breaking news
makdrill
-
అర్ధరాత్రి కలకలం
ఆదిలాబాద్‌టౌన్ : ‘హలో సార్.. నేను రైల్వే నుంచి మాట్లాడుతున్నా.. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం ఉండం దగ్గర పూర్ణ ఎక్స్‌ప్రెస్ రైలు ఓ ట్రక్‌ను ఢీకొని బోల్తాపడింది. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలి’ మంగళవారం అర్ధరాత్రి డయల్ 100 నంబరుకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి తాను చెప్పాల్సింది చెప్పి పెట్టేశాడు. వెంటనే ఆదిలాబాద్ పోలీసుల ఫోన్ మోగింది. ఆ కాల్ డయల్ 100 సెంటర్ నుంచి వచ్చింది. రైలు ప్రమాదం గురించి సమాచారం ఇచ్చింది. ఇక చూడండి.. అర్ధరాత్రి పూట అధికారుల ఉరుకులు.. పరుగులు..! హుటాహుటిన పోలీసు, వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ, ఎక్సైజ్, అటవీ, తదితర శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న రైలులో ప్రయాణం చేస్తున్న వారి బంధువులు, స్థానికుల్లో ఆందోళన మొదలైంది. ఆదిలాబాద్ రైల్వే ట్రాక్ నుంచి ఉండం వరకు ప్రమాదం ఎక్కడ జరిగిందని వెతుక్కుంటూ వెళ్లారు. తీరా తెల్లవారుజామున 4గంటల సమయంలో రైల్వే అధికారులు మాక్ డ్రిల్ చేశామని, జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నారో లేదో, సంఘటన జరిగితే స్పందన ఎలా ఉంటుందోనని చావుకబురు చల్లగా చెప్పడంతో అందరూ బిత్తరపోయారు. అయితే ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రైల్వే అధికారులపై ఫైర్.. రైల్వే అధికారులు జిల్లా ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇలా మాక్‌డ్రిల్ నిర్వహించడంపై జిల్లా ఎస్పీతో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇదే సమయంలో ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే పరిస్థితి ఏమిటని రైల్వే అధికారులను ప్రశ్నించినట్లు సమాచారం. పూర్ణ ఎక్స్‌ప్రెస్ ట్రక్‌ను ఢీకొట్టడంతో బోల్తా పడి ఉంటుందని, ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉందోనని అంబులెన్స్‌ను, ఫైర్ ఇంజన్, తదితర ఏర్పాట్లను చేశామని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా యంత్రాంగంతో పాటు ఉమ్మడి జిల్లా పరిధిలోని నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల వారికి కూడా సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. మాక్‌డ్రిల్ అంటే.. ఏదైనా రైలు ప్రమాదం జరిగితే జిల్లా యంత్రాంగం ఎలా స్పందిస్తుంది, సంఘటన స్థలానికి ఎంత సమయంలో చేరుకుంటారు, వైద్యసేవలు, ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారనే విషయాలను తెలుసుకునేందుకు రైల్వే అధికారులు చేపట్టే కార్యక్రమం మాక్‌డ్రిల్. అయితే జిల్లా యంత్రాంగం మాత్రం అప్రమత్తమై వెంటనే రైల్వే అధికారులు తెలిపిన ఉండం రైల్వే స్టేషన్ వద్దకు చేరుకున్నారు. డీఎస్పీ, సీఐలు, ఆర్డీఓ, తహసీల్దార్లు, వైద్య ఆరోగ్య, అగ్నిమాపక, ఇదితర శాఖల అధికారులు, సిబ్బంది సైతం స్పందించారు. ఏదేమైనా ఇలాంటి మాక్‌డ్రిల్ నిర్వహించే ముందు ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సంఘటన స్థలంలో డీఎస్పీ నర్సింహారెడ్డి, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ విశ్వప్రసాద్, ఎస్సైలు, పోలీసులు, ఆయా శాఖల అధికారులు ఉన్నారు. -
సునామీపై అప్రమత్తం కండి
మొగల్తూరు: ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీ చేసిన వెంటనే ప్రజలు అప్రమత్తంగా ఉండటంతో పాటు అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తే ప్రాణనష్టాన్ని తగ్గించవచ్చని సబ్‌కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు. సునామీ సంభవిస్తే తీసుకోవల్సిన జాగ్రత్తలపై బుధవారం మండలంలోని కేపీ పాలెం సౌత్ గ్రామంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. రెవెన్యూ, పోలీస అగ్నిమాపక శాఖ, మత్స్యశాఖ, ఆర్డబ్ల్యూఎస్, ఎన్డీఆర్ఎఫ్, వైద్యారోగ్య శాఖ అధికారులు సునామీ హెచ్చరికలు జారీ అయిన వెంటనే తీసుకోవాల్సిన చర్యలను ప్రజలకు వివరించారు. అనంతరం జరిగిన సమావేశంలో సబ్‌కలెక్టర్ మాట్లాడుతూ సునామీ బారిన పడిన 23 దేశాలు సమావేశమై సునామీ ఏర్పడితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏడాదికోసారి మాక్‌డ్రిల్ నిర్వహిస్తున్నాయని చెప్పారు. అధికారులకు ప్రజలు సహకరిస్తే ప్రాణనష్టాన్ని తగ్గించుకోవచ్చున్నారు. డీఎస్పీ పూర్ణ చంద్రరావు, తహసిల్దార్ శ్రీపాద హరినాథ్, ఎంపీడీవో పి.రమాదేవి, ఎన్ఎస్ఎస్ అధికారి హరిప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్ డీఈ అనంతరాజు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస నాయక్, సర్పంచ్‌లు కవురు ముత్యాలరావు, మేళం రంగనాద్, ఉపసర్పంచ్ అందే తాత తదితరులు పాల్గొన్నారు.