breaking news
mining branch
-
తగ్గిన ఇసుక మోత!
• క్యూబిక్ మీటర్‌పై ఉన్న రూ.560 రుసుము తొలగింపు • నీటిపారుదల-మైనింగ్ శాఖల మధ్య అవగాహన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై ఇసుక భారం తగ్గనుంది. ఇసుకను నేరుగా నీటిపారుదల శాఖే తీసుకునేలా వెసులుబాటు ఇవ్వడం, గతంలో విధించిన రుసుమును ఇప్పుడు పూర్తిగా ఎత్తివేయడంతో ప్రాజెక్టుల వ్యయం తగ్గుతోంది. ఈ మేరకు మంత్రి హరీశ్‌రావు నిర్వహించిన సమీక్ష సందర్భంగా నీటి పారుదల, మైనింగ్ శాఖల మధ్య అవగాహన కుదిరింది. అయితే నీటిపారుదల శాఖ సీనరే జీ చార్జీలను మాత్రం చెల్లించాల్సి ఉంటుంది. భారీగా ఇసుక అవసరాలు ప్రస్తుతం రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు మొత్తంగా 1.87 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరాలు ఉన్నాయి. గతంలో ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమయ్యే ఇసుకను సమకూర్చుకోవాల్సిన బాధ్యత పూర్తిగా కాంట్రాక్టర్లపైనే ఉండేది. మైనింగ్ శాఖ ఇసుక క్వారీలను గుర్తించి కలెక్టర్‌కు నివేదించేది. దానికి అనుగుణంగా కలెక్టర్ క్వారీల కేటాయింపు చేసేవారు. ఈ ప్రక్రియకు నెలల తరబడి సమయం పడుతుండడం, రీచ్‌లు కేటాయించినా వాటిలో తగినంత ఇసుక లభ్యతగా లేకపోవడంతో ప్రాజెక్టుల నిర్మాణాల్లో జాప్యం జరుగుతోంది. దీనికితోడు క్యూబిక్ మీటర్ ఇసుకకు రూ.560 రుసుముగా నీటి పారుదల శాఖ నుంచి మైనింగ్ శాఖ వసూలు చేసేది. అదనంగా రూ.40 చొప్పున సీనరేజీ చార్జీలు వసూలు చేసేవారు. వీటిని నీటి పారుదలశాఖ ప్రాజెక్టు వ్యయాల్లోనే చూపేది. దీంతో ఒక్కో ప్రాజెక్టుకు ఇసుక కోసం వందల కోట్లను ఖర్చు చేయాల్సి వచ్చేది. పాలసీలో సవరణలతో.. తాజాగా ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన ఇసుకను రిజర్వాయర్ల నుంచి నీటి పారుదల శాఖ సొంతంగా వెలికితీసి వినియోగించుకునేలా రాష్ట్ర ఇసుక పాలసీలో సవరణలు చేశారు. నీటిపారుదల శాఖకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఇసుక మేటలను గుర్తించిన తర్వాత.. మైనింగ్ ఏడీ, ఇరిగేషన్ ఈఈలు సంయుక్తంగా హద్దులను నిర్ణయిస్తారు. అలా లభించే ఇసుక పరిమాణం లెక్కించి.. జిల్లాస్థాయి ఇసుక కమిటీ ఆమోదానికి పంపుతారు. ఇక ఇసుక వెలికితీతలో ఎలాంటి అక్రమాలు జరుగకుండా ట్రక్కులకు జీపీఎస్ అమర్చడం, పరిమాణానికి అనుగుణంగా సీనరేజీ చార్జీలను మైనింగ్ విభాగానికి చెల్లించాల్సిన బాధ్యతలను ఇరిగేషన్ ఈఈకి అప్పగించాలని నిర్ణయించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాంతాల్లో ఏకంగా 22 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులో ఉందని మైనింగ్ శాఖ గుర్తించింది. ఆ ఇసుకను కాళేశ్వరం ప్రాజెక్టు అవసరాలకు వాడాలని నిర్ణయించారు -
యథేచ్ఛగా బుసక అక్రమ తవ్వకాలు
పెడన రూరల్, న్యూస్‌లైన్ : మండల పరిధిలోని మడక గ్రామ పంచాయతీ ఇసుక మేటల నుంచి బుసక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యారు. కొంత మంది బుసక మాఫీయాదారులు సీండికేట్గా ఏర్పడి మైనింగ్ శాఖ అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా రోజుకు లక్షలాది రూపాయల విలువ చేసే బుసక ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయంలో మండల రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇందుకు కారణం మాఫియా వెనుక రాజ కీయ పెద్దల హస్తం ఉండడమేనని విమర్శలున్నాయి. ఓ బిల్టర్ మడక గ్రామంలో సహజ సిద్ధంగా ఏర్పడిన బుసక మేటలున్న 20 ఎకరాల పొలాన్ని ఇటీవల కొనుగోలు చేసి బుసక తవ్వకాలు నిర్వహించుకునేందుకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ మైనింగ్ శాఖ నుంచి ఎటువంటి అనుమతులు రాకుండానే... పంట పొలాన్ని చదును చేసుకునేందుకు అనుమతులొచ్చాయని చెబుతూ బుసక తరలిస్తున్నారనే ఆరోపణ లున్నాయి. ఈ విషయంలో రెవెన్యూ అధికారులను ప్రలోభాలకు గురి చేసి వారి అండదండలతో పగలు రాత్రి అనే తేడా లేకుండా నిత్యం వందలాది వాహనాల్లో బుసకను అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారనే విమర్శలున్నాయి. బుసక క్వారీలో పొక్లెయిన్ ఏర్పాటు చేసి ఒక్కో టిప్పర్‌కు రూ.1500, ట్రాక్టర్‌కు రూ.300 నగదు వసూలు చేస్తున్నారు. దళారులు బుసక ఒక్కొ టీప్పర్ను రెండు నుంచి మూడు వేల వరకు ట్రాక్టర్‌ను రూ.600 నుంచి 800 వరకు విక్రయిస్తున్నారు. దూరాన్ని బట్టి బుసకకు రేటు నిర్ణయిస్తున్నారు. బుసక అక్రమ తరలింపులో మండల రెవెన్యూ అధికారి కార్యాయంలోని ఓ వీఆర్ఏ ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది. సదరు వీఆర్ఏ ద్వారా మండల రెవెన్యూ కార్యాలయంలోని కిందిస్థాయి అధికారి నుంచి పైస్థాయి అధికారి వరకు భారీగా ముడుపులు తీసుకుని వారికి సహకారం అందిస్తున్నారనే ఆరోపణలున్నాయి. బుసకను భవన నిర్మాణాలు చేసే ప్రాంతాలను మేరక చేసుకునేందుకు ఉపయోగిస్తున్నారు. గూడూరు మండలం తరకటూరు ప్రాంతంలో ఓ రైస్ మిల్లు నిర్మాణం కోసం వందల టిప్పర్లు తరలి వెళుతున్నాయి. వీటితో పాటు బందరు, బంటుమిల్లి, గూడూరు, కృత్తివెన్ను గుడ్లవల్లేరు, గుడివాడ, పామర్రు, ఉయ్యూరు మండలాలకు టిప్పర్లు, ట్రాక్టర్లపై పరదాలు కప్పి బుసకను అక్రమంగా తరలిస్తున్నారు. బుసక క్వారీ నుంచి ప్రతి రోజూ సుమారు లక్ష నుంచి ఐదు లక్షల రూపాయల విలువ చేసే బుసక తరలిపోతున్నట్లు సమాచారం. ఈ విషయమై స్థానిక తహశీల్దార్ కొగంటి ఉమారాణిని న్యూస్‌లైన్ వివరణ కోరగా బుసక తవ్వకాల గురించి ఎవరికీ ఎటువంటి అనుమతులు లేవని, విచారణ నిర్వహించి అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. వారి నుంచి రెవెన్యూ కార్యాలయ సిబ్బందికి ముడుపులు ఏమి అందలేదని, అవన్నీ నిరాధార ఆరోపణలని ఆమె చెప్పారు. చేపల చెరువుల తవ్వకాలకు రంగం సిద్ధం... మడకలో గ్రామంలో బుసక దిబ్బలను చేపల చెరువులుగా మార్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మడకలో బిల్డర్ కొనుగోలు చేసిన 20 ఎకరాల్లో సహజ సిద్ధంగా ఏర్పడిన బుసక గుట్టలు ఉన్నాయి. ఈ గుట్టలను తరలించి ఆ ప్రాంతంలో అనధికారికంగా చేపల చెరువులను తవ్వేందుకు ప్రయత్నాలు జోరుగాసాగుతున్నాయి.