అంగారక గ్రహాన్ని సృష్టిస్తున్న చైనా
బీజింగ్: ఖగోళశాస్త్ర విజ్ఞాన రంగంలో కూడా వేగంగా దూసుకుపోతున్న చైనా భూమి మీద అంగారక గ్రహాన్ని సష్టిస్తోంది. అంటే, అంగారక గ్రహంపై ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయో అలాంటి పరిస్థితులనే భూమి మీద సృష్టించి, దాన్ని శాస్త్ర విజ్ఞాన పరిశోధక కేంద్రంగా, అటు పర్యాటక ప్రాంతంగా అభివద్ధి చేయాలని ప్రణాళిక వేసి అప్పుడే పనులను కూడా ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్కోసం కింఘాయ్ రాష్ట్రంలో 95 వేల చదరపు మైళ్లు విస్తరించి ఉన్న ఎడారి ప్రాంతాన్ని ఎంపిక చేసింది. ఆ ఎడారిని ఎంపిక చేయడానికి కారణం అది కాస్త అంగారక గ్రహం ఉపరితలాన్ని పోలి ఉండడమే.
2020 సంవత్సరం నాటికి అంగారక గ్రహంపైకి పరిశోధక యంత్రాలను పంపించడం, ఆ తర్వాత అక్కడికి మానవ వ్యోమగాములను పంపించాలన్న వ్యూహంలో భాగంగానే భూమిపై అంగారక గ్రహాన్ని సష్టిస్తున్నట్లు చైనా అకాడమీ ఆఫ్ సైన్సెస్ అధికారి లీ జియావోకున్ తెలియజేశారు. 2020లో అంగారక గ్రహంపైకి పరిశోధన పరికరాలను పంపిస్తున్నట్లు చైనా గత జనవరి నెలలో ప్రకటించింది. ఇప్పటికే నాసా పంపించిన రోబోలు అక్కడ పరిశోధనలు సాగిస్తున్న విషయం తెల్సిందే. ఆలస్యంగా అంతరిక్షం పరిశోధనలపై దష్టిపెట్టిన చైనా ఆ రంగంలో కూడా ప్రపంచ ఆధిపత్యాన్ని సాధించాలని ఆశిస్తోంది.
కత్రిమంగా తాము సృష్టించే అంగారక గ్రహం ఎరోస్పేస్, ఆస్ట్రానమీ, జియోగ్రఫీ, జియాలోజీ, మెటియోరాలోజీ, న్యూ ఎనర్జీ రంగాల్లో అధ్యయనానికి ఉపయోగపడుతుందని చైనా అధికారులు అంటున్నారు. నాసా 2015లోనే అంగారక గ్రహం పోలిన వాతావరణ కేంద్రాన్ని సష్టించింది. ఆరుగురు వ్యోమగాములకు శిక్షణ ఇవ్వడం కోసమే నాసా ఆ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. వారు అందులో శిక్షణ కూడా పూర్తి చేసుకున్నారు. మరో పక్క పర్యాటకులను నేరుగా అంగారక గ్రహం మీదకు తీసుకెళ్లేందుకు స్పేస్ ఎక్స్ రాకెట్ కంపెనీ, తెస్లా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ యజమాని ఎలాన్ మాస్క్ కషి చేస్తున్నారు. అంగారక గ్రహం వెళ్లేందుకు ఒక పర్యాటకుడికి దాదాపు రెండు లక్షల డాలర్లు ఖర్చు అవుతుందన్నది ఆయన అంచనా.
చైనా ప్రాజెక్టు భూమి మీద కనుక, ఇదే ముందుగా పూర్తయ్యే అవకాశం ఉంది. అప్పుడు అంగారక గ్రహం వెళ్లేందుకు అంత డబ్బులు పెట్టలేని పర్యాటకులు భూమి ఉపరితలంపై వెలసిన అంగారక గ్రహ వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు. డబ్బుపెట్టే స్థోమత ఉన్నవాళ్లు కూడా ఇక్కడ ఆ వాతావరణాన్ని అనుభవించి, అంగారకుడిపై కూడా అలాగే ఉంటుందా? అన్న అంశాన్ని అనుభవ పూర్వకంగా తెలసుకోవచ్చు.