breaking news
Maharani Laxmi Bai Medical College Hospital
-
UP Fire Accident: ఆ నర్సు వల్లే ఈ ఘోరం?
లక్నో: ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయ్ వైద్య కళాశాలలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం.. పది మంది పసికందుల్ని బలిగొనడం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘోర ప్రమాదం జరగడానికి కారణం ఏంటన్నది తేల్చే పనిలో అధికారులు ఉన్నారు. శనివారం సాయంత్రంకల్లా నివేదికను ప్రభుత్వానికి సమర్పించే అవకాశాలు ఉన్నాయి. అయితే.. ఘటనకు షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమికంగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈలోపు విస్తుపోయే విషయం ఒకటి బయటకు వచ్చింది. ఆక్సిజన్ సిలిండర్ పైప్‌ను కనెక్ట్ చేస్తున్న సమయంలో ఓ నర్సు నిర్లక్ష్యంగా అగ్గిపుల్ల వెలిగించినట్లు తెలిపిన ఓ ప్రత్యక్ష సాక్షి చెబుతున్నారు. అయితే అధికారులు మాత్రం దర్యాప్తు తర్వాతే కారణంపై ప్రకటన చేస్తామని అంటున్నారు. ఆపద్భాందవుడిలా భగవాన్ దాస్!హమీర్‌పూర్‌కు చెందిన భగవాన్ దాస్ తన కొడుకును ఇదే ఆస్పత్రిలో చేర్చాడు. ప్రమాదం నుంచి తన కొడుకుతో పాటు మరికొందరు చిన్నారులను దాస్ రక్షించాడని పక్కన ఉన్నవాళ్లు చెబుతున్నారు. ‘‘ఆ నర్సు అగ్గిపుల్ల వెలగించగానే.. ఒక్కసారిగా పెద్ద పేలుడు సంభవించింది. అక్కడంతా మంటలు అంటుకున్నాయి’’ అని దాస్ చెబుతున్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే దాస్ ఓ గుడ్డలో నలుగురు పసికందుల్ని చుట్టి.. తన వీపుకి కట్టుకుని బయటకు తీసుకొచ్చాడని అక్కడే ఉన్న ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు. అగ్ని కీలలు ఎగసి పడ్డాక.. ఆస్పత్రిలోని సేఫ్టీ అలారంలు మోగకపోవడంతో చిన్నారుల తరలిపు ఆలస్యం అయ్యిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.అయితే.. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం, ఆరోగ్యశాఖ మంత్రి బ్రజేష్ పాథక్.. బాధితులకు న్యాయం జరిగి తీరుతుందని చెబుతున్నారు. సిలిండర్ కాన్సెంట్రేటర్లో షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారని, ఒకవేళ మానవ తప్పిదం జరిగి ఉంటే ఎవరినీ వదలబోమని, బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని అన్నారాయన. ఘటనపై మూడంచెల దర్యాప్తు కొనసాగుతుందని అన్నారు.నెట్టింట దయనీయమైన దృశ్యాలుశుక్రవారం రాత్రి 10.30గం.-10.45గం. మధ్య ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రి చిన్నపిల్లల వార్డులో (neonatal intensive care unit..NICU) అగ్నిప్రమాదం సంభవించింది. ఆ వెంటనే అక్కడ బీతావహ వాతావరణం నెలకొంది. పసికందుల్ని రక్షించేందుకు ఆస్పత్రి సిబ్బందితో పాటు తల్లిదండ్రులు పరుగులు తీసిన దృశ్యాలు, ఆ పసికందుల మృతదేహాల వద్ద రోదిస్తున్న దృశ్యాలు.. ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనలో నవజాత శిశువులు 10 మంది సజీవ దహనం కాగా, మరో 16 మంది ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద సమయంలో 54 మంది ఆ వార్డులో చికిత్స పొందుతుండగా.. అందులో 44 మంది నవజాత శిశువులే కావడం గమనార్హం.ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యూపీ ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం, గాయపడ్డవాళ్లకు రూ.50 వేల పరిహారం ప్రకటించారు. ఘటనపై నివేదికను 12 గంటల్లో సమర్పించాలని డీజీపీ ఆదేశించారాయన. మరోవైపు.. ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి బాధిత కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు. -
మరో గోరఖ్‌పూర్ ఘటన రిపీట్ కానివ్వొద్దు
లక్నో: ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ ప్రాంతం. బుందేల్‌ఖండ్ ప్రాంతం ప్రజలకు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా ఒకే ఒక్క ఆస్పత్రి వైపు పరుగులు తీస్తారు. 700 పడకల పెద్ద ఆస్పత్రి అది. అలాంటిది సమస్యలకు మాత్రం నిలయంగా ఉంది. ముఖ్యంగా గోరఖ్‌పూర్ ఘటన తరహా ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా లేమి ఇక్కడ కూడా దర్శనమిస్తోంది. బాబా రాఘవ దాస్ ఆస్పత్రి ఉదంతం అనంతరం మహారాణి లక్ష్మి బాయి కాలేజీ ఆస్పత్రి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్డీ ఆస్పత్రి మాదిరిగానే ఇక్కడా ఆస్పత్రి యాజమాన్యం సిలిండర్ల సరఫరా కంపెనీకి బకాయిలు ఉన్నారు. అయితే గోరఖ్‌పూర్ ఉదంతం అనంతరం అప్రమత్తమై రంగంలోకి దిగిన అధికారులు హుటాహుటినా కంపెనీకి రూ. 36 లక్షలను చెల్లించేశారు. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే... ఆస్పత్రి, కంపెనీ ఒప్పందం ఈ యేడాది మార్చికే పూర్తయిపోయినప్పటికీ వాళ్లు ఇంకా సిలిండర్ల సరఫరాను కొనసాగించటమే. మరోపక్క టెండర్లు నిర్వహించాల్సిన ఆస్పత్రి వర్గాలు కూడా నిబంధనలను పెడ చెవిన పెట్టేశాయి. ఆస్పత్రికి రోజుకు 120 నుంచి 150 సిలిండర్ల అవసరం ఉండగా, కేవలం 25 నుంచి 50 సిలిండర్లను మాత్రమే వాళ్లు సరఫరా చేయగలుగుతున్నారు. సిలిండర్లు సప్లై చేస్తున్న గౌరీ గ్యాస్ కంపెనీ చాలా చిన్నది కావటంతోనే ఈ సమస్య ఉత్పన్నమవుతుందని ఇదే ఆస్పత్రిలో సేవలు అందించిన రిటైర్డ్ వైద్యుడు ఒకరు తెలిపారు. ఇలాంటి సమయంలో బీఆర్డీ ఆస్పత్రి మాదిరి జరగరానిది ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. అయితే తాను 18 ఏళ్లుగా ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్నానని, ఖరగ్‌పూర్ ఘటన మాదిరి పరిస్థితులు ఇక్కడేం కనిపించలేదని విధులు నిర్వహిస్తున్న మరో వైద్యుడు చెబుతున్నాడు. కానీ, రోగుల అనుభవాలు మాత్రం భయానకంగా ఉన్నాయి. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తికి ఆయింట్ మెంట్ పూయటం తప్ప వేరే చికిత్స చేయకపోవటం, రైలు నుంచి కింద పడి గాయపడ్డ ఓ బాలుడికి స్ట్రెచ్చర్ కూడా అందించకపోవటం లాంటి పరిస్థితులు అక్కడ దర్శనమిచ్చాయి. యూపీతోపాటు మధ్యప్రదేశ్ నుంచి ఏడు జిల్లాల ప్రజలు నిత్యం ఇక్కడకు చికిత్స కోసం వస్తుంటారు. యూపీలో దాదాపు ప్రతీ ఆస్పత్రిలో ఇలాంటి పరిస్థితులే దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల జాప్యం, అరకోర సిబ్బంది వంటి సమస్యలే ప్రజలకు మెరుగైన వైద్యాన్ని దూరం చేస్తున్నాయి. కనీసం ఇప్పుడు విమర్శల నేపథ్యంలోనైనా ప్రభుత్వాలు సకాలంలో స్పందించి చర్యలు తీసుకుంటే గోరఖ్‌పూర్ తరహా మృత్యు ఘోషలు పునరావృతం కావని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.