breaking news
memon hanging
-
‘ఉరి’పై దుమారం..
న్యూఢిల్లీ: యాకూబ్ మెమన్ ఉరితీతపై ప్రభుత్వం, విపక్షాల మధ్య దుమారం చెలరేగింది. అసలు ఇంత అత్యవసరంగా మెమన్ ఉరితీతను ఎందుకు అమలు చేయాల్సివచ్చిందని, ఇందులో ప్రభుత్వం, న్యాయవ్యవస్థ విశ్వసనీయత ప్రశార్థకంగా మారిందని కాంగ్రెస్ సీనియర్ నేతలు దిగ్విజయ్‌సింగ్, శశిథరూర్ వ్యాఖ్యానించగా... మెమన్ ఉరి అమలు న్యాయ తప్పిదమని సీపీఎం విమర్శించింది. మరోవైపు ఈ విమర్శలపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. ఉగ్రవాదులను తప్పించేలా వ్యాఖ్యలు చేస్తూ వారు ప్రజలను అవమానిస్తున్నారని.. న్యాయ ప్రక్రియనే ప్రశ్నిస్తున్నారని విమర్శించింది. మెమన్ ఉరి అనంతరం దిగ్విజయ్‌సింగ్ ట్విటర్లో వరుసగా పలు ట్వీట్లు చేశారు. నిందితుల మతాన్ని బట్టి కాకుండా అన్ని ఉగ్రవాద కేసుల్లోనూ ఇదే తరహాలో వ్యవహరించాలన్నారు. మాలెగావ్ పేలుళ్ల కేసు దర్యాప్తులో జాప్యాన్ని ఉద్దేశిస్తూ... కొన్ని ఉగ్రవాద కేసుల దర్యాప్తుల విషయంలో తనకు కొన్ని అనుమానాలున్నాయని దిగ్విజయ్ పేర్కొన్నారు. ఒక వ్యక్తిని ఇలా నిర్దాక్షిణ్యంగా ఉరి తీయడం వల్ల ఉగ్రవాద దాడులు తగ్గిపోయినట్లు ఎక్కడా లేదని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ట్వీట్ చేశారు. మెమన్ను ఉరితీయడం న్యాయ తప్పిదమని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు. బాబ్రీ మసీదు కూల్చివేతతో ఏర్పడిన మతఘర్షణలే ముంబై బాంబు పేలుళ్లకు కారణమని శ్రీకృష్ణ కమిషన్ ఎప్పుడో స్పష్టం చేసిందని.. మరి ఆ ఘటనలకు సంబంధించిన వారిపై తీసుకున్న చర్యలేమిటని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మాలెగావ్, సంరతా ఎక్స్‌ప్రెస్ పేలుళ్లు వంటి హిందూత్వ ఉగ్రవాద కేసుల్లో ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆరోపించారు. మాలెగావ్ పేలుళ్లు, గుజరాత్ అల్లర్లకు కారణమైన స్వామి అసీమానంద్, పురోహిత్, బాబు బజరంగిలను కూడా ఉరితీయాలనిఎంఐఎం నేత ఒవైసీ డిమాండ్ చేశారు. -
కసబ్..అఫ్జల్...మెమన్..
న్యూఢిల్లీ : గత మూడేళ్లలో యాకుబ్ మెమన్ది మూడో ఉరితీత. దేశంలో గడిచిన మూడేళ్ల కాలంలోమూడు ఉరిశిక్షలు అమలు అయ్యాయి. 2008 ముంబై మారణకాండలో సజీవంగా పట్టుబడ్డ కసాయి అజ్మల్ అమీర్ కసబ్ 2012 నవంబరు 12న పుణేలోని యెరవాడ జైలులో ఉరితీశారు. తర్వాత 2013 ఫిబ్రవరి 9న అఫ్జల్ గురు (పార్లమెంటుపై దాడి కేసులో మరణశిక్ష పడింది)ను తీహార్ జైలులో ఉరి తీశారు. ఆ తర్వాత అతడిని జైలులోనే ఖననం చేశారు. ఇక ముంబై పేలుళ్ల కేసులో నిందితుడు యాకుబ్ మెమన్ను గురువారం మహారాష్ట్రలోని నాగపూర్ సెంట్రల్ జైలులో ఉరి తీసిన విషయం తెలిసిందే. కాగా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2004 నుంచి 2015 మధ్యకాలంలో దేశంలోని వివిధ కోర్టులు ఏకంగా 1,303 మందికి మరణదండన విధించాయి. అయితే వీరిలో వెస్ట్ బెంగాల్ (2004), మహారాష్ట్ర (2012), ఢిల్లీ (2013)కి చెందిన ముగ్గురు మాత్రమే ఉరికంబం ఎక్కారు. ఓ టీనేజీ అమ్మాయిని రేప్ చేసి చంపిన వాచ్‌మన్ ధనంజయ్ ఛటర్జీని 2004 ఆగష్టు 14న వెస్ట్ బెంగాల్‌లోని అలిపోర్ సెంట్రల్ జైలులో ఉరితీశారు. ఇక 2004 -2014 మధ్య కాలంలో ఎవరికీ ఉరిశిక్ష అమలు కాలేదు. ఈ పదేళ్ల కాలంలో 3.751 ఉరిశిక్షలను వివిధ కోర్టులు జీవితఖైదుగా మార్చాయి.