బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన
సూరత్‌లో నిర్వహించిన ఎమ్మెల్యే సంగీతా పాటిల్
సాక్షి, ముంబై : బీజేపీ జాతీయ నాయకత్వం పిలుపు మేరకు ‘మహా సంపర్క్ అభియాన్-2015’లో భాగంగా సూరత్‌లో చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ప్రతాప్‌నగర్, మారుతీనగర్, సర్దార్‌నగర్, అంబానగర్లలో బీజేపీ నాయకులు ఇంటింటికీ తిరిగి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెసుకున్నారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. లింబాయత్ వార్డు తెలుగు కార్పొరేటర్ రాపోలు లక్ష్మితో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంగీతా పాటిల్ మాట్లాడుతూ.. నూతన పాఠశాల భవనాలు, ఫ్లై ఓవర్లు, కమ్యూనిటీ హాళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, కూరగాయల మార్కెట్లు, రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సౌకర్యాలను సూరత్ కార్పొరేషన్ కల్పించిందని చెప్పారు. భవిష్యత్‌లో ఇంకా మెరుగైన సేవలు అందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో విధానసభ సభ్యురాలు సంగీతా పాటిల్, లింబాయత్ కార్పొరేటర్ డాక్టర్ రవీంద్ర పాటిల్, లింబాయత్ వార్డు బిజేపీ అధ్యక్షుడు చిట్యాల రాము, మాజీ కార్పొరేటర్ సంజయ్ పాటిల్, బీజేపీ తెలుగు నాయకులు అడిగొప్పుల సత్యనారాయణ, చెన్నూరి వెంకటయ్య, జెల్ల రాం చందర్ పాల్గొన్నారు.