breaking news
Manjulareddy
-
విజయ ‘గీత’: కసితో చదివారు.. ఆమె పేరు చివర ఆరు డిగ్రీలు
అవార్డులు ఊరికే రావు. ఆ అవార్డు వెనుక... అవార్డు అందుకున్న చేతులు చక్కబెట్టిన బాధ్యతలుంటాయి. ఆ చేతులు తీర్చిదిద్దిన జీవితాలుంటాయి. ఆ చేతులు చేతల్లో చూపించిన విజయాలుంటాయి. ‘బెస్ట్ ఉమన్ ఎంటర్ప్రెన్యూర్ ఫర్ మెంటారింగ్ స్టార్ట్ అప్స్’ అవార్డు అందుకున్న డాక్టర్ గీత ప్రస్థానమూ అలాంటిదే. జీవితంలో ఊహించని అవరోధం ఎదురు కానంత వరకు ఎవరూ జీవితాన్ని తరచి చూసుకోరు. అక్కడి నుంచి మొదలయ్యేదే అసలైన జీవితం... అంటారు యష్మిసొల్యూషన్స్ సీఈవో డాక్టర్ బి. గీతారెడ్డి. యువ పరిశ్రమ యువత పట్టాలు పుచ్చుకుని ఉద్యోగం కోసం ఎదురు చూడడమే మనకు తెలిసిన పురోగతి. ఉద్యోగం కోసం ఎదురు చూడడం కాదు, ఉద్యోగం ఇచ్చేలా ఎదగడం యువత లక్ష్యం అయి ఉండాలి. అందుకోసం ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నాను. ఏపీ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్‌తో మా ‘సిఐఎమ్ఎస్ఎమ్ఈ’ ఒప్పందం కుదుర్చుకుంది. సైన్స్, ఆర్ట్స్, కామర్స్, మేనేజ్మెంట్ స్టూడెంట్స్ అందరికీ ఎంటర్ ప్రెన్యూర్షిప్ అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించడం ఇందులో ఉద్దేశం. పరిశ్రమల రంగం యువకులతో, మహిళలతో నిండిపోవాలనేది నా కల. – డాక్టర్ బి. గీతారెడ్డి, చైర్పర్సన్, సిఐఎమ్ఎస్ఎమ్ఈ (ఏపీ స్టేట్). క్లస్టర్ డైరెక్టర్ (ఏపీ, ఒడిషా), కోవె ఎగ్జిక్యూటివ్ మెంబర్ యష్మి సొల్యూషన్స్ స్థాపించి సర్వీస్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారడానికి ముందు ఆమె తనకు ఎదురైన ఎన్నో సవాళ్లను మనోధైర్యంతో అధిగమించారు. ప్రభుత్వ భూముల కబ్జా వంటి అన్యాయాన్ని, అక్రమాన్ని ఎదిరించడంలో మొండిధైర్యంతో సాగిపోయారు. కసితో చదవడం మొదలు పెట్టారు. ఇప్పుడామె పేరు చివర ఆరు డిగ్రీలు కనిపిస్తాయి. అందరమ్మాయిల్లాగానే నేనూ వైజాగ్‌లో పుట్టి పెరిగిన గీత ఎంసీఎ పూర్తయిన తర్వాత పెళ్లయింది. ‘‘పెళ్లి తర్వాత కూడా చదవడమే పనిగా చదివాను. ‘ఒక సమస్య మీద గట్టిగా వాదిస్తావు. పెద్ద పోరాటమే చేస్తావు, నీకు లీగల్ నాలెడ్జ్ ఉంటే పది మందికి ఉపయోగపడతావని చెప్పాడు మా పెద్ద తమ్ముడు. ఆ మాటతో ఎల్ఎల్బీ చేశాను. ఎంబీఏ, ఆస్ట్రాలజీ, మెడికల్ ఆస్ట్రాలజీలో పీహెచ్డీ, ఉమెన్ ఇన్ ప్రొఫెషనల్ స్టడీస్‌లో పీహెచ్డీ చేశాను. ఇదే సమయంలో నాకంటూ ఒక మంచి యాక్టివిటీని అభివృద్ధి చేసుకున్నాను. అప్పుడప్పుడే డిజిటల్ మీడియా ఊపందుకుంటున్న రోజులవి. మా చిన్న తమ్ముడితో కలిసి డిజిటల్ మీడియా సెక్టార్లో సర్వీస్ మొదలు పెట్టాను. తర్వాత 2015లో సొంతంగా సర్వీస్ ఇండస్ట్రీ స్థాపించుకున్నాను. యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లకు పని చేశాను. ఇప్పుడు నా సర్వీస్ బిజినెస్ చూసుకుంటూనే సమాజానికి నా వంతుగా సేవ చేస్తున్నాను. బాధితులు మహిళలే కుటుంబ సమస్యగా కనిపించే అనేక సమస్యలకు నేరుగా బాధితులయ్యేది మహిళలే. ఆ సమస్యను పరిష్కరించగలిగితే పూర్తి కుటుంబం సంతోషంగా సాగిపోతుందని నా గట్టి నమ్మకం. అందుకే మహిళల సమస్యల మీదనే దృష్టి పెట్టాను. లీగల్ కౌన్సెలింగ్, ఫ్యామిలీ కౌన్సెలింగ్ ఇవ్వడంతోపాటు మహిళల స్వయంసమృద్ధి కోసం స్టార్టప్ మెంటార్‌గా కూడా మారాను. ఆర్థిక స్వేచ్ఛ కొరవడడం పరోక్షంగా మానసిక అభద్రతకు కారణమవుతుంటుంది. అక్కడి నుంచి కుటుంబ సమస్యలు తలెత్తుతాయి, అవి న్యాయపరమైన చిక్కులకు దారి తీస్తాయి. కౌన్సెలింగ్ సమయంలో వందలాది మంది మహిళల మనసులను చదివాను. ఆ అనుభవంతో చెప్తున్న మాట ఇది. ‘జాతకాలు చూసి మరీ పెళ్లి చేశారు మా వాళ్లు. అయినా నా జీవితం ఇలా ఉంది’ అని చాలా మంది మహిళలు బాధపడేవాళ్లు. జ్యోతిషం నిజమే అయితే ఫలితాలు ఇలా ఎందుకుంటాయనే సందేహం నాకూ కలిగింది. అప్పుడు జ్యోతిషం చదివాను. ఏ సబ్జెక్టు మీదకు దృష్టి మళ్లితే ఆ కోర్సు చేయడమే ఇప్పటి వరకు నా ప్రస్థానంగా మారింది. ఇప్పుడు బెంగళూరు ఐఐఎమ్ నుంచి మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనేది కోరిక’’ అన్నారు డాక్టర్ గీతారెడ్డి. – వాకా మంజులారెడ్డి ‘వనిత’ల కోసం మన మహిళల ఉత్పత్తులకు ఒక బ్రాండింగ్ డిజైన్ చేస్తే విదేశాల్లో మంచి గుర్తింపు వస్తుంది. హస్తకళాకృతులను, ఇతర ఉత్పత్తులతో ఉపాధి పొందే మహిళలను ఒక త్రాటి మీదకు తీసుకురావడానికి ‘కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్’ ద్వారా ప్రయత్నిస్తున్నాం. గాజులు, మగ్గం వర్క్, పోటరీ, జీడిపప్పు గ్రేడింగ్ అండ్ ప్యాకింగ్ వంటి ఉత్పత్తుల మార్కెట్ కోసం ‘వనిత’ పేరుతో వెబ్సైట్ రూపకల్పన జరుగుతోంది. గార్మెంట్ మేకింగ్‌లో ఉన్న మహిళలకు హిందూస్థాన్ షిప్‌యార్డ్ ఉద్యోగులకు అవసరమైన బాయిలర్ సూట్స్ ఆర్డర్ ఇప్పించడం, తిరుపతిలోని మహిళా యూనివర్సిటీలో శిక్షణ కార్యక్రమాల సమన్వయం జరుగుతోంది. -
ఉక్కుపిండాలు... మూత్రగండాలు
చిన్న పిల్లల్లో మూత్రపిండాలకు వచ్చే సమస్యల్లో కిడ్నీ వాపు సాధారణంగా కనిపిస్తుంది. ఇలా కిడ్నీకి వాపు రావడాన్ని వైద్యపరిభాషలో ‘హైడ్రోనెఫ్రోసిస్’ అంటారు. నిజానికి ఈ కిడ్నీ వాపు లక్షణం ఎన్నో రకాల కారణాల వల్ల రావచ్చు. వాటిలో కొన్ని శస్త్రచికిత్స ద్వారా నయం చేయగలిగేవి, మరికొన్ని వైద్య చికిత్సతో సరిచేయగలిగేవి. చాలా సందర్భాల్లో బిడ్డ ఇంకా పుట్టకముందే తల్లి కడుపులో ఉన్నప్పుడే ఈ సమస్యలు బయటపడతాయి. తల్లికి స్కానింగ్ చేస్తున్నప్పుడు ఇవి బయటపడతాయి. పిల్లల్లో ఈ కిడ్నీ సమస్యలు ఎంత విస్తృతం అంటే... పుట్టబోయే బిడ్డల్లో కనీసం ఒకటి నుంచి రెండు శాతం మంది వీటితో పుడతారంటే అది అవాస్తవం కాదు. పుట్టిన ప్రతి ఒక్కరూ జీవితకాలంలో ఏదో ఒక సమయంలో మూత్రంలో ఇన్ఫెక్షన్తో బాధపడే అవకాశం ఉంది. ఈ నెల 13న ప్రపంచ కిడ్నీ దినం సందర్భంగా గర్భస్థ శిశువుల్లో, పిల్లల్లో కిడ్నీ సమస్యలపై అవగాహన కోసం ఈ కథనం. తల్లిదండ్రులూ...మీరివి చేయండి.. రెండేళ్ల లోపు పిల్లలకు మాటిమాటికీ జ్వరం వస్తుంటే వారికి మూత్ర సంబంధ ఇన్ఫెక్షన్లు ఏవీ లేవని మొదట నిర్ధారణ చేసుకోండి. మూడేళ్లు దాటిన పిల్లలు ప్రతి రెండు లేదా మూడు గంటలకొకసారీ సాఫీగా నింపాదిగా మూత్రవిసర్జన చేసేలా జాగ్రత్త తీసుకోండి. పిల్లలు చాలాసేపు టీవీ చూస్తూనో లేదా కంప్యూటర్‌పై ఆడుతూనో ఉంటే వారిని బయటి ఆటలు ఆడేలా ప్రోత్సహించండి. పిల్లలు చాలాసేపు మూత్రం బిగబట్టి ఉంచడాన్ని ప్రోత్సహించకండి. పీచు పదార్థాలు పుష్కలంగా ఉండే ఆకుకూరల వంటి ఆహారాన్ని పిల్లలకు ఎక్కువగా ఇవ్వండి. కిడ్నీ సమస్యలను నివారించడానికి మలబద్దకం లేకుండా చూసుకోవడం కూడా చాలా ప్రధానం.పిల్లల్లో ఎదుగుదల సరిగ్గా లేకపోయినా, రక్తహీనత ఉన్నా, బీపీ ఉన్నా, మూత్రంలో రక్తం పడినా, తరచూ ఇన్ఫెక్షన్లు వస్తున్నా ఒకసారి కిడ్నీ పరీక్షలు చేయించండి. పీయూజే అబ్స్ట్రక్షన్ (పీయూజే బ్లాక్) మన శరీరంలోని జీవక్రియల్లో విడుదలయ్యే మలినాలన్నింటినీ మూత్రపిండాలు వడపోస్తాయి. ఇలా వడపోశాక తయారయ్యే మూత్రం... మూత్రపిండాల నుంచి మూత్రాశయం వరకు రెండు నాళాల ద్వారా వెళుతుంది. వాటిని యురేటర్లు అంటారు. మూత్రపిండాల నుంచి మూత్రాశయానికి (బ్లాడర్‌కు) మూత్రం సరఫరా చేసే ఈ నాళాలలో అడ్డంకి రావడం మూత్రపిండాల వాపునకు దారితీస్తుంది. ఈ రకమైన అడ్డంకుల్లో చాలా సాధారణమైన అడ్డంకిని పీయూజే అబ్స్ట్రక్షన్ అంటారు. ఈ రకమైన సమస్య ఉన్నట్లు తల్లిగర్భంలోనే స్కానింగ్ ద్వారా కనుక్కోవచ్చు. కానీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. బిడ్డ పుట్టిన తర్వాత పరీక్షల ద్వారా దీన్ని నిర్ధారణ చేసి వ్యాధి ముదరకముందే సరైన చికిత్స తీసుకుంటే దీన్ని పూర్తిగా నయం చేయవచ్చు. నిర్ధారణ: అల్ట్రా సౌండ్ స్కాన్ ద్వారా పీయూజే అబ్స్ట్రక్షన్ అనే ఈ కండిషన్ బయటపడుతుంది. దీన్ని నిర్ధారణ చేయడం కోసం ‘డీటీపీఏ/ఈసీ రీనోగ్రామ్’ అనే పరీక్ష చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఎంసీయూజీ అనే పరీక్ష అవసరం కావచ్చు. చికిత్స: పై పరీక్షల ద్వారా పీయూజే దగ్గర అడ్డంకి ఉండి, ఫలితంగా కిడ్నీ పనితీరు 40 శాతం కంటే తగ్గడం లేదా లక్షణాలు కనిపించడం జరిగితే... ఆ అడ్డంకిని శస్త్రచికిత్సతో చేస్తారు. దీన్ని చిన్నగాటు ద్వారా కీ-హోల్ (లాపరోస్కోపిక్) ప్రక్రియలోనూ చేయవచ్చు. ఈ ప్రక్రియలో చిన్నారి పొట్టభాగంపై ఎలాంటి కోత లేకుండా కేవలం 3 మి.మీ. సైజ్‌లో చిన్న గాట్లతోనే శస్త్రచికిత్స పూర్తి చేయవచ్చు. ఈ పద్ధతిలో నెలల పిల్లలకు కూడా సురక్షితంగా ఆపరేషన్ చేయవచ్చు. వెసైకో యురెట్రిక్ రిఫ్లక్స్ (వీయూఆర్) మూత్రపిండాల వాపుతో లేదా మూత్రంలో ఇన్ఫెక్షన్తో బయటపడే మరో ముఖ్యమైన సమస్య వెసైకో యురెట్రిక్ రిఫ్లక్. అయితే ఈ సమస్య ఒక్కోసారి ఎలాంటి వాపూ లేకుండా కూడా రావచ్చు. సాధారణంగా కిడ్నీలో వడపోత ప్రక్రియ పూర్తయ్యాక కిడ్నీల నుంచి మూత్రం యురేటర్ ద్వారా మూత్రాశయానికి రావాలి. అంతేగాని ఎలాంటి పరిస్థితుల్లోనూ అది వెనక్కు ప్రవహించకూడదు. అయితే విసైకో యురెట్రిక్ రిఫ్లక్స్ అనే స్థితిలో అది మూత్రాశయం నుంచి కిడ్నీలకు వెనక్కు ప్రవహిస్తుంది. దాంతో ప్రమాదకరమైన ‘పైలో నెఫ్రైటిస్’ అనే స్థితి వచ్చి అది కిడ్నీ దెబ్బతినడానికి దారితీయవచ్చు. ఈ వీయూఆర్ అనే కండిషన్ సాధారణంగా పుట్టకముందే ఏర్పడుతుంది. అయితే దీని దుష్పరిణామాలు మాత్రం బిడ్డ పుట్టాక కిడ్నీకి ఇన్ఫెక్షన్ రూపంలో వ్యక్తమవుతాయి. సమస్య ఏమిటంటే పిల్లల్లో సాధారణంగా ఎలాంటి నొప్పిగాని, ఇబ్బందిగాని, మూత్రవిసర్జనకు అవరోధం గాని ఉండవు. కాబట్టి పిల్లలకు తరచూ జ్వరం గానీ, మూత్రంలో ఇన్ఫెక్షన్‌గాని వస్తే వీయూఆర్ నిర్ధారణ చేయడానికి కొన్ని పరీక్షలు చేయించాలి. నిర్ధారణ పరీక్షలు: ఎంసీయూజీ అనే ప్రత్యేకమైన ఎక్స్-రే చేయించాలి. వీయూఆర్ అనే కండిషన్లో ఐదు గ్రేడ్స్ ఉంటాయి. ఇందులో మొదటి రెండింటిని తక్కువ తీవ్రత దశగానూ, మూడో గ్రేడ్‌ను మధ్యదశగానూ, నాలుగు, ఐదు గ్రేడ్లను తీవ్రమైనవిగానూ చెబుతారు. వీయూఆర్ కండిషన్ ఉందని తెలిశాక మూత్రపిండాలు పాడయ్యాయా లేదా అని చూసేందుకు డీఎమ్‌ఎస్‌ఏ అనే స్కాన్ చేయాల్సి ఉంటుంది. వీయూఆర్ వల్ల దుష్పరిణామాలు ఏమిటి? కొంతమంది పిల్లల్లో లో-గ్రేడ్ వీయూఆర్ ఉన్నా ఏ రకమైన సమస్యలూ రాకపోవచ్చు. కానీ ఇంటర్మీడియట్ గ్రేడ్ లేదా హైగ్రేడ్ వీయూఆర్ ఉన్న పిల్లల్లో కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. దీనివల్ల కిడ్నీలలో ‘స్కార్’ తయారై కిడ్నీ పనితీరును దెబ్బతీసి, కిడ్నీ ఫెయిల్యూర్‌కీ, చిన్న వయసులోనే హైబీపీకి దారితీసే ప్రమాదం ఉంది. వీయూఆర్ వల్ల పుట్టకముందే జరిగే నష్టాన్ని నివారించలేం గానీ, పుట్టాక వీయూఆర్ వల్ల, ఇన్ఫెక్షన్ వల్ల కలిగే డ్యామేజీని ఖచ్చితంగా నివారించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటంటే ఒకసారి కిడ్నీ స్కార్ తయారైతే ఆ నష్టం శాశ్వతం. చికిత్స: వీయూఆర్ నివారించడానికి రెండు రకాల చికిత్సలు చేయవచ్చు. అవే... సాధారణ వైద్యచికిత్స, శస్త్రచికిత్స. ఏ తరహా చికిత్స అవసరం అన్నది చిన్నారి వయసు, గ్రేడ్, ఆడపిల్లా, మగపిల్లవాడా, కిడ్నీలు ఏమేరకు దెబ్బతిన్నాయి... వంటి అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఏ పిల్లాడికి ఏది అవసరం అన్నది పూర్తిగా నిపుణులైన డాక్టర్లు నిర్ధారణ చేస్తారు. వైద్య చికిత్స: ఈ చికిత్స ఏడాది నుంచి ఏడాదిన్నర వయసు లోపల ఉన్న పిల్లలకు, లోగ్రేడ్ వీయూఆర్ పిల్లలకు ఉపయోగిస్తారు. సాధారణంగా వీయూఆర్‌కు వైద్య చికిత్సతో పెద్దగా ప్రయోజనం చేకూరదు. అయితే తీవ్రత తక్కువగా ఉండే ఒకటి రెండు దశల్లో వ్యాధి ఉన్నప్పుడు దాన్ని మరింత ముదరకుండా చేసేందుకు మాత్రమే వైద్యచికిత్స తోడ్పడతుంది. శస్త్రచికిత్స: ఈ ప్రక్రియ ద్వారా మూత్రం వ్యతిరేక మార్గంలో పయనించడాన్ని నివారిస్తారు. శస్త్రచికిత్స లక్ష్యం ఏమిటంటే కిడ్నీ ఇన్ఫెక్షన్ రాకుండా అరికట్టి తద్వారా కిడ్నీ దెబ్బతినకుండా రక్షించడం. శస్త్రచికిత్స అంటే భయపడాల్సిన పనిలేదు. ఇప్పుడు అత్యాధునికమైన, అత్యంత తక్కువ ఇబ్బంది కలిగించే ఎండోస్కోపిక్, లాపరోస్కోపిక్ శస్త్రచికిత్స ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. ఓపెన్ సర్జరీ కంటే ఈ ప్రక్రియలతో సౌకర్యం ఎక్కువ. పోస్టీరియర్ యురెథ్రల్ వాల్వ్స్ (పీయూవీ) ఈ కండిషన్ సాధారణంగా చిన్నారి పుట్టకమునుపే రెండు వైపులా మూత్రపిండాల వాపుతో కనిపిస్తుంది. పుట్టుకతో వచ్చే మూత్రపిండాల సమస్యలన్నింటిలోనూ ఇది చాలా ప్రమాదకరమైన స్థితి. ఇది కేవలం మగపిల్లల్లో మాత్రమే వస్తుంది. సాధారణంగా మూత్రపిండాల నుంచి మూత్రాశయం వరకు రెండు నాళాలు ఉంటాయి. అయితే మూత్రాశయం నుంచి కిందికి మూత్రం ప్రవహించే మార్గం ఒకటే ఉంటుంది. పీయూవీలో అడ్డంకి మూత్రాశయం (బ్లాడర్) కిందన ఏర్పడుతుంది. అంటే ఒకే నాళం ఉండే చోట అడ్డంకి ఏర్పడటం వల్ల మిగతా మూత్రపిండాల సమస్యలతో పోలిస్తే ఇది ఒక మూత్రపిండాలకి బదులుగా, రెండింటినీ దెబ్బతీస్తుంది కాబట్టి, ఇది అపాయకరంగా పరిణమించే అవకాశాలు ఎక్కువన్నమాట. అందుకే ఈ కండిషన్‌ను ఎమర్జెన్సీగా పరిగణించి శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. ఈ కండిషన్‌ను ఇటీవల బిడ్డ పుట్టకముందే తెలుసుకుంటున్నారు. ఈ కండిషన్‌ను అనుమానించినప్పుడు బిడ్డ పుట్టగానే ఎంసీయూజీ అనే పరీక్షతో దీన్ని నిర్ధారణ చేస్తారు. చికిత్స: నిర్ధారణ పరీక్ష నిర్వహించిన తర్వాత బిడ్డ పుట్టీపుట్టగానే సిస్టోస్కోపీ అనే శస్త్రచికిత్స ద్వారా ఈ కండిషన్‌ను సరిదిద్దుతారు. అయితే ఇలాంటి శస్త్రచికిత్స నిర్వహించిన చిన్నారులను సుదీర్ఘకాలం పాటు (అంటే దాదాపు 15 నుంచి 20 ఏళ్లపాటు) డాక్టర్ల పర్యవేక్షణ (ఫాలో-అప్)లో ఉంచాలి. ఎందుకంటే చాలామందికి శస్త్రచికిత్స అనంతరం వైద్య చికిత్స అవసరం అవుతుంది. కొందరిలో మరోసారి శస్త్రచికిత్స చేయాల్సిన పరిస్థితీ రావచ్చు. అయితే నిపుణులైన శస్త్రచికిత్సకులు నిర్వహించిన శస్త్రచికిత్స తర్వాత ఈ పిల్లలు మామూలుగానే జీవించే అవకాశం ఉంది. కాబట్టి తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వెసైకో యూరెట్రిక్ జంక్షన్ (వీయూజే) అబ్స్ట్రక్షన్ ఈ కండిషన్లో మూత్రప్రవాహానికి యురేటర్‌కూ, యూరినరీ బ్లాడర్‌కూ మధ్య ఉండే జంక్షన్లో అడ్డంకి వస్తుంది. ఫలితంగా యూత్రం యురేటర్‌నుంచి కిందికిపోకుండా ఉండటంతో మూత్రపిండం వాపు (హైడ్రోనెఫ్రోసిస్) కనిపిస్తుంది. ఈ కండిషన్ కూడా బిడ్డ కడుపులో ఉండగానే వస్తుంది. దీనివల్ల చిన్నపిల్లల దశలోనే ఇన్ఫెక్షన్స్, కడుపునొప్పి రావచ్చు. ఈ కండిషన్‌ను అల్ట్రాసౌండ్, ఎంసీయూజీ, డీటీపీఏ రీనోగ్రామ్, ఐవీపీ లేదా ఎమ్మార్ యూరోగ్రఫీ అనే పరీక్షలతో నిర్ధారణ చేస్తారు. చికిత్స: ఒకసారి వీయూజే అబ్స్ట్రక్షన్ అని నిర్ధారణ జరిగాక, చికిత్స ఎలా అన్నది నిర్ణయించాల్సి ఉంటుంది. అంటే... ఎలాంటి లక్షణాలూ బయటకు కనిపించకుండా ఉండి, మూత్రపిండాలు దెబ్బతినకుండా ఉంటే... ఈ కండిషన్ ఉన్న పిల్లలను వైద్యులు తరచూ వైద్య పరీక్షలు చేయిస్తూ, నిరంతరం వారిని పర్యవేక్షిస్తూ, వేచిచూస్తూ ఉండాలి. ఒకవేళ పరిస్థితి ఏమాత్రం విషమిస్తున్నా శస్త్రచికిత్స అవసరమవుతుంది. ఈ శస్త్రచికిత్సకూడా కిడ్నీ దెబ్బతినకుండా రక్షించడానికి చేస్తారు. చాలా పిల్లల్లో దీన్ని ఒకే ఆపరేషన్‌తో సరిచేస్తారు. అయితే మరీ చంటిపిల్లలయితే రెండు ఆపరేషన్లు అవసరమవుతాయి. మొదటిది అడ్డంకిని బై-పాస్ చేసేందుకు నిర్వహిస్తారు. రెండో శస్త్రచికిత్సను మరో రెండు మూడేళ్ల తర్వాత చేసి, అప్పుడు యురేటర్‌ను, బ్లాడర్‌ను కలుపుతారు. దీన్ని కూడా ల్యాపరోస్కోపిక్ విధానంలో చేయవచ్చు. ఫలితంగా చిన్నారులకు ఇబ్బంది, సమస్యలు, నొప్పి కలిగే అవకాశాలు చాలా తక్కువ నెఫ్రోటిక్ సిండ్రోమ్ సాధారణంగా మన శరీరంలో జరిగే జీవక్రియల్లో వెలువడే విషపదార్థాలు, వ్యర్థాలను మూత్రపిండాలు వడపోసి, వేరు చేసి వ్యర్థపదార్థాలను మాత్రమే మూత్రం ద్వారా బయటకు పంపేస్తాయి. అయితే నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఉన్నప్పుడు శరీరానికి అవసరమైన ప్రోటీన్లు కూడా మూత్రంలో వెళ్తాయి. గుర్తించేదెలా: దీన్ని సాధారణంగా ఒంటి వాపు లక్షణంతో గుర్తించవచ్చు. పిల్లల్లో కంటి చుట్టూవాపు కనిపిస్తుంది. ముఖ్యంగా తెల్లవారుజామున ఈ వాపు ఎక్కువ. మూత్రం తక్కువగా, నురగతో వస్తుంది. ఒక్కోసారి వాంతులు అవుతాయి. ఆకలి కూడా మందగిస్తుంది. ఎందుకు వస్తుంది: ఏవైనా ఇన్ఫెక్షను లేదా అలర్జీ కారణంగా సాధారణ రోగనిరోధక వ్యవస్థ దెబ్బతినడం వల్ల ఇది రావచ్చు. చాలా సందర్భాల్లో ఇదమిత్థంగా కారణం తెలియదు. ఏడాది లోపు పిల్లల్లో జన్యుపరమైన కారణాల వల్ల కూడా ఇది రావచ్చు. నిర్ధారణ: సాధారణ మూత్ర, రక్త పరీక్షలతో దీన్ని గుర్తించవచ్చు. చికిత్స : దీనికి చేసే చికిత్స మూడు దశల్లో ఉంటుంది. మొదట ఒక నాలుగైదు నెలల పాటు రోగనిరోధక వ్యవస్థను చక్కదిద్దేలా స్టెరాయిడ్స్ ఇస్తారు. ఆ తర్వాత పిల్లల ఆహారంలో మార్పులు తెస్తారు. అంటే వారు రోజు తీసుకునే ఉప్పు, నూనెపదార్థాలు, మాంసాహారం వంటి వాటిని సగానికి సగం తగ్గిస్తారు. ఇలాంటి పిల్లల్లో రక్తం గడ్డకట్టడం అనేది మెడికల్ ఎమర్జెన్సీగా వచ్చి, అది అత్యవసరంగా చికిత్స చేయాల్సిన పరిస్థితికి దారితీయవచ్చు. పిల్లల మూత్రపిండాల్లో రాళ్లు... సాధారణంగా మూత్రపిండాల్లో రాళ్లు చిన్నపిల్లలకు రావని అనుకుంటారు. కానీ కొంతమంది పిల్లల్లో ఇవి వస్తాయి. కారణాలు: పిల్లల్లో మంచినీరు తాగే అలవాటు తగ్గడమే దీనికి కారణం. జన్యుపరమైన అంశాలు, కుటుంబ చరిత్రలో కిడ్నీల్లో రాళ్లు రావడం, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలు (ప్యాకేజ్డ్ ఫుడ్స్, చిప్స్, పచ్చళ్లు, అప్పడాలు, భోజనంలో ఉప్పు ఎక్కువగా వేసుకోవడం) వంటివి దీనికి ప్రధాన కారణం. రెండేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లల్లోనైతే మూత్రపిండాల నిర్మాణంలో లోపాల వల్ల ఇవి వస్తాయి. లక్షణాలు: మూత్రవిసర్జనలో తీవ్రమైన నొప్పి రావడం, భరించలేనంత కడుపునొప్పి, వికారం, వాంతులు, ఒక్కోసారి మూత్రవిసర్జన సమయంలో రక్తం కనిపించడం, మాటిమాటికీ కడుపునొప్పి రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నిర్ధారణ: అల్ట్రా సౌండ్ స్కానింగ్ అనే అతి చవకైన పరీక్షతో వీటిని నిర్ధారణ చేయవచ్చు. ఇవి ఏర్పడటానికి కారణాలను తెలుసుకోడానికి రక్తపరీక్షలు చేస్తారు. చాలా అరుదుగా సీటీ స్కాన్, ఇతర పరీక్షలు అవసరం కావచ్చు. చికిత్స: నోటి ద్వారా తీసుకునే కొన్ని మందులతో తొలుత 3-6 నెలల పాటు చికిత్స చేస్తారు. దీనివల్ల 8 మి.మీ. కంటే తక్కువ పరిమాణం ఉన్న రాళ్లు వాటంతట అవే పోతాయి. అయితే 12 మి.మీ. కంటే పెద్ద రాళ్లను తొలగించడానికి శస్త్రచికిత్స ప్రక్రియలు అవసరం కావచ్చు. దీని తర్వాత ఈ రాళ్లు మళ్లీ పెరగకుండా నివారించేందుకు నీళ్లు ఎక్కువగా తాగడం, ఉప్పు, మాంసాహారం తగ్గించడంవంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ (యూటీఐ) పిల్లల్లో మూత్ర సంబంధ ఇన్ఫెక్షన్లను యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటారు. కారణాలు: మూత్రపిండాలు, యురేటర్, మూత్రాశయం వంటి మూత్రవిసర్జక వ్యవస్థలోని వివిధ అవయవాల నిర్మాణంలో లోపాలు, మూత్రం వ్యతిరేక దిశలో పయనించడం, మూత్రనాళాల్లో అడ్డంకుల వంటివి రెండేళ్ల వయసులోపు ఉండే 60-70 శాతం మంది పిల్లల్లో యూటీఐకి కారణాలు. ఇక స్కూల్‌కు వెళ్లే వయసు పిల్లల్లో మూత్రవిసర్జన చేసినప్పుడు మూత్రాశయం పూర్తిగా ఖాళీకాకపోవడం ఒక కారణం. మూత్రం వస్తున్నా ఆటల్లో పడి లేదా టీవీ చూస్తుండటం వల్లనో, స్కూల్లో టాయిలెట్ శుభ్రంగా లేదనో లేదా మరేదైనా కారణం వల్లనో చాలాసేపు మూత్రవిసర్జన చేయకుండా బిగబట్టి ఉండటం కూడా దీనికి కారణం. దీనివల్ల మూత్రాశయంలోని బ్యాక్టీరియా వృద్ధి చెంది ఇన్ఫెక్షన్కు దారితీయవచ్చు. ఇక పిల్లలు నీళ్లు తక్కువగా తాగడం వల్లనో లేదా మలబద్ధ్దకంతోనో బాధపడుతూ బ్లాడర్ పూర్తిగా ఖాళీ చేయకుండా ఉండటం వల్ల అక్కడ బ్యాక్టీరియా పెరిగి, మూత్రంలో ఇన్ఫెక్షన్లు రావచ్చు. లక్షణాలు: రెండేళ్ల కంటే తక్కువ వయసు పిల్లల్లో కారణం లేకుండా తరచూ జ్వరం, మూత్రంలో మంట, వాంతులు కావడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక పెద్ద పిల్లల్లో మూత్రవిసర్జనలో నొప్పి, దుస్తుల్లోనే మూత్రవిసర్జన కావడం వంటి లక్షణాలు ఉంటాయి. నిర్ధారణ / చికిత్స: సాధారణ మూత్రపరీక్ష, మూత్రం కల్చర్ పరీక్ష వంటి వాటితో దీన్ని నిర్ధారణ చేయవచ్చు. సాధారణ యాంటీబయాటిక్స్, జ్వరం మాత్రలతో చికిత్స జరుగుతుంది. పిల్లల్లో కిడ్నీ ఫెయిల్యూర్ మూత్రపిండాలు మనలోని వృథా పదార్థాలను వడపోసి, ఆ వ్యర్థాలను మూత్రం ద్వారా బయటకు పంపిస్తుంది. ఒకవేళ మూత్రపిండాలు పూర్తిగా పనిచేయని పరిస్థితి వస్తే దాన్ని కిడ్నీ ఫెయిల్యూర్‌గా పేర్కొంటారు. ఫలితంగా వ్యర్థాలు మన శరీరంలోనే ఉండిపోతాయి. దాంతో రక్తంలో క్రియాటినిన్, బ్లడ్ యూరియా వంటివి ఎక్కువవుతాయి. కిడ్నీ ఫెయిల్యూర్లో రెండు రకాలుంటాయి. మొదటిది తాత్కాలికం. అంటే కొద్దిరోజుల్లోనే మూత్రపిండం మళ్లీ తన వడపోత సామర్థ్యాన్ని తిరిగి పొందుతుంది. ఇక రెండో రకం కిడ్నీ ఫెయిల్యూర్‌ను క్రానిక్ లేదా శాశ్వత వైఫల్యంగా పేర్కొంటారు. ఇందులో కిడ్నీ తన పనితీరును మళ్లీ మెరుగుపరచుకోవడం ఉండదు. ఈ పరిస్థితి వస్తే కిడ్నీ మార్పిడి చికిత్సే దీనికి పరిష్కారం. కారణాలు: తాత్కాలిక కిడ్నీ ఫెయిల్యూర్‌కు శరీరంలో రోగనిరోధకశక్తిలో మార్పులు, ఇన్ఫెక్షన్లు (బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్), కిడ్నీలో రాళ్లు, అధిక రక్తపోటు, గుండెజబ్బులు, ఒక్కోసారి కొన్ని రకాల మందులు వాడటం కూడా దీనికి కారణం. ఇక క్రానిక్ లేదా శాశ్వత కిడ్నీ ఫెయిల్యూర్‌కు జన్యుపరమైన, నిర్మాణలోపాల వంటి అనేక అంశాలు కారణమవుతాయి. లక్షణాలు: మూత్ర పరిమాణం తగ్గడం ఒంట్లో వాపు శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు (ఊపిరితిత్తుల్లో నీరు చేరడం వల్ల) వాంతులు తలనొప్పి ఫిట్స్ రావడం కొందరిలో దీర్ఘ నిద్ర. కొందరు పిల్లల్లో చర్మంపై ర్యాష్, కీళ్లనొప్పులు, జ్వరం, నీళ్ల విరేచనాలు కూడా ఉండవచ్చు. కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చిన పిల్లల్లో ఎదుగుదల తక్కువగా ఉంటుంది. నీళ్లు కూడా తక్కువగా తాగుతారు. నిర్ధారణ: సాధారణ రక్త, మూత్ర పరీక్షలతో దీన్ని నిర్ధారణ చేయవచ్చు. రక్తం, మూత్ర పరీక్షల్లో క్రియాటినిన్, బ్లడ్ యూరియా ఎక్కువగా ఉంటాయి. దీనితో పాటు అల్ట్రా సౌండ్ స్కానింగ్, ఛాతీ ఎక్స్-రే వంటి మామూలు పరీక్షలతో పాటు కొన్ని ప్రత్యేక పరీక్షలూ అవసరమవుతాయి. కొందరికి కిడ్నీ బయాప్సీ పరీక్ష చేసి వారిలో వ్యాధి తీవ్రత, అనుసరించాల్సిన చికిత్సలను నిర్ణయిస్తారు. చికిత్స: దీనికి రెండు రకాలుగా చికిత్స చేయాల్సి ఉంటుంది. అంటే రోగికి ఏ కారణంగా ఈ పరిస్థితి వచ్చిందో తెలుసుకుని దానికి అనుగుణంగా సపోర్టివ్ చికిత్స ఇవ్వాలి. ఉదాహరణకు అధిక రక్తపోటు వల్ల ఇలా జరిగితే ఆ పిల్లల్లో ఉప్పు పాళ్లు సరిచేసేలా ఆహారాన్ని నిర్ణయించడం, అవసరాన్ని బట్టి ఇమ్యూనోసప్రెసెంట్స్ వంటి మందులు వాడటం చేస్తారు. ఇక కొందరు పిల్లలకు రక్తంలో పేరుకున్న వ్యర్థాలను వడపోసే డయాలసిస్ చేయాల్సి రావచ్చు. దాంతోపాటు కడుపులో చేరిన నీళ్లను తొలగించే చికిత్స అవసరం కావచ్చు. చాలామంది పిల్లల్లో కొద్ది రోజుల నుంచి వారాల్లోనే మూత్రపిండాల పనితీరు మళ్లీ మామూలవుతుంది. అయితే దీర్ఘకాలం పాటు వాళ్లకు నిత్యం వారి ఎదుగుదలను పరిశీలిస్తూ ఉండటం, క్రియాటినిన్ పాళ్లను పరీక్షిస్తూ ఉండటం వంటి పరీక్షలు దాదాపు 20 ఏళ్ల పాటు చేయిస్తూ ఉండాలి. ఇక మూత్రపిండాలు శాశ్వతంగా దెబ్బతిన్న పిల్లలకు నిత్యం డయాలసిస్ అవసరం లేదా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స శాశ్వత పరిష్కారమవుతుంది. చాలా ప్రాథమిక స్థాయి పరీక్షలతో కిడ్నీ సమస్యను తెలుసుకోవచ్చు. తగిన చికిత్స తీసుకోవచ్చు. ఆ జాగ్రత్త పిల్లల విషయంలో మరింత ఎక్కువ అవసరం. - నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి