breaking news
national employment scheme
-
అనుచితాలు కాదు: సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘ఉచితమంటే ఏమిటి? దేన్ని ఉచితంగా పరిగణించాలి’’ అనే కీలకమైన మౌలిక ప్రశ్నలను సర్వోన్నత న్యాయస్థానం లేవనెత్తింది. సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ, తాగునీటి సదుపాయం తదితరాలను ఉచితాలుగా భావించాలా, లేక పౌరుల ప్రాథమిక హక్కుగానా అన్నది లోతుగా ఆలోచించాల్సిన అంశమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ వంటి పథకాల ద్వారా దేశ పౌరులకు అందుతున్న ఎనలేని ప్రయోజనాలను ప్రస్తావించారు. తద్వారా గ్రామీణ భారతంలో అపారంగా ఆస్తుల సృష్టి కూడా జరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో పార్టీల ఉచిత హామీల అంశాన్ని సమగ్రంగా తేల్చడానికి ఓ నిపుణుల కమిటీ వేసే యోచన ఉందని మరోసారి చెప్పారు. రాజకీయ పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలను నియత్రించేలా కేంద్రాన్ని, ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ బీజేపీ నేత, న్యాయవాది అశ్వనీకుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ హిమా కోహ్లిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారించింది. ఈ సందర్భంగా జస్టిస్ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటర్లకు వాగ్దానాలు చేయకుండా రాజకీయ పార్టీలను నిరోధించలేమని సూచనప్రాయంగా పేర్కొన్నారు. ‘‘వాగ్దానాలు చేయకుండా దేశంలోని రాజకీయ పార్టీలను నిరోధించలేమని సూచిస్తున్నాం. ఎందుకంటే సమాజంలోని భిన్న వర్గాల్లో ఆదాయం, హోదా, సదుపాయాలు, అవకాశాలపరంగా అసమానతలను రూపుమాపాలని రాజ్యాంగమే ప్రభుత్వాలకు నిర్దేశిస్తోంది. కాబట్టి గెలిచి అధికారంలోకి వస్తే ఈ నిర్దేశాన్ని సాకారం చేసేందుకు ఉచిత హామీలివ్వకుండా పార్టీలను గానీ, వ్యక్తులను గానీ నిరోధించలేం. కాకపోతే ఏది నిజమైన హామీ నిర్వచనంలోకి వస్తుందన్నదే అసలు ప్రశ్న. అలాగే అసలు ఉచితమంటే ఏమిటో స్పష్టంగా నిర్వచించాల్సిన అవసరముంది. సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ, తాగునీటి సదుపాయం, ఎలక్ట్రానిక్ పరికరాలు వంటివాటిని ఉచితంగా పొందవచ్చా?’’ అంటూ ఆయన కీలక ప్రశ్నలు లేవనెత్తారు. ‘‘ప్రజలు గౌరవంగా జీవించడానికి అవసరమైన పథకాలు కూడా ఉన్నాయి. ఎన్నికల్లో గెలుపును కేవలం ఉచిత వాగ్దానాలే నిర్దేశించడం లేదు. కొన్ని పార్టీలు ఎన్ని వాగ్దానాలు చేసినా ఎన్నికల్లో గెలవడం లేదుగా!’’ అని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో అందరి అభిప్రాయాలూ తెలుసుకున్న తర్వాతే ఉచితాల మీద ఓ స్పష్టమైన నిర్ణయానికి రాగలమని సీజేఐ స్పష్టం చేశారు. తదుపరి విచారణను ఆగస్టు 22కు వాయిదా వేశారు. అన్నింటిపైనా చర్చ: విపక్షాలు పిటిషన్‌పై కాంగ్రెస్, ఆప్, డీఎంకే తదితర విపక్ష పార్టీలు భిన్నమైన వ్యాఖ్యలు చేశాయి. ఉచితాలు, దేశ ఆర్థిక పరిస్థితుల మధ్య సంబంధంపై చర్చ జరగాలంటే రాజకీయ నేతలు, చట్టసభ సభ్యులు ఏమేం ప్రయోజనం పొందుతున్నారో కూడా చర్చ జరగాలని ఆప్ తన ఇంటర్వీన్ అప్లికేషన్లో పేర్కొంది. ప్రజలకు రాయితీలివ్వడాన్ని ఉచితంగా పరిగణించరాదని కాంగ్రెస్ నేత జయ ఠాకూర్ తన అప్లికేషన్లో పేర్కొన్నారు. భారత్‌ను ప్రజాస్వామ్య దేశం నుంచి పెట్టబడీదారీ దేశంగా మార్చాలని పిటిషనర్ ప్రయత్నిస్తున్నారని డీఎంకే తరఫు సీనియర్ న్యాయవాది పి.విల్సన్ వాదించారు. సంక్షేమ పథకాలకు తాము వ్యతిరేకం కాదని కేంద్రం పేర్కొంది. అయితే పార్టీల ఉచిత వాగ్దానాలను నియంత్రించాల్సిన అవసరముందని కేంద్రం తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మరోసారి సుప్రీంకోర్టుకు స్పష్టం చేశారు. ఈ విషయమై చట్టసభల్లో చట్టాలు రూపొందేదాకా సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవచ్చని కూడా మరోసారి సూచించింది. పదవీ విరమణ రోజున ప్రస్తావిస్తా రిజిస్ట్రీ సమస్యలు తదితరాలపై సీజేఐ సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు రిజిస్ట్రీ అవలంబిస్తున్న కొన్ని పద్ధతులను నియంత్రించాల్సి ఉందని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. బుధవారం విచారణ సందర్భంగా రిజిస్ట్రీతో ఓ కేసు విషయంలో ఎదురైన ఇబ్బందిని న్యాయవాది దుష్యంత్ దవే ప్రస్తావించగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘రాత్రి ఎనిమిదింటికి దాకా కేసులకు సంబంధించిన అంశాలు విన్నాం. సమావేశాలు కూడా ఎక్కువయ్యాయి. ఆ తర్వాత ఒక కేసును విచారణ జాబితా నుంచి తొలగిస్తేనే ఈ కేసు జాబితాలో చేరింది. ఇది సరికాదు. రిజిస్ట్రీలో ఇలాంటి పద్ధతులను నియంత్రించాల్సించే’’ అన్నారు. ‘‘నా దృష్టికి చాలా సమస్యలు వచ్చాయి. వాటన్నింటినీ నా పదవీ విరమణ సందర్భంగా వీడ్కోలు ప్రసంగంలో చెబుతా’ అని పేర్కొన్నారు. జస్టిస్ రమణ 26న పదవీ విరమణ చేయనుండటం తెలిసిందే. -
ఉపాధి హామీతోనే గ్రామీణ వికాసం
గ్రామీణ భారతదేశంలో ప్రజల వినియోగాన్ని క్షీణింపజేయడంలో కేంద్ర ప్రభుత్వ పాలసీ విధానాల్లోని తప్పటడుగులు చాలా ముఖ్యమైన పాత్ర పోషించాయి. వ్యవసాయానికి పోటీగా వాణిజ్యాన్ని నిలబెట్టడం, ద్రవ్యోల్బణంపైనే గురిపెడుతున్న ద్రవ్యవిధానం, పెద్దనోట్ల రద్దు, అధిక మొత్తం నగదు లావాదేవీలపై పన్ను, జీఎస్టీ వంటివి మొత్తంగా వ్యవసాయ రంగం అభివృద్ధిపై శీతకన్ను వేస్తున్నాయి. ఇవన్నీ కలిసి గ్రామీణ మార్కెట్లలో నగదు చెలామణీని, మొదటి నుంచి వాడుకలో ఉన్న నగదు లావాదేవీలను విచ్ఛిన్నపర్చడానికే తోడ్పడ్డాయి. అందుచేత గ్రామీణ ఆర్థిక ఉద్దీపనను అమలు చేయడానికి మరింత మెరుగుపర్చిన రూపంలోని జాతీయ ఉపాధి హామీ పథకం ఒక బలమైన పునాదిని ఏర్పరుస్తుంది. ఇది ఒక డిమాండ్‌ను సృష్టించే పథకం. పనికోసం చూస్తున్న ఎవరికైనా ఈ పథకం పని కల్పిస్తుంది. కాబట్టి ఆదాయ మద్దతు పథకాలతో ఘర్షించే సమస్యలను ఇది అధిగమించి గ్రామీణ ప్రాంతంలో శ్రమజీవులకు ఎక్కువ మేలు చేస్తుంది. ప్రస్తుతం దేశంలో అలుముకుంటున్న ఆర్థిక మందగమనాన్ని అడ్డుకోవడం గురించి తీవ్రంగా ఆలోచిస్తున్న మన విధాన నిర్ణేతలు భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పట్టి పీడిస్తున్న సంక్షోభాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. కొన్ని నెలల క్రితం ఎన్నికలు సమీపించిన తరుణంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ భారతీయ విధాన నిర్ణేతల ప్రథమ ప్రాధాన్యతగా ఉండేది. ఈ సంవత్సరం జనవరిలో ప్రధానమంత్రి–కిసాన్ యోజన్ పథకాన్ని ప్రకటించి భారీ ఎత్తున అమలుకు ప్రయత్నాలు చేశారు. కానీ సరిగ్గా అయిదు నెలల తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభం తీవ్రతరమవుతోందని గుర్తిస్తున్నప్పటికీ పీఎం కిసాన్ యోజన పథకం అమలు వేగాన్ని తగ్గిస్తూ వస్తోంది. కేంద్రం ప్రకటించిన దాని ప్రకారం రైతులకు మూడో విడత నగదు చెల్లింపు మొత్తం తొలి రెండు విడతల కంటే గణనీయంగా తగ్గిపోవడం గమనార్హం. తొలి రెండు విడతల నగదును ఎన్నికల ప్రచార సమయంలో సత్వరం పంపిణీ చేసిన వాస్తవాన్ని మర్చిపోకూడదు. బహుశా, పార్లమెంట్ ఎన్నికల్లో సాధించిన ఘన విజయం కేంద్ర ప్రభుత్వ రాజకీయ గణాంకాలను మార్చివేసి ఆర్థిక వ్యవస్థలోని ఇతర అంశాలపై తన దృష్టిని మరల్చినట్లుంది. కార్పొరేట్, ద్రవ్యరంగం ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించడానికి మిక్కుటంగా కృషి చేస్తోంది. కానీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను విస్మరించి పెట్టుబడుల పెంపుదల కోసం ప్రయత్నించడం అంటే చాలా తీవ్రమైన తప్పిదం కాగలదు. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆర్థిక మాంద్యం నేపథ్యంలో కార్పొరేట్ పన్నులను భారీగా తగ్గిస్తూ ప్రస్తుతం విధానపరంగా తీసుకున్న చర్యలు దేశంలో డిమాండును పెంచే సమస్యను పరిష్కరించడంలో భవిష్యత్తులో విఫలం కాక తప్పదనిపిస్తోంది. ప్రముఖ ఆర్థిక వేత్త హిమాన్షు నొక్కి చెప్పినట్లుగా భారతదేశం వినియోగ సరకులకోసం పెట్టే ఖర్చు కనీవినీ ఎరుగని స్థితికి దిగజారిపోయింది. జాతీయ శాంపిల్ సర్వే ఆఫీసు డేటాను ఉపయోగించి గ్రామీణ భారతదేశంలో సంవత్సరానికి 4.4 శాతం చొప్పున దేశీయ వినియోగ వ్యయం క్షీణించిపోయిందని ఆయన లెక్కించారు. అదే పట్టణ ప్రాంతాల్లో వినియోగ వ్యయం 4.8 శాతం పడిపోయింది. రెండోది.. గ్రామీణ భారతదేశంలో ప్రజల వినియోగాన్ని క్షీణిం పజేయడంలో కేంద్ర ప్రభుత్వ పాలసీ విధానాల్లో తీసుకున్న తప్పటడుగులు చాలా ముఖ్యమైన పాత్ర పోషించాయి. వ్యవసాయానికి పోటీగా వాణిజ్యాన్ని నిలబెట్టి ద్రవ్యోల్బణంపై గురిపెడుతున్న ద్రవ్యవిధానం, పెద్దనోట్ల రద్దు, అధిక మొత్తంలో నగదు లావాదేవీలపై పన్ను, జీఎస్టీ వంటివి మొత్తంగా వ్యవసాయ రంగం అభివృద్ధిపై శీతకన్ను వేస్తున్నాయి. ఇవన్నీ కలిసి గ్రామీణ మార్కెట్లలో నగదు చెలామణీని, మొదటి నుంచి వాడుకలో ఉన్న నగదు లావాదేవీలను విచ్ఛిన్నపర్చడానికే ఇతోధికంగా తోడ్పడ్డాయి. విధాన పరమైన ఈ తప్పటడుగులను ప్రత్యేకంగా సరిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బలహీనంగా ఉన్న గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వినియోగం తగ్గిపోవడం అంటేనే అక్కడ దారిద్య్రం పెరుగుతోందని అర్థం. అందుకే అతితక్కువ కాలంలోనే వినియోగ డిమాం డును పునరుద్ధరించడానికి గ్రామీణ భారతదేశానికి సత్వరమే ఆర్థిక ఉద్దీపన అనేది అవసరం కార్పొరేట్ ఇండియాకంటే మించిన ఉద్దీపన ప్యాకేజీనీ మన గ్రామప్రాంతాలకు అందించి తీరాలి. గ్రామీణ ఉద్దీపన ప్యాకేజీకి అందించాల్సిన రెండు విధానపరమైన సాధనాలపై ఇటీవలకాలంలో చాలా విస్తృతమైన వాదనలు చోటుచేసుకున్నాయి. అవి కనీస మద్దతు ధరను పెంచడం, ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దేశంలోని అనేక రాష్ట్రాలు ఇటీవలికాలంలో కేంద్ర ప్రభుత్వ అడుగుల్లో అడుగులేసి తమవైన రైతు ఆదాయ మద్దతు విధానాలను ప్రకటించాయి. ఇవి ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కంటే ఎక్కువగా తమ తమ బడ్జెట్లలో అధిక మొత్తాన్ని రైతు సహాయ నగదు పథకాల కోసం కేటాయించాయి. కానీ ఇలాంటి ఉద్దీపన సాధనాలకు పరిమితులున్నాయి. కనీస మద్దతు ధరను దెబ్బతీసే ధరలు, పంటల ఎంపికలు అనేవి వ్యవసాయ సంస్కరణల అమలును దీర్ఘకాలంలో దెబ్బతీస్తాయి. పైగా, కేంద్రప్రభుత్వం ఇప్పటికే పంపిణీ చేయనటువంటి ఆహార ధాన్యాలను భారీస్థాయిలో నిల్వ చేసుకుని సిద్ధం చేసుకుని కూర్చుంది. దీంతో అదనపు ధాన్య సేకరణకు అవకాశాలు చాలా పరిమితమైపోయాయి. నగదు మద్దతు పథకాలు కనీస మద్దతు ధరపై ప్రతికూల ప్రభావాలను తగ్గించగలుగుతాయి కానీ వీటి అమలులో తీవ్రమైన సవాళ్లు ఎదురుకాక తప్పదు. 2018–19 రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలపై భారతీయ రిజర్వ్ బ్యాంకు తాజాగా విడుదల చేసిన నివేదిక ఎత్తి చూపినట్లుగా, ఇలాంటి ప్రత్యక్ష నగదు పంపిణీ పథకాల విజయం అనేది భూ రికార్డులను డిజిటలీకరించడం, వాటిని బ్యాంకు ఖాతాలకు అనుసంధానం చేయడం పూర్తిగా నెరవేర్చారా లేదా అనే షరతులపై ఆధారపడి ఉంటుంది. పైగా లక్షలాది మంది రైతుల భూ రికార్డుల డిజిటలీకరణ అనేది ఒక్క రాత్రిలో జరిగిపోదు. అందుకే పీఎమ్ కిసాన్ సభను వేగంగా అమలు చేయాలంటే సాధ్యపడదు. ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకాన్ని దేశంలోనే మొదటిసారిగా అమలు చేసిన తెలంగాణ రాష్ట్రం తన రైతుల భూ రికార్డుల డేటా బేస్‌ను సరిచేయడానికి దాదాపు రెండేళ్ల సమయం పట్టిందంటే వాస్తవ పరిస్థితులను మనం అర్థం చేసుకోవచ్చు. అందుచేత గ్రామీణ ఆర్థిక ఉద్దీపనను అమలు చేయడానికి మరింత మెరుగుపర్చిన రూపంలోని జాతీయ ఉపాధి హామీ పథకం ఒక బలమైన పునాదిని ఏర్పరుస్తుంది. ఈ పథకం గొప్పదనం ఏమిటంటే ఇది ఒక డిమాండ్‌ను సృష్టించే పథకం. పనికోసం చూస్తున్న ఎవరికైనా ఈ పథకం పని కల్పిస్తుంది. కాబట్టి ఆదాయ మద్దతు పథకాలతో ఘర్షించే సమస్యలను చాలావాటిని ఇది అధిగమించి గ్రామీణ ప్రాంతంలో శ్రమజీవులకు ఎక్కువ మేలు చేస్తుంది. అంతకంటే ముఖ్యంగా ఉపాధి హామీ పథకం అనేది రైతులకు మాత్రమే కాకుండా వ్యవసాయ కార్మికుల విస్తృత భాగస్వామ్యానికి వీలిచ్చేలా రూపొందించడమైనది. అందుకే ఈ పథకం గ్రామీణ ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాల ప్రజల ఆదాయాలను బాగా పెంచగలుగుతుంది. చివరగా, జాతీయ ఉపాధి హామీ పథకం ప్రధానంగా గుంతలు తవ్వే పనులకే పరిమితమైపోయిందనే భావన విస్తృతంగా ప్రచారంలో ఉన్నప్పటికీ, వ్యవసాయ భూమిలో ఉత్పాదకతను మెరుగు పర్చడంలో ఇది అతి ముఖ్యమైన పాత్ర పోషించింది. ఉపాధి హామీ పథకం కింద పనుల్లో ఎక్కువ భాగం సన్నకారు రైతుల యాజమాన్యంలోని భూ కమతాలను అభివృద్ధి చేయడం పైనే దృష్టి పెట్టాయి. ఉదాహరణకు సాగునీటి వసతుల నిర్మాణం, పశువులు, జంతువుల షెడ్ల నిర్మాణం వంటివి. భూ ఉత్పాదకతను మెరుగుపర్చడం అంటేనే రైతుల ఆదాయాలను సూత్రబద్ధంగా పెంచడం, వ్యవసాయ కార్మికులకు డిమాండును అధికంగా ఏర్పర్చడం అన్నమాట. అయితే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పైకెత్తాలంటే బడ్జెట్లలో కేటాయింపులను పెంచవలసి ఉంటుంది. అధిక వేతనాలు ఇవ్వడం, అమలులో మెషిన్ తరహా క్రమబద్ధమైన పర్యవేక్షణను సాగించడం చేయాల్సి ఉంటుంది. 2012–13 సంవత్సరం నాటి నుంచి ఉపాధి హామీ పథకానికి బడ్జెట్ కేటాయింపులను తగ్గిస్తూ వచ్చినప్పటికీ పనికి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో 2017–18 నాటికి రూ. 5,000 కోట్ల రూపాయల విలువైన అదనపు వ్యయం వెచ్చించాల్సి వచ్చింది. పర్యవసానంగా, వేతన చెల్లింపుల్లో ఆలస్యం జరిగింది. 2017–18 సంవత్సరం తొలి సగంలో 32 శాతం వేతనాలు మాత్రమే సకాలంలో పంపిణీ చేయగలిగారు. పైగా రాష్ట్ర కనీస వేతనాల కంటే తక్కువ స్థాయిలో జాతీయ ఉపాధి హామీ పథకంలో చెల్లించే వేతనాలు తగ్గుస్థాయికి పడిపోయాయి. ఈ అడ్డంకులను అధిగమించడం పరిష్కరించడం సంక్లిష్టంగా మారింది. అయితే కేంద్ర ప్రభుత్వం జీడీపీలో 10 శాతం వరకు అధిక అప్పులను చేస్తున్నప్పుడు ఉపాధి హామీ పథకాన్ని విస్తరింపజేయడం ఎలా అనేది ప్రశ్న. ప్రభుత్వం అప్పుల జోలికి వెళ్లకుండానే ఈ పథకానికి నిధులను సమకూర్చవచ్చు. ఎరువులు, నీరు, విద్యుత్ వంటి వాటిపై ఇస్తున్న భారీ సబ్సిడీలను దశలవారీగా హేతుబద్దీకరించడం ద్వారా ఇది సాధ్యపడుతుంది. సంక్షోభం అనూహ్య అవకాశాలను కల్పిస్తుంది. భారతీయ సబ్సిడీ రాజ్‌ని సంస్కరించడం చాలాకాలంగా పెండింగులో ఉంది. ఉపాధి హామీ పథకాన్ని విస్తృతం చేయడం అంటేనే వ్యవస్థ నిర్మాణాత్మక సంక్షోభానికి ఒక పరిష్కారం కావచ్చు. యామిని అయ్యర్, సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ -
నేతలకు ఉపాధి
► రూ.కోట్లు కొల్లకొడుతున్న అధికార పార్టీ నాయకులు ► సహకరిస్తున్న అధికారులు ► సోషల్ ఆడిట్లో వెలుగుచూస్తున్న నిజాలు ► రికవరీ ఊసే లేదు ఉదయగిరి : జాతీయ ఉపాధిహామీ పథకం పనుల్లో అవినీతికి పాల్పడిన అధికారులు, సిబ్బందిని సస్పెండ్ చేస్తున్నా తిరిగి రాజకీయ నేతల సిఫార్సులతో తక్కువ వ్యవధిలోనే విధుల్లో చేర్చుకుంటుండటంతో పరిస్థితిలో ఎలాంటి మార్పు ఉండటంలేదు. యంత్రాలతో చేయించి.. జిల్లాలోని 42 మండలాల్లో ఉపాధి హామీ పథకం అమలులో ఉంది. కొన్ని మండలాల్లో కూలీల చేత చేయిం చాల్సిన పనులను యంత్రాలతో చేయించడం, బినామీ మస్టర్లు వేయటం, పనులు చేయకుండానే రికార్డుల్లో చేసినట్లుగా నమోదుచేస్తున్నారు. ఊటకుంటలు, చెక్‌డ్యాంలు, ఇతర సామగ్రి పనుల్లో భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారు. మూడేళ్లనుంచి ఈ పనుల్లో అవినీతిస్థాయి భారీగా పెరిగింది. ► దుత్తలూరు మండలంలో గతేడాదిలో జరిగిన ఉపాధిహామీ పనుల్లో అంతులేని అవినీతి చోటుచేసుకుంది. ఇక్కడ రూ.10.57 కోట్లతో పనులు జరగ్గా, అందులో రూ.5.94 కోట్లు అవినీతి జరిగినట్లు అధికారులు గుర్తించారు. దీనికి బాధ్యులైన సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఎంపీడీఓను కూడా విధుల నుంచి తొలగించారు. నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయించిన పలువురు సిబ్బందిపై, సప్లయ్దారులపై ఆర్ఆర్ యాక్ట్కింద కేసులు చేసి రికవరీకి ఆదేశించారు. కానీ రాజకీయ జోక్యంతో ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. రికవరీలు చెల్లించలేదు. దీనివెనుక అధికార పార్టీ పెద్దల హస్తం ఉందనే విష యం స్పష్టం. ► బాలాయపల్లి మండలంలో గతేడాది జరిగిన రూ.11.63 కోట్ల ఉపాధి పనులకు సంబంధించి గత జూన్‌లో సామాజిక తనిఖీ నిర్వహించగా రూ.3 కోట్లు అవినీతి జరిగినట్లు తేలింది. ఇందులో డ్వామా అధికారులు రూ.25 లక్షలు రికవరీ పెట్టారు. కానీ ఇంతవరకు రికవరీ చెల్లించలేదు. ► ఈనెల 19వ తేదీన సీతారామపురం మండలంలో జరిగిన సామాజిక తనిఖీల్లో రూ.9.84 కోట్లు అవినీతి జరిగినట్లు గుర్తించారు. డ్వామా అధికారులు ఈ అవినీతిని కప్పెట్టి రూ.87 లక్షలు వివిధ వర్గాలనుంచి రికవరీకి ఆదేశించారు. దీనికి బాధ్యులైన వారిపై ఎలాంటి చర్యలు చేపట్టలేదు. రికవరీ ఎప్పుడో..? ఉపాధిహామీ పనులు జరిగిన ఈ పదేళ్లలో ఎనిమిదిసార్లు సామాజిక తనిఖీ బృందాలు క్షేత్రస్థాయి పరిశీలన జరిపి జరిగిన పనులను చూశారు. వీరి తనిఖీల్లో రూ.కోట్లు అవినీతి జరిగినట్లుగా గుర్తించి నివేదికలు ఇచ్చినప్పటికీ డ్వామా అధికారులు బహిరంగ చర్చావేదికల్లో తగ్గించి చూపిస్తున్నారు. ఈ పథకం జిల్లాలో ప్రారంభమైన నాటినుంచి నేటివరకు రూ.6.25 కోట్లు రికవరీకి ఆదేశాలిచ్చారు. కానీ ఇంతవరకు అందులో సగం కూడా వసూలుకాలేదు. పైగా రాజకీయ నాయకుల సిఫార్సులతో పలువురు సిబ్బం ది, సప్లయ్దారులు తమపై విధించిన రికవరీలను భారీగా తగ్గించుకుంటున్నారు. రికవరీలు కట్టిస్తున్నాం ఉపాధిహామీలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటున్నాం. నిధులు రికవరీ పెడుతున్నాం. ఇప్పటికే కొంత మొత్తంలో రికవరీ కట్టించాం.ఉపాధి సిబ్బందికి సంబంధించి జీతాల్లో కట్‌చేసి రికవరీకి జమ చేస్తున్నాం. తప్పుచేసిన వారిపై చర్యలు తప్పవు. – హరిత, డ్వామా పీడీ