breaking news
Lok Sabha TV channel
-
ఆధార్– ఓటర్ ఐడీ అనుసంధానానికి లోక్‌సభ ఓకే
న్యూఢిల్లీ: ఓటర్ ఐడీని ఆధార్ నెంబర్‌తో అనుసంధానించడం సహా పలు ఎన్నికల సంస్కరణలు పొందుపరిచిన బిల్లుకు లోక్‌సభ సోమవారం ఆమోదం తెలిపింది. బిల్లును హడావుడిగా తీసుకురావడంపై అసహనం వ్యక్తం చేసిన విపక్షాలు, దీన్ని స్టాండింగ్ కమిటీ (లా అండ్ జస్టిస్) పరిశీలనకు పంపాలని డిమాండ్ చేశారు. చివరకు మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోదం లభించింది. ఎన్నికల చట్ట సవరణ బిల్లు –2021ను సోమవారం న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఓటర్ ఐడీ– ఆధార్‌ను లింక్ చేయడం వల్ల బోగస్ ఓట్లను ఏరివేయవచ్చని ప్రభుత్వం పేర్కొంది. అయితే దీనివల్ల పౌరుల వ్యక్తిగత గోపత్యకు భంగం కలుగుతుందని, దేశ పౌరులు కాని వారు కూడా ఓటేసే ప్రమాదం ఉంటుందని కాంగ్రెస్ ఆరోపించింది. ఆధార్ లింకింగ్‌తో పాటు కొత్త ఓటర్ల నమోదుకు నాలుగు కటాఫ్ డేట్లను (జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1) నిర్ణయించడం, సర్వీసు ఓటర్ నిబంధనలో మార్పును బిల్లులో పొందుపరిచారు. మరోవైపు ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో అదనంగా మరో రూ. 3.73 లక్షల కోట్లను వ్యయం చేసుకునేందుకు వీలుకల్పించే సప్లిమెంటరీ గ్రాంట్స్‌కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ మొత్తంలో రూ.62 వేల కోట్లను ఎయిర్ఇండియాకున్న పాత అప్పులు, ఇతరత్రా బకాయిలను చెల్లించడానికి, రూ. 58 వేల కోట్లను ఎరువుల సబ్సిడీకి, రూ. 53 వేల కోట్లను ఎగుమతుల ప్రోత్సాహక బకాయిలను చెల్లించడానికి, రూ. 22 వేల కోట్లను గ్రామీణాభివృద్ధికి వెచ్చిస్తారు. ఒమిక్రాన్‌పై పోరుకు సిద్ధం కరోనా కొత్త వేరియంట్‌పై పోరుకు భారత్ సిద్ధంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి మన్సుఖ్ మాండవీయ రాజ్యసభలో చెప్పారు. రాబోయే రెండు నెలల్లో దేశ టీకా ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకు 45 కోట్ల డోసులకు పెంచుతామని తెలిపారు. ఎలాంటి సంక్షోభాన్నైనా ఎదుర్కొనేందుకు అవసరమైన ఔషధాలు, ఆక్సిజన్‌ను సిద్ధంగా ఉంచామన్నారు. దేశంలో ఇంతవరకు 161 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయన్నారు. మరోవైపు మీడియేషన్ (మధ్యవర్తిత్వ) బిల్లును స్టాండింగ్ కమిటీకి, బయోడైవర్సిటీ బిల్లును జాయింట్ కమిటీకి పంపేందుకు ప్రభుత్వం అంగీకరించింది. సోమవారం రాజ్యసభ ఎన్డీపీఎస్ చట్టానికి ఆమోదం తెలిపింది. సభ్యుల ఆందోళనలతో రాజ్యసభ పలుమార్లు వాయిదా పడింది. ఎందుకింత హడావుడి? ఎన్నికల చట్ట సవరణల బిల్లును మధ్యాహ్నం 12 గంటలకు సభలో ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లు పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉందని, సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘిస్తోందని విపక్షాలు దుయ్యబట్టాయి. విపక్ష సభ్యుల ఆందోళనతో సభ వాయిదా పడింది. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి ప్రారంభవ్వగానే ఈ బిల్లుపై చర్చకు స్పీకర్ అనుమతించారు. అయితే విపక్ష ఎంపీలు మరోసారి ఆందోళన చేపట్టడంతో మరో 45 నిమిషాల పాటు సభ వాయిదా పడింది. అనంతరం 2.45గంటలకు లోక్‌సభ మళ్లీ సమావేశమైంది. బిల్లును తీసుకురావడంలో ప్రభుత్వం తొందరపాటు చూపిందని, తగిన నిబంధనలు పాటించలేదని ప్రతిపక్షాలు విమర్శించాయి. దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని కోరాయి. అయితే పుట్టుస్వామి కేసులో వ్యక్తిగత గోపత్య ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు లోబడే ఈ బిల్లును తెచ్చామని, దీనివల్ల ఎవరైనా ఒక్కచోట మాత్రమే ఓటరుగా నమోదు చేసుకోగలరని, ఒక్కరే వేర్వేరు నియోజకవర్గాల్లో ఓటరుగా నమోదై ఉంటే... అలాంటివి గుర్తించి ఏరివేయవచ్చని మంత్రి రిజిజు వివరణ ఇచ్చారు. తద్వారా పారదర్శక ఎన్నికలు జరపవచ్చని అన్నారు. సుప్రీం జడ్జిమెంట్‌లో పేర్కొన్న అన్ని అంశాలకు అనుగుణంగానే బిల్లు రూపొందిందన్నారు. అలాగే ఆధార్‌తో అనుసంధానం స్వచ్ఛందమని స్పష్టం చేశారు. ఆధార్‌తో లింక్ చేయలేదని ఏ ఒక్కరి ఓటునూ తొలగించడం జరగదన్నారు. లా అండ్ పర్సనల్ స్టాండింగ్ కమిటీ సిఫార్సులను ఇప్పటికే బిల్లులో చేర్చినందున మరలా దీన్ని స్టాడింగ్ కమిటీకి పంపాల్సిన పనిలేదన్నారు. ప్రతిపక్షాల ఆందోళనల నడుమే మూజువాణి ఓటుతో బిల్లును లోక్‌సభ ఆమోదించింది. అయితే బిల్లులో ‘‘ఆధార్ నెంబరు ఇవ్వలేకపోతున్నందువల్ల (నిర్దేశించే సముచిత కారణాన్ని చూపితే)... కొత్తగా ఓటరు నమోదు కోసం వచ్చే ఏ ఒక్క దరఖాస్తును తిరస్కరించ కూడదు, ఓటరు జాబితాలోని ఏ ఒక్క పేరునూ తొలగించడానికీ వీల్లేదు’’ అని మెలిక ఉండటం అనుమానాలకు తావిస్తోంది. అనంతరం సభ మంగళవారానికి వాయిదా పడింది. -
సంసద్ టీవీని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ: లోక్‌సభ టీవీ, రాజ్యసభ టీవీ ఛానళ్లను కలుపుతూ కొత్తగా సంసద్ టీవీ ఛానల్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్య నాయుడు, లోక్‌సభ సభాపతి ఓం బిర్లా పాల్గొన్నారు. పార్లమెంటు కార్యకలాపాలను విస్తృత స్థాయిలో ప్రజలకు అందుబాటులో తేచ్చేందుకుగాను సంసద్ టీవీని మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ, అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం రోజున సంసద్ టీవీ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. చదవండి: ఐఫోన్- 13 రిలీజ్..! విపరీతంగా ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు..! అందులో జోమాటో కూడా.. సంసద్ టీవీలో పార్లమెంటు, ప్రజాస్వామిక వ్యవస్థల కార్యకలాపాలు; పథకాలు, విధానాల అమలు, పాలన; భారత దేశ చరిత్ర, సంస్కృతి; సమకాలిక స్వభావంగల సమస్యలపై ఈ చానల్ ప్రసారం చేయనున్నారు. లోక్‌సభ టీవీ, రాజ్యసభ టీవీ ఛానళ్లను కలిపి ఒకే చానల్‌గా ఏర్పాటు చేసేందుకు ప్రసార భారతి సీఈఓ సూర్య ప్రకాశ్ నేతృత్వంలోని కమిటీ ఆమోదం తెలిపింది. 2006 జూలైలో లోక్‌సభ టీవీ ప్రారంభించారు. లోక్‌సభ మాజీ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ ఆలోచనల మేరకు లోక్‌సభ టీవీను ఏర్పాటు చేశారు. రాజ్యసభ టీవీ 2011లో ప్రారంభమైంది. చదవండి: రెండు కోట్ల ఉద్యోగాలపై ఆందోళనలకు యువజన కాంగ్రెస్ పిలుపు -
లోక్‌సభ టీవీ సీఈవోకు ఉద్వాసన
న్యూఢిల్లీ: త్వరలో పదవి నుంచి దిగిపోనున్న లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ లోక్‌సభ టీవీ చానల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజీవ్ మిశ్రాకు ఉద్వాసన పలికారు. లోక్‌సభ సీఈవోగా రాజీవ్ మిశ్రాను తొలగిస్తూ స్పీకర్ మీరాకుమార్ ఉత్తర్వులు జారీచేశారని లోక్‌సభ సచివాలయం శుక్రవారం రాత్రి నోటిఫికేషన్ జారీచేసింది. స్పీకర్ ఆదేశాలు శనివారం నుంచి అమలులోకి వస్తాయని పేర్కొంది. అయితే మిశ్రా తొలగింపునకు స్పీకర్ ఎలాంటి కారణాలనూ ప్రస్తావించలేదు. తనను సర్వీసు నుంచి తొలగించడంపై మిశ్రా స్పందిస్తూ.. నోటీసులు ఇవ్వకుండానే తొలగించడాన్ని తప్పుపట్టారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌లోని ససారం నుంచి మీరాకుమార్ ఓడిపోయారని, ఆ వార్తను లోక్‌సభ టీవీలో ఫ్లాష్ న్యూస్‌లో ప్రసారం చేసినందుకే ఆమె తనపై వేటువేశారంటూ ఆరోపించారు.