breaking news
local cuisine
-
జీ20 నేతలకు మెనూ సిద్ధం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 9, 10వ తేదీల్లో జరిగే జీ20 శిఖరాగ్ర సదస్సుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా పలువురు ప్రపంచ దేశాల నేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఎన్నో పోషకాలతో నోరూరించే భారతీయ తృణధాన్యాల వంటకాల రుచిని వీరికి చూపించనున్నారు. భారత్ మంటపంలో జరుగుతున్న శిఖరాగ్రం ఏర్పాట్లను జీ20 స్పెషల్ సెక్రటరీ ముక్తేశ్ పర్దేశి ఆదివారం పీటీఐకి వివరించారు. ‘మన దేశ స్ట్రీట్ ఫుడ్, ప్రాంతీయ, స్థానిక వంటకాలను వారికి సరికొత్త రీతిలో పరిచయం చేయనున్నాం. ఢిల్లీలోని చాందినీ చౌక్ తదితర ప్రాంతాల్లోని స్ట్రీట్ ఫుడ్‌కు ఎంతో పేరుంది. ఇక్కడ ఏర్పాటు చేయనున్న మీడియా సెంటర్లో భారతీయ స్ట్రీట్ ఫుడ్ రుచిని ఆస్వాదించొచ్చు’అని పర్దేశి వివరించారు. ప్రపంచదేశాల నేతల సతీమణుల కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఆయన చెప్పారు. ‘నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్‌లో షాపింగ్ అనుభవంతో కూడిన భారతీయ ప్రసిద్ధ హస్తకళల వారసత్వంపై లైవ్ షోలు ఏర్పాటుచేశాం. నేతలు, ప్రతినిధులకిచ్చే బహుమతుల ఎంపికలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం’అని చెప్పారు. ‘ప్రపంచ నాయకులకిచ్చే బహుమతులు గౌరవభావాన్ని పెంచేలా, వారి మనస్సును ఆకట్టుకునేలా ఉండాలని ప్రధాని చెప్పారు. ఆ మేరకు తివాచీలు, హస్తకళల వస్తువులు, పెయింటింగ్‌ల వంటి వాటితో జాగ్రత్తగా తయారు చేసిన జాబితాను అందజేశాం’అని తెలిపారు. శిఖరాగ్రానికి వివిధ దేశాల నుంచి 10 వేల మందికి పైగా తరలిరానున్నారని పర్దేశి చెప్పారు. ‘శిఖరాగ్రంలో చివరి సెషన్లో జీ20 తదుపరి అధ్యక్ష హోదాలో బ్రెజిల్ లాంఛనప్రాయంగా బాధ్యతలను చేపడుతుంది. నవంబర్ 30వ తేదీన ప్రధాని బ్రెజిల్‌కు వెళ్లి బాధ్యతలను అప్పగించే అవకాశం లేకపోవడంతో ఈ మేరకు నిర్ణయించారు’అని పర్దేశి చెప్పారు. -
రైళ్లలో ఇక ప్రాంతీయ రుచులు
- స్వయంసహాయక సంఘాలతో ఈ-కేటరింగ్ సదుపాయం - సికింద్రాబాద్, విజయవాడ, విశాఖపట్నం సహా 9 స్టేషన్ల ఎంపిక న్యూఢిల్లీ: ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించడంలో భాగంగా భారతీయ రైల్వే మరో అడుగు ముందుకేసింది. స్వయంసహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) ద్వారా రైళ్లలో ప్రాంతీయ రుచులు అందించేలా స్టేషన్ ఆధారిత ఈ-కేటరింగ్ సదుపాయానికి శ్రీకారం చుట్టింది. తెలుగు రాష్ట్రాల్లోని సికింద్రాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు మైసూర్, ఎర్నాకులం, అద్రా తదితర పది స్టేషన్లలో పరిశుభ్ర వాతావరణంలో వండిన నాణ్యమైన స్థానిక ఆహార పదార్థాలను వడ్డించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈమేరకు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజమ్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్సీటీసీ)... తొమ్మిది ఎస్‌హెచ్‌జీలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ స్టేషన్ల మీదుగా వెళ్లే అన్ని రైళ్ల ప్రయాణికులు ఈ-కేటరింగ్ ద్వారా ఈ సదుపాయాన్ని పొందవచ్చు. ఎస్‌హెచ్‌జీలను ప్రోత్సహించడంతో పాటు, ప్రయాణికులకు మరిన్ని రుచికరమైన వంటకాలు అందించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైల్వే మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు చెప్పారు. తద్వారా ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతాయన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని స్వయంసహాయక సంఘాలు ఇందులో భాగస్వామ్యమవుతాయని ఆశిస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా నడుస్తున్న రైళ్లలో రోజుకు 11 లక్షల భోజనాలు సరఫరా అవుతున్నాయి. వీటిల్లో అత్యధికంగా ప్రైవేటు కేటరర్సే అందిస్తున్నారు. స్టేషన్ ఆధారిత ఈ-కేటరింగ్ సదుపాయాన్ని రైల్వే గత ఏడాది ప్రారంభించింది. రైళ్లలో సరఫరా చేసే ఆహార పదార్థాలపై నిత్యం అందుతున్న ఫిర్యాదులను తగ్గించి, నాణ్యమైన వంటకాలను ప్రయాణికులకు అందించేలా తాజా పథకాన్ని రైల్వే తీసుకువచ్చింది. ఫ్లెక్సీ-ఫేర్ విధానంలో మార్పులు..! ప్రీమియర్ రైళ్లలో ఖాళీ బెర్త్‌లను భర్తీ చేసుకొనేందుకు రాజధాని, దురంతో, శతాబ్ధి రైళ్లలో అమలవుతున్న ఫ్లెక్సీ-ఫేర్ విధానంలో రైల్వే మార్పులు చేయనుంది. గతేడాది సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టిన ఫ్లెక్సీ-ఫేర్ విధానంలో... పది శాతం సాధారణ చార్జీల కేటగిరీ కింద, ఆ తరువాత భర్తీ అయిన ప్రతి పది శాతం బెర్తులపై పది శాతం చొప్పున అధిక టికెట్ ధర (అత్యధికంగా 50 శాతం) వసూలు చేస్తున్నారు. దీనికి స్వస్తి చెప్పి... ప్రీమియర్ రైళ్లలో బేసిక్ టికెట్ ధరను 15 శాతం పెంచడమో... లేక 50 శాతం బెర్త్‌లకు సాధారణ చార్జీ నిర్ణయించడమో చేసే ఆలోచనలో రైల్వే ఉంది. రాజాధాని, దురంతో, శతాబ్ధి రైళ్లలోని ఖాళీ సీట్లపై సమీక్ష జరిపిన రైల్వే మంత్రి సురేశ్ ప్రభు... ఆక్యుపెన్సీ పెంచుకొంటూ ప్రయాణికులకు మరింత ప్రయోజనం చేకూర్చేలా ఫ్లెక్సీ-ఫేర్‌లో మార్పులు చేయాలని భావిస్తున్నారు. దీనిపై లోతుగా చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ఓ నిర్ణయం వెలువడుతుందని మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ విధానం ద్వారా రైల్వే ఇప్పటి వరకు రూ.260 కోట్లు ఆర్జించింది. దీన్ని ఏడాదికి రూ.500 కోట్లకు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఢిల్లీ-కోల్‌కతా మార్గంలో మెరుగైన నెట్వర్క్ అన్నింటికన్నా ఢిల్లీ-హౌరా రైల్వే మార్గంలో మొబైల్ నెట్వర్క్ కవరేజీ అత్యుత్తమంగా ఉందని ఓ అధ్యయనంలో తేలింది. ఈ మార్గంలో 88 శాతం నెట్వర్క్ కవరేజీ ఉండగా, తరువాతి స్థానాల్లో బెంగళూరు-చెన్నై రూట్లో 78 శాతం, ఢిల్లీ-ముంబై మార్గంలో 74 శాతం కవరేజీ ఉంది. రైల్వే స్టేషన్లలో హైస్పీడ్ వైఫై అందుతుండగా, దూరప్రాంత రైళ్లలో మొబైల్ కనెక్టివిటీ హెచ్చుతగ్గులుందని రైల్యాత్రి సీఈఓ మనిష్ రాఠి చెప్పారు.