breaking news
Krishna - Guntur
-
మడ అడవుల వృద్ధిలో మనమే టాప్!
సాక్షి ప్రతినిధి విజయవాడ/అవనిగడ్డ: మడ అడవుల వృద్ధిలో కృష్ణా–గుంటూరు జిల్లాలు ముందు వరుసలో నిలిచాయి. 15 ఏళ్ల నుంచి చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాలు ఎంతో సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం మడ అడవుల వృద్ధిలో వరుసగా రెండోసారి కృష్ణా–గుంటూరు జిల్లాలు గణనీయమైన వృద్ధి సాధించాయి. 19,481.61 హెక్టార్లలో మడ అడవుల వృద్ధి.. సాధారణంగా మంచినీరు, ఉప్పునీరు కలిసే నదీ ముఖద్వారం ప్రాంతంలోనే మడ అడవులు పెరుగుతాయి. కృష్ణా జిల్లాలోని కోడూరు మండలం పాలకాయతిప్ప నుంచి నాగాయలంక మండలం గుల్లలమోద వరకు మడ అడవులు విస్తరించి ఉన్నాయి. అవనిగడ్డ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో మడ అడవులను వృద్ధి చేసేందుకు 2006లో ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. నదీ ముఖ ద్వారం వద్ద ఖాళీ ప్రాంతాలను గుర్తించి మడ అడవులు, పలు రకాల మొక్కల పెంపకాన్ని చేపట్టారు. ఫిష్బోన్ (చేప ముళ్లు) ఆకారంలో ఫీడర్ చానల్స్, ఫీల్డ్ చానల్స్‌ను ఏర్పాటు చేసి వీటి ద్వారా పలు రకాల మొక్కలు పెంచారు. తెల్లమడ, నల్లమడ, పొన్న, దుడ్డు పొన్న, గజరా, పుచ్చ వంటి రకాల మొక్కల విత్తనాలను నాటి వాటిని సంరక్షించే చర్యలు చేపట్టారు. 2019 ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో మడ అడవుల వృద్ధిలో కృష్ణా–గుంటూరు జిల్లాలు మొదటి స్థానంలో నిలిచాయి. 2021 నివేదికలోనూ ఈ జిల్లాలు ముందంజలోనే ఉన్నాయి. కృష్ణా–గుంటూరు జిల్లాల్లో ప్రస్తుతం 19,481.61 హెక్టార్లకు మడ అడవులు విస్తరించి ఉన్నాయి. అత్యధిక పెరుగుదల రాష్ట్రంగా ఏపీ.. 2021 ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం దేశంలోనే అటవీ విస్తీర్ణంలో గరిష్ట పెరుగుదలను నమోదుచేసిన రాష్ట్రాల్లో 647 చదరపు కిలోమీటర్ల వృద్ధిరేటుతో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో నిలిచింది. 632 చ.కి.మీ వృద్ధితో తెలంగాణ రెండో స్థానంలో ఉండగా, 537 చ.కి.మీ వృద్ధితో ఒడిశా మూడో స్థానంలో ఉంది. అరుదైన జంతువులు, పక్షులకు ఆవాసం.. కృష్ణాజిల్లాలోని నాగాయలంక మండల పరిధిలోని పలు తీర ప్రాంత గ్రామాల్లో విస్తరించిన మడ అడవులు అరుదైన జంతువులు, పక్షులకు ఆవాసంగా మారాయి. దేశంలోనే అరుదుగా కనిపించే పిషింగ్ క్యాట్ (బావురు పిల్లి) ఈ ప్రాంతంలోనే ఎక్కువగా కనిపిస్తుంటుంది. నీటికుక్కలు, అరుదైన సముద్రపు తాబేళ్లు, పెలికాన్ (గూడబాతు), కింగ్ ఫిషర్స్ పక్షులు తదితర పక్షిజాతులు ఈ ప్రాంతంలో సందడి చేస్తుంటాయి. పదిహేనేళ్ల శ్రమకు దక్కిన ఫలితమిది.. పదిహేనేళ్ల నుంచి పడుతున్న శ్రమకు దక్కిన ఫలితమిది. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు అధికారులు, సిబ్బంది ఎంతో శ్రమించి నాటిన మడ చెట్లను కంటికి రెప్పలా కాపాడుకున్నాం. మడ అడవుల వృద్ధి వల్ల రానున్న రోజుల్లో ఈ ప్రాంతం పర్యాటకంగా ఎంతో అభివృద్ధి సా«ధించనుంది. – సీహెచ్ సుజాత, ఫారెస్ట్ రేంజ్ అధికారిణి, అవనిగడ్డ -
కృష్ణకు అటూ ఇటూ..!
రాజధాని నగరానికి భూసేకరణపై సీఎం నిర్దేశం? ► కృష్ణా - గుంటూరు రెండు జిల్లాలను సంతృప్తి పరుద్దాం ► కృష్ణా నదిని ఆనుకుని 2 జిల్లాలు కలిసేలా భూ సమీకరణకు సర్వే చేయండి ► కృష్ణా తీరంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్ ఏర్పాటుకు స్థలం చూడండి ► కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లతో భేటీలో సీఎం చంద్రబాబు ఆదేశాలు ► అమరావతి, అచ్చంపేట, కంచికచర్ల, కొండపల్లిలో రాజధాని అంటూ ప్రచారం ► అచ్చంపేట పరిసరాల్లో 3,000 ఎకరాలు, గుడిమెట్ల, చందర్లపాడు ప్రాంతాల్లో మరో 3,000 ఎకరాల దాకా ప్రభుత్వ, అటవీ భూములు ఉన్నాయన్న నివేదికలు విజయవాడ బ్యూరో ‘రాష్ట్ర రాజధాని విషయంలో గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన నాయకులు, వివిధ వర్గాల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. మనకు అండగా నిలిచిన ఈ రెండు జిల్లాలను సంతృప్తి పరచాల్సిన అవసరం ఉంది. గుంటూరు, కృష్ణా జిల్లాలను ఆనుకుని కృష్ణా నదికి రెండు వైపులా రాజధాని నిర్మించేలా ఆలోచన చేద్దాం. ఇందుకు సంబంధించి అందుబాటులో ఉన్న భూములపై మరోసారి సమగ్ర సర్వే చేయించి వీలైనంత త్వరలో నివేదికలు అందించండి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాజాగా మంత్రులు, రెండు జిల్లాల కలెక్టర్లతో పేర్కొన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్ర మంత్రులు పి.నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావులతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు మంగళవారం సీఎంను కలసి రెండు జిల్లాల్లో ప్రభుత్వ, అటవీ భూముల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కృష్ణానదికి ఇరువైపులా భూసేకరణ కోసం సర్వే నిర్వహించాలని సూచించినట్లు సమాచారం. సీఎం సంకేతాల ప్రకారం.. గుంటూరు జిల్లాలోని అమరావతి, అచ్చంపేట, మంగళగిరి, కృష్ణా జిల్లాలోని కంచికచర్ల, ఇబ్రహీంపట్నం, కొండపల్లి ప్రాంతాల దిశగా రాష్ట్ర రాజధాని నిర్మాణం సాగే అవకాశముందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అలాగే.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్ (నిడ్) ఏర్పాటు కోసం కృష్ణా నదీ తీరం వెంటే 50 నుంచి 60 ఎకరాల భూమి ఒకే చోట ఉండే స్థలాన్ని గుర్తించి నివేదిక ఇవ్వాలని చంద్రబాబు కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు రఘునందనరావు, కాంతిలాల్ దండేలను ఆదేశించినట్లు తెలియవచ్చింది. ఆ ప్రాంతం అనువైనదేనన్న నివేదికలు... ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు నుంచి చెప్తున్న విధంగా కృష్ణా - గుంటూరు జిల్లాల మధ్యలోనే రాజధాని ఏర్పాటు చేయడానికి అమరావతి, అచ్చంపేట ప్రాంతాలు అనువైనవిగా అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కృష్ణా నది మీదుగా రెండు కిలోమీటర్ల దూరం హైలెవెల్ బ్రిడ్జి నిర్మిస్తే గుంటూరు - కృష్ణా జిల్లాలను కలిపేయవచ్చని ప్రభుత్వం భావి స్తున్నట్లు సమాచారం. ఈ రెండు ప్రాంతాల్లోని ప్రభుత్వ, అటవీ భూముల వివరాలు, నీటి లభ్యత, 9వ జాతీయ రహదారికి అనుసంధాన దూరం, గన్నవరం విమానాశ్రయానికి వెళ్లే మార్గం వివరాల గురించి గుంటూరు, కృష్ణా జిల్లాల అధికార యంత్రాంగం ద్వారా ప్రభుత్వం ఇప్పటికే నివేదికలు తెప్పించుకుంది. అచ్చంపేట పరిసర ప్రాంతాల్లో 3,000 ఎకరాలకు పైగా, కృష్ణా జిల్లాలోని గుడిమెట్ల, చందర్లపాడు ప్రాంతాల్లో మరో 3,000 ఎకరాల దాకా ప్రభుత్వ, అటవీ భూములు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు చెప్తున్నారు. ఈ ప్రాంతానికి పులిచింతల ప్రాజెక్టు నుంచి గానీ, కృష్ణా నది నుంచి గానీ నీటిని సులువుగా తీసుకురావచ్చని.. రైతుల నుంచి భూములు సేకరించాల్సి వచ్చినా తక్కువ ధరకు లేదా 60 : 40 ప్రాతిపదికన సులువుగా భూ సేకరణ చేయొచ్చని అధికార వర్గాలు నివేదించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అచ్చంపేట నుంచి గన్నవరం విమానాశ్రయం 95 కిలోమీటర్లు, నందిగామ 30 కి.మీ, జగ్గయ్యపేట, సత్తెనపల్లి, మంగళగిరి, అమరావతి, నరసారావుపేట పట్టణాలు 50 కి.మీ. దూరంలోనే ఉంటాయని వివరించారని సమాచారం.