ఆపదలో ఆమె సైతం..!
ఆపదలో ఆదుకునే రెస్క్యూ టీమ్‌లో సైతం మహిళలకు అవకాశం కల్పించిన సంస్థగా సింగరేణి రికార్డు సొంతం చేసుకుంది. సింగరేణిలో మేనేజ్మెంట్ ట్రెయినీగా పని చేస్తున్న అంబటి మౌనిక ఇటీవల రెండోసారి రెస్క్యూ శిక్షణను విజయవంతంగా పూర్తి చేశారు. ఖమ్మం నగరానికి చెందిన అంబటి మౌనిక కొత్తగూడెం కేఎస్ఎం కాలేజీలో మైనింగ్ పూర్తి చేసింది. ఆ తర్వాత రాజస్థాన్‌లో ఓ ప్రైవేటు సంస్థలో మైనింగ్ ఇంజనీర్‌గా చేరింది. అప్పటికే ఆ సంస్థలో 15 శాతం వరకు మహిళలు పని చేస్తున్నారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే సీపీఆర్‌తో పాటు ఇతరత్రా సాయం చేసేందుకు వీలుగా రెస్క్యూ టీమ్‌లో మహిళల అవసరం ఏర్పడింది. ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థలే సమర్థంగా రెస్క్యూ టీమ్‌లను నిర్వహిస్తుండగా.. వెస్టర్న్ కోల్‌ఫీల్డ్‌కు సంబంధించిన నాగ్‌పూర్ రెస్క్యూ శిక్షణ కేంద్రానికి మౌనికను ఆ సంస్థ పంపింది. అయితే తాను తెలంగాణ అమ్మాయినని, సింగరేణిలో ట్రైనింగ్‌కు వెళ్తానని అంటే.. ‘అక్కడ శిక్షణ మరింత కఠినంగా ఉంటుంది. మహిళలు అది తట్టుకోలేరు’ అంటూ రాజస్థాన్ కంపెనీ ఆమె ప్రతిపాదనను తిరస్కరించింది. దీంతో నాగ్‌పూర్‌లోనే బ్రిగేడియర్‌గా మౌనిక శిక్షణ పొందింది. సింగరేణిలో మేనేజ్మెంట్ ట్రెయినీగా..మేనేజ్మెంట్ ట్రెయినీ (మైనింగ్) పోస్టులకు 2024లో నోటిఫికేషన్ రావడం, అందులో తొలిసారిగా మహిళలకు అవకాశం ఇవ్వడంతో మౌనిక సింగరేణి రామగుండం ఏరియాలో జాయిన్ అయింది. ఈ సంస్థలో పనిచేసే మహిళా కార్మికులు, ఉద్యోగులు, స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కఠినమైన రెస్క్యూ టీమ్ మెంబర్‌గా మారేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.సింగరేణిలో రెస్క్యూ టీమ్ బ్రిగేడియర్‌గా మారాలంటే కఠినమైన శిక్షణ దాటాలి్సందే. ఎందుకంటే విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్న మనుషుల ప్రాణాలను ఈ బ్రిగేడియర్లు కాపాడాల్సి ఉంటుంది. దానికి తగ్గట్టుగా తనకు మించిన బరువులు మోయడం, బరువైన వçస్తువులను పక్కకు నెట్టడం వంటి తదితర అంశాల్లో తర్ఫీదు ఇస్తారు. కఠినమైన శిక్షణ.. శిక్షణలో భాగంగా 30 కేజీల చొప్పున ఉండే రెండు ఇసుక సంచులను రెండు చేతులతో వంద మీటర్ల పాటు ఆగకుండా మోయాల్సి ఉంటుంది. దీంతో పాటు బరువైన టైర్లను అటూ ఇటు ఫ్లిప్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత గాలి, వెలుతురు సరిగా లేని చోటుకు వెళ్లి సహాయక చర్యలు అందించేలా 15 కేజీల బరువు ఉండే బ్రిగేడియర్ పరికరాలు శరీరానికి తగిలించుకుని ఆపద సమయంలో అవలీలగా పని చేయాలి. అంటే ప్రమాదాలు జరిగినప్పుడు సగటున 80 కేజీల బరువు ఉండే మనుషులను మోయడం, అడ్డదిడ్డంగా పడి పోయి ఉండే శిథిలాలను పక్కకు జరపడం వంటి పనులు సులువుగా చేసే సామర్థ్యం సంతరించుకునేలా రెస్క్యూ మెంబర్లకు శిక్షణ ఇస్తారు. రాష్ట్ర సేవల్లో ఒకే ఒక్కరు..ప్రస్తుతం తెలంగాణలో అంబటి మౌనిక ఒక్కరే మహిళా రెస్క్యూ బ్రిగేడియర్‌గా ఉన్నారు. ఇటీవల మహిళా దినోత్సవం సందర్భంగా మౌనికను మంత్రులు కిషన్‌రెడ్డి, సీతక్క ప్రశంసించడంతో పాటు సత్కరించారు. తెలంగాణ నుంచి మొత్తం ముగ్గురు రెస్క్యూ బ్రిగేడియర్లుగా ఉండగా.. వీరంతా కొత్తగూడెం ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్న వారే కావడం విశేషం. వీరిలో మౌనిక సింగరేణి కొత్తగూడెం ఏరియాలో పని చేస్తుండగా మిగిలిన ఇద్దరూ ఇతర రాష్ట్రాల్లో సేవలు అందిస్తున్నారు.వెలకట్టలేని విలువఆపదలో మనం చేసే సాయం ఎంత విలువైందో, ప్రాణాలు ఎలా కాపాడుతుందో రెస్క్యూ టీమ్ శిక్షణలో చెబుతారు. పాఠాలుగా విన్నప్పుడు ఆ మాటలు ఎంతో విలువైనవో సరిగా అర్థం కాలేదనే చెప్పాలి. కానీ, ఓసారి జైపూర్ ఎయిర్‌పోర్టులో ఉండగా ఒక మహిళ ఛాతినొప్పితో పడిపోయింది. నేను వెంటనే స్పందించి సీపీఆర్ అందించాను. కాసేపటికి ఆ మహిళ కోలుకుంది. అప్పుడు అర్థమైంది నేను పొందిన శిక్షణ ఎంత విలువైందనేది.– అంబటి మౌనిక– సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం (చదవండి: నిన్న పిజ్జా మేకర్.. నేడు ఫ్యాషన్ మోడల్..! అంతర్జాతీయ ఫ్యాషన్ పత్రికలు..)