breaking news
the mayor murder case
-
పోలీసుల అదుపులో బాంబు కేసు నిందితులు
చిత్తూరు (అర్బన్): చిత్తూరు నగరంలోని జిల్లా న్యాయస్థానాల సముదాయంలో జరిగిన బాంబు పేలుడు ఘటనలో పోలీసులు ఐదుగురు పాత నేరస్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 7వ తేదీన చిత్తూరు కోర్టులో బాంబు పేలడం, ఓ న్యాయవాది గుమస్తా గాయపడిన విషయం తెలిసిందే. కేసు విచారణలో భాగంగా పోలీసులు ఇప్పటికే మేయర్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూ అనుచరులను, కటారి వర్గీయులను విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 2007లో చిత్తూరు సీకే.బాబుపై మందుపాతర దాడి ఘటన కేసులో ప్రధాన నిందితులుగా కటారి మోహన్, చింటూ, కటారి ప్రవీణ్‌లతో పాటు మాజీ నక్సల్స్ కూడా ఉన్నారు. శుక్రవారం చిత్తూరు కోర్టులో ఈ కేసు విచారణకు వచ్చింది. కేసు విచారణకు చింటూ తప్ప మిగిలిన నిందితులు హాజరయ్యారు. వీరిలో రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌కు చెందిన ఐదుగురిని వన్‌టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీకే.బాబుపై జరిగిన మందుపాతర ఘటన, కోర్టులో జరిగిన బాంబు పేలుడు రెండూ ఒకేలా ఉండడంతో వీరికి సంబంధాలు ఉన్నాయా..? అనే దిశగా పోలీసులు విచారణ చేస్తున్నారు. -
కడప జైలుకు చింటూ
చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూను పోలీసులు కడప జైలుకు తరలించారు. జంట హత్య కేసులో నిందితుడిగా ఉన్న చింటూను కస్టడీకు తీసుకున్న గడువు పూర్తవడంతో ఆదివారం అతన్ని పోలీసులు చిత్తూరు నగరంలోని నాలుగో అదనపు మునిసిఫ్ మేజిస్ట్రేట్ యుగంధర్ ముందు హాజరుపరిచారు. కాగా చింటూకు కోర్టు విధించిన రిమాండ్ పూర్తవడంతో సోమవారం అతన్ని కడప నుంచి చిత్తూరుకు తీసుకొచ్చే అవకాశం ఉంది.