breaking news
kovelamudi ravindra
-
గుంటూరులో ఐటీ దాడులు
సాక్షి, గుంటూరు : ఆంధ్రపద్రేశ్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. తాజాగా టీడీపీ నేత, ఎల్వీఆర్ క్లబ్ కార్యదర్శి, వ్యాపారవేత్త కోవెలముడి రవీంద్ర ఇంట్లో ఐటీ దాడులు జరిగాయి. సోమవారం తెల్లవారు జాము నుంచి రవీంద్ర ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. రవీంద్ర పెట్రోల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీలు నిర్వహిస్తున్నారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలోని వివిధ వ్యాపార వేత్తలు, టీడీపీ నేతలపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వరుస ఐటీ దాడులతో టీడీపీ నేతల్లో అలజడి మొదలయింది. ఇటీవలే ఆ పార్టీ ఎంపీ సీఎం రమేశ్‌పై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈసందర్భంగా అనేక డాక్యుమెంట్లు, విలువైన పత్రాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు టీడీపీ నేత బీద మస్తాన్‌రావుపై కూడా గతంలో ఐటీ సోదాలు జరిగాయి. ఏక కాలంలో ఆయన కంపెనీలపై దాడులు జరిపి రికార్డులు, కంప్యూటర్ డేటాలను స్వాధీనం చేసుకున్నారు. -
మంత్రి అండతో చెలరేగి పోతున్న 'తమ్ముడు'
గుంటూరు సమీపంలో దురాక్రమణకు దిగిన టీడీపీ నేత నకిలీ డాక్యుమెంట్లతో భూమిని కాజేసే యత్నం రూ.15 కోట్ల విలువైన ఏడెకరాలను కొట్టేసేందుకు పన్నాగం కబ్జాదారుడికే ప్రజాప్రతినిధుల వత్తాసు గవర్నర్, సీఎంకి ఫిర్యాదు చేసినా ఆగని ఆక్రమణ తమకు న్యాయం చేయాలని బాధితుడి వేడుకోలు లేకపోతే ఆత్మహత్యకైనా అనుమతి ఇవ్వాలని అభ్యర్థన హైదరాబాద్ : గుంటూరుకు చెందిన వెలివోలు శివరామకృష్ణ చౌదరికి చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి(ఎన్‌హెచ్-16) పక్కనే ప్రత్తిపాడు మండలం ఈదులపాలెంలో ఏడెకరాల భూమి ఉంది. నూతన రాజధాని ప్రకటనతో ఈ భూమి విలువ రూ.15 కోట్లకు ఎగబాకింది. అత్యంత విలువైన ఈ భూమిని కాజేసేందుకు గుంటూరుకు చెందిన అధికార పార్టీ నేత ఒకరు తీవ్రంగా యత్నిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచీ ఈ ఏడెకరాలను కాజేసేందుకు ప్రయత్నాలు తీవ్రమయ్యాయి. భూమిని అప్పగించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, ఈ వ్యవహారం వెనుక మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారంటూ శివరామకృష్ణ చౌదరికి నిత్యం బెదిరింపులు వస్తున్నాయి. తన భూమిని టీడీపీ నేత కోవెలమూడి రవీంద్ర అలియాస్ కాల్‌గ్యాస్ నాని చెరపట్టారని బాధితుడు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదులు చేసినా ఫలితం సున్నా తన భూమిని కాపాడుకునేందుకు శివరామకృష్ణ చౌదరి అన్ని ప్రయత్నాలూ చేశారు. మండల, జిల్లాస్థాయి అధికారుల నుంచి గవర్నర్, ముఖ్యమంత్రి వరకు సాయాన్ని అర్థించారు. అందరికీ రాతపూర్వకంగా ఫిర్యాదులు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో తీవ్ర మనోవేదన గురవుతున్నారు. టీడీపీ నేతల అరాచకాల నుంచి తమను రక్షించాలని, లేనిపక్షంలో తమ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతివ్వాలని ఆయన వేడుకుంటున్నారు. తమ కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ ‘సాక్షి- సాక్షి టీవీ’ని ఆశ్రయించారు. ఆక్రమణదారుడికే వత్తాసు తమ భూమిపై కన్నేసిన కోవెలమూడి రవీంద్ర అలియాస్ నాని గుంటూరు జిల్లాలో ఏయే మంత్రులు, ఏయే ఎమ్మెల్యేలకు బినామీనో అందరికీ తెలిసిన విషయమేనని శివరామకృష్ణ చౌదరి చెప్పారు. టీడీపీ నేతల బెదిరింపులతో తమతోపాటు తమ ఇద్దరు పిల్లలకు కంటిమీద కునుకు ఉండటం లేదని శివరామకృష్ణ చౌదరి భార్య నిర్మలాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం ప్రజాప్రతినిధుల వద్దకు వెళితే.. తప్పదు, భూమి ఇచ్చేయండంటూ దురాక్రమదారుడికి వత్తాసు పలుకుతున్నారని వాపోయారు. నకిలీ డాక్యుమెంట్లతో దగా చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి పక్కన గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం ఈదులపాలెంలో సర్వే నంబర్ 55లో ప్రభుత్వ రికార్డుల ప్రకారం మొత్తం 15.10 ఎకరాల పట్టా భూమి ఉంది. ఎనిమిది ఎకరాలు అనామతు భూములుగా ఉండటంతో 2012 నుంచి ఆక్రమణల పాలైంది. అయితే, ఈ సర్వే నంబర్‌లోనే 2012లో వెలివోలు శివరామకృష్ణ చౌదరి పేరిట 4 ఎకరాలు, ఆయన భార్య నిర్మలాదేవి పేరిట 3.10 ఎకరాలు కొనుగోలు చేశారు. ఈ ఏడెకరాలను సొంతం చేసుకునేందుకు టీడీపీ నేత కోవెలమూడి నాని పక్కా స్కెచ్ వేశారని బాధితుడు చెప్పారు. కబ్జాదారులు ముందుగా ఈ భూముల్లో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ పేరుతో వెంచర్ వేసినట్లు, ఇళ్ల స్థలాలను విక్రయించినట్లు కాగితాల్లో చూపించారు. దీనిపై శివరామకృష్ణ చౌదరి అప్పటి జిల్లా కలెక్టర్, సీసీఎల్ఏకు ఫిర్యాదులు పంపించారు. ప్రజావాణిలో పలుమార్లు ఫిర్యాదు చేయడంతో అప్పటి జిల్లా కలెక్టర్ సురేష్‌కుమార్ స్పందించారు. పులిచింతల ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ సీహెచ్ లక్ష్మయ్యను విచారణ అధికారిగా నియమించారు. విచారణ చేసిన స్పెషల్ కలెక్టర్ 2012లో ఇచ్చిన నివేదిక ఆధారంగా గుంటూరు జిల్లా పంచాయతీ అధికారి అనధికార లేఔట్‌ను రద్దు చేశారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి విక్రయించిన ఇళ్ల స్థలాలను కొనుగోలుదారుల నుంచి కోవెలమూడి రవీంద్ర జీపీఏ చేయించుకున్నారు. రవీంద్రే మళ్లీ వాటిని కొనుగోలు చేసినట్లు రికార్డులు సృష్టించారు. ఈ రికార్డుల్లో సర్వే నంబర్లు కూడా లేవు. ఇదంతా నల్లపాడు రిజిస్ట్రార్ కనుసన్నల్లో జరిగింది. అయితే, లేని సర్వే నంబర్ 55/1 పేరిట ఏడెకరాల భూమిని కోవెలమూడి నాని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకోవడం గమనార్హం. గత సెప్టెంబర్ నెలాఖరు నుంచి ఈ ఏడాది జనవరి వరకు ఈ భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు రికార్డులు సృష్టించారు. కబ్జాకాండకు జిల్లా మంత్రి అండ రెవెన్యూ శాఖ వెబ్‌ల్యాండ్‌లో ఏడెకరాల భూమి శివరామకృష్ణ చౌదరి పేరిటే ఉంది. తప్పుడు డాక్యుమెంట్లతో ఈ భూములను తమ ఆధీనంలో తెచ్చుకునేందుకు ల్యాండ్ మాఫియా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఆక్రమణదారులు జిల్లా మంత్రి అండతో భూముల్లోకి చొరబడి ఫెన్సింగ్ వేశారు. గత రెండ్రోజుల నుంచి ఈ దురాక్రమణ పర్వం కొనసాగుతోంది. తమకు రక్షణ కల్పించాలని ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని శివరామకృష్ణ చౌదరి పేర్కొన్నారు. నకిలీ డాక్యుమెంట్ల ఆధారంగా భూమిని రిజిస్ట్రేషన్ చేసిన నల్లపాడు రిజిష్ట్రార్పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మా భూమిని చెరబడుతున్నారు ‘‘మా భూమిని బలవంతంగా తీసుకునేందుకు టీడీపీనేత కోవెలమూడి నాని అన్నిరకాలుగా ఒత్తిళ్లు తెస్తున్నారు, బెదిరిస్తున్నారు. ఆయన అరాచకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు దష్టికి తీసుకెళ్లేందుకు విజయవాడలోని సీఎం కార్యాలయం ఎదుట గంటన్నరసేపు నిరీక్షించినా ఫలితం కనిపించలేదు. టీడీపీకి అభిమానులమైన మాకే ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతుంటే సామాన్యుల పరిస్థితి ఇంకెలా ఉంటుందో అంతుబట్టడం లేదు. ఇలాంటి ప్రభుత్వాన్నేనా ఎన్నుకున్నది అని ఆవేదనకు లోనవుతున్నాం. అధికార పార్టీ నేతల బారి నుంచి రక్షించకపోతే ఆత్మహత్య చేసుకోవడం మినహా మాకు మరో గత్యంతరం లేదు. ప్రభుత్వం అందుకైనా అనుమతివ్వాలి’’ - శివరామకృష్ణ చౌదరి దంపతులు డాక్యుమెంట్లు తీసుకురావడంతో రిజిస్ట్రేషన్ చేశాం ‘‘సర్వే నంబర్ 55/1లో ఏడెకరాల భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు మాకు అందడంతో రిజిస్ట్రేషన్ చేశాం. పట్టాదారు శివరామకృష్ణ మాపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఆ తర్వాత తెలిసింది. సదరు భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు నకిలీవన్న విషయం ఇంకా మా దృష్టికి రాలేదు’’ - అజయ్‌కుమార్‌రెడ్డి, సబ్ రిజిస్ట్రార్, నల్లపాడు