breaking news
MPPEB
-
పుట్టినవాడు గిట్టక మానడు!
‘వ్యాపమ్’ నిందితుల మరణాలపై మధ్యప్రదేశ్ హోం మంత్రి భోపాల్: ‘పుట్టినవాడు గిట్టక మానడు..మరణం అనేది సహజం.. అది జైల్లో అయినా.. రైల్లో అయినా.. ఒకసారి పుడితే చనిపోక తప్పదు’.. మధ్యప్రదేశ్ హోం మంత్రి బాబూలాల్ గౌర్ అన్న మాటలివి. సంచలనం సృష్టించిన ఆ రాష్ట్ర వృత్తి పరీక్షల బోర్డు(ఎంపీపీఈబీ) అలియాస్ వ్యాపమ్ స్కాం నిందితులు ఒకరి తరువాత ఒకరు చనిపోవటంపై మంత్రి చేసిన వ్యాఖ్యలివి. ఈ స్కాంలో ఇద్దరు నిందితులు 24 గంటల వ్యవధిలో చనిపోవటంపై సీబీఐ విచారణ జరిపించటానికి సోమవారం ఆయన తిరస్కరించారు. తమ విచారణ సరైన దిశలోనే సాగుతోందన్నారు. వ్యాపమ్ కేసులకు సంబంధించి దాదాపు వందమంది నిందితులలో 25మంది చనిపోయారు. ‘మద్యపానం ప్రాథమిక హక్కు..’: మద్యపానం ప్రాథమిక హక్కు, సామాజిక హోదాకు చిహ్నమని బాబూలాల్ గౌర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మద్యంతో నేరాలు పెరగవన్నారు. భోపాల్‌లో మద్యం అమ్మకాల సమయాన్ని రాత్రి 11.30కు పొడిగించడంపై ఆయనిలా స్పందించారు. -
రాజకీయ పోరుకు కోర్టులు వేదికలు కాదు
జబల్పూర్ (మధ్యప్రదేశ్): రాజకీయ పోరాటానికి కోర్టులు వేదికలు కాబోవని, ఏదైనా అంశంపై కోర్టును ఆశ్రయించేటపుడు న్యాయశాస్త్రబద్ధంగా సరైన పద్ధతిలోనే పిటిషన్‌ను దాఖలు చేయాలని మధ్యప్రదేశ్ హైకోర్టు సోమవారం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్‌కు స్పష్టంచేసింది. మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ బోర్డు కుంభకోణంపై సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేస్తూ దిగ్విజయ్ రాసిన లేఖకు స్పందనగా మధ్యప్రదేశ్ హైకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఆయన లేఖను ధర్మాసనం పక్కనబెట్టింది. కోర్టును ఏదో డిమాండ్ చేస్తున్న ధోరణిలో లేఖ రాయడం చెడు సంప్రదాయానికి దారితీస్తుందని, కోర్టులకు వాటి సొంత పద్ధతులంటూ ఉంటాయని జస్టిస్ ఏఎం ఖన్వినల్కర్, జస్టిస్ అలోక్ అరాధేలతో కూడిన ధర్మాసనం హితవు చెప్పింది. రాజకీయ యుద్ధక్రీడలకు కోర్టులు వేదికలు కాబోవని, అలాటి క్రీడల్లో కోర్టులకు ప్రమేయం కల్పించినట్టుగా వ్యవహరించవద్దని కూడా స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్ ప్రొపెషనల్ బోర్డు కుంభకోణం కేసులో విద్యార్థులను, వారి తల్లిదండ్రులను అర్థరాత్రే అరెస్ట్ చేశారని, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం (ఆరెస్సెస్) ప్రమేయం ఉన్నా వారిని ప్రశ్నించనే లేదని దిగ్విజయ్ తాను ఇదివరకు హైకోర్టుకు రాసిన లేఖలో ఆరోపించారు. కాగా, తన లేఖను పిటిషన్‌గా స్వీకరించేందుకు హైకోర్టు నిరాకరించిన అంశంపై తదుపరి చర్యగురించి న్యాయవాదులను సంప్రదిస్తున్నట్టు దిగ్విజయ్ చెప్పారు. పంటనష్టపోయిన రైతులకు తగిన పరిహారం, ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డు కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు అంశాలపై మధ్యప్రదేశ్‌లోని గుణాలో సోమవారం ఏడురోజుల నిరాహార దీక్షను ప్రారంభించిన సందర్భంగా దిగ్విజయ్ ఈ విషయం చెప్పారు.