఎద్దేవా చేశారు. ‘వాస్తవానికి అక్కడ గాలిపటమూ ఉండదు, ఎగరటమూ ఉండదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. అమలు ఎలా..? కేంద్ర బడ్జెట్లో అందరినీ ఆకర్షించిన ప్రధానాంశం జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం (ఎన్‌హెచ్‌పీఎస్). దేశ జనాభాలో మూడోవంతుకు దీర్ఘకాలంలో ఆరోగ్యబీమా కల్పించడమే ఈ పథకం లక్ష్యం. ఒబామాకేర్ తరహాలో ప్రభుత్వం మోదీ కేర్ అని పిలుస్తోంది. మరి ఈ మోదీ కేర్ పథకం ఎలా ఉంటుంది? దీన్ని ఏయే సంస్థలు అమలు చేస్తాయన్న వివరాలను ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2007 ఏప్రిల్ ఒకటిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన∙రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ముఖ్యమంత్రి అధ్యక్షతన నడిచే ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ ద్వారా విజయవంతంగా అమలు చేశారు. ఐఏఎస్ అధికారి ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) గా ఉన్న ట్రస్ట్ ఆరోగ్యపరిరక్షణరంగ నిపుణులతో సంప్రదించి ఆరోగ్యశ్రీని సాధ్యమైనంత పకడ్బందీగా అమలు చేసింది. ఎన్‌హెచ్‌పీఎస్ అమలుకు చేతులు కలపాలని తన కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాల్లో భాగంగా ప్రైవేటు కంపెనీలను కూడా కేంద్ర సర్కారు కోరవచ్చు. కాని, ప్రతి ఏటా అదనంగా అవసరమైన సొమ్మును ప్రైవేటు పారిశ్రామికవేత్తలు సకాలంలో ఎలా అందజేస్తారన్న విషయం కూడా ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే. అయితే.. ఈ పథకాన్ని హడావుడిగా అమలు చేస్తే లాభపడేది ఇన్సూరెన్స్ కంపెనీలు, ప్రైవేటు ఆస్పత్రులేనని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
వచ్చే ఏడాది నుంచి మోదీ కేర్ అమలు
సాక్షి, న్యూఢిల్లీ: బడ్జెట్లో ప్రకటించిన ప్రతిష్టాత్మక ఆరోగ్య బీమా పథకం వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ప్రారంభమవుతుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ఇది వైద్య ఖర్చుల రీఎంబర్స్మెంట్ పథకం కాదని, ఆస్పత్రుల్లో నగదు రహిత సేవలు అందుబాటులోకి వస్తాయని వివరించారు. మోదీ కేర్‌గా పిలుస్తున్న నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్ (ఎన్‌హెచ్‌పీఎస్) ద్వారా దేశ జనాభాలో 40 శాతం జనాభాకు దాదాపు పదికోట్ల కుటుంబాలకు పైగా రూ 5 లక్షల వరకూ మెడికల్ కవరేజ్ కల్పిస్తారు. పలు రాష్ర్టాల ఆస్పత్రులు, ఎంపిక చేసిన ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఈ పథకం వర్తిస్తుందని..ట్రస్ట్, బీమా తరహాలో ఈ పథకం పేద కుటుంబాలకు నగదు రహిత వైద్య సేవలను కల్పిస్తుందని చెప్పారు. ప్రస్తుతం మోదీ కేర్ మోడల్‌పై నీతిఆయోగ్, ఆరోగ్య మంత్రిత్వ శాఖలు కసరత్తు చేస్తున్నాయని వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుందని తెలిపారు. ఇన్సూరెన్స్ మోడల్లో స్కీమ్ ప్రధానంగా రూపొందితే పాలసీదారులు పెరిగేకొద్దీ ప్రీమియం తగ్గుతుందని చెప్పుకొచ్చారు. మరోవైపు మోదీ కేర్ అమలుపై నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కేవలం రూ 2000 కోట్ల ప్రారంభ నిధితో ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని ఎలా చేపడతారని ప్రశ్నిస్తున్నారు. -
ఏపీలో 2,184 కుటుంబాలకు ఆరోగ్య బీమా లబ్ధి
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ ఆరోగ్య బీమా పథకం కింద ఈ ఏడాది మార్చి 31 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 2,184 కుటుంబా లు లబ్ధిదారులుగా ఉన్నాయని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. బీమా పథకానికి సంబంధించి లోక్‌సభలో సోమవారం బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు అడిగిన ప్రశ్నకు మంత్రి దత్తాత్రేయ బదులిచ్చారు. అసంఘటిత రంగాల కార్మికులకు వర్తించేలా ఈ పథకం సేవలను విస్తరించాలని నిర్ణయించినట్టు తెలిపారు. భవన, ఇతర నిర్మాణరంగ కార్మికులు, లెసైన్సు రైల్వే పోర్టర్లు, వీధి వ్యాపారులు, ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కార్మికులు, బీడీ కార్మికులు, ఇళ్లలో పనులు చేసేవారు, పారిశుద్ధ్య, గని కార్మికులు, సైకిల్ రిక్షా, ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఈ బీమాను అమలు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు.