breaking news
Malli Malli Idi Rani Roju movie
-
ఇది ప్రేమ విజయం!
‘‘ఒక సినిమా విజయం సాధిస్తే, అది పరిశ్రమకు ఎంత ఉపయోగమో నాకు బాగా తెలుసు. ఆ పరంగా ఈ సినిమా పరిశ్రమకు ఉపయోగపడింది. అన్ని కోణాల్లోనూ సినిమా బాగుంది. కొన్ని సన్నివేశాలకు నా మనసు స్పందించింది. అలా చాలా అరుదుగా జరుగుతుంది’’ అని ‘ప్రసాద్’ సంస్థల అధినేత రమేశ్ ప్రసాద్ అన్నారు. శర్వానంద్, నిత్యామీనన్ జంటగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కె. వల్లభ సమర్పణలో కేయస్ రామారావు నిర్మించిన ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ గత వారం విడుదలైంది. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన విజయోత్సవ సభలో సంభాషణల రచయిత బుర్రా సాయిమాధవ్ మాట్లాడుతూ - ‘‘ఫైట్లు, ఐటమ్ సాంగ్స్ లేకపోతే ప్రేక్షకులు సినిమాలు చూడరనే మాట విన్నప్పుడల్లా, ప్రేక్షకులను తక్కువ చేస్తున్నారేమోనని బాధపడిపోయేవాణ్ణి. కరెక్ట్ సినిమా తీస్తే, ప్రేక్షకులు ఆదరిస్తారనడానికి ఈ చిత్రం నిదర్శనం’’ అన్నారు. ఏ ఆర్టిస్ట్ అయినా అద్భుతంగా నటించాలంటే మంచి సన్నివేశాలు, సంభాషణలు అవసరమనీ, ఈ చిత్రంలో ఆ రెండూ ఉన్నాయని నిత్యామీనన్ అన్నారు. మంచి చిత్రంలో నటించినందుకు సంతృప్తిగా ఉందని శర్వానంద్ చెప్పారు. కథను నమ్మి సినిమా చేశామనీ, ఇది ప్రేమ విజయం అని దర్శకుడు తెలిపారు. ఈ విజయం ద్వారా మరిన్ని అద్భుతమైన చిత్రాలు నిర్మించే ప్రోత్సాహాన్ని ప్రేక్షకులు ఇచ్చారని వల్లభ అన్నారు. గోపీసుందర్, జ్ఞానశేఖర్, పావని, కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నెన్నో వర్ణాల హరివిల్లు
ప్రేమించుకున్న మనుషులు దూరమైనా.. మనసులు మాత్రం కలిసే ఉంటాయని తెలిపే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’. శర్వానంద్, నిత్యామీనన్ జంటగా నటించిన ఈ చిత్రానికి ‘ఓనమాలు’ ఫేం క్రాంతిమాధవ్ దర్శకుడు. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై అలెగ్జాండర్ వల్లభ నిర్మిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు కె.ఎస్.రామారావు మాట్లాడుతూ -‘‘మనసుల్ని మెలిపెట్టే పరిణతి చెందిన ప్రేమకథాచిత్రమిది. ప్రేమ గొప్పతనాన్ని హృద్యంగా తెలియజెప్పాడు దర్శకుడు. సాహితి రచించిన ‘ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే...’ అనే పల్లవితో సాగే పాటకు స్వర్ణ మాస్టర్ నృత్య రీతుల్ని సమకూర్చగా, పాండిచ్చేరిలో హీరోహీరోయిన్లపై చిత్రీకరించాం. దీంతో షూటింగ్ పూర్తయింది. నిత్యామీనన్, శర్వానంద్‌ల జంట యువతను విశేషంగా ఆకట్టుకుంటుంది. సాయిమాధవ్ బుర్రా సంభాషణలు, జ్ఞానశేఖర్ ఛాయాగ్రహణం, గోపీసుందర్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలాలు. అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసి అతి త్వరలో పాటల్ని, త్వరలో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు.