వైఎస్సార్సీపీ నేతలపై కక్ష
రేణిగుంట/కొలిమిగుండ్ల: వైఎస్సార్సీపీ నేతలపై కక్ష గట్టి నష్టం చేకూర్చిన ఘటనలు తిరుపతి, నంద్యాల జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం ఇనగలూరులో వైఎస్సార్సీపీ నేత, సర్పంచ్ చెలికం నాగరాజురెడ్డి తన పొలం (లీజు)లో ఉన్న 100 టన్నుల టేకు కొయ్యలను కట్ చేయించి గ్రామ శివారులో ఉన్న తన స్థలంలో నిల్వ చేశారు. ఇది తెలుసుకున్న కొందరు గురువారం అర్ధరాత్రి వాటికి నిప్పు పెట్టారు. టేకు కలప ఉంచిన ప్రాంతంలో మంటలు ఎగుస్తుండటంతో స్థానికులు గుర్తించి నాగరాజురెడ్డికి సమాచారం ఇచ్చారు.మంటలను ఆర్పేందుకు ప్రయత్నించగా వీలు కాలేదు. అవి పూర్తిగా కాలిపోవడంతో రూ.10 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపారు. గ్రామానికి చెందిన కొందరు అధికార పార్టీ నాయకులు తనను భయభ్రాంతులకు గురిచేసేందుకు తగులబెట్టారని ఆయన మండిపడ్డారు. ఇందుకు కారకులైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో ఘటనలో నంద్యాల జిల్లా హనుమంతుగుండంలో వైఎస్సార్సీపీ నేత పాణ్యం ఖాన్బాదర్కు చెందిన పొలానికి కొందరు వ్యక్తులు శుక్రవారం నిప్పు పెట్టారు.గ్రామ సమీపంలోని ఆంజనేయస్వామి గుండం వద్ద ఉన్న ఎకరం పొలంలో పశువుల మేత కోసం గడ్డి సాగు చేశాడు. కొందరు ఉద్దేశ పూర్వకంగా పెట్రోల్ పోసి నిప్పు పెట్టడంతో పశుగ్రాసం పూర్తిగా కాలిపోయింది. బోరులో నుంచి తీసి పక్కన పెట్టిన 40 పైపులు దగ్ధమయ్యాయి. నీళ్లు పారించేందుకు ఏర్పాటు చేసిన పది లింక్ పైపులు, స్టార్టర్ బాక్స్, విద్యుత్ తీగ కాలిపోయింది. రూ.3 లక్షల మేర నష్టం వాటిల్లిందని ఖాన్బాదర్, రమీజాబి దంపతులు కన్నీటిపర్యంతమయ్యారు. పక్కనే ఉన్న గడ్డివామికి కూడా నిప్పంటించి వెళ్లారు. అయితే అదే సమయంలో పొలంలోకి వచ్చిన రమీజాబి గమనించి మంటలను ఆర్పేసింది. బాధితుడు వైఎస్సార్సీపీ తరఫున 2024 ఎన్నికల్లో ఏజెంట్గా కూర్చున్నాడు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత డిసెంబర్లో టీడీపీ నాయకులు పట్టుబట్టి ఇతన్ని వీఓఏగా తొలగించారు. భార్య రమీజాబి చాలా ఏళ్లుగా ఉపాధి హామీ పథకంలో మేటీగా పని చేస్తోంది. ఆమెను మేటీగా తొలగించాలని టీడీపీ నేతలు కొద్ది రోజులుగా ఒత్తిడి చేస్తున్నారు. ఎలాగైనా తమను ఇబ్బంది పెట్టాలనే దురుద్దేశంతో టీడీపీ నాయకులే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని ఖాన్బాదర్ దంపతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కొలిమిగుండ్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.పాలన మరచి పగబట్టారు : ఎంపీ గురుమూర్తి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, పాలనను మరచి కేవలం వైఎస్సార్సీపీ నాయకులు, సానుభూతిపరులే లక్ష్యంగా విధ్వంసం సృష్టిస్తోందని తిరుపతి ఎంపీ గురుమూర్తి మండిపడ్డారు. ఇనగలూరు సర్పంచ్ చెలికం నాగరాజురెడ్డికి చెందిన టేకు కొయ్యలకు నిప్పంటించిన ప్రాంతాన్ని శుక్రవారం సాయంత్రం ఆయన పరిశీలించారు. బాధితుడు నాగరాజు రెడ్డికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగాన్ని మరచి, రెడ్ బుక్ రాజ్యాంగ పాలనను అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధితునికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.