Listening
-
ష్.. మీ ఫోన్ వింటోందా?
మీరేం మాట్లాడుతున్నారు? ఏం చేయాలని అనుకుంటున్నారు?.. ఇవన్నీ మీ వ్యక్తిగతం. వేరే ఎవరికీ తెలిసే అవకాశమే లేదు. కానీ మీ స్మార్ట్ ఫోన్ ఇవన్నీ వినేస్తోంది. మనపై మన ఫోన్ ఉంచుతున్న నిఘా గుట్టును తేల్చేయడానికి నిపుణులు 4 సూచనలు చేస్తున్నారు. మన సంభాషణలను రహస్యంగా వినేస్తున్న స్మార్ట్ ఫోన్లు మనం దేని గురించి మాట్లాడితే.. ఆ అంశంపై యాడ్స్ వెబ్సైట్ల నుంచి సోషల్ మీడియా ఏది ఓపెన్ చేసినా అవే ప్రకటనల గోల మీరేం మాట్లాడుతున్నారు? దేని గురించి మాట్లాడుతున్నారు? ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు?.. ఇవన్నీ మీ వ్యక్తిగతం. ఇంట్లో మీ గదిలో కూర్చుని మీ భార్యతోనో, భర్తతోనో, పిల్లలతోనో, తల్లిదండ్రులతోనో ఇవన్నీ మాట్లాడుకున్నారు. వేరే ఎవరికీ తెలిసే అవకాశమే లేదు. కానీ ఒకరు మాత్రం రహస్యంగా అన్నీ వినేస్తున్నారు.. వినడమే కాదు, మీ మాటలన్నీ విశ్లేషించి... మీ అవసరానికి సూటయ్యేలా సూచనలు చేస్తున్నారు. మీకు తెలియకుండానే ఇదంతా జరిగిపోతోంది. ఇంతకీ అన్నీ వింటున్న ఆ ఒక్కరు ఎవరు?.. మీ స్మార్ట్ ఫోనే! నిఘా పెట్టేదెలాగో, అది మనకు తెలిసేదెలాగో తెలుసుకుందామా..ఇంటర్నెట్ సెర్చింగ్ నుంచి మైక్రోఫోన్‌తో నిఘా దాకా..మీరు ఏదైనా ప్రదేశం గురించో, మరేదైనా సమాచారం కోసమో ఇంటర్నెట్లో సెర్చింగ్ చేస్తే.. ఆ తర్వాత మీ ఫోన్లో, కంప్యూటర్లో ఆ ప్రదేశం, సమాచారానికి సంబంధించిన ప్రకటనలు ప్రత్యక్షమవుతూ ఉంటాయి. ఉదాహరణకు మనం ఢిల్లీలో మంచి హోటళ్లు ఏమేం ఉన్నాయని సెర్చ్ చేశామనుకోండి. ఆ తర్వాత కొన్నిరోజుల వరకు మనం ఏ వెబ్సైట్లు ఓపెన్ చేసినా.. వాటిలో ఢిల్లీలోని హోటళ్ల సరీ్వసులు, ట్రావెల్ ఏజెన్సీల ప్రకటనలు కనిపిస్తూ ఉంటాయి. ఇంతవరకు మనకు తెలిసిందే. కానీ మన ఫోన్ మనం ఏం మాట్లాడుతున్నాం, దేని గురించి మాట్లాడుతున్నామనేదీ తెలుసుకుంటోంది. ఫోన్లోని మైక్రోఫోన్ ద్వారా నిఘాపెడుతోంది. మరి మన ఫోన్ ఇలా మనపై నిఘా పెట్టిందా లేదా అనేది చిన్న ట్రిక్ ద్వారా తెలుసుకోవచ్చని ‘నార్డ్ వీపీఎన్’ సంస్థ టెక్ నిపుణులు చెబుతున్నారు.మనపై ఫోన్ నిఘా గుట్టు తేల్చేద్దాం ఇలా..1. మీరు ఇప్పటివరకు ఇంటర్నెట్లో సెర్చ్ చేయని, సోషల్ మీడియాలో పెట్టని, ఎప్పుడూ మాట్లాడని ఒక కొత్త టాపిక్‌ను ఎంచుకోండి.2. మీ ఫోన్‌ను మీకు దగ్గరలో పెట్టుకుని ఈ టాపిక్‌పై నాలుగైదు రోజులు తరచూ మాట్లాడండి. ఎవరితోనైనా చర్చించండి. ఉదాహరణకు ఏదైనా దేశం, అక్కడి నగరాలు, టూరిస్టు ప్లేసులు, రెస్టారెంట్లు వంటి అంశాలను మాట్లాడండి.3. అయితే ఈ టాపిక్కు సంబంధించి ఇంటర్నెట్లో, సోషల్ మీడియాలో ఎక్కడా సెర్చింగ్, పోస్టింగ్ వంటివి చేయకూడదు. కేవలం ఫోన్‌ను మీకు సమీపంలో పెట్టుకుని సదరు టాపిక్‌పై మాట్లాడాలి. మిగతా విషయాల్లో మీ ఫోన్‌ను మామూలుగానే వాడుతూ ఉండాలి.4. 4,5 రోజుల తర్వాతి నుంచి మీ ఫోన్లో, మీ ఈ–మెయిల్‌తో లింక్ అయి ఉన్న స్మార్ట్ టీవీలు, ట్యాబ్లెట్లు, కంప్యూ టర్లలో.. మీరు చూసే వెబ్సైట్లు, సోషల్ మీడియా యాప్స్‌లో వచ్చే యాడ్స్‌ను కాస్త గమనిస్తూ ఉండండి.5, ఒకవేళ మీరు మాట్లాడిన అంశానికి సంబంధించి యాడ్స్ తరచూ కనిపిస్తూ ఉంటే.. ఫోన్ మీపై నిఘా పెట్టి, మీ సంభాషణలలోని టాపిక్స్‌ను యాడ్స్ కోసం వాడుతున్నట్టే.ఈ నిఘా నుంచి బయటపడేదెలా? ⇒ ఫోన్లో సోషల్ మీడియా, ఈ–కామర్స్, బ్యాంకింగ్ వంటి ముఖ్యమైన యాప్స్ నుంచి.. గేమ్స్, యుటిలిటీస్ యాప్స్ వరకు ఉంటా యి. వాటిని ఇన్స్టాల్ చేసినప్పుడు స్టోరేజీ, మైక్రోఫోన్, కెమెరా వంటి పరి్మషన్లు ఇస్తుంటాం. ఇక్కడే సమస్య మొదలవుతుంది. ⇒ పెద్ద కంపెనీల యాప్‌లతో సమస్య ఉండకపోవచ్చుగానీ.. గేమ్స్, యుటిలిటీస్, ఎంటర్టైన్మెంట్ కోసం ఇన్స్టాల్ చేసుకునే యాప్‌లు, యాడ్స్‌పై లింకులను క్లిక్‌చేయడం ద్వారా డౌన్లోడ్ అయ్యే యాప్‌లతో ఇబ్బంది ఉంటుంది. ఇలాంటి యాప్‌లకు ఇచ్చే పరి్మషన్లు దుర్వినియోగమై.. మీ ఫోన్‌తోనే మీపై నిఘా మొదలవుతుంది. అందువల్ల ముఖ్యమైన యాప్స్ మాత్రమే ఇన్స్టాల్ చేసుకోవాలి. ⇒ యాప్స్‌కు అవసరమైన పరి్మషన్లు మాత్రమే ఇవ్వాలి. అప్పుడప్పుడూ ఏయే యాప్స్‌కు ఏ పరి్మషన్లు ఇచ్చినదీ, సెట్టింగ్స్‌లోకి వెళ్లి పరిశీలించాలి. అనవసర యాప్స్‌కు ఇచ్చిన పరి్మషన్లను తొలగించాలి. వీలైతే అవసరం లేని యాప్స్‌ను తొలగించేయడం మంచిది. ⇒ ఫోన్లోని వాయిస్ అసిస్టెంట్ యాప్ సెట్టింగ్స్‌లో ‘ఆలో వెన్ లాక్డ్’ఆప్షన్‌ను డిజేబుల్ చేయాలి. దీనితో ఫోన్ లాక్ అయి ఉన్నప్పుడు మైక్రోఫోన్ వాడకుండా ఉంటుంది. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
యాడ్స్ కోసం ఎంతకు తెగించింది ఈ కంపెనీ..?
ఆన్లైన్ మార్కెటింగ్ కంపెనీల ఆగడాలు శృతి మించుతన్నాయి. సాధారణంగా ఇంటర్నెట్లో యూజర్ల ప్రవర్తన ఆధారంగా కంపెనీలు వెబ్సైట్లు, సోషల్ మీడియాలో లక్షిత యాడ్స్‌ను ప్రదర్శిస్తుంటాయి. అయితే వినియోగదారుల అభిరుచులను కనుగొనేందుకు కంపెనీలు యూజర్ల ఫోన్ సంభాషణలను వింటున్నాయని ఎప్పటి నుంచో అనుమానాలు ఉన్నాయి. అయితే తాజాగా ఓ కంపెనీ దీన్ని అంగీకరించింది. ఇందు కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తున్నట్లు వెల్లడించింది.‘404 మీడియా’ నివేదిక ప్రకారం.. కాక్స్ మీడియా గ్రూప్ (Cox Media Group) అనే మార్కెటింగ్ కంపెనీ స్మార్ట్ ఫోన్ల మైక్రోఫోన్ల ద్వారా యూజర్లు ఏం మాట్లాడుతున్నారో వింటోంది. ఆ సంభాషణల ఆధారంగా ప్రకటనలు గుప్పిస్తున్నట్లు అంగీకరించింది. ఫేస్బుక్, గూగుల్ వంటి పెద్ద ప్లాట్‌ఫామ్‌లు ఈ కంపెనీకి క్లయింట్లుగా ఉన్నాయి. యూజర్ల సంభాషణలు వినడానికి ఆ కంపెనీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన యాక్టివ్ లిజెనింగ్ సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తున్నట్లు తమ ఇన్వెస్టర్లకు తెలిజేసింది.దీనిపై స్పందన కోరేందుకు 404 మీడియా సంప్రదించిన వెంటనే గూగుల్ తమ పార్ట్నర్ ప్రోగ్రామ్ వెబ్సైట్ నుంచి సదరు మార్కెటింగ్ సంస్థను తొలగించింది. ‘వర్తించే అన్ని చట్టాలు, నిబంధనలతో పాటు గూగుల్ ప్రకటనల విధానాలకు ప్రకటనకర్తలందరూ కట్టుబడి ఉండాలి. ఈ విధానాలను ఉల్లంఘించే ప్రకటనలు లేదా ప్రకటనదారులను గుర్తించినప్పుడు, తగిన చర్య తీసుకుంటాం" అని గూగుల్ ప్రతినిధి ఒకరు తెలిపినట్లు ‘న్యూయార్క్ పోస్ట్’పేర్కొంది. -
కథ చెబుతాం.. ఊ కొడతారా..!
‘అనగనగా ఓ మహారాజు ఉన్నాడు. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు.. ఏడుగురూ వేటకువెళ్లి ఏడు చేపలు తెచ్చారు...’ ఇలా పిల్లలకు పాత కథలు మాత్రమే తప్ప కొత్త కథలు, కొత్తగా చెప్పడం రాని ఆధునిక తల్లిదండ్రులు.. కథలు నేర్పే స్టోరీ టెల్లర్స్ దగ్గర బారులు తీరుతున్నారు. వీరు మాత్రమే కాదు పాఠశాల విద్యార్థులకు పాఠాలు చెప్పే టీచర్ల నుంచి కార్పొరేట్ ఉద్యోగులకు పాఠాలు చెప్పే కౌన్సిలర్స్ వరకూ అందరూ కథా కళ..లో నైపుణ్యం కోసం క్యూ కడుతున్నారు. – సాక్షి, సిటీబ్యూరోప్రధానంగా నగరంలో ఈ కళకు డిమాండ్ తీసుకురావడంతో తల్లిదండ్రులే మహారాజు పోషకులుగా కనిపిస్తున్నారు. పిల్లలకు కథలు చెప్పడం మానసిక వికాసానికి మార్గమని సైకాలజిస్ట్‌లు సూచిస్తుండడం ఈ పోకడకు ఆజ్యం పోస్తోంది. పిల్లలకు కథలు చెప్పడం కేవలం వినోదం కాదని, ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో ఇది తప్పనిసరి అని చెబుతున్నారు స్టోరీ టెల్లర్ దీపాకిరణ్. కథలు చెప్పడం వల్ల పెద్దలు, పిల్లల మధ్య అనుబంధం మరింత బలపడుతుందని అన్నారామె.ప్రయోజనాలెన్నో...సంభాషించడానికి మాత్రమే కాదు నేర్చుకోవడానికీ.. ఆలోచనల్లో పరిణితికీ భాష అవసరం. అయితే ప్రస్తుత రోజుల్లో చిన్నారుల్లో భాషా పరిజ్ఞానం సంతరించుకోవడం ఆలస్యం కావడం సహజంగా మారింది. ఈ పరిస్థితుల్లో చిన్నారులను ఆకట్టుకునేలా కథలు చెప్పడం నేర్చుకున్న పెద్దలు ఆ నైపుణ్యాన్ని పిల్లలకు అందిస్తారు. కథల ద్వారా సంస్కృతి గురించి నేర్పవచ్చు. అలాగే ప్రవర్తనను తీర్చిదిద్దవచ్చు అంటున్నారు నిపుణులు.మనవడికి కథలు చెబుతున్నా...కొన్ని రోజుల క్రితం నా పదేళ్ల మనవడు అమ్మమ్మా కథ చెప్పమని నన్ను అడగడం నన్నెంతో ఆశ్చర్యపరిచింది. ఇంటర్నెట్ కాలంలో కూడా పెద్దల నోటి ద్వారా కథలు వినడానికి పిల్లలు ఇష్టపడుతున్నారని నాకు అర్థమైంది. స్టోరీ టెల్లింగ్ వర్క్‌షాప్‌కి అటెండ్ అయ్యి కొత్త కొత్త కథలు, ఆకట్టుకునేలా చెప్పగలడం అనేది నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. నా మనవడు/మనవరాళ్లతో అనుబంధం మరింత బలోపేతం చేసింది. – భారతి రామినేనిమెళకువలు నేర్చుకుంటే మేలెంతో..స్టోరీ టెల్లింగ్ సెషన్స్‌కి హాజరవడం వల్ల కథకు సంగీతాన్ని జత చేయడం, ముఖ కవళికలు, గొంతు పలికే తీరులో మార్పుచేర్పులు చూపడం.. వంటివి నేర్చుకుని నా మూడేళ్ల కొడుకుకి మంచి కథలు చెప్పగలుగుతున్నా. తనతో అనుబంధాన్ని మరింతగా ఆనందిస్తున్నా. – దాసన్నకళ అబ్బింది.. కథ వచ్చింది.. కథలు చెప్పడమే కదా ఎంత సేపు అనుకుంటాం కానీ.. ఈ ఆర్ట్‌ను నేర్చుకుంటే.. జీవితంలో ప్రతీ సందర్భాన్ని ఒక కథగా మలిచే సామర్థ్యం వస్తుంది. సంగీతాన్ని కలుపుతూ మా అబ్బాయికి కథ చెప్పడం, కథలోని క్యారెక్టర్స్ ఆవాహన చేసుకుని చెప్పడం వంటివి తనకి బాగా కనెక్ట్ అవుతోంది. తన కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడానికి బాగా ఉపకరిస్తోంది. విశేషం ఏమిటంటే తనే కథలు అల్లేసి నాకు చెబుతున్నాడు. – సుధారాణిప్రొఫెషనల్ లైఫ్‌లో ప్రజెంటేషన్స్కూ..ఓ ఐటీ కంపెనీలో పనిచేసే నాకు వృత్తి జీవితంలో స్టోరీ టెల్లింగ్ సామర్థ్యం ఉపకరించింది. ముఖ్యంగా పలు అంశాలపై ప్రజెంటేషన్స్ ఇవ్వడానికి సహకరించాయి. నిజానికి నా సోదరి కూతుర్ని పెంచాల్సిన బాధ్యత వల్ల స్టోరీటెల్లింగ్ నేర్చుకోవాల్సి వచి్చంది. అలా నేర్చుకుని తనకు చెప్పిన కొన్ని కథలు తనని క్లాస్‌లో టాపర్‌గా మార్చాయి. మంచి హాబీస్‌ను అలవర్చాయి. తను ఎప్పుడైనా ఏడుపు ముఖం పెట్టిందంటే నేను అనగనగా అనగానే ముఖ కవళికలు మార్చేసి ఆసక్తిగా చూస్తుంది. కథలు చెప్పడం వల్ల నా కూతురికి కూడా చాలా మానసిక వికాసం వచ్చేలా చేయగలిగాను. చాలా ఇళ్లలో పిల్లల వల్ల ఎదురయ్యే అల్లరి చిల్లరి ఇబ్బందులెప్పుడూ నాకు ఎదురు కాలేదు. దానికి కారణం కథలే అని చెప్పగలను. అందరు పిల్లలూ వీడియోగేమ్స్‌లో బిజీగా ఉండే సమయంలో మా పిల్లలు నన్ను కథ చెప్పవా అని అడుగుతారు. – వసుధకథలతో అనుబంధాలు బలోపేతం..స్టోరీటెల్లింగ్ అనే కళలో నైపుణ్యం సాధించే విషయంలో టీచర్లతో పాటు అవ్వా, తాతలకు, తల్లిదండ్రులకు బాగా ఆసక్తి పెరిగి మా స్టోరీ సూత్ర సంస్థను సంప్రదిస్తున్నారు. కథలు చెప్పే కళలో నైపుణ్యం సాధించిన వారు ఇలా పిల్లలతో తమ మధ్య అనుబంధం బలపడిందని, అంతిమంగా అది తమ ఆరోగ్యానికి, ఆనందానికి సైతం ఉపకరిస్తోందని చెబుతున్నారు. – దీపాకిరణ్, స్టోరీ టెల్లర్ -
పుస్తకం కర్ణభూషణం
పుస్తకం హస్తభూషణమన్నారు; అది చదివే పుస్తకాల గురించి! ఇప్పుడు వినే పుస్తకాలు ప్రాచుర్యాన్ని తెచ్చుకుంటూ కర్ణభూషణంగా మారుతున్నాయి. కాలం చేసే తమాషాలలో ఇదొకటి. మన జీవితమూ, ఊహలూ, ప్రణాళికలూ కాలం వెంబడి సరళరేఖలా సాగుతాయనుకుంటాం. కానీ,దృష్టి వైశాల్యాన్ని పెంచుకుని చూస్తే కాలం మళ్ళీ మళ్ళీ బయలుదేరిన చోటికే వచ్చే చక్రంలా కూడా కనిపిస్తుంది. ‘కాలచక్ర’మనే మాట సర్వత్రా ప్రసిద్ధమే. పుస్తక ప్రపంచంలోకే కనుక ఒకసారి తొంగి చూస్తే, ‘చదువు’ అనే మాట పుస్తకంతో ముడిపడే ప్రచారంలోకి వచ్చింది. పుస్తకాలు లేని కాలంలో; లేదా, అవి జనసామాన్యానికి విరివిగా అందుబాటులోకి రాని రోజుల్లో కథలూ, కవిత్వాలూ, ఇతరేతర జ్ఞానాలూ అన్నీ వినుకలి ద్వారానే అందేవి. దీర్ఘకాలంపాటు ప్రపంచవ్యాప్తంగా సమస్త వాఙ్మయమూ చక్షురక్షరాల మధ్య కాకుండా; వక్తకీ, శ్రోతకీ మధ్య ప్రవహిస్తూ మౌఖిక వాఙ్మ యమనే ముద్ర వేసుకుంది. పుస్తక వ్యాప్తితోనే లిఖిత సాహిత్యమన్న మాట వాడుకలోకి వచ్చింది. కాలచక్రం మళ్ళీ మొదటికొచ్చి, పుస్తకమనే ‘పఠన’ మాధ్యమం స్థానాన్ని, ఇయర్ ఫోన్ రూపంలో తిరిగి వెనకటి ‘శ్రవణ’ మాధ్యమం ఆక్రమించుకుంటున్నట్టు తోస్తోంది. నేటి యువత పుస్తకాన్ని చదవడం కన్నా, వినడాన్ని ఎక్కువ ఇష్టపడుతున్నట్టు కనిపిస్తోంది. ఆ విధంగా, ‘పుస్తకాలు లేని గది ఆత్మలేని దేహ’మన్న సిసిరో సూక్తిని కొంత సవరించుకోవలసిన అవసరమూ కలుగుతోంది. కనుకలి నుంచి వినుకలికి మారినప్పుడు పుస్తకం కలిగించే అనుభూతి గాఢతలోనూ మార్పు వస్తుందా అన్నది అనుభవంతో మాత్రమే చెప్పగలం. ఏదైనాసరే అంతిమంగా అలవాటు పడడంలోనే ఉంటుంది. మాధ్యమం ఎలాంటిదైనా పుస్తకానికీ మస్తకానికీ పడిన పీటముడి స్థిరమూ, శాశ్వతమనీ మాత్రం నిస్సంశయంగా చెప్పవచ్చు. రాబోయే కాలం అనూహ్యంగా మన అంచనాలను తలకిందులు చేస్తే తప్ప పుస్తకాలతో మన సహజీవనం మరికొన్ని తరాలపాటు నిరాఘాటంగా కొనసాగుతుందనే అనుకోవచ్చు. కాపురంలోలానే పుస్తకాలతో కాపురంలోనూ చేదూ, తీపీ కలగలిసే ఉంటాయి. పుస్తక ప్రియులు వియ్యమందితే ఒక్కోసారి సొంతింటి పుస్తక వారసత్వానికీ, సొంత సేకరణకూ అదనంగా అత్తింటి పుస్తక వారసత్వమూ అంది, పుస్తకాలు ఇబ్బడి ముబ్బడై అల్మైరాలను దాటిపోయి నేల మీద పరచుకుంటూ ఉంటాయి. పుస్తెతోపాటు సంక్రమించిన పుస్తక సంపదా ఇల్లాలికి దినదిన సమస్య అవుతూ ఉంటుంది. పుస్తకాలతో జీవించడం కూడా ఒక పుస్తకానికి సరిపోయే ఇతివృత్త మవుతుంది. బాల్యం నుంచి, వార్ధక్యం వరకూ మనతో ఉండే పుస్తకాలు, ఒక్క పుట కూడా తెరవకుండానే, ఆయా వయోదశల మీదుగా మన అభిరుచులలో వచ్చే తేడాలను బోధిస్తాయి. మనకు పనికిరానివని పక్కన పెట్టిన పుస్తకాలే క్రమంగా మన చదువుల బల్లకెక్కి వెక్కిరిస్తాయి. మన హస్తస్పర్శ కోసం ఏళ్ల తరబడి మౌన తపస్సు చేసే పుస్తకాలే, ఒక్కసారి తెరవగానే అద్భుత ప్రపంచంలోకి మనల్ని లాక్కుపోతాయి. మన ప్రయాణం ఆగినా పుస్తక ప్రయాణం కొన సాగుతూనే ఉంటుంది. కవిత్వానికి ఏదీ అనర్హం కాదని మహాకవి ఉగ్గడించినట్టుగా, చరిత్ర శోధనకూ ఏదీ అనర్హం కాదు. పుస్తక చరిత్రనే తవ్వితే అది కూడా ఎన్నో అవతారాలు ఎత్తుతూ నేటి దశకు వచ్చిన సంగతి అర్థమై రేపటి అవతారం గురించిన దిగులు, గుబుళ్లను తగ్గిస్తుంది. పుస్తకం గురించిన ఊహ క్రీస్తుపూర్వం నాలుగవ సహస్రాబ్ది నాటికే ఉండేది. ప్రాచీన ఈజిప్టు వాసులు మధ్య ఆఫ్రికా, నైలునదీ లోయల్లో పెరిగే ‘పెపారస్’ అనే నీటిమొక్క నుంచి తీసిన మెత్తని బెరడును రాతకు, చిత్రలేఖనానికి ఉపయోగించేవారు. ఈ ‘పెపారస్’ పేరే ‘పేపర్’గా మారి ఇప్పటికీ వ్యవహారంలో ఉంది. ఆంగ్లంలో ‘బుక్’ అనే మాట పుట్టుకా ఇంతే ఆసక్తికరం. యూరప్, ఆసియా అడవుల్లో పెరిగే ‘బచ్’ అనే చెట్టు తాలూకు తెల్లని బెరడును రాతకు ఉపయోగించేవారు. నేటి ఇండో–యూరోపియన్ భాషలకు మాతృక అయిన ప్రోటో–ఇండో–యూరోపియన్ లోని ‘భెరెగ్’, ‘భగో’ అనే మాటలే వివిధ పుత్రికాభాషల్లో ‘బచ్’ గానూ, ‘బీచ్’ గానే కాక; ఇంకా అనేక రూపాంతరాలు చెందుతూ చివరికి ‘బుక్’గా మారాయి. ప్రాచీన భారతదేశంలో రాతకు ఉపయోగించిన ‘భూర్జపత్ర’ మనే సంస్కృత శబ్ద మూలాలు కూడా ‘భెరెగ్’ అనే ప్రోటో–ఇండో–యూరోపియన్ పదంలోనే ఉన్నాయి. క్రీస్తుశకం తొలి శతాబ్దంలో రోమన్లు శిక్షాస్మృతుల రాతకు గొర్రె, మేక చర్మాన్ని వినియో గించేవారు. క్రమంగా తాటియాకులు, రాగిరేకులు రాతకు ఆలంబనమయ్యాయి. క్రీస్తుశకం 2–5 శతాబ్దుల మధ్యలో వచ్చినట్టు చెబుతున్న ‘డైమెండ్ సూత్ర’ తొలి ముద్రితగ్రంథమంటారు. ఇక 15వ శతాబ్దిలో జోహానెస్ గూటెన్‌బర్గ్ కనిపెట్టిన ముద్రణ యంత్రం పుస్తక ప్రచురణను విప్లవీకరించడం, 16వ శతాబ్దిలో రిచర్డ్ ముల్కాస్టర్ అనే పండితుడు ఎనిమిదివేల మాటలతో తొలి నిఘంటువును ప్రచురించడం వగైరాలు ఇటీవలి చరిత్ర. ఎప్పటికప్పుడు పరిమిత సంఖ్యలో పుస్తకాలను ప్రచురించుకునే నేటి అవకాశాన్ని (ప్రింట్–ఆన్ –ఆర్డర్) ఫ్రెడరిక్ ఫో అనే సైన్సు ఫిక్షన్ రచయిత 1966లోనే ఊహించాడు. ఇంతకీ ఈ పుస్తక స్మరణ దేనికంటే, రెండు తెలుగు రాష్ట్రాలలోనూ పుస్తకాల పండుగ సమీపిస్తోంది. కొన్ని రోజులపాటు జరిగే ఈ పండుగకు ముద్రాపకులు, విక్రేతలు, రచయితలు సమధికోత్సాహంతో సిద్ధమవుతున్నారు. ముద్రిత గ్రంథాల భవిష్యత్తు పట్ల ప్రస్తుతానికి అదే కొండంత భరోసా. -
నేస్తమా పుస్తకం విందామా!
పుస్తకం హస్తభూషణం అన్నారు.చేతిలో ఉండాల్సిన పుస్తకం ‘ఆడియో బుక్స్’ రూపంలో చెవికి చేరువవుతోంది.వ్యక్తిత్వ వికాసం నుంచి కాల్పనిక సాహిత్యం వరకు పుస్తకాలను ‘ఆడియో బుక్స్’ రూపంలో వినడానికి యూత్ ఆసక్తి ప్రదర్శిస్తోంది. పుస్తకాలు బాగా చదివే అలవాటు ఉన్న బెంగళూరుకు చెందిన విరజ, పుస్తకాల విలువ గురించి తెలుసుకొని వాటిపై ప్రేమ పెంచుకున్న భోపాల్‌కు చెందిన చైత్రకు పుస్తకాలకు చేరువ కావడానికి ఒకప్పుడు టైమ్ దొరికేది కాదు. ఇప్పుడు మాత్రం వీరిద్దరికి మాత్రమే కాదు యువతరంలోని ఎంతోమందికి పుస్తకాలు దగ్గర కావడానికి ‘టైమ్’ అనేది సమస్య కావడం లేదు. దీనికి కారణం... ఆడియో బుక్స్.మిలీనియల్స్, జెన్‌జెడ్ జెనరేషన్‌కు ‘ఆడియో బుక్స్’ హాట్ ఫేవరెట్‌గా మారాయి.‘ఒక పుస్తకం చదవడానికి రకరకాల కారణాల వల్ల నెల రోజులు పట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఆడియో బుక్స్ వారానికి ఒకటి వినగలుగుతున్నాను. వినడం పూర్తయిన వెంటనే ఆ పుస్తకానికి సంబంధించిన నోట్స్ రాసుకుంటాను’ అంటుంది విరజ.గూగుల్ ప్లేలో ఆడియో బుక్స్ సెక్షన్ ప్రారంభమైన కొత్తలో యువత అంత దగ్గర కాలేదు. అయితే ఇప్పుడు దృశ్యం మారింది. వారి ప్రధానమైన ఆసక్తులలో ‘గూగుల్ ఆడియో బుక్స్’ కూడా ఒకటి.గూగుల్ ప్లేలో డబ్బు చెల్లించే ఆడియో బుక్స్‌తో పాటు చెల్లించనవసరం లేనివి కూడా ఉన్నాయి.‘ఓకే గూగుల్, హూ ఈజ్ అథర్?’ ‘ఓకే గూగుల్, స్టాప్ ప్లేయింగ్ ఇన్ 20 మినిట్స్’...ఇలాంటి కమాండ్స్ గూగుల్ అసిస్టెంట్‌కు ఇవ్వవచ్చు. గ్లోబల్ ఆడియో బుక్స్ మార్కెట్ లీడర్‌గా ఉన్న ‘ఆడిబుల్’ ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించిన తరువాత ఆడియో బుక్స్‌కు ఊపు వచ్చింది. రకరకాల వయసుల వారిని దృష్టిలో పెట్టుకొని ‘ఆడిబుల్ ఇండియా’లో వేలాది ఆడియో బుక్స్‌ను రొమాన్స్, థ్రిల్లర్, ఆధ్మాత్మికం, హారర్, డ్రామా జానర్లలో తీసుకువచ్చారు.ఇంగ్లిష్తో సహా హిందీ, మరాఠీ, ఉర్దూ, బెంగాలీ... మొదలైన భాషలలో ఆడియో బుక్స్ ఉన్నాయి.‘ఆడియో బుక్స్ సక్సెస్ కావడానికి కారణం మన మూలాల్లోనే ఉంది. చిన్నప్పుడు కథలను వినేవాళ్లం’ అంటుంది ముంబైకి చెందిన స్మిత. ఒక పుస్తకం విజయాన్ని అంచనా వేసే ప్రమాణాలలో ఆడియో బుక్స్ కూడా చేరాయి. మాతృభాషలో పుస్తకాలు చదవడానికి ఇబ్బంది పడే యువతరానికి ఆడియో బుక్స్ ఆత్మీయనేస్తాలయ్యాయి.‘పాడ్‌కాస్ట్‌తో పాటు ఆడియో బుక్స్‌కు ఆదరణ పెరిగింది’ అంటున్నాడు ‘వన్ బై టు’ మీడియా కో–ఫౌండర్ రాజేష్ తాహిల్.ఫిక్షన్, రొమాన్స్ జానర్స్ కోసం యాపిల్ బుక్ ‘మాడిసన్’ ‘జాక్సన్’ ‘హెలెన్’ అనే డిజిటల్ నేరేటర్లను క్రియేట్ చేసింది.యూఎస్, యూరోపియన్ దేశాలలో పబ్లిషర్స్‌కు ఆడియో కంటెంట్ క్రియేట్ చేయడానికి సొంతంగా స్టూడియోలు ఉన్నాయి. మన దేశంలో అలాంటి పరిస్థితి వచ్చినట్లు లేదు. ఒక ఆడియో బుక్కు కనీసం లక్ష రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా.‘స్పాటిఫై’ అనగానే గుర్తుకు వచ్చేది సంగీతం. ఆడియో బుక్స్ ఆదరణను పసిగట్టిన ఈ డిజిటల్ మ్యూజిక్ సర్వీస్ యూఎస్‌తో పాటు నాలుగు దేశాల్లో ఆడియో బుక్ ఫీచర్‌ని ప్రవేశపెట్టింది. మూడు లక్షల ఆడియో బుక్స్‌ను తీసుకువచ్చిన ‘స్పాటిఫై’ యూజర్ల కోసం ‘ఆడియో కామెంట్’ తీసుకురానుంది.ఆడియో బుక్ ఇండస్ట్రీ ఊపందుకోవడాన్ని గమనించిన పబ్లిషర్లు రానున్న రోజుల్లో ఆడియో బుక్స్ స్పేస్‌ను పెంచాలనుకుంటున్నారు. క్లాసిక్స్‌పై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు.‘గతంతో పోల్చితే ఆడియో బుక్స్ వినడానికి వెచ్చిస్తున్న టైమ్ పెరిగింది’ అంటున్నాడు ‘స్టోరీ టెల్ ఇండియా’ కంట్రీ మేనేజర్ యోగేష్ దశరథ్.ఆడియో బుక్స్ యూత్‌ను ఆకట్టుకోవడానికి ప్రధాన కారణం ప్రయాణాలలో, బారెడు క్యూలలో నిలబడిన సందర్భాలలో కూడా వాటిని వినే అవకాశం ఉండడం. కొందరైతే వ్యాయామాలు చేస్తూ కూడా ఆడియో బుక్స్ వింటున్నారు.‘ఆడియో బుక్స్ వల్ల పుస్తకం చదివే దృశ్యం అదృశ్యం కానుందా?’ అనే ప్రశ్నకు ఇంజనీరింగ్ స్టూడెంట్ సౌమ్య మాటల్లో జవాబు దొరుకుతుంది.‘పుస్తకం చదవడం అంటేనే నాకు ఇష్టం. అంతమాత్రాన ఆడియో బుక్స్‌కు దూరం కాలేదు. సమయ సందర్భాలను బట్టి చదవాలా, వినాలా అనేదాన్ని ఎంచుకుంటాను’ అంటుంది సౌమ్య. ఆడియో బుక్ రీడ్ బై సెలబ్రిటీ ఆడియో బుక్స్ విజయంలో పుస్తకంలోని కంటెంట్‌తో పాటు నేరేటర్ ప్రతిభ కూడా ఆధారపడి ఉంటుంది. వినే కొద్దీ వినాలనుకునే గొంతులు ఆడియో బుక్స్ విజయంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి.‘ఆడియో బుక్ రీడ్బై సెలబ్రిటీస్’ ధోరణి మన దేశంలోనూ పెరగనుంది. ఆడియో బుక్ రీడింగ్‌లో బాలీవుడ్ నటి సోహా అలీఖాన్ మంచి పేరు తెచ్చుకుంది. వుడీ ఎలెన్ ‘కౌంట్ డ్రాకులా’తో పాటు ఎన్నో పుస్తకాలు ఆమె స్వరంలో యువత మంత్రముగ్ధులై విన్నారు. -
బుక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్..! నాలుగేళ్ల సబ్స్క్రిప్షన్ కేవలం రూ. 2కే..!
పుస్తక ప్రియులకు శుభవార్త..! బుక్ లవర్స్ కోసం అమెజాన్ సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. అమెజాన్‌కు చెందిన అడిబుల్ యాప్ నాలుగు నెలల సబ్స్క్రిప్షన్ కేవలం రూ. 2 కే అందించనుంది. అడిబుల్లో వినియోగదారులు పుస్తకాలను వినవచ్చును. అంతేకాకుండా విభిన్నమైన పాడ్‌కాస్ట్‌లను కూడా అడిబుల్ అందిస్తోంది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన వెబ్సైట్లో ఈ ఆఫర్‌ను ప్రకటించింది. కాగా ఈ ఆఫర్ కేవలం మొదటిసారి జాయిన్ అయ్యే కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది. అడిబుల్ సబ్‌స్క్రీప్షన్ తీసుకుంటే ఆఫ్‌లైన్‌లో మీకు నచ్చిన పుస్తకాలను వినొచ్చు. అడిబుల్ సాధారణంగా నెలకు రూ.199 కు అందిస్తోంది. కాగా ఈ ఆఫర్ ప్రైమ్ మెంబర్ షిప్ ఉన్నవారికి మాత్రమే. -
కంటి చికిత్సకు ముందు మ్యూజిక్ వింటే...
ఫ్రాన్స్ః సంగీతం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఒత్తిడిని తగ్గించి, మానసికోల్లాసాన్ని కలిగించే సంగీతం ఆరోగ్యవంతమైన జీవితం గడిపేందుకు కూడ సహకరిస్తుంది. సంగీతం అనేక బాధలనుంచి స్వాంతన పొందేట్టు చేస్తుంది. అయితే కంటికి శస్త్ర చికిత్స చేయించుకునే ముందు కాసేపు సంగీతం వినడం ఆందోళన తగ్గించేందుకు మంచి సాధనం అంటున్నారు ఫ్రాన్స్ పరిశోధకులు. కాసేపు సంగీతం విన్న తర్వాత శస్త్ర చికిత్సకు వెళ్ళడం ఎంతో మంచిదని సూచిస్తున్నారు. మ్యూజిక్ వినండం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతుందని, ముఖ్యంగా కంటి ఆపరేషన్ చేయించుకునే వారు ఎనస్థీషియా తీసుకునేందుకు ముందు.. కొద్ది సమయం మ్యూజిక్ వినడంవల్ల ఆందోళన తగ్గుతుందని అంటున్నారు ఫ్రాన్స్ లోని కొచిన్ యూనివర్శిటీ ఆస్పత్రికి చెందిన గిల్లెస్ గ్యూరియర్. ముఖ్యంగా శస్త్ర చికిత్స సమయంలో మెలకువతో ఉండటం రోగులకు ఆందోళనను, ఒత్తిడిని కలుగజేస్తుంది. అదే నేపథ్యంలో కాసేపు సంగీతం విన్నవారు, వినకుండా సర్జరీకి వెళ్ళిన వారిపై అధ్యయనాలు జరిపిన పరిశోధకులు ఇద్దరికీ మధ్య ఆత్రుతలో గణనీయమైన తేడా కనిపించినట్లు కనుగొన్నారు. ముఖ్యంగా ప్రతి వందమందిలో సంగీతం విన్నవారికంటే... వినకుండా సర్జరీకి వెళ్ళినవారికి మత్తుమందుల అవసరం ఎక్కువగా ఉన్నట్లు చెప్తున్నారు. సంగీతం విన్న పేషెంట్లకు మత్తు మందులు 16 శాతం అవసరమైతే, లేని వారికి 32 శాతం అవసరమైనట్లు చెప్తున్నారు. అంతే కాక మ్యూజిక్ విన్నవారిలో ఆపరేషన్ తర్వాత కూడ ఫలితాలు పాజిటివ్ గా ఉన్నట్లు కనుగొన్నారు. ఈ నేపథ్యంలో అన్ని రకాల కంటి శస్త్ర చికిత్సలకు ముందు సంగీతం అందిస్తున్నామని, అలాగే లోకల్ ఎనస్థీషియా ఇవ్వాల్సి వచ్చే ఎముకలతో సహా ఏ రకమైన ఆపరేషన్ కైనా సంగీతం వినిపించే పద్ధతిని అమల్లోకి తెచ్చేందుకు యోచిస్తున్నామని గ్యూరియర్ చెప్తున్నారు. కాటరాక్ట్ సర్జరీ చేయించుకునే ముందు పేషెంట్లు దాదాపు 15 నిమిషాల పాటు జాజ్, ఫ్లామెన్కో క్యూబన్, క్లాజికల్, పియానో, వంటి విభిన్న శైలుల్లోని సంగీతం వినడంవల్ల నొప్పిని తట్టుకొని, ఆందోళన చెందకుండా, ఆత్రుత పడకుండా ఆపరేషన్ సమయంలో చక్కగా వ్యవహరించగలిగినట్లు తమ పరిశోధనల్లో తేలిందని, శస్త్ర చికిత్స వల్ల కలిగే భయయాన్ని పోగొట్టేందుకు వినిపించే మ్యూజిక్ వినడానికి ముందు, తర్వాత... సర్జికల్ ఫియర్ క్వశ్చనీర్ (ఎస్ఎఫ్ క్యూ) ను ఉపయోగించి ఆందోళనను అంచనా వేసినట్లు పరిశోధకులు లండన్ యూరో ఎనస్థీషియా 2016 లో నివేదించారు.