breaking news
migrants and refugees
-
గ్రీస్ పడవ విషాదం.. 500 మందికి పైగా గల్లంతు!
ఏథెన్స్: గ్రీస్ సమీపంలోని మెస్సేనియా పైలోస్ తీరంలో ఇటీవల జరిగిన పడవ ప్రమాదంలో 78 మంది మృతి చెందగా సుమారు 500 మంది గల్లంతై ఉంటారని అదే ప్రమాదంలో ప్రాణాలు దక్కించుకున్న ఇద్దరు యువకులు సిరియాకు చెందిన హసన్(23) పాకిస్తాన్ కు చెందిన రాణా(24) తెలిపారు. ఈ పడవలో 15 మంది సిబ్బంది, మొత్తంగా 700 మంది శరణార్థులు ప్రయాణిస్తున్నారని వారన్నారు. లిబియా నుండి అనేక మంది అక్రమ రవాణాదారులు చాలా ఏళ్లుగా శరణార్థులను ఇలా తరలిస్తూ ఉన్నారని, అక్కడ తనకు చాలా తక్కువ వేతనం లభిస్తుండటంతో జర్మనీ వెళ్లాలన్న ఆలోచనతో ప్రయాణమయ్యానని హసన్ అన్నాడు. మరో శరణార్థి రాణా తానూ ఇటలీ వెళ్లడం కోసం లిబియా అక్రమార్కులకు చాలా పెద్ద మొత్తంలో చెల్లించానని, కానీ వారు మాకు కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా చాలీచాలని నీళ్లు, ఆహారం ఇచ్చి నాలుగు రోజులు ప్రయాణంలో సర్దుకోమని చెప్పారన్నాడు. పడవలో ఇసుక వేస్తే రాలనంత జనం ఉన్నారు. మూడో రోజు పడవలోకి ఒక పక్క నుండి నీళ్లు రావడంతో జనమంతా కంగారుగా రెండో పక్కకు కదిలారు. అంతే క్షణాల్లో పడవ నీటమునిగింది. గ్రీస్ కోస్ట్ గార్డ్ బృందం వచ్చి కాపాడేంతవరకు మాకైతే ఏమీ తెలియలేదని వాళ్లిద్దరూ తెలిపారు. బోటులో సుమారుగా 500 మంది ప్రయాణిస్తున్నారని వారిలో 79 మంది మృతదేహాలను మాత్రమే గుర్తించామని 104 మంది ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారని మిగిలిన వారు గల్లంతై ఉంటారని వారు ప్రాణాలతో దొరికే అవకాశాలున్నాయని గ్రీస్ కోస్ట్ అధికారులు చెబుతున్నారు. ఇతర బోట్లతో పాటు డ్రోన్ల సాయంతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని వారు తెలిపారు. ఇది కూడా చదవండి: 3 వేల ఏళ్లయినా ‘కత్తి’లా ఉంది! -
సరిహద్దుల్లో పందుల తలకాయలు వేలాడదీస్తారా?
బుడాపెస్ట్: సిరియా దేశం నుంచి వస్తున్న ముస్లిం వలసలను నిరోధించేందుకు ఇంతవరకు భౌతిక దాడులకు దిగిన హంగేరి ప్రభుత్వం ఇప్పుడు అనైతిక చర్యకు ఆలోచన చేయడంపై ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సెర్బియా సరిహద్దు గుండా దేశంలోకి ముస్లింల వలసలను నిరోధించేందుకు సరిహద్దు కంచె వద్ద తెగ నరికిన పందుల తలలను వేలాడదీయాలంటూ యూరోపియన్ పార్లమెంట్ సభ్యుడు, హంగేరి పాలకపక్ష పార్లమెంట్ సభ్యుడు గ్యోర్జి స్కాఫిన్ సూచన చేశారు. దీనికి కొంత మంది పాలకపక్ష సభ్యులు మద్దతు పలగ్గా ప్రతిపక్ష సభ్యులు విమర్శలు గుప్పిస్తారు. ఈ సూచనపై మానవ హక్కుల సంఘాలు విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికే సరిహద్దు కంచె వద్ద వలస ప్రజలను భయపెట్టేందుకు క్యారెట్లతో తయారు చేసి, వేలాడదీసిన ‘దిష్టి బొమ్మ’లను తీసివేయాలని డిమాండ్ చేస్తున్న అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఇప్పుడు అంతకంటే భయంకరమైన ఆలోచన చేయడం పట్ల మండి పడుతున్నాయి. సిరియా దేశాల నుంచి వస్తున్న ముస్లిం ప్రజల వలసలను అరికట్టేందుకు సెర్బియా వద్ద హంగేరి గతేడాదే సరిహద్దును మూసివేసింది. ముట్టుకుంటే కోసుకుపోయే పదునైన రేసర్ లాంటి కంచెను ఏర్పాటు చేసింది. అయినా వలస ప్రజలు దూసుకువస్తుండడంతో హంగేరి సైన్యం వారిపై భౌతిక దాడులకు దిగింది. మహిళలు, పిల్లలు అనే విచక్షణ చూడకుండా ముస్లిం ప్రజలను పిడిగుద్దులు కురిపిస్తున్నారు. లాటీలు, తుపాకీ మడమలతో చితక బాదుతున్నారు. ఈ సంఘటనలపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం కూడా స్పందించి ఈ సంఘటనలపై దర్యాప్తు జరిపించాల్సిందిగా హంగేరి ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పటికీ సరిహద్దుల గుండా దాదాపు పది లక్షల మంది ప్రజలు తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించారని, వారికి ఎన్ని విధాలుగా నచ్చ చెప్పినా వలసలు ఆగడం లేదని హంగేరి ప్రభుత్వం వాదిస్తోంది.